POK: భారత్‌లో కలపాలంటూ పాక్‌లో తీవ్ర ఆందోళన.... పూర్తి వివరాలు ఇవిగో..
తమను భారత్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.
కార్గిల్ రోడ్డును తిరిగి తెరవాలని, భారత్‌లో కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో తమ ప్రాంతాన్ని కలిపేయాలని వారు అడుగుతున్నారు. ఆ ప్రాంతంలో 12 రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. గోధుమ, ఇతర నిత్యావసర వస్తువులపై సబ్సిడీ పునరుద్ధరించాలని, ఈ ప్రాంతంలోని సహజవనరుల దోపిడీ, భూముల ఆక్రమణను ఆపాలని వారు నినదిస్తున్నారు.
గిల్గిట్ బాల్టిస్థాన్‌లో 1989 ప్రాంతంలో బలవరిస్థాన్ నేషనల్ ఫ్రంట్‌ను నవాజ్‌ఖాన్ స్థాపించాడు. మొదట రాజకీయ పార్టీగా తన ప్రస్థానం మొదలుపెట్టినా రాను రాను పాకిస్థాన్ ప్రభుత్వం తమని నిర్లక్ష్యం చేస్తోందన్న భావనతో తమకి ప్రత్యేక దేశం కావాలని ఉద్యమం మొదలుపెట్టింది. గిల్గిట్ బాల్టిస్థాన్ లో ఉన్న సహజ వనరులని తీసుకుపోయి ఉర్దూ మాట్లాడే ప్రాంతాలలో ఖర్చు పెడుతోందని గిల్గిట్ బాలిస్థాన్ వాసులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం పాక్‌లో నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతుండడంతో వారిలో ఆందోళన, ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నాయి. పాక్‌లోని ఇతర ప్రాంతాల్లో మొదటగా సబ్సిడీ ఇస్తూ... మిగిలితే తమకు అందజేస్తున్నారన్న ఆగ్రహం వారిలో పెరిగిపోయింది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ లాంటి చోట్ల గోధుమపిండి కిలో రూ. 150 ఉంటే అది గిల్గిట్ బాలిస్టాన్‌లో రూ. 200కి అమ్ముతున్నారు.
వందల ఏళ్లుగా తాము ఉంటున్న ప్రాంతాన్ని ఆక్రమించి తమను బాల్టిస్థాన్ నుంచి వేరే ప్రాంతాలకు పంపించేందుకు పాకిస్థాన్ సైన్యం ప్రయత్నిస్తోందని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. గిల్గిట్ బాల్టిస్థాన్ దగ్గర సైనిక స్థావరాలని నిర్మించాలనే నెపంతో అక్కడి ప్రజలని దూరంగా తరలించేదుకు పాక్ గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇందుకు ప్రాంత ప్రజలు ససేమిరా ఒప్పుకోవడం లేదు. గిల్గిట్ బాల్టిస్థాన్‌కి ఆనుకుని చైనాకి చెందిన సీపీఈసీ రోడ్ మార్గం కారకోరం వద్ద ఉంది. గిల్గిట్ బాలిస్థాన్‌లో ఆందోళన వల్ల పాకిస్థాన్‌తో పాటు చైనా కూడా కలవరపడుతోంది.
1948లో గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజల సహకారంతో గిల్గిట్ బాల్టిస్థాన్‌ని పాకిస్తాన్ ఆక్రమించుకోగలిగింది. ఇప్పుడు అదే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండడంతో ఏం చేయాలో పాక్‌కు దిక్కుతోచడం లేదు. ఇప్పటికే పాకిస్థాన్ వద్ద విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. ఏం కొనాలన్నా, ఖర్చు పెట్టాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సిన దుస్థితి. ఈ పరిస్థితుల్లో బాలిస్థాన్ ప్రజల ఆందోళన ఏ తీరానికి చేరుకుంటుందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.