Skip to main content

Genaral Essay: ఇప్ప‌టివ‌ర‌కు మ‌హిళా ఎమ్మెల్యేలే లేరు... శాస‌న‌స‌భ‌లో వారి ప్రాతినిధ్యం సున్నా... ఎక్క‌డంటే..!

ఆమె... ఎందులోనూ తక్కువ కాదు. ఆకాశంలో సగం. అన్నింటా కూడా సగం. ఇంటికే పరిమితమనేది గతించిన మాట. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా, ధాటిగా తనను తాను నిరూపించుకుంటోంది. మహిళలు అన్ని రంగాల్లోనూ గణనీయమైన పురోగతి సాధిస్తున్నారు. కానీ నాగాలాండ్‌లో మాత్రం మహిళలు ఒక విషయంలో మరీ వెనకబడ్డారు.
Women Voters

ఇక్కడా తప్పు వారిది కాదు... అక్కడి పురుషాధిక్య సమాజానిది. ఆ రాష్ట్రంలో చదువులో, ఉద్యోగాల్లో లేని కట్టుబాటు రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం పెద్ద అడ్డుకట్టగా మారింది. నాగాలాండ్‌ శాసనసభకు ఇప్పటిదాకా ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు!
13 ఎన్నిక‌ల్లోనూ ద‌క్క‌ని ప్రాతినిధ్యం
నాగాలాండ్‌ 1963లో రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఇప్పటిదాకా శాసనసభకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ 13 సభల్లోనూ మహిళలకు అసలే ప్రాతినిధ్యం దక్కలేదు. 13 ఎన్నికల్లోనూ బరిలో దిగిన మహిళల సంఖ్య కేవలం 20 మాత్రమే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఐదుగురు మహిళలు పోటీ చేశారు. కానీ వీరిలో ముగ్గురికి డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఓవరాల్‌గా ఇప్పటిదాకా బరిలో దిగిన 20 మందిలో చాలామంది మహిళలకూ అదే ఫలితం దక్కింది!

చ‌ద‌వండి: మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుద‌ల‌
దేశ స‌గ‌టు కంటే ఎక్కువే..!
మహిళలు ప్రధాని అవడమే గాక ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టిన మన దేశంలో ఒక్క నాగాలాండ్‌లోనే ఎందుకీ దుస్థితి? అక్కడేమన్నా అక్షరాస్యత తక్కువగా ఉందా అంటే, ఆ సమస్యే లేదు. రాష్ట్రంలో మహిళల్లో కూడా అక్షరాస్యత ఏకంగా 76.11 శాతం. ఇది దేశ సగటు అక్షరాస్యత (64.6 శాతం) కన్నా ఎక్కువ. ఇంత అక్షరాస్యత ఉన్నా నాగా మహిళలు సాటి మహిళలకు ఓటేసేందుకు సుముఖంగా లేరు! రాష్ట్ర మొత్తం ఓటర్ల సంఖ్య 13.17 లక్షలు. వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు సగం, అంటే 6.56 లక్షలు. అయినా ఎందుకీ చిన్నచూపు?
ఎందుకీ వివక్ష?
స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ 2017లో నాగాలాండ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమై నిరసనలు, ఆందోళనల దాకా వెళ్లింది! అక్కడ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యంపై ఎంత వ్యతిరేక భావన ఉందో దీన్నిబట్టే అర్థమవుతోంది. ఈ రిజర్వేషన్లను నిరసిస్తూ పెద్ద ఎత్తున చెలరేగిన హింసలో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు! రాజ్యాంగంలోని 371 (ఎ) ఆర్టికల్‌లో పేర్కొన్న ప్రత్యేక హక్కులకు ఇది విరుద్ధమన్నది నిరసనకారుల వాదన.

Karnataka Elections 2023: గృహిణులకు నెలకు రూ.2 వేలు
మహిళలకు ప్రాతినిధ్యం ఉండకూడదు
నిర్ణయాధికారాల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండకూడదన్నది వారి డిమాండ్‌. నాగాలాండ్‌లో అత్యధిక శాతం ప్రజలు దీన్ని బలంగా విశ్వసిస్తారు. దీన్ని మార్చేందుకు మహిళల సాధికారత కోసం గళమెత్తే పలు స్వచ్ఛంద సంస్థలు ఎంత కృషి చేసినా లాభం లేకపోయింది. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి నిపూ రియో పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా పెద్దగా ఫలితమైతే లేదు. ఆయన తన నేషనల్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ తరఫున ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు మహిళలకు టికెట్లిచ్చారు.
60లో రెండేనా...?
కానీ మొత్తం 60 సీట్ల శాసనసభలో రెండే టికెట్లివ్వడం ఏ మేరకు సమన్యాయం చేసినట్టవుతుందో! కాంగ్రెస్, బీజేపీ అయితే మహిళలకు ఒక్కో టికెట్‌తోనే సరిపెట్టాయి. ప్రజలతో పాటు పార్టీలు కూడా మహిళల రాజకీయ ప్రాతినిధ్యానికి సరైన ప్రాధాన్యమివ్వడం లేదని ఈ సీట్ల కేటాయింపు చెప్పకనే చెబుతోంది. పార్లమెంటులో కూడా నాగాలాండ్‌ మహిళలకు దక్కిన ప్రాతినిధ్యం స్వల్పాతిస్వల్పం. అప్పుడెప్పుడో 1977లో రానో షైజా లోక్‌సభకు ఎన్నికవగా, తాజాగా 2022లో ఫంగ్నోన్‌ కొన్యాక్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రజలతో పాటు పార్టీల వైఖరి కూడా మారినప్పుడు మాత్రమే నాగాలాండ్‌ అసెంబ్లీలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం దక్కుతుంది.
ఆరుగురిలో ఇద్ద‌రు డ్రాప్‌..!
నాగాలాండ్‌ అసెంబ్లీకి మేఘాలయ, త్రిపురలతో పాటు ఈ నెలాఖర్లోగా పోలింగ్‌ పూర్తవుతుంది. త్రిపురకు ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు 27న పోలింగ్‌ జరగనుంది. కేవలం ఆరుగురు మహిళలు మాత్రమే నామినేషన్‌ వేశారు. వారిలో ఇద్దరు అధికార ఎన్డీపీపీ అభ్యర్థులు, బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి ఒక్కో అభ్యర్థి... మరో ఇద్దరు నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఆ నలుగురిలో ఒక్కరైనా నెగ్గి చరిత్ర సృష్టిస్తారో లేదో చూడాలి. కనీసం సగం మందైనా గెలిస్తే మహిళల రాజకీయ ప్రాతినిధ్యంపై నాగాలాండ్‌ ప్రజల్లో ఉన్న విముఖత మెల్లమెల్లగా తొలగిపోతున్నట్లు భావించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం మార్చి 2న వెలువడే ఫలితాల్లో లభిస్తుంది.
‍‍- ఎస్‌.రాజమహేంద్రారెడ్డి

Published date : 14 Feb 2023 01:52PM

Photo Stories