Skip to main content

2020లో ప్రపంచాన్ని నడిపించిన గొప్ప స్త్రీ మూర్తులు

ఊరి మీదకు రాక్షసుడొచ్చి పడ్డాడు. కొత్త ముఖం రాక్షసుడు. బండెడన్నం కాదు వాడి డిష్‌. రోజుకు బండెడు మనుషులు. ఊరు ఇంట్లోకి పరుగులు తీసి తలుపేసుకుంది. దబా.. దబా.. దబా.. దబా..రాక్షసుడు తలుపు తడుతున్నాడు.తడుతూనే ఉన్నాడు. ధడేల్మని తలుపులు తెరుచుకున్నాయి.
ఆ ఇంటి మహిళ బయటికి వచ్చింది. చేతుల్లో పది కత్తులు ఉన్నాయి! పది కత్తులకు పది రూపాలు. గృహిణి, ఉద్యోగి, డాక్టర్, నర్స్, యాక్టివిస్ట్‌..పరిశోధకురాలు, పారిశుధ్య కార్మికురాలు..ఆశా వర్కర్‌.. ఆన్‌లైన్‌ టీచర్, అంబులెన్స్‌ డ్రైవర్‌! రాక్షసుడి అడుగు తడబడింది. ఊరు ధైర్యంగా తొంగి చూసింది.కరోనాపై యుద్ధంలోనే కాదు..సకల రంగాలలోనూ స్త్రీ శక్తి విజేతగా నిలిచింది.
అన్ని రంగాలలోనూ అద్భుత విజయాలు...
జాతీయంగా, అంతర్జాతీయంగా అన్ని రంగాలలోనూ మహిళలు ఈ ఏడాది అసమాన ప్రతిభను చాటారు. అద్భుత విజయాలు సాధించారు. అవార్డులు పొందారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేశారు. సంపన్నులుగా చరిత్రను సృష్టించారు. మన దేశంలో పది మంది ప్రముఖ మహిళల పేరిట వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యాపీఠాలను నెలకొల్పనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు పురుషులతో సమానంగా ఉన్నత బాధ్యతలు నెరవేర్చే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ భావనను వ్యతిరేకించడమేనని సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మక తీర్పునిచ్చింది. ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో కొడుకులతో పాటు, కూతుళ్లకు సమాన హక్కులుంటాయని తేల్చి చెప్పింది. చర్మాన్ని తెల్లగా మార్చే సౌందర్య ఉత్పత్తులు వర్ణవివక్షలో భాగమేనన్న చర్చ నేపథ్యంలో ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ పేరును ‘గ్లో అండ్‌ లవ్లీ’గా మారుస్తూ హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) హెచ్‌యూఎల్‌ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఏపీ దిశ చట్టం–2019 అమలు కోసం ఐఎఎస్‌ కృతికా శుక్లా, ఐపీఎస్‌ దీపిక దిశ స్పెషల్‌ ఆఫీసర్‌లుగా నియమితులయ్యారు. అంతర్జాతీయంగా కమలా హ్యారిస్, జాతీయంగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి పాలనలో, ప్రణాళికలో తమ ముద్రను వేశారు. ఈ వివరాలు సంక్షిప్తంగా మీ కోసం.
అక్కడ కమల పాలన..
ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవి బరిలో నిలిచి గెలిచిన భారత సంతతి మహిళ కమలా దేవి హ్యారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా జనవరిలో పగ్గాలు చేపట్టబోతున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళగా, తొలి నల్లజాతి అమెరికన్‌గా, తొలి ఇండో–అమెరికన్‌గా, తొలి ఆసియా–అమెరికన్‌ మహిళగా కమల రికార్డు నెలకొల్పారు. కమలా హ్యారిస్‌ 1964 అక్టోబర్‌ 20న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఒక్లాండ్‌లో జన్మించారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్‌ తమిళనాడులోని సంప్రదాయ కుటుంబానికి చెందినవారు. తండ్రి జమైకా దేశస్తుడు డొనాల్డ్‌ హ్యారిస్‌. వాషింగ్టన్‌ డీసీలోని హోవార్డ్‌ యూనివర్సిటీలో కమల చదువుకున్నారు. యూసీ హేస్టింగ్‌స కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు. అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయంలో ఎనిమిది సంవత్సరాలు పనిచేశారు. ప్రధానం గా చిన్నారులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు.
కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేస్తున్నప్పుడు బరాక్‌ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్రటిక్‌ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు.
ఇక్కడ శైల ప్రణాళిక...
కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ ‘టాప్‌ థింకర్‌ 2020’ గా ఎంపికయ్యారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా యు.కె.లోని ప్రతిష్టాత్మక పత్రిక ‘ప్రాస్పెక్ట్‌’ ఆమెను ఈ టైటిల్‌తో గౌరవించింది. తత్వవేత్తలు, మేధావులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, రచయితలను యేటా ‘ప్రాస్పెక్ట్‌’ఓటింగ్‌ ఆధారంగా ఎంపిక చేస్తుంది. పాఠకులు, నిపుణులు, సంపాదక బృందం ఇచ్చే రేటింగ్‌ని అనుసరించి జాబితాను ప్రకటిస్తుంది. సకాలంలో చర్యలు తీసుకుని తన రాష్ట్రంలో కరోనా విస్తృతిని కట్టడిని చేసిన శైలజకు గుర్తింపు లభించింది. ఈ సమర్థతను కారణంగానే ఆమెకు ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడే ఘనతను సాధించారు. గతంలో నిఫా వైరస్‌ కేరళను ఆవరించినప్పుడు కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా శైలజే సమర్థంగా ఎదుర్కొన్నారు. ‘నిఫా యువరాణి’, ‘కోవిడ్‌ రారాణి’ అంటూ విపక్షాలు వ్యంగ్యంగా మాట్లాడినా, తన పనితీరుతో గట్టి సమాధానం చెప్పారు. శైలజ విధి నిర్వహణ చురుగ్గా, ముందుచూపుతో ఉంటుంది. కేరళలో కరోనా కేసులు బయటపడగానే ఆమె ప్రణాళికలు సిద్ధంగా చేశారు. ఆరోగ్యశాఖ యంత్రాంగాన్ని పూర్తిగా మేల్కొలిపారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి టెస్టింగ్‌ కాంటాక్ట్‌ ట్రేసింగ్, క్వారెంటైన్‌ విధానాన్ని కఠినంగా అమలు పరిచారు.
ఇంకా ఇలా ఎందరో..స్త్రీ శక్తి విజేతలు :
 • బయోకాన్‌ వ్యవస్థాపకురాలు, ఎండీ కిరణ్‌ మజుందార్‌ షాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా’ లభించింది. దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య వాణిజ్య, విద్యాపర సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకుగాను కిరణ్‌కు ఈ అవార్డు దక్కింది.
 • అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రూత్‌ బాడర్‌ గిన్స్‌ బర్గ్‌(87) కన్నుమూశారు. మహిళా హక్కుల కోసం, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన రూత్‌ అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళగా రికార్డులకెక్కారు.
 • దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌కు చైర్‌పర్సన్‌గా రోష్ని నాడార్‌ మల్హోత్ర నియమితులయ్యారు. హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ ఏకైక సంతానం అయిన రోష్ని దేశంలోనే అత్యధిక సంపద ఉన్న మహిళగా హురున్‌ సంస్థ తాజా కుబేరుల జాబితాలో ఉన్నారు.
 • అమెరికాకు చెందిన దిగ్గజ టెన్నిస్‌ క్రీడాకారిణి, కెరీర్‌ ఆరంభం నుంచి సమానత్వ హక్కుల కోసం పోరాడిన బిల్లీ జీన్‌ కింగ్‌ (76)ను అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) అరుదైన రీతిలో గౌరవించింది. ప్రతిష్టాత్మక ఐటీఎఫ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫెడ్‌ కప్‌ పేరు మారుస్తూ ఇకపై దీనిని ‘బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌’గా వ్యహరిస్తామని ప్రకటించింది. ఒక టీమ్‌ ఈవెంట్‌ టోర్నీని మహిళ పేరుతో వ్యవహరించడం చరిత్రలో ఇదే మొదటిసారి.
 • తమిళనాడులోని మదురైకి చెందిన 9వ తరగతి విద్యార్థిని నేత్ర ఐక్యరాజ్యసమితి ‘గుడ్‌ విల్‌ అంబాసిడర్‌ ఫర్‌ ది పూర్‌’గా నేత్ర నియమితురాలైంది. క్షౌరశాల నడుపుతున్న తండ్రి తన పెళ్లి కోసం దాచిన 5లక్షల రూపాయలను నేత్ర పేదల సంక్షేమం కోసం ఖర్చుచేసింది.
 • ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన ‘బీబీసీ 100 మహిళలు–2020’ జాబితాలో భారత్‌ నుంచి బిల్కిస్‌ దాదీ (82), గానా ఇసైవాణి (23), మానసీ జోషీ (31), రిధిమా పాండే(12) చోటు దక్కించుకున్నారు.
 • ఏడాది కాలంలో అత్యధికంగా ఆర్జించిన క్రీడాకారిణిగా జపాన్‌ టెన్నిస్‌ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌ వన్‌ నయోమి ఒసాకా గుర్తింపు పొందింది. ‘ఫోర్బ్స్‌ పత్రిక మే వెల్లడించిన వివరాల ప్రకారం 2019 జూన్‌ నుంచి 2020 జూన్‌ కాలానికి 22 ఏళ్ల ఒసాకా ప్రైజ్‌మనీ, ఎండార్స్‌మెంట్ల ద్వారా మొత్తం 3కోట్ల 74 లక్షల డాలర్లు (రూ. 284 కోట్లు) సంపాదించింది.
 • నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌ జాయ్‌ ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీని పూర్తి చేసినందుకు చాలా సంతోషం గా ఉన్నానని ఆడపిల్లల విద్యకోసం పాటు పడుతున్న ఈ ఉద్యమ కారిణి అన్నారు.
 • ఇండియన్‌ ఆర్మీ చరిత్రలోనే లెఫ్టినెంట్‌ జనరల్‌ ర్యాంకుకు చేరుకున్న మూడోమహిళగా మాధురీ కనిట్కర్‌ చరిత్ర సృష్టించారు. ఆర్మీలో రెండవ అత్యున్నతస్థాయిలోని ఈ ర్యాంకును పొందిన తొలి పీడియాట్రీషియన్‌గా కూడా కనిట్కర్‌ గుర్తింపు పొందారు.
 • దివ్యా గోకుల్‌ నాథ్‌ ‘ఫోర్బ్స్‌’ ఏషియా పవర్‌ఫుల్‌ బిజినెస్‌ఉమన్‌ లిస్ట్‌–2020లో స్థానం సంపాదించారు. ఆమె, ఆమె భర్త వ్యవస్థాపకులుగా ఉన్న ‘బైజూస్‌’ కంపెనీ విలువ 300 కోట్ల డాలర్లు! ఈ స్టార్టప్‌ ఆలోచన దివ్యదే.
 • అత్యంత వేగవంతమైన మానవ కంప్యూటర్‌గా ఖ్యాతి గడించిన భారత గణిత మేధావి శకుంతలాదేవికి దాదాపు 4 దశాబ్దాల తర్వాత గిన్నిస్‌ సంస్థ సర్టిఫికెట్‌ అందజేసింది. 1980లో లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీలో జరిగిన ప్రదర్శనలో 13 అంకెల రెండు సంఖ్యలను అత్యంతవేగంగా కేవలం 28 సెకన్లలోనే గుణించిన శకుంతలాదేవి ప్రపంచ రికార్డు నెలకొల్పినప్పటికీ అప్పటి నిబంధనల ప్రకారం ఆమెకు గిన్నిస్‌ సంస్థ ధ్రువీకరణ పత్రం అందజేయలేదు.
 • బాలీవుడ్‌ మెగాస్టార్‌ ప్రియాంక చోప్రా ‘ఫార్చూన్‌’ వారి భారతదేశపు అతి శక్తిమంతమైన బిజినెస్‌ ఉమన్‌ జాబితాలో స్థానం పొందారు. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ ఆమె నటించారు.
 • హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త ప్రత్యూష పారెడ్డికి ‘నీతీ ఆయోగ్‌ మహిళా అవార్డు’ లభించింది. 2017లో నెమో కేర్‌ అనే స్టార్టప్‌ కంపెనీని ప్రారంభించిన ప్రత్యూష శిశు మరణాలను తగ్గించడానికి విశేషంగా కృషి చేయడంతోపాటు నవజాత శిశువుల ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకునే కార్యక్రమాలు చేపట్టారు.
 • ముంబైలోని నావికాదళ స్కూల్‌ విద్యార్థిని 12 ఏళ్ల కామ్య కార్తికేయన్‌ దక్షిణ అమెరికాలోని ఎత్తయిన పర్వతం మౌంట్‌ అకాంకాగ్వా (6,962మీ) విజయవంతంగా అధిరోహించింది. అకాంకాగ్వా పర్వతాన్ని అధిరోహించిన అత్యంత చిన్న వయస్కురాలిగా కామ్య ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
Published date : 31 Dec 2020 03:51PM

Photo Stories