Skip to main content

అసెంబ్లీ... తెలుసుకోతగ్గ అంశాలు

అసెంబ్లీ అంటే ఏమిటి? సమావేశాలు ఎలా నిర్వహిస్తారు? పాటించే పద్ధతులేంటి? చట్టాలు ఎలా రూపొందుతాయి? వంటి వాటితో సహా తరచూ మనం వినే అసెంబ్లీ పదజాలం మీకోసం...
అసలు అసెంబ్లీ అనే ఆంగ్ల పదం ‘అసెంబ్లర్’ అనే ప్రాచీన ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. అసెంబ్లీ అంటే ‘ఒక ప్రయోజనం కోసం కొంత మంది ప్రజలు ఒక చోట సమావేశం అవటం’ అని అర్థం.

ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశాల్లో భారతదేశం ఒకటి. ఎలాంటి భేదభావం లేకుండా 18ఏళ్లు నిండిన అన్ని వర్గాల ప్రజలకు ఓటేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. భారతదేశంలో ప్రతి ఐదేళ్లకొకసారి పార్లమెంటుకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలను కేంద్ర, రాష్ర్ట ఎన్నికల సంఘాలు నిర్వహిస్తాయి. దేశ ప్రజల సంక్షేమం కోసం చట్టాలు చేసేందుకు పార్లమెంటు ఉన్నట్లుగానే రాష్ట్రానికి అసెంబ్లీ ఉంటుంది. శాసనసభ, శాసనమండలిని కలిపి అసెంబ్లీగా పిలుస్తారు. శాసనసభలో మొత్త స్థానాల్లో సరిగ్గా సగం కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మిగిలిన పార్టీలు ప్రతిపక్షాలుగా వ్యవహరిస్తాయి. వాటిలో ఎక్కువ స్థానాలు గెలుచుకొన్న పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. ఈ సగం సీట్లు ఉన్న సంఖ్యను మేజిక్ ఫిగర్ అంటారు. ఉదాహరణకు తెలంగాణ శాసనసభలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119. ఇందులో మేజిక్ ఫిగర్ 60.

సభా నిర్వహణ: శాసనసభా నిర్వహణ బాధ్యతను స్పీకర్ నిర్వహిస్తారు. సభ్యులు వారిలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకొంటారు. సాధారణంగా అధికార పార్టీ సభ్యుడే స్పీకర్‌గా ఎన్నికవుతారు. సహాయకుడిగా ఒక డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరుగుతుంది. ఎన్నికల తరువాత సభ్యుల ప్రమాణ స్వీకారంతో శాసనసభ ఏర్పాటవుతుంది. ప్రమాణ స్వీకార నిర్వహణకు ఒక తాత్కాలిక సభాపతిని ఎన్నుకుంటారు. సాధారణంగా సభలో అనుభవజ్ఞుడైన సభ్యుడిని ఎన్నుకోవడం ఆనవాయితీ. తరువాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అప్పటినుంచి పూర్తి బాధ్యత స్పీకరుదే. సభానిర్వహణకు కొన్ని నిబంధనలు కూడా ఏర్పాటుచేస్తారు. సభ్యుల ప్రవర్తనను నిర్దేశిస్తూ నియమావళి ఉంటుంది. వివిధ అంశాలకు సమయం కేటాయింపు కోసం బిజినెస్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తారు.

శాసనసభ
ప్రతి రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకునే సభ్యులతో కూడిన ఒక సభ ఉంటుంది. దీన్ని శాసనసభ లేదా విధానసభ అంటారు. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా శాసనసభలో 500 కంటే ఎక్కువ కాకుండానూ, 60 కంటే తక్కువ కాకుండా స్థానాలు ఉండాలి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175, తెలంగాణలో 119 స్థానాలున్నాయి. సభా నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించేందుకు సభాపతి, ఉపసభాపతులను సభ్యుల నుంచి ఎన్నుకుంటారు.

సభ్యుల అర్హతలు
  • భారత పౌరుడై ఉండాలి.
  • 25 ఏళ్ల వయసు ఉండాలి.
శాసన మండలి
రాష్ట్రాల శాసన వ్యవస్థలలో రెండో సభను ‘శాసన మండలి’ అంటారు. ప్రస్తుతం ఉన్న 29 రాష్ట్రాల్లో కేవలం ఏడింటిలోనే రెండో సభ ఉంది. అవి ఉత్తర ప్రదేశ్, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీరు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షంగా ఎన్నికవుతారు. ఇది శాశ్వత సభ. మండలిని రద్దు చేయడం సాధ్యం కాదు. ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు.

సభ్యుల అర్హతలు
  • భారత పౌరుడై ఉండాలి.
  • 30 ఏళ్ల వయసు ఉండాలి.
ఆంధ్రప్రదేశ్
General Knowledge శాసనసభ స్థానాలు- 175
శాసనమండలి స్థానాలు- 50
లోక్‌సభ స్థానాలు- 25
రాజ్యసభ స్థానాలు- 11
గవర్నర్- విశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్
ముఖ్యమంత్రి- వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
శాసనసభ స్పీకర్- తమ్మినేని సీతారామ్‌
తెలంగాణ
General Knowledge 
శాసనసభ స్థానాలు- 119
శాసనమండలి స్థానాలు- 40
పార్లమెంట్ స్థానాలు- 17
రాజ్యసభ స్థానాలు- 7
గవర్నర్-  తమిళిసై సౌందరరాజన్
ముఖ్యమంత్రి- కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
శాసనసభ స్పీకర్- పోచారం శ్రీనివాస రెడ్డి

అసెంబ్లీ భవన నిర్మాణం
General Knowledge హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవనాన్ని 1913లో నిర్మించారు. ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్‌హాల్. 1905లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ 40వ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు ఈ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సేకరించారు. ఈ భవన నిర్మాణం పూర్తవడానికి ఎనిమిది ఏళ్ల సమయం పట్టింది. పర్షియన్, రాజస్థానీ శైలుల మేళవింపుతో ఈ భవనాన్ని ప్రత్యేక వాస్తుశిల్పకళా నిపుణులు డిజైన్ చేశారు. 1980లో పాత అసెంబ్లీ భవనానికి ఆనుకొని నూతన భవనాన్ని నిర్మించారు. నూతన భవనం కూడా పాత భవనం మాదిరిగా ఉంటుంది. రెండింటిలో ఏది పాతదో, ఏది కొత్తదో కనిపెట్టడం కష్టం.

తొలి సమావేశాలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు 1956 డిసెంబర్ 3న ప్రారంభమయ్యాయి. తొలి స్పీకర్‌గా అయ్యదేవర కాళేశ్వరరావు, డిప్యూటి స్పీకర్‌గా కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవహరించారు. ఆ సమయంలో సభలో 245 మంది సభ్యులుగా ఉండేవారు. ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు 140, హైదరాబాద్ రాష్ట్ర ఎమ్యెల్యేలు 105 మంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2014, జూన్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్‌గా నా దెండ్ల మనోహర్ వ్యవహరించారు.

చట్ట నిర్మాణం
ప్రజలకు ఉపయోగపడేలా రూపొందించుకున్నవే చట్టాలు, శాసనాలు. ప్రస్తుత వ్యవస్థలో అంటిపెట్టుకొని ఉన్న లోపాలను సవరించి ప్రజలకు ఉత్తమ జీవితాన్ని అందించడమే వాటి ఉద్దేశం. ప్రజల పరిస్థితులను మెరుగుపరచడానికి కొత్త చట్టాలు, శాసనాల అవసరం ఉంది. రాష్ట్ర కార్యకలాపాలు పెరిగేకొద్దీ శాసనాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది.

బిల్లు: బిల్లు అంటే ముసాయిదా చట్టం అని అర్థం. బిల్లు చట్టంగా మారాలంటే వివిధ దశలను దాటాలి.

ప్రతిపాదనా నోటీసు: బిల్లును సభలో ప్రవేశపెట్టాలనుకొనే సభ్యుడు లేక మంత్రి ముందుగా సభ అనుమతి కోసం ప్రతిపాదనా నోటీసు ఇవ్వాలి. బిల్లు ప్రతిని, ఉద్దేశ కారణాలను తెలియజేయాలి. ప్రతిపాదనా నోటీసు గడువు ఏడురోజులు. ప్రతిపాదనను సభ్యుడెవరైనా వ్యతిరేకిస్తే ప్రతిపాదించిన, వ్యతిరేకించిన సభ్యుల అభిప్రాయాల్ని విని ఎలాంటి చర్చకు తావీయకుండా సభ అనుమతికి పెట్టవచ్చు.

గెజిట్‌లో ప్రచురణ: ప్రవేశపెట్టడానికి అనుమతి లభించిన వెంటనే బిల్లును, దాని ఉద్దేశ కారణాలను గెజిట్‌లో ప్రచురించాలి. బిల్లును ప్రవేశపెట్టిన తరువాత ప్రతిపాదిత సభ్యుడు దానిని సభ పరిశీలనకు గానీ, సెలెక్ట్ కమిటీ పరిశీలనకు గానీ, ప్రజాభిప్రాయ సేకరణకు గానీ పంపాలి. ప్రతిపాదిత సభ్యుడు బిల్లును పరిశీలనలోకి తీసుకోవాలని ప్రతిపాదించినపుడు, దానిని సెలెక్ట్ కమిటీకి లేదా ప్రజాభిప్రాయ సేకరణకు పంపాలని ఏ సభ్యుడైనా ప్రతిపాదనకు సవరణ కోరవచ్చు. ఆ సవరణను సభ ఆమోదిస్తే ఆ మేరకు పంపుతారు.

కమిటీ సమక్షంలో ఎలా?: సెలెక్ట్ కమిటీ సభ్యులను సభ నిర్ణయిస్తుంది. సాధారణంగా పదిహేను మందికి మించకుండా సభ్యులు ఉంటారు. కమిటీ అధ్యక్షుణ్ని సభాపతి నియమిస్తారు. బిల్లు ప్రతిపాదిత సభ్యుడు విధిగా కమిటీలో సభ్యుడై ఉండాలి. బిల్లును కమిటీ పరిశీలనకు పంపినపుడు, పరిశీలనకు తీసుకునే ముందు రోజు కమిటీ సభ్యులు దానికి సవరణ నోటీసులు ఇవ్వొచ్చు. బిల్లును కమిటీ సమగ్రంగా పరిశీలించి తాను భావించిన విధంగా సవరించి సభకు సమర్పిస్తుంది.

సవరణ: సెలెక్ట్ కమిటీ నివేదించిన రూపంలో బిల్లును సభ పరిశీలనలోకి తీసుకుంటుంది. ఒకవేళ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపకపోతే ప్రవేశపెట్టిన రూపంలో పరిశీలనకు తీసుకుంటుంది. సవరణలు ప్రతిపాదించాలనుకుంటే బిల్లును సభ పరిశీలనలోకి తీసుకొనే ముందు రోజు సవరణ నోటీసులను శాసనసభ కార్యదర్శికి అందజేయాలి. గడువులోగా వచ్చిన సవరణ నోటీసులను సభాపతి ఆమోదించిన తరువాత ఆయా అంశాలు చర్చకు వచ్చినపుడు సవరణలు పరిశీలించి ఓటింగ్‌కు పెడతారు.

బిల్లు ఆమోదం: బిల్లును సభ పరిశీలించిన తరువాత ఓటింగ్‌కు పెట్టి సభ అనుమతి పొందుతారు. రాష్ట్ర ఉభయ సభలూ(శాసనసభ, శాసనమండలి) ఆమోదించిన తరువాత బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపుతారు. గవర్నర్ దానికి ఆమోదం తెలియజేయచ్చు లేదా నిలుపు చేయచ్చు లేదా రాష్ర్టపతి పరిశీలనకు పంపవచ్చు. బిల్లులోని ఏవైనా అంశాలను పునఃపరిశీలించాలని కోరుతూ గవర్నర్ దాన్ని తిప్పి పంపితే ఉభయసభలు దానికి సవరించి కానీ లేక అలాగే ఆమోదించి తిరిగి గవర్నర్‌కు సమర్పిస్తే ఆయన బిల్లుకు ఆమోదాన్ని తెలుపుతారు. సందర్భానుసారంగా గవర్నర్ లేదా రాష్ర్టపతి ఆమోదాన్ని పొందిన తర్వాత బిల్లు చట్టంగా రూపొందుతుంది.

అసెంబ్లీ విశేషాలు
ప్రశ్నోత్తరాల సమయం:
సమావేశం మొదలైన తర్వాత మొదటి గంట సమయం. నక్షత్రం మార్కు గల ప్రశ్నలకు కచ్చితంగా మౌఖికంగా సమాధానం చెప్పాలి, నక్షత్రం మార్కులేని ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం ఇస్తారు.

జీరో అవర్: ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఎజెండాకు ముందు ఈ రెండింటి మధ్యగల సమయం. దీనికి నిర్ధిష్ట కాల పరిమితి ఉండదు. ముందుగా నోటీస్ ఇవ్వకుండానే ప్రశ్నలు వేయవచ్చు.

క్లోజర్ మోషన్: ఏదైనా ఒక బిల్లుపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు.. జరుగుతున్న చర్చను నిలిపివేసి బిల్లును ఓటింగ్‌కు పెట్టడాన్ని క్లోజర్ మోషన్ అంటారు.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్: సభా నిర్వహణ బాధ్యతలు నిర్వహించేందుకు ఒక సభాపతి (స్పీకర్), ఒక ఉప సభాపతి (డిప్యూటీ స్పీకర్)ని సభ్యులు ఎన్నుకుంటారు. సభాపతినిగా అధికార పక్షానికి, ఉప సభాపతిగా ప్రతిపక్షానికి చెందిన వారిని ఎన్నుకోవడం సంప్రదాయం. అయితే ఇది నియమం కాదు. తమ పదవికి రాజీనామా సమర్పించదలచిన సందర్భంలో సభాపతి ఉపసభాపతికి, ఉప సభాపతి సభాపతికి సమర్పించాలి. వారి తొలగింపుకు మెజారిటీ సభ్యుల మద్దతు అవసరం. క్రమశిక్షణతో కూడిన అర్థవంతమైన చర్చలు జరిగేలా చూడటం స్పీకర్ బాధ్యత. సభలో ఎవరు మాట్లాడాలి అనే అంశంపై తుది నిర్ణయం స్పీకర్‌దే.

బడ్జెట్
ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ఆదాయ వ్యయాలకు సంబంధించిన అంచనాల వివరణను బడ్జెట్ అంటారు. గవర్నర్ నిర్ణయించిన తేదీన బడ్జెట్‌ను శాసనసభకు సమర్పిస్తారు.

బడ్జెట్‌పై చర్చ: బడ్జెట్ సమర్పణకు, దానిపై చర్చకు మధ్య 48 గంటల విరామం ఉండాలి. శాసనసభ.. బడ్జెట్‌ను రెండు దశలలో పరిశీలిస్తుంది. బడ్జెట్‌పై సాధారణ చర్చ, గ్రాంట్ల నిమిత్తం అభ్యర్థనలపై ఓటింగ్. సాధారణ చర్చకు ఆరు రోజులు, గ్రాంట్ల అభ్యర్థనలపై ఓటింగ్‌కు పద్దెనిమిది రోజులు కేటాయిస్తారు. సాధారణ చర్చలో బడ్జెట్‌ను పూర్తిగా కానీ విధానపరమైన అంశాన్ని కానీ చర్చిస్తారు. చర్చ ముగింపులో ఆర్థికమంత్రి ఆ చర్చలకు సమాధానాలిస్తారు.

వాయిదా ప్రతిపాదన
అత్యవసర విషయాన్ని సభాసమక్షానికి తీసుకువచ్చి.. అప్పటికే జరుగుతున్న కార్యక్రమాన్ని వెంటనే వాయిదా వేసి ఆ విషయంపై చర్చ జరగాలని కోరడమే వాయిదా ప్రతిపాదన ఉద్దేశం. దీని వల్ల ఒక విషయంపై పూర్తి చర్చ జరిపే అవకాశం దక్కుతుంది. అయితే చర్చించాల్సిన విషయం కచ్చితమైనదై ఉండాలి. అంతకు క్రితమే జరిగిన ప్రభుత్వ చర్యకు సంబంధించినదై ఉండాలి. విషయం అత్యవసర స్వభావం కలిగినదై ఉండాలి. అకస్మాత్తుగా జరిగిన సంఘటనగా ఉండాలి. జాప్యానికి అవకాశమే ఉండకూడదు.

గవర్నరు ప్రసంగం - ధన్యవాద తీర్మానం
  • ప్రతి సాధారణ ఎన్నికల తరువాత జరిగే శాసనసభ తొలి సమావేశపు ప్రారంభంలో, ప్రతి సంవత్సరం జరిగే మొదటి సమావేశపు ప్రారంభంలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణాలను ఉభయసభలకు గవర్నర్ తెలియజేస్తారు.
  • గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞత తెలిపే తీర్మానం సభలో ఓ సభ్యుడు ప్రతిపాదిస్తారు. దాన్ని మరో సభ్యుడు బలపరుస్తారు. ఈ ఇద్దరిని ఆచారం ప్రకారం ముఖ్యమంత్రి ఎంపికచేస్తారు.
  • గవర్నర్ ప్రసంగంపై సభలో చర్చ జరుగుతుంది.
  • గవర్నర్ ప్రసంగంపై చర్చాపరిధి చాలా విస్తృతమైంది. యావత్ పాలనారంగ పనితీరును చర్చించవచ్చు. ప్రసంగంలోని అంశాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గవర్నర్ బాధ్యుడు కాదు.
  • ధన్యవాద తీర్మానానికి సవరణలను ప్రతిపాదించవచ్చు.
  • ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రి ఇచ్చే ప్రత్యుత్తరంతో కృతజ్ఞతా ప్రతిపాదనపై చర్చ ముగుస్తుంది.
  • ధన్యవాద తీర్మానానికి సవరణలు ఉన్నట్లయితే వాటిని ముఖ్యమంత్రి ప్రత్యుత్తరం తరువాత సభలో ఓటింగ్‌కు పెడతారు. ప్రతిపాదనను ఆమోదించిన తరువాత సభాపతి దాన్ని గవర్నర్‌కు తెలియజేస్తారు. ప్రతిపాదన అందినట్లుగా గవర్నర్ ఒక సందేశం పంపుతారు. ఆ సందేశాన్ని సభలో చదివి వినిపిస్తారు.
సభా సంప్రదాయాలు
General Knowledge సభలో సభ్యులు పాటించవలసిన నియమాలను సభాసంప్రదాయాలని అంటారు. సభాపతి ఆయా సమయాల్లో ఇచ్చిన రూలింగ్స్‌పై ఇవి ఆధారపడి ఉంటాయి.
  • సభ ఆరంభ సమయం (సాధారణంగా ఉ. 9.00 గంటలు) కన్నా ముందుగానే సభ్యులు సభకు హాజరుకావాలి.
  • సభ వాయిదాపడిన తరువాత తిరిగి సమావేశమయ్యేందుకు స్పీకరు నిర్ణయించిన సమయం కన్నా కొన్ని నిమిషాల ముందే సభ్యులు సభలో ఉండాలి.
  • సభాపతి అధ్యక్షస్థానాన్ని స్వీకరించడానికి వచ్చినప్పుడు, సభ్యులందరు వారి స్థానాల్లో లేచి నిలబడాలి.
  • సభలోకి ప్రవేశించేటప్పుడు, వెళ్లేటప్పుడు అధ్యక్షస్థానానికి శిరస్సువంచి అభివాదం చేయాలి.
  • సభాకార్యక్రమంతో సంబంధముంటే తప్ప ఏ పుస్తకాన్ని గానీ, వార్తాపత్రికను గానీ చదవరాదు.
  • ఎవరైనా సభ్యుడు ప్రసంగిస్తున్నప్పుడు, మిగతా సభ్యులు ఎలాంటి అంతరాయం కలిగించరాదు. సభ్యుడు ప్రసంగించేటప్పుడు నిర్దేశ స్థానంలోనే ఉండాలి.
  • సభాకార్యకలాపాలను అడ్డుకోవడం, హేళన ధ్వనులు చేయడం, అంతరాయం కలిగించడం వంటివి చేయరాదు.
  • వేరొక సభ్యుడు ప్రసంగించే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయరాదు. సభలో నినాదాలు కూడా చేయరాదు.
  • బ్యాడ్జీలు, జెండాలు, చిహ్నాలు ధరించడం, ప్రదర్శించడం వంటివి చేయరాదు.
  • సభ్యుడు తన ప్రసంగాన్ని ముగించిన వెంటనే సభను వీడరాదు.
  • సభా ఆవరణలో ఎలాంటి సాహిత్యం, ప్రశ్నావళి, చిన్నపుస్తకాలు, పత్రికా ప్రకటనలు, కరపత్రాలు పంచరాదు.
  • ఆరోగ్యకారణంపై సభాపతి అనుమతిస్తే తప్ప ఏ సభ్యుడూ సభలోనికి చేతికర్రను తీసుకెళ్లరాదు.
  • సభ్యుడు టేప్‌రికార్డులు, క్యాసెట్‌లను సభలోకి తీసుకురావటంగానీ, వినిపించటంగానీ చేయరాదు.
  • సభలో సత్యాగ్రహం, ధర్నా వంటివి చేయరాదు.
  • సభనుద్దేశించి సభ్యుడు ప్రసంగించాలనుకున్నప్పుడు సభాపతి దృష్టిని ఆకర్షించే వరకు చేతులు ఎత్తాలి. సభాపతి అనుమతి ఇచ్చిన తరువాతనే ప్రసంగించాలి.
సభ్యుడు ప్రసంగించేటప్పుడు...
  • న్యాయనిర్ణయం అపరిష్కృతంగా ఉన్న వాస్తవ విషయాన్ని ప్రస్తావించరాదు.
  • వేరొక సభ్యునికి వ్యతిరేకంగా వ్యక్తిగత దోషారోపణ చేయరాదు.
  • శాసనసభ కార్యకలాపాల గురించి పరుషమైన వ్యక్తీకరణాలు ఉపయోగించరాదు.
  • సభా నిర్ణయాన్ని రద్దు చేసే ప్రతిపాదన మినహా ఇది వరకటి సభానిర్ణయాన్ని నిందించకూడదు.
  • చర్చను ప్రభావితం చేసే ఉద్దేశంతో గవర్నరు పేరును ఉపయోగించకూడదు.
  • పరుషపదజాలం ఉపయోగించకూడదు.
  • ప్రభుత్వాధికారులను పేరుపెట్టి ప్రస్తావించరాదు.
  • సభాపతి అనుమతితో తప్ప లిఖిత ఉపన్యాసాన్ని చదువరాదు.
  • సభాపతి ద్వారా తప్ప వ్యక్తిగతంగా సభ్యులను సంభోదించరాదు.
  • నియమిత ప్రతిపాదన మినహా సభాపతి రూలింగ్‌ను ప్రశ్నించటంగానీ, వ్యాఖ్యానించటం గానీ చేయకూడదు.
సభ వెలుపల సభ్యుల నైతిక ప్రవర్తనకు సంబంధించిన మార్గదర్శకాలు
  • ప్రత్యక్షంగానీ, పరోక్షంగా గానీ తనకు సంబంధమున్న వ్యాపార సంస్థలకు ప్రభుత్వం నుంచి వ్యాపారానికి పొందడానికి సభ్యుడు ప్రయత్నించకూడదు.
  • ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ప్రతి సభ్యుడు నిర్ణయాలు తీసుకోవాలే తప్ప, తన స్వప్రయోజనాలు ఆశించి నిర్ణయాలు తీసుకోకూడదు.
  • అవాస్తవమైన సర్టిఫికెట్లను సభ్యుడు ఇవ్వరాదు.
  • ప్రభుత్వం తనకు కేటాయించిన నివాస ప్రాంగణాన్ని సభ్యుడు మరొకరికి అద్దెకివ్వకూడదు.
  • ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ ఆర్థికపరంగా తనకు ఆసక్తి ఉన్న అంశం విషయంలో ప్రభుత్వాధికారులను లేదా మంత్రులను సభ్యుడు అనుచితంగా ప్రభావితం చేయరాదు.
Published date : 18 Mar 2015 12:49PM

Photo Stories