Skip to main content

ఇటీవల ప్రపంచ వారసత్వ హోదా పొందిన దేవాలయం?

అధ్బుత కట్టడం రామప్ప దేవాలయానికి ‘ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో)’ గుర్తింపు లభించింది.
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తున్నట్లు జూలై 25న యునెస్కో ప్రకటించింది. చైనాలోని ఫుఝౌ కేంద్రంగా జూలై 25న జరిగిన యునెస్కో 44వ హెరిటేజ్‌ కమిటీ సమావేశంలో.. 28 సభ్య దేశాలకుగాను దేశాలు రామప్ప ఆలయానికి హోదా ఇచ్చేందుకు అనుకూలంగా ఓటు వేశాయి. అనంతరం యునెస్కో అధికారిక ప్రకటన చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి చారిత్రక కట్టడంగా రామప్ప ఆలయం నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిది...
మన దేశంలో ఇప్పటివరకు(2021, జూలై 25నాటికి) 38 ప్రాంతాలు/కట్టడాలకు మాత్రమే యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. ఇందులో దక్షిణ భారతదేశంలో ఐదు (తమిళనాడులో రెండు, కర్ణాటకలో రెండు, కేరళలో ఒకటి) మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క ప్రాంతం/కట్టడానికి ఈ గుర్తింపు రాలేదు. తాజాగా రామప్ప... తెలుగు రాష్ట్రాల్లో మొదటిదిగా, దేశంలో 39వదిగా, దక్షిణ భారతదేశంలో ఆరో ప్రాంతం/కట్టడంగా యునెస్కో జాబితాలో నిలిచింది.

మొత్తం 40...
గుజరాత్‌ రాష్ట్రం కచ్‌ జిల్లాలో ఉన్న హరప్పా నాగరికత కాలం నాటి నగరం ‘‘ధోలావీరా’’ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తున్నట్లు 2021, జూలై 27న యునెస్కో ప్రకటించింది. దీంతో భారత్‌లోని మొత్తం 40 కట్టడాలు, ప్రాంతాలు యునెస్కో జాబితాలో చేరినట్లయింది. దోలావీరాలో క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1,800 సంవత్సరం వరకు సుమారు 1,200 ఏళ్లపాటు సింధులోయ నాగరికత విలసిల్లింది. ఆనాటి కట్టడాలు, వస్తువులు, ఆధారాలు పురాతత్వశాఖ తవ్వకాల్లో లభించాయి.

యునెస్కో 44వ హెరిటేజ్‌ కమిటీ సమావేశం
ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన... ఐరాస విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) లేదా యూఎన్‌ ఎడ్యుకేషనల్‌ సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌(్ఖNఉ ఇౖ)ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఉంది. దీనిని 1945, నవంబర్‌ 16వ తేదీన ఏర్పాటు చేశారు. 2020, జనవరి నాటికి 193 దేశాలకు యునెస్కో సభ్యత్వం ఉంది. అలాగే 11 దేశాలు అసోసియేట్‌ సభ్యులుగా ఉన్నాయి. ప్రస్తుతం యునెస్కో డెరైక్టర్‌ జనరల్‌గా ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఆడ్రీ అజౌలే ఉన్నారు.

యునెస్కో 44వ హెరిటేజ్‌ కమిటీ సమావేశం(ప్రపంచ వారసత్వ కమిటీ 44వ సెషన్‌) చైనాలోని ఫుఝౌ నగరం కేంద్రంగా 2021, జూలై 16న ప్రారంభమైంది. జూలై 31వ తేదీ వరకు జరగనుంది. సభ్యదేశాల ప్రతినిధులు ఆన్‌లైన్‌ విధానం ద్వారా సమావేశంలో పాల్గొంటున్నారు. తాజా సమావేశాల సందర్భంగానే రామప్ప ఆలయానికి, ధోలావీరా ప్రాంతానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది.

రామప్ప ఆలయ విశేషాలు
Current Affairs
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు 1213వ సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని కట్టించాడు. ఆలయంలో రామలింగేశ్వరుడు(ఏకశిల) ప్రధాన దేవుడు. ఈ ఆలయ శిల్పి పేరు రామప్ప. దీంతో రామప్ప పేరుతో ఈ కట్టడం ప్రాచుర్యంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట(వరంగల్‌కు 77 కిలోమీటర్ల దూరం)లో రామప్ప ఆలయం ఉంది.
 • కాకతీయుల సామ్రాజ్యంలో ఎన్నో అద్భుత ఆలయాల నిర్మాణం జరిగినా రామప్ప ఎంతో ప్రత్యేకమైనది.
 • నేల నుంచి ఆరు అడుగులు ఎత్తున్న నక్షత్రాకార మండపంపై దీన్ని నిర్మించారు.
 • ఆలయ గోపురాన్ని నీటిపై తేలియాడే ఇటుకలతో నిర్మించారు.
 • అనేక యుద్ధాలు, దాడులు, 17వ శతాబ్దిలోని ఒక భూకంపాన్ని తట్టుకుని ఇది నిలిచింది. అయితే గుడి పరిధిలోని కొన్ని చిన్న నిర్మాణాలు దెబ్బతిన్నాయి.
 • ఆలయ నిర్మాణం సాంకేతికతను ‘‘శాండ్‌ బాక్స్‌ టెక్నిక్‌’’ అంటారు. భూకంపాలను తట్టుకునేలా దీన్ని నిర్మించడం విశేషం.
 • గర్భగుడి ముందుండే మండపంలో అద్భుత శిల్పకళ ఉంటుంది. నాట్య గణపతి, ఆయుధాలు ధరించిన యోధులు, భటులు, భైరవుడు, వేణుగోపాలస్వామి, మల్లయుద్ధ దృశ్యాలు, నాట్యగత్తెలు, వాయిద్యకారులు, నాగిని, సూర్య, శృంగార శిల్పాలు ఎన్నో ఉన్నాయి.
 • ఇది హిందూ ఆలయమే అయినా ప్రవేశ ద్వారం, రంగమండపం అరుగు తదితర చోట్ల జైన తీర్థంకరులు, బౌద్ధమూర్తుల చిత్రాలు ఉన్నాయి.
 • నటరాజ రామకృష్ణ అనే వ్యక్తి రామప్ప గుడిపై ఉండే శిల్ప భంగిమలను ఆధారం చేసుకుని అంతరించిపోయిన పేరిణి శివతాండవం అనే నృత్యాన్ని తిరిగి పునరుద్ధరించారు.
 • జాయప సేనాని రాసిన నృత్య రత్నావళిలోని కొన్ని భంగిమలు కూడా ఈ గుడిపై శిల్పాలుగా చెక్కారు.
 • ఆలయం నిర్మాణంలో ఎక్కువగా ఎర్ర ఇసుకరాయిని వినియోగించారు. కీలకమైన ద్వార బంధాలు, స్తంభాలు, పైకప్పు, మదనిక, నాగనిక శిల్పాలు, నంది విగ్రహం, గర్భాలయంలోని శివలింగాలకు మాత్రం అత్యంత కఠినమైన బ్లాక్‌ డోలరైట్‌ (నల్లశానపు) రాయిని వాడారు.
 • ఇక్కడ నంది కోసం ప్రత్యేక మండపాన్ని నిర్మించారు.
 • గర్భాలయ ప్రవేశానికి పక్కనే గోడకు చెక్కిన వేణుగోపాలస్వామి విగ్రహాన్ని సున్నితంగా మీటితే సప్తస్వరాలు వినిపిస్తాయి.
 • ఆలయ గోడలపై ఓ శిల్పం విదేశీ వస్త్రధారణతో చిత్రంగా కనిపిస్తుంది. ఆ కాలంలో వచ్చిన విదేశీ పర్యాటకుల వేషధారణ ఆధారంగా ఆ శిల్పాన్ని చెక్కారన్న అభిప్రాయం ఉంది.
 • పక్కనే ఉన్న రామప్ప చెరువు, అందమైన తోటలు దీనికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

2015లోనే ప్రయత్నాలు...
 • రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక ‘ద గ్లోరియస్‌ కాకతీయ టెంపుల్స్‌ అండ్‌ గేట్‌ వే’ పేరుతో యూనెస్కోకు ప్రతిపాదన పంపారు. ఇందులో ‘కేంద్ర పురావస్తు విభాగం (ఏఎస్‌ఐ)తోపాటు వరంగల్‌ కేంద్రంగా ఉన్న కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు కీలకంగా వ్యవహరించింది.
 • మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 55 ఏళ్ల కిందటే రామప్పకు ప్రపంచ గుర్తింపు గురించి ఆకాంక్షించారు. ఆలయంలోని అద్భుతాలను చూసి అబ్బురపడిన ఆయన తన భావాలకు ‘రామప్ప– ఏ సింఫనీ ఇన్‌ స్టోన్స్‌’ పేరుతో అక్షర రూపం ఇచ్చారు. ఆ నిర్మాణం ప్రపంచ ఖ్యాతి పొందగలిగినదని అందులో పేర్కొన్నారు.
 • రామప్పను ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక, శిల్పకళా వేదికగా మార్చేందుకు ఇప్పటికే పనులు చేపట్టారు. ఆలయం పక్కన చెరువు మధ్యలో ఉన్న ద్వీపంలో భారీ శివలింగం ఏర్పాటు కోసం నమూనాలను సిద్ధం చేశారు. 10 ఎకరాల స్థలంలో శిల్ప కళావేదిక, శిల్పుల కోసం, శిల్పకళా అధ్యయనం కోసం కాలేజీ ఏర్పాటు చేయనున్నారు.

‘వారసత్వ హోదా’ ప్రయోజనాలు ఎన్నో..
 • ఆలయం యునెస్కో అధీనంలోకి వెళ్తుంది. ప్రపంచ పటంలో రామప్పకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
 • రామప్పకు యునెస్కోతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గణనీయంగా నిధులు అందుతాయి. వసతులు, రవాణా సౌకర్యాలు పెరుగుతాయి.
 • యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాలు/కట్టడాలను చూసేందుకు విదేశీ పర్యాటకులు లక్షల్లో వస్తారు. ఇక ముందు రామప్పకూ పోటెత్తిన అవకాశం ఉంటుంది.
 • యునెస్కో ప్రచారం, వసతులు, రవాణా సౌకర్యాలు మెరుగుపడితే దేశీయ పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది.
 • రామప్పకు వచ్చేవారు ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించే అవకాశం ఉంటుంది. ఇది పర్యాటకానికి ఊతమిస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
Published date : 30 Jul 2021 03:07PM

Photo Stories