Skip to main content

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక- సామాజిక న్యాయం

ఆధునిక రాజ్యాలు సంక్షేమ రాజ్యాలు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి, వికాసం కోసం నిర్దిష్ట పథకాలను, ప్రణాళికలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. సామాజిక న్యాయం రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిలో అంతర్భాగం. ముఖ్యంగా సమాజంలోని అత్యంత అణగారిన వర్గాలుగా ఉన్న షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ప్రజలకు; ఇతర ప్రజానికానికి మధ్య ఉన్న అభివృద్ధి అసమానతలు, ఇతర వివక్షతలను తొలగించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా రాజ్యాంగం గుర్తించింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వర్గాలకు ప్రయోజనం అందించే ప్రత్యేక ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పించింది.

ఉప ప్రణాళిక ఉపయోగం, ఆవశ్యకత:
కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి ధ్యేయంతో 1974లో గిరిజన ఉప ప్రణాళిక, 1979లో ఎస్సీలకు ప్రత్యేక ఉప ప్రణాళికలను రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తమ బడ్జెట్‌లో జనాభా దామాషా కింద ఈ వర్గాలకు నిధులు కేటాయించడం, వనరుల సమీకరణ, సమీకృతాభివృద్ధి పథకాలను అమలు చేయడం వంటివి ఈ ప్రణాళికల ప్రధాన లక్ష్యాలు. వీటిని అమలుచేసేలా కేంద్ర ప్రణాళిక సంఘం రాష్ట్రాలకు మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. అయితే చాలా రాష్ట్రాలు ఈ మార్గదర్శక సూత్రాలను విస్మరించాయి. ఈ వర్గాలకు కేటాయించిన నిధులను దారి మళ్లించడం, సకాలంలో సక్రమంగా వినియోగించకపోవడం మొదలైన కారణాల వల్ల ప్రభుత్వాలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి. వీటిని అరికట్టడం, సక్రమ వినియోగం కోసం చట్టబద్ధత అనివార్యమైంది.

ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి:
మొదటి నుంచి మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు ఉప ప్రణాళికలను పకడ్బందీగా అమలుచేస్తున్నాయి. మహారాష్ట్రలో ప్రత్యేక నిధులతోపాటు అదనపు నిధులు కేటాయించి సంక్షేమాభివృద్ధి పథకాలను అమలుచేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల నిధుల వినియోగం తీరు పరిశీలిస్తే మహారాష్ట్ర, గుజరాత్‌లు 100 శాతం, తమిళనాడు 95 శాతం, ఛత్తీస్‌గఢ్ 93 శాతం, ఒడిశా 92 శాతం, కేరళ 89 శాతం వినియోగించగా, ఆంధ్రప్రదేశ్ 65 శాతం నిధులను మాత్రమే ఖర్చు పెట్టింది.

ఆంధ్రప్రదేశ్- ఉప ప్రణాళిక చట్టబద్ధతలో ప్రథమం- వినియోగంలో అథమం:
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ఉప ప్రణాళిక (ఆర్థిక వనరుల కేటాయింపు, వినియోగం-2012) బిల్లును డిసెంబర్ 3, 2012న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. ఈ విధంగా ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డులకెక్కింది. బిల్లు ఆమోదం కోసం శాసనసభ మూడు రోజులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం గమనార్హం.

ఉప ప్రణాళిక- ముఖ్యాంశాలు:
  1. ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన వారి ఆర్థిక, విద్య, జీవన ప్రమాణాలను పెంచడంతోపాటు ఆయా వర్గాలకు భద్రత, సామాజిక హోదా కల్పన కోసం ప్రణాళిక బడ్జెట్‌లోని ఉప ప్రణాళిక నిధులను వెచ్చించాలి.
  2. ఎస్సీ, ఎస్టీలకు; ఇతర వర్గాల మధ్య నున్న వ్యత్యాసాలను రూపుమాపేలా ఆయా వర్గాలకు ప్రత్యక్ష, మెరుగైన ప్రయోజనాలను అందించేలా పథకాలను రూపొందించాలి. వ్యక్తిగతంగా, కుటుంబాలవారీగా, నివాసాలవారీగా బడ్జెట్ రూపకల్పనకు ఆరునెలలు ముందే ప్రణాళికలను తయారుచేయాలి. అందులోనూ అత్యంత వెనుకబడిన ఎస్సీ, ఎస్టీలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి.
  3. ఉప ప్రణాళికను పారదర్శకంగా అమలు చేసేందుకుగానూ అన్ని ప్రభుత్వ శాఖలను పటిష్టపరచాలి.
  4. ఈ ప్రణాళిక అమలుకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి.
  5. ఈ చట్టం ద్వారా కేటాయించే నిధుల దారిమళ్లింపుగాని, ఖర్చు చేయని పక్షంలో మురిగిపోయేందుకు కానీ అవకాశం ఉండదు. నిధులను ఖర్చు చేయడంలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకుంటారు.
  6. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే మండలి ఈ చట్టం ద్వారా సంక్రమించే అధికారాలను, విధులను పర్యవేక్షిస్తుంది. ఈ మండలి ఏటా రెండు పర్యాయాలు సమావేశం కావాల్సి ఉంటుంది.
  7. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో నోడల్ ఏజెన్సీలు ఉప ప్రణాళికల అమలు తీరును పరిశీలించి, తమ నివేదికలను అభివృద్ధి మండలి ఆమోదానికి పంపుతాయి.
  8. ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి పదేళ్లపాటు కాల పరిమితిని విధించారు.
ఉప ప్రణాళిక-వ్యూహం,ఉత్పన్నమయ్యే సమస్యలు:
దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం రూపొందిన ఈ ఉప ప్రణాళిక అమలు, కార్యాచరణ ఖరారు కావాల్సి ఉంది. స్వాతంత్య్రం సిద్ధించిన ఆరున్నర దశాబ్దాల కాలంలో అమలుచేసిన ప్రణాళికలను, పథకాలను సమీక్షించాల్సి ఉంటుంది. వారి అభ్యున్నతికి ఉద్దేశించిన పథకాలు ఏవీ లక్ష్యాలను ఆశించిన రీతిలో చేరుకున్న దాఖలాల్లేవు. ఈ ప్రణాళిక కూడా వాటిలో ఒకటిగా మిగిలి పోకుండా ఉండాలంటే రాజకీయ క్రియాశీలతతోపాటు నిజాయితీతో అమలు చేయాల్సి ఉంటుంది.

ప్రణాళిక అమలు - పారదర్శకత గీటురాయి:
ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇతర రాష్ట్రాలు ఎలాంటి చట్టాల అవసరం లేకుండానే కేంద్ర ప్రణాళిక సంఘం మార్గదర్శకాలను నిక్కచ్చిగా, పారదర్శకంగా, ప్రశంసనీయంగా అమలుచేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. మన రాష్ట్రంలో అలాంటి ఫలితాలను సాధించేందుకు ఈ ఉప ప్రణాళిక దోహదం చేస్తుందని చెప్పక తప్పదు. అయితే ఇందులో ఎన్నో లోపాలు వెల్లడయ్యాయి. వాటిని గుర్తించి, సవరించాల్సి ఉంది. ముఖ్యంగా..
  1. నిధుల సద్వినియోగంపై మంత్రిమండలి ఉప సంఘం సూచించిన అంబుడ్స్‌మెన్ ఏర్పాటు చేయాలి.
  2. ఉప ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయడానికి అంకిత భావం, సర్వహంగులతో కూడిన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
  3. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి సామాజిక తనిఖీలు నిర్వహిస్తుండాలి.
  4. ఉప ప్రణాళిక అమలులో భాగంగా బడ్జెట్‌లో ప్రణాళిక కేటాయింపుల్లో జనాభా దామాషాలో నిధులు కేటాయిస్తారు. అత్యధిక శాతం ఎస్సీ, ఎస్టీలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి అంతగా ప్రాధాన్యత ఉండటం లేదు. జల యజ్ఞానికి అధిక నిధులు కేటాయిస్తున్నా, దాని వల్ల ఈ వర్గాలకు పెద్ద ప్రయోజనం ఉండదు. కారణం వీరిలో ఎక్కువగా భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలుగా పనిచేస్తుండటమే.
  5. అందువల్ల ఉప ప్రణాళికను సాంకేతిక దృక్పథంతో కాకుండా సామాజిక, ఆర్థిక దృక్పథంతో పరిశీలించాల్సి ఉంటుంది.
  6. ఆర్థిక వ్యవస్థలో... ముఖ్యంగా సర్వీసెస్, టెక్నాలజీ రంగాల్లో వస్తున్న మార్పుల్లో ఈ వర్గాలను భాగస్వాములను చేయాలి. ఈ రంగాలే భవిష్యత్తులో సంపదను సృష్టించే కీలక రంగాలుగా మారనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నం, చొరవ ప్రశంసనీయం. దేశానికి కూడా ఆదర్శనీయమే. చిత్తశుద్ధి, సంకల్ప శుద్ధి, రాజకీయ ప్రయోజన రహిత ఆదర్శాలతో అమలు చేస్తే నాడు పూజ్య బాపూజీ కలలు కన్న ఆదర్శ రాజ్యం, డా॥ బి. ఆర్. అంబేద్కర్ ఆశించిన నవ సమాజం సాకారమవుతుంది. అదే విధంగా పన్నెండో పంచవర్ష ప్రణాళిక ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశించిన వేగవంతమైన, సుస్థిరమైన, మరింత సమ్మిళితమైన అభివృద్ధితో కూడిన సమ సమాజం సుసాధ్యమవుతుంది.

ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ సంరక్షణలు
భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయ సాధన కోసం ఈ వర్గాలకు అనేక సంరక్షణ ఏర్పాట్లు ఉన్నాయి.
అవి..
  1. ప్రకరణ-14: చట్టం ముందు అందరూ సమానులే. అదేవిధంగా అందరికీ సమాన అవకాశాలు.
  2. ప్రకరణ-15 (1): పౌరులను వారి కులం ఆధారంగా వివక్ష చూపరాదు.
  3. 15 (2): ప్రజోపయోగకరమైన ప్రదేశాల్లోకి అందరికీ సమాన ప్రవేశం.
  4. ప్రకరణ- 15 (4): ఈ వర్గాలకు ప్రత్యేక రక్షణలు, మినహాయింపులు
  5. ప్రకరణ- 15 (5): ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రత్యేక అవకాశాలు
  6. ప్రకరణ- 16 (2): ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల వివక్ష చూపరాదు.
  7. ప్రకరణ-16 (4A, 4B): ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు
  8. ప్రకరణ-46: ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి పథకాల అమలు
  9. ప్రకరణ-243D: ఎస్సీలకు పంచాయితీ వ్యవస్థలో రిజర్వేషన్లు
  10. ప్రకరణ-243T: పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు
  11. ప్రకరణ-330: లోక్‌సభలో రిజర్వేషన్లు
  12. ప్రకరణ-332: రాష్ట్ర విధాన సభలో రిజర్వేషన్లు
  13. ప్రకరణ-335: కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో ఈ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం
  14. ప్రకరణ-338: ఎస్సీల కోసం జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు
  15. ప్రకరణ-338A: ఎస్టీల కోసం జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు
Published date : 25 Jan 2013 01:23PM

Photo Stories