Skip to main content

AP CM YS Jagan : మరో మంచి కార్యక్రమానికి సీఎం జగన్‌ శ్రీకారం...

సాక్షి, అమరావతి: మరో మంచి కార్యక్రమానికి ఈరోజు(అక్టోబ‌ర్ 26వ తేదీన‌) శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
YSR Rythu Bharosa 2nd Installment
YSR Rythu Bharosa 2nd Installment

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తున్నామన్నారు. అక్టోబ‌ర్ 26వ తేదీన ఆయన రైతు భరోసా కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘మాది రైతు పక్షపాత ప్రభుత్వం. మూడో సంవత్సరం రెండో విడత నిధులు విడుదల చేస్తున్నాం. రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.18,777 కోట్లు విడుదల చేశామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.  

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా...
‘‘గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు రూ.1,180 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. కరువుసీమలో కూడా నేడు పుష్కలంగా సాగునీరు అందుతోంది. కరోనా సవాల్‌ విసిరినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రూ.2,134 కోట్ల వ్యయంతో యంత్రసేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 29 నెలల పాలనలో అనేక మార్పులు తీసుకొచ్చాం. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశాం. ఈ-క్రాపింగ్‌ నమోదు ద్వారా వ్యవసాయ పథకాలు అమలు చేస్తున్నామని’’ సీఎం అన్నారు.

వైఎస్సార్‌ సున్నావడ్డీతో..
వైఎస్సార్‌ రైతుభరోసా, వైఎస్సార్‌ సున్నావడ్డీ, వైఎస్సార్‌ యంత్ర సేవాపథకం.. ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను సీఎం జగన్‌ కాసేపట్లో తన క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 

50.37 లక్షల మంది రైతులకు.. 
ఖరీఫ్‌ కోతలు, రబీ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద రెండోవిడత పెట్టుబడి సాయంగా 50.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,052 కోట్లను జమచేయనున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందు తొలివిడతలో దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.7,500 చొప్పున రూ.3,811.96 కోట్లు జమచేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కౌలుదారులు, అటవీ భూములు సాగుచేస్తున్న రైతులతో సహా 50.37 లక్షల మందికి రెండోవిడత సాయం అందిస్తోంది. వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద 2019 నుంచి ఏటా మూడువిడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీన్లో రూ.7500 మే నెలలోను, రూ.4 వేలు అక్టోబర్‌లోను, మిగిలిన రూ.2 వేలు జనవరిలోను జమ చేస్తున్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతోపాటు దేవదాయ, అటవీభూముల సాగుదారులతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రాంత రైతులకు రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే భరోసా కల్పిస్తోంది.

49.40 లక్షల మంది రైతుల‌కు..

AP CM YS Jagan Mohan Reddy


2019–20లో 45.23 లక్షల మంది కుటుంబాలకు రూ.6,162.45 కోట్ల ఆర్థిక సహాయం అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో 49.40 లక్షల మంది రైతులకు రూ. 6,750.67 కోట్లు అందజేసింది. అటవీభూమి సాగుచేస్తున్న వారితోపాటు కౌలుదారులు కలిపి తొలి ఏడాది 1,58,123 మంది, రెండో ఏడాది 1,54,171 మంది లబ్ధిపొందారు. 2021–22 సంవత్సరానికి సంబంధించి తొలివిడతగా మే 13న రూ.3,811.96 కోట్ల సాయమందించిన ప్రభుత్వం రెండోవిడతగా నేడు 50.37 లక్షల మంది రైతులకు రూ.2052 కోట్లు అందిస్తోంది.

భూమిలేని 1.50 లక్షల మందికి..
ఈ ఏడాది లబ్ధిపొందుతున్న రైతు కుటుంబాల్లో 48,86,361 మంది భూ యజమానులు కాగా, అటవీభూములు సాగుచేస్తున్న వారు 82,251 మందితోపాటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాస్తవ సాగు(కౌలు)దారులు 68,737 మంది లబ్ధిపొందుతున్నారు. మూడేళ్లుగా లబ్ధి పొందుతున్న వారిసంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న రెండోవిడత సాయంతో కలిపి 2019 నుంచి ఇప్పటివరకు వైఎస్సార్‌ రైతుభరోసా కింద రైతులకు రూ.18,777 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించింది.

అర్హుల ఎంపిక ఇలా..
ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్న సంకల్పంతో అర్హుల గుర్తింపులో ప్రభుత్వం అత్యంత పారదర్శకత పాటిస్తోంది. అర్హుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తూ రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. అర్హులై ఉండి లబ్ధిపొందని వారి వివరాలను గ్రీవెన్స్‌ పోర్టల్‌లో పొందుపరిచి వారిలో అర్హులను గుర్తిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నివసిస్తూ మన రాష్ట్రంలో వ్యవసాయ భూములు ఉన్న 865 మంది రైతులకు కూడా ఈ ఏడాది రూ.13,500 వంతున రైతుభరోసా సాయం అందించారు. 

6.67 లక్షల మంది రైతులకు.. 

AP CM YS Jagan


అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్న హామీమేరకు వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాల పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. రుణాలను గడువులోగా తిరిగి చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఇస్తోంది. రూ.లక్షలోపు పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వైఎస్సార్‌ సున్నావడ్డీ కింద రాయితీ ఇస్తూ వారికి అండగా నిలుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించకుండా వదిలేసిన బకాయిలు కూడా చెల్లిస్తూ రైతులకు బాసటగా ఉండటమేగాక ఏడాది తిరక్కుండానే ఈ వడ్డీ రాయితీ సొమ్మును జమచేస్తోంది.

ఖరీఫ్‌–2020 సీజన్‌కు సంబంధించి 6.67 లక్షల మంది రైతులకు రూ.112.70 కోట్ల సున్నావడ్డీ రాయితీ సొమ్మును నేడు ముఖ్యమంత్రి వారిఖాతాల్లో జమచేస్తున్నారు.  2014–15లో రూ.3.46 కోట్లు, 2015–16లో రూ.1.91 కోట్లు, 2016–17లో రూ.212.33 కోట్లు, 2017–18లో రూ.345.18 కోట్లు, 2018–19లో రూ.617.78 కోట్లు కలిపి మొత్తం 50 లక్షల మంది రైతులకు రూ.1,180.66 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమచేసింది. ఖరీఫ్‌–2019 సీజన్‌లో 14.28 లక్షల మందికి రూ.289.68 కోట్లు, రబీ–2019–20 సీజన్‌లో 5.55 లక్షల మందికి రూ.92.38 కోట్లు చెల్లించింది.

ఈ–క్రాప్, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా..
ఖరీఫ్‌–2020 సీజన్‌కు సంబంధించి ఈ–క్రాప్‌లో నమోదైన పంట వివరాల ఆధారంగా, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం వడ్డీ రాయితీ లబ్ధిని వాస్తవ సాగుదారులకు అందించాలని సంకల్పించారు. ఈ సీజన్‌లో రూ.లక్షలోపు 11,03,228 మందికి రూ.6,389 కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ–క్రాప్, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం వీరిలో 6.67 లక్షల మంది సున్నావడ్డీకి అర్హులుగా గుర్తించారు. ఈ జాబితాలను సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌) కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శిస్తున్నారు. ఇలా అర్హత పొందినవారి ఖాతాలకు వైఎస్సార్‌ సున్నావడ్డీ రాయితీ కింద రూ.112.70 కోట్లను ప్రభుత్వం నేడు జమచేస్తోంది.

యాంత్రీకరణకు చేయూత..
చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వాటికి సంబంధించి సబ్సిడీ సొమ్ము రూ.25.55 కోట్లను నేడు రైతు గ్రూపులకు జమచేయనుంది. వైఎస్సార్‌ యంత్ర సేవాపథకం కింద గ్రామస్థాయిలో ఇప్పటికే 789 యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించగా, తాజాగా మరో 1,720 కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఆధునిక యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో వైఎస్సార్‌ ఆర్బీకేలకు అనుబంధంగా కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను (సీహెచ్‌సీలను) ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్‌ యంత్ర సేవాపథకం కింద గ్రామస్థాయిలో ఒక్కొక్కటి రూ.15 లక్షల విలువైన యంత్ర పరికరాలతో 10,750, క్లస్టర్‌ స్థాయిలో రూ.25 లక్షల విలువైన వరికోత యంత్రాలతో కూడిన 1,035 యంత్ర సేవాకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ పథకం కింద రూ.2,134 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను 11,785 రైతుగ్రూపుల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మొత్తంలో 854 కోట్లు (40 శాతం) సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుండగా, 10 శాతం (రూ.213 కోట్లు) రైతు కమిటీలు భరిస్తున్నాయి. మిగిలిన 50 శాతం (1,067 కోట్లు) బ్యాంకులు రుణంగా ఇస్తున్నాయి. తొలివిడతగా గ్రామస్థాయిలో 3,250 సీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా కాగా ఇప్పటికే 789 సీహెచ్‌సీలను రైతు దినోత్సవం రోజైన జూలై 8వ తేదీన అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటికి సంబంధించి రూ.9.07 కోట్ల సబ్సిడీని జమచేశారు. తాజాగా రూ.69.87 కోట్ల విలువైన యంత్ర పరికరాలతో 1,720 యంత్ర సేవాకేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి 40 శాతం సబ్సిడీ మొత్తం రూ.25.55 కోట్లను మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

Published date : 01 Nov 2021 11:27AM

Photo Stories