Skip to main content

ఇంటర్నేషనల్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ డేను ఎప్పడు జరుపుకుంటారు?

భూమికి అవతల ఏముంది.. ఇతర గ్రహాల్లో, ఇంకెక్కడైనా జీవం ఉందా.. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తోక చుక్కలు.. ఇలా అంతరిక్షంపై ఎప్పటినుంచో మనిషికి ఆసక్తి ఉంది.
ఆ దిశగానే అంతరిక్ష ప్రయోగాలు చేపట్టారు. మనుషులు స్పేస్‌లోకి అడుగు పెట్టారు కూడా. 1961 ఏప్రిల్‌ 12న రష్యా కాస్మోనాట్‌ యూరీ గగారిన్‌ తొలిసారిగా స్పేస్‌లోకి వెళ్లారు. ఈ మేరకు 2011 నుంచి ఏటా ఏప్రిల్‌ 12న ‘ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ డే’గా జరుపుతున్నారు. ఈ సందర్భంగా 2021 ఏడాది చేపట్టిన పలు కీలక అంతరిక్ష ప్రయోగాలేంటో తెలుసుకుందాం.

అమెరికా.. ఆర్టెమిస్‌–1
చంద్రుడిపైకి మనుషులను పంపే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్‌ మిషన్‌లో భాగంగా 2021 ఏడాది తొలి ప్రయోగం జరుగనుంది. నవంబర్‌లో ‘ఆర్టెమిస్‌–1’ను లాంచ్‌ చేసేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది.

జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌
సుదూర అంతరిక్షంలో రహస్యాలను ఛేదించేందుకు, భూమిలాంటి గ్రహాలను గుర్తించేందుకు నాసా చేపట్టిన ‘ది జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌’ 2021 ఏడాది అక్టోబర్‌లో నింగికి ఎగరనుంది.

స్పేస్‌లో చెత్తను క్లీన్‌ చేసేందుకు..
సుమారు 50 ఏళ్లుగా వివిధ దేశాలు పంపిన శాటిలైట్లలో గడువు ముగిసిపోయినవి, చెడిపోయినవి, ప్రయోగాలకు వాడిన రాకెట్లు, వాటి విడిభాగాలు లక్షల సంఖ్యలో భూమిచుట్టూ తిరుగుతున్నాయి. వాటినే ‘స్పేస్‌ జంక్‌’ అంటారు. ఇవి భవిష్యత్తు శాటిలైట్‌ ప్రయోగాలకు ప్రమాదకరం. ఈ నేపథ్యంలో ఆ చెత్తను క్లీన్‌ చేసేందుకు జపాన్‌కు చెందిన ఆస్ట్రోస్కేల్‌ కంపెనీ 2021, మార్చి 22న ‘స్పేస్‌ జంక్‌ క్లీనప్‌’ మిషన్‌ను ప్రయోగించింది.

ఆస్టరాయిడ్ల గుట్టు తేల్చే.. ల్యూసీ మిషన్‌
అంగారక గ్రహం అవతలి ఒక ఆస్టరాయిడ్, గురుగ్రహం కక్ష్యలో సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఏడు ‘ట్రోజాన్‌ ఆస్టరాయిడ్ల’పై పరిశోధన కోసం నాసా చేపట్టిన ప్రయోగం ‘ల్యూసీ’ మిషన్‌. సౌర కుటుంబం ఏర్పడిన తొలినాళ్లలో పరిస్థితులు, భూమిపై జీవం పుట్టుకకు సంబంధించిన ఆనవాళ్లను ఈ ప్రయోగంతో గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 12 ఏళ్లపాటు సాగు ఈ సుదీర్ఘ మిషన్‌ 2021, అక్టోబర్‌లో నింగికి ఎగరనుంది.

మార్స్‌పైకి.. మూడు దేశాలు
ఒకప్పుడు జీవం ఉండి ఉంటుందని భావిస్తున్న అంగారక గ్రహంపై 2021 ఏడాది మూడు దేశాలు పరిశోధనలు చేపట్టాయి. అమెరికా పంపిన ‘పర్సవెరన్స్‌’ రోవర్‌ మార్స్‌పై ఉపరితలంపై తిరుగుతూ అక్కడి నేల, రసాయనాలు, జీవం ఉనికిని వెతుకుతోంది. ఈ రోవర్‌ వెంట వెళ్లిన ‘ఇన్‌జెన్యుటీ’.. భూమి అవతల మరోగ్రహంపై గాల్లోకి ఎగిరే తొలి హెలికాప్టర్‌ కానుంది. ఇక మార్స్‌పైకి చైనా, యూఏఈ దేశాలు తొలిసారి ప్రయోగాలు చేపట్టాయి. చైనాకు చెందిన టియాన్వెన్‌–1, యూఏఈకి చెందిన ది హోప్‌ ఆర్బిటర్‌ రెండూ.. 2021, ఫిబ్రవరిలో కేవలం ఒక్క రోజు తేడాలో అంగారకుడిని చేరి పరిశోధనలు మొదలుపెట్టాయి.
Published date : 15 Apr 2021 06:23PM

Photo Stories