Skip to main content

జూలై 29న‌ అంతర్జాతీయ టైగర్ దినోత్సవం

ప్ర‌తి ఏడాది జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ టైగర్ దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వ‌హించుకుంటారు.
పులుల ఆవాసాల రక్షణ మరియు విస్తరణ‌ను ప్రోత్సహించడం కోసం పులుల పరిరక్షణపై అవగాహన ద్వారా పొందే మద్దతు కోసం 2010 నుండి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవంను నిర్వహిస్తున్నారు.
పులితో పోరాటం అంటే ప్రాణాలపై ఆశలను వదులుకోవడమే. అయితే ఇది గతం. వర్తమానానికి వస్తే మమ్మల్ని చంపొద్దూ, కాపాడండి అని పులే వేడుకుంటోంది. మనిషి దురాశకు పులి బలైపోతోంది. ఇందుకు వరల్డ్ వైల్డ్ లైఫ్ గణాంకాలే నిదర్శనం. 1913లో ప్రపంచంలో లక్ష పులులు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 3200 లోపే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ వందేళ్లలో 97 శాతం మేర పులులు అంతరించిపోయాయి. విచక్షణా రహితంగా పులులను వేటాడటంతోపాటు అడవుల నరికివేత, ఆహార లభ్యత తగ్గడమే అవి అంతరించిపోవడానికి కారణం. ఈ నేపథ్యంలో పులులు సంచరించే అభయారణ్యాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 2010 నుంచి ఏటా జూలై 29న గ్లోబల్ టైగర్ డేగా పాటిస్తున్నారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో జరిగిన టైగర్ సమ్మిట్‌ నిర్ణయం మేరకు అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఈ సమితి లక్ష్యంగా పెట్టుకుంది.

గత ఐదేళ్లలో భారత్ సహా మిగతా ప్రపంచ దేశాల్లోనూ పులుల సంఖ్య చెప్పుకోదగిన రీతిలో వృద్ధి చెందడం ఆహ్వానించదగిన పరిణామం. 2010లో ప్రపంచవ్యాప్తంగా 3200 పులులు ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 3890కి చేరుకుంది. పులుల జనాభాలో పెరుగుదల సుమారు 22 శాతం ఉందని ఈ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 690 పులులు పెరగ్గా, ఒక్క భారత్‌లోనే వాటి సంఖ్య 500 పెరగడం విశేషం. భారత్‌తో పాటు రష్యా, నేపాల్, భూటాన్ దేశాల్లోనూ పులుల సంఖ్య పెరిగింది. ప్రపంచంలోకెల్లా ఎక్కువ పులులు మనదేశంలోనే ఉన్నాయి.
Published date : 03 Jul 2020 07:14PM

Photo Stories