ISRO: 2024లో రోదసిలోకి మానవుడు.... చరిత్ర సృష్టించనున్న ఇస్రో
గగన్ యాన్‌కు సంబంధించి ఇప్పటికే పలు రకాలుగా భూస్థిర పరీక్షలు నిర్వహించామన్నారు. దీనికి సంబంధించి 2022లో తొమ్మిది రకాల సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్‌లు నిర్వహించామన్నారు.
2024లో మానవ సహిత ప్రయోగం...
మరో 30 రకాల భూస్థిర పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ ఏడాది ఆఖరు నాటికి క్రూ మాడ్యూల్‌తో ప్రయోగాన్ని నిర్వహిస్తామని ఆర్ముగం తెలిపారు. ముందు రెండుసార్లు మానవ రహిత ప్రయోగాలను నిర్వహించాక 2024 ఆఖరు నాటికి ఎల్‌వీఎం–3 భారీ రాకెట్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఇస్రోలో అన్ని సెంటర్లు దీనిపైనే దృష్టిసారించి పనిచేస్తున్నాయన్నారు. అన్నీ సవ్యంగా జరిగితే 2024లో గగన్ యాన్ ప్రయోగంలో మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.
2023లో 11 ప్రయోగాలు లక్ష్యం....
ఈ ఏడాది 11 ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆర్ముగం తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఐదు రాకెట్లు, ఎల్‌వీఎం–3లో రెండు, జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో రెండు, ఎస్‌ఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో రెండు ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఫిబ్రవరి మూడో వారంలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ (స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్) డీ2 ప్రయోగాన్ని నిర్వహించిన అనంతరం ఐదు పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలతో పాటు సూర్యుడిపై పరిశోధనకు ఆదిత్యఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని తెలిపారు.
చంద్రయాన్–3 ప్రయోగానికి సన్నాహాలు...
ఎల్‌వీఎం–3 రాకెట్ల ద్వారా వన్ వెబ్ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను, చంద్రయాన్–3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా నావిగేషన్, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. మరోవైపు.. షార్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పీఐఎఫ్) భవనం నిర్మాణం పూర్తిచేసి విజయవంతంగా ట్రయల్ రన్‌ను నిర్వహించారు.
స్పేస్ రీఫార్మ్ ఇయర్‌గా చెప్పుకోవచ్చు...
పీఎస్‌ఎల్‌వీ సీ55 ఇంటిగ్రేషన్‌తో సెకండ్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నామని ఆర్ముగం వెల్లడించారు. మొత్తం మీద షార్‌లోని అన్ని సదుపాయాలను ఉపయోగించి ఈ ఏడాది 11 ప్రయోగాలను చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. తద్వారా ఈ ఏడాది కూడా స్పేస్ రీఫార్మ్ ఇయర్‌గా చెప్పుకోవచ్చునని ఆయన తెలిపారు. అలాగే ప్రైవేట్ ప్రయోగాల విషయంలో ఎవరైనా స్టార్టప్ కంపెనీలతో వస్తే ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.