వికాసాన్ని మింగేస్తున్న ఒత్తిళ్లు
Sakshi Education
చుక్కా రామయ్య, వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు.
ఇంజనీరింగ్ విద్య పట్ల మొగ్గు అధికం కావడంతో తల్లిదండ్రులు మామూలు కాలేజీలోకాక ఐఐటీలో తమ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారు. ఆపై అమెరికా పంపితే, వారి భవిష్యత్తు అంతా డాలర్ల పంటేనని కలలు కంటున్నారు. ఈ ఐఐటీ మోజుని కార్పొరేట్ కళాశాలలు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఐఐటీ ఎంట్రన్‌స రాయగలిగే సామర్థ్యం, ఆపై చదివేందుకు కావలసిన పునాది విద్యార్థికి ఉందా లేదా అన్న మదింపు చేయకుండా వేల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకొని తరగతి గదులలో కుక్కుతున్నారు.
కలకలం రేపుతున్న ఆత్మహత్యలు
విద్యారంగంలో ప్రస్తుతం విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. మానసిక ఒత్తిడిని తట్టుకోలేని పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. అనుకున్న ర్యాంక్ రాలేదనో, కావాలనుకున్న విభాగంలో సీటు దక్కదనో, పరీక్షలో తన సామర్థ్యం సరిపోవడం లేదనో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు, బంధువుల దృష్టి అంతా విద్యార్థి మీదనే. కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకుల ఆశాదీపం కూడా విద్యార్థే. ఇంతమందీ తనవైపే చూస్తుంటే, తానేమో చదువులో వారందరూ ఆశించిన రీతిలో రాణించలేక పోతున్నానన్న ఒత్తిడితో విద్యార్థులు సతమతమవుతున్నారు. ఇప్పుడిప్పుడే లోకం పోకడ తెలుసుకుంటున్న వారి మనసుకు మరో మార్గం కన్పించక మరణమే శరణ్యమన్న భావన బలపడుతున్నది. ప్రభుత్వం దీనికి స్పందిస్తోంది. కాలేజీలను తనిఖీ చేయిస్తామంటోంది. పెనాల్టీలు విధిస్తామంటోంది. అవసరమైతే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామంటోంది. ప్రస్తుతం విద్యారంగంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ ప్రభుత్వాలనే నియంత్రించే స్థాయిలో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలు ఈ హెచ్చరికలను తాటాకు చప్పుళ్లుగా పరిగణించి పెడచెవిన పెడతాయా? లేకపోతే భయపడి దారికి వస్తాయా? వేచి చూడవలసిందే. కానీ ఈ చర్యలే పరిష్కారమా? వీటివల్లనే విద్యార్థులపై ఒత్తిళ్ళు ఆగి పోతాయా? లేదు. ఇది కేవలం వ్యాధికి పైపైన చేసే చికిత్సే తప్ప, రుగ్మతల మూలాన్ని శోధించి, శాశ్వతంగా నిర్మూలించే ప్రయత్నం మాత్రం కాదు. అలా జరగాలంటే విద్యార్థులపై ఒత్తిళ్ళకు మూల కారణాల కోసం అన్వేషించాలి.
విద్య లక్ష్యం...
చదువుల గమ్యం ఏమిటి? అన్న ప్రశ్నలో ప్రస్తుత సంక్షోభానికి మూలాలు దాగి ఉన్నాయి. విద్య లక్ష్యం ఏమిటి? మనిషిలో చైతన్యానికి సాధనం విద్య. అంతర్గత అవలోకనానికి ఉపకరణం. ఇలా కలిగించిన చైతన్యం జ్ఞానార్జనగా మారి జీవితపర్యంతం కొనసాగుతుంది. కొత్త విషయం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్న తపన మనిషి తుది శ్వాసదాకా జ్వలి స్తూనే ఉండటానికి ఇదే కారణం. విద్య వల్ల సామాజిక పరివర్తన సాధ్యపడుతుంది. సాంస్కృతిక ఉద్దీపన అంకురిస్తుంది. విద్య వల్ల ఒనగూరే ఈ ప్రయోజనాల స్థానాన్ని నేడు ఆర్థిక లబ్ధి ఆక్రమించడం ప్రస్తుత అనర్థాలకు వెనుక ఉన్న కారణం. విద్యార్థికి నేర్పాల్సిన చదువు ఉద్దేశం ధనార్జన మార్గం కావడమే అసలు రుగ్మత. విద్య పెట్టుబడి వస్తువుగా మారడమే నేటి సంక్షోభానికి హేతువు. దీనికి విషబీజాలు అమెరికాలో పడ్డాయి.
ఈ విషబీజాలు అక్కడివే!
అమెరికాలో ఉన్నత విద్యాసంస్థలు, పారిశ్రామికరంగం పరస్పరాధారితాలు. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు ఒకదాని ఆధారంగా మరొకటి పనిచేస్తుంటాయి. యూనివర్సిటీల పాలకమండళ్లలో పారిశ్రామికవేత్తలు, సంస్థలకు ప్రాతినిధ్యం ఉంటుంది. వారు విశ్వవిద్యాలయ నిర్వహణ, అభివృద్ధికి నిధులు ఇస్తుంటారు. వారి ఆర్థిక తోడ్పాటుతోనే విశ్వవిద్యాలయాలు వృద్ధి చెందుతుంటాయి. అలాగే విశ్వవిద్యాలయాలలో జరిగే పరిశోధనల లక్ష్యం పరిశ్రమలకు ఉపకరించడమే. అక్కడి పరిశోధనల ఆధారంగా పరిశ్రమలు నూతన ఉత్పత్తులు చేపట్టి మార్కెట్‌లోకి తీసుకువస్తాయి. ఈ ప్రక్రియ సాఫీగా సాగేందుకు విశ్వవిద్యాలయాలలో పరిశోధనలకు సారథ్యం వహించే ప్రొఫెసర్లే ఒక పరిశోధన కొలిక్కిరాగానే దీర్ఘకాల సెలవు పెట్టి ఆ పరిశోధనలను అమలు పెట్టబోతున్న పరిశ్రమలో తాత్కాలికంగా చేరి సేవలు అంది స్తుంటారు. పరిశోధనలు చేసిన ప్రొఫెసర్లే ఉత్పత్తి రూపకల్పనలో పాలు పంచుకోవడం వల్ల సాధారణంగా సత్ఫలితాలే వస్తాయి. ఇది ఒక కోణం అయితే మరొక కోణం - పరిశ్రమల్లో వాణిజ్య ఉత్పత్తికి మానవ వనరుల అవసరం. ఈ మానవ వనరులను కూడా విశ్వవిద్యాలయాల్లో అవసరమైన నైపుణ్యాలలో తర్ఫీదు ఇచ్చి పరిశ్రమకు పంపుతారు. మళ్లీ అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్లే ఉండి ఎంపికలు జరుపుతారు. ఈ విధంగా పరిశ్రమల కారణంగా విశ్వవిద్యాలయాలు బాగుపడుతుంటాయి. అదేవిధంగా పరిశ్రమలు అపార సంపదను కూడబెడుతుంటాయి. ఈ ఏర్పాటు చూడటానికి ఎంతో బాగున్నట్టు అన్పిస్తుంది. ఎవరికై నా, ‘మంచిదే కదా... రెండూ బాగుపడుతున్నాయి’ అన్న భావన కలగడం సహజం. అయితే ఆర్థికకోణం నుంచి చూసినపుడు ఈ ఏర్పాటు ఉభయతారకంగా అనిపించినపుడు కాని, ఇందులో లోపిస్తున్నది సామాజిక మానవీయ కోణమన్న సంగతి అర్థంకాదు. సమాజానికి ధనం ఒక్కటే అవసరం కాదు. అది ఉన్నవాడి దగ్గరే మరింత పోగుపడడం కాదు. ధనాన్ని సృష్టించింది సమాజమే. అందుకే ధనం సమాజంలో ఒక భాగం మాత్రమే. సమాజానికి ఇంతకుమించి ఉన్నత లక్ష్యాలున్నాయి.
సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం విద్య దోహదపడాలి. కేవలం ఆర్థిక ఫలితాల కోసమే విద్య కాదు. సామాజిక పరివర్తనకు విద్య ఒక ఆయుధం. సామాజిక చైతన్యానికి, ప్రజాస్వామ్య పరిపుష్టికి, లౌకిక భావాల వ్యాప్తికి, దేశభక్తి ప్రేరేపించేందుకు, విద్య ఒక ఉపకరణంలా నిలవాలి. కానీ అమెరికాలో విద్య ఆదాయ వనరుగా, సంపద సృష్టి మార్గంగా భావించి పరిశ్రమలు, కంపెనీలు ఉన్నత విద్యాలయాలలో పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు. పరిశోధనలు సత్ఫలితాలు రావాలంటూ ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. దానితో పరిశ్రమలు విశ్వవిద్యాలయాల పరిశోధనల ఆధారంగా ఉత్పత్తులు తీసుకువస్తే వాటి ఆదాయంలో యూనివర్సిటీలు వాటా డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. ఇక్కడితో అమెరికాలో ఉన్నత విద్య లాభార్జనకే అన్నది (ఎడ్యుకేషన్ ఫర్ ప్రాఫిట్) ఖరారు అయిపోయింది. దీని ప్రభావం మనదేశంపై మరొక విధంగా పడింది.
అంతిమ గమ్యం అమెరికానే!
మన దేశంలో ఇంజనీరింగ్ విద్య పట్ల మొగ్గు అధికం కావడంతో తల్లిదండ్రులు మామూలు కాలేజీలోకాక మంచి భవిష్యత్తు ఉండే ఐఐటీలో తమ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారు. ఐఐటీల్లో చదివించి ఆపై ఎం.ఎస్.కు అమెరికా పంపితే ఆపై వారి భవిష్యత్త అంతా డాలర్ల పంటేనని కలలు కంటున్నారు. తల్లిదండ్రుల ఈ ఐఐటీ మోజుని కార్పొరేట్ కళాశాలలు సొమ్ము చేసుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. ఐఐటీ ఎంట్రన్‌స రాయగలిగే సామర్థ్యం, ఆపై ఐఐటీల్లో చదివేందుకు కావలసిన పునాది విద్యార్థికి ఉందా లేదా అన్న మదింపు చేయకుండా వేల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకొని తరగతి గదులలో కుక్కుతున్నారు. తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ ఫీజులు పిండడం కోసం తమ వద్ద ర్యాంకులు తెచ్చుకున్న వారంటూ ఫొటోలు చూపుతారు. నిజంగా ఆ ర్యాంకులు వచ్చినవారు తమ సహజ సొంత ప్రతిభతో సాధించుకొని ఉండవచ్చు. లేదా వేలమందిలో గుప్పెడు ర్యాంకులు వచ్చి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రులు కాస్త తార్కికంగా ఆలోచించాల్సింది పోయి ప్రచారపు రొంపిలో ఇరుక్కుంటున్నారు. ఒక ర్యాంకు చూపితే వేల అడ్మిషన్లు వస్తాయని చాలా సందర్భాలలో కార్పొరేట్ కళాశాలలు ర్యాంకుల్ని కొంటున్నాయి కూడా. మొత్తం మీద తల్లిదండ్రులు కూడా ఈ రొంపిలో పడుతున్నారు. కార్పొరేట్ కళాశాలలను అమెరికాకు పాస్‌పోర్ట్ ఇచ్చే సంస్థలన్నట్టు కొందరు తల్లిదండ్రులు నమ్ముతున్నారంటే ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ఈ విధంగా మనదేశంలో కూడా మంచి చదువు కాసులు కురిపిస్తుందన్న విశ్వాసానికి సగటు మనిషి వచ్చేశాడు. చదువు వల్ల వచ్చే ఒకే ఒక ఫలితం ధనమే అయిపోయింది. దీని వల్లనే విద్యార్థిపై అటు కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకులు, ఇటు తల్లిదండ్రులు ఒత్తిడి పెంచేస్తున్నారు. దీని ఫలితమే విద్యార్థుల ఆత్మహత్యలు. తనపై మితిమీరిన ఆశలు పెట్టుకొన్న తల్లిదండ్రులు, మరోపక్క ర్యాంకులు తెచ్చుకోవాలంటూ కార్పొరేట్ కళాశాలలు మెడమీద కత్తి పెడుతున్నాయి. దానితో మరో దారిలేక విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. ఈ కోణం నుంచి చూడకుండా కేవలం కార్పొరేట్ కళాశాలలపై దాడులు చేస్తే వ్యాధి ఒక చోట ఉంటే చికిత్స మరొక చోట చేసినట్టవుతుంది.
దిద్దుబాటు చర్యలు ఏమిటి?
తల్లిదండ్రుల దృక్పథం మారాలి. తమ పిల్లలు ఐఐటీల్లోనే చదవాలన్న అత్యాశను వదులుకోవాలి. అలాగే అందరి పిల్లల్లాగానే తమ పిల్లలు అమెరికా వెళ్లిపోవాలన్న కోరిక గురించి పునరాలోచించుకోవాలి. పిల్లలకు ఇష్టం లేకపోయినా ఐఐటీలకు పంపి ఒత్తిడి కలిగించడం కంటే వారికి ఇష్టమైన రంగాన్ని ఎంచుకోనివ్వాలి. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవాలి.
ఆసక్తి చూపేవారు తగ్గితే సహజంగానే కార్పొరేట్ కళాశాలల దూకుడు తగ్గుతుంది. కార్పొరేట్ సంస్థలు ర్యాంకుల ప్రకటనను ముద్రణ, ప్రసార మాధ్యమాల్లో ఇతరత్రా రాకుండా చూడాలి. ఉల్లంఘిస్తే చర్యలు ఉండాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై దృష్టి పెట్టి మానవ వనరుల విధానాన్ని రూపకల్పన చేయాలి. ఇందులో రాబోయే పదేళ్ల పాటు ఏయే రంగాలలో ఏ విద్యార్హతలు గల నిపుణులు, ఉన్నత విద్యావంతులు అవసరమో ప్రకటించి ప్రచారం కల్పించాలి. ఆయా రంగాలలో కాలుమోపిన వారికి గల ఉజ్జ్వల అవకాశాలను ఆవిష్కరించాలి. దీని ద్వారా పరాయి దేశం పోవడం కంటే ఇక్కడే ఉండి నచ్చిన రంగంలో స్థిరపడవచ్చునన్న ఆశ విద్యార్థులు, తల్లిదండ్రులకు కలుగుతుంది.
ఉన్నత విద్యను ఆదాయ కల్పవృక్షంగా చూడకుండా విద్యార్థిలో అది తీసుకువచ్చే మానసిక, సామాజిక మార్పులను సామాన్యుల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. తయారీ రంగం, స్టార్టప్‌లకు దేశంలో ప్రస్తుతం ఉన్న సానుకూల ప్రోత్సాహకర వాతావరణం రీత్యా ఉన్నత విద్యకు వచ్చిన వారిలో ఆసక్తిగల వారిని గుర్తించి ఉద్యోగం కోసం చేయి చాచకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేందుకు కావలసిన అవకాశాలు కల్పించాలి.
మొత్తం మీద లాభార్జన కోసమే విద్య అన్న భావనకే మనవారి దృష్టి స్థిరపడడానికి ముందే ప్రభుత్వాలు కళ్లు తెరచి చొరవ చూపాలి. లేకపోతే అమెరికా చవిచూస్తున్న విషఫలాలే భవిష్యత్తులో మనమూ అందుకునే ప్రమాదం ఉంది. ఈ దిశగా కృషి చేయడం వల్ల మన పిల్లలపై ఒత్తిడి తగ్గి ఆత్మహత్యలు కనుమరుగవుతాయన్నదే ఆశ.

Published date : 15 Nov 2017 02:26PM