Skip to main content

నాయక్ కమిటీ సిఫార్సులు- పరిశీలన

బ్యాంక్ బోర్డుల గవర్నెన్స్‌పై సమీక్షకు సంబంధించి తగిన సిఫార్సులు చేయడానికి యాక్సిస్ బ్యాంక్ మాజీ చైర్మన్ పి.జె. నాయక్ అధ్యక్షతన ఒక కమిటీని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ జనవరి 20,2014న ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ముందు నాయక్ కమిటీ తన నివేదికను సమర్పించింది. విత్త రంగ సంస్కరణలకు సంబంధించిన ఈ కమిటీ నివేదిక ప్రస్తుతం కొత్త ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కొన్ని సవరణలతో నూతన ప్రభుత్వం సిఫార్సులను ఆమోదించే అవకాశం కనిపిస్తున్నది.

నిర్మాణాత్మకమైన సిఫారసులు:
బ్యాంకింగ్ రంగం అభివృద్ధికి వ్యూహాలు, వృద్ధి, గవర్నెన్స్, నష్టభయ నివారణ యాజమాన్యం, బ్యాంక్ ఓనర్‌షిప్‌నకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్ నియంత్రణలతో కూడిన మార్గదర్శకాలలాంటి అంశాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకునే విషయంలో బ్యాంకుబోర్డులు తగిన సమయాన్ని కేటాయిస్తున్నాయా? లేదా? అనే విషయాలను పి.జె.నాయక్ కమిటీ పరిశీలించింది.
కమిటీ నివేదికలో వెల్లడించిన సిఫార్సులు నిర్మాణాత్మకంగానూ, ఆలోచించదగినవిగానూ ఉన్నాయి. సిఫార్సులను ఆమోదించడ మనేది రాజకీయ కోణంతో కూడినటువంటిది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల గవర్నెన్స్‌కు సంబంధించి సంస్కరణలు, బ్యాంకుల యాజమాన్యానికి సంబంధించి పలు అంశాల విషయంలో కొత్త సర్కారు తగిన చర్యలు తీసుకోగలదని ఆశించవచ్చు.

పభుత్వ రంగ బ్యాంకులు - మార్కెట్ వాటా:
వివిధ కేటగిరీలకు చెందిన బ్యాంకుల ఆస్తుల సగటు సాంవత్సరిక వృద్ధి మార్చి 2000- మార్చి 2013 మధ్య కాలంలో పరిశీలించినపుడు విదేశీ బ్యాంకులు, ప్రభుత్వ , ప్రైవేటు రంగ బ్యాంకుల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తున్నది. 2000 సంవత్సరంలో బ్యాంకింగ్ రంగ ఆస్తులలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 80 శాతం కాగా 2025 నాటికి 60 శాతానికి తగ్గే సూచనలు ఉన్నాయి. అంటే ప్రస్తుతం 12 శాతం ఉన్న ప్రైవేటు రంగ బ్యాంకుల వాటా 2025 నాటికి 32.1 శాతానికి పెరుగుతుందని అంచనా. బ్యాంకు అసెట్స్ మార్కెట్‌లో విదేశీ బ్యాంకులు Marginal Players గానే ఉండగలవు. 2025 సంవత్సరం నాటికి విదేశీ బ్యాంకుల వాటా 4.7 శాతంగా ఉండగలదని అంచనా.

ఉందిలే మంచి కాలం ముందుముందునా
పైవేటు బ్యాంకింగ్ రంగ స్థితి భవిష్యత్‌లో మెరుగవుతుందని ఆశించడానికి మూడు
కారణాలను పేర్కొనవచ్చు. అవి...
  1. రాబోయే దశాబ్దంలో అనేక నూతన ప్రైవేటు రంగ బ్యాంకులకు లెసైన్స్‌లు మంజూరు చేసే అవకాశం ఉన్నందువల్ల ఆస్తులకు సంబంధించి ఆయా బ్యాంకుల వాటా పెరిగే అవకాశం ఉంది.
  2. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి తరుగుతున్న ఆస్తుల నాణ్యత ఆయా బ్యాంకుల వృద్ధిపై ప్రభావం చూపనుంది.
  3. ప్రైవేటు రంగ బ్యాంకులు వ్యాపారాభివృద్ధిలో భాగంగా ఉపయోగిస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఖాతాదారుల సంఖ్య పెరిగే సూచ నలు ఉన్నాయి.
గత ఎనిమిదేళ్ల కాలంలో (మార్చి 2005-మార్చి 2013 వరకు) ఆస్తుల నుంచి లభించే ప్రతిఫలాల విషయంలో వివిధ బ్యాంకింగ్ కేటగిరీల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. గత ఐదేళ్ల కాలంలో ఆస్తుల నుంచి లభించే ప్రతిఫలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే నూతన ప్రైవేటు రంగ బ్యాంకులకు అధికం. డిసెంబర్ 2013 నాటికి సగటు ఆర్‌ఓఏను ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చినపుడు ప్రైవేటు రంగ బ్యాంకులకు నాలుగురెట్లు ఎక్కువ. 2013-14లో ఆర్థిక వృద్ధి రేటు క్షీణించిన నేపథ్యంలో అన్ని కేటగిరీలలోని బ్యాంకుల ఆర్‌ఓఏ తగ్గింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్‌ఓఏలో తగ్గుదల రేటు ఎక్కువ.

నాయక్ కమిటీ సిఫార్సులు
  1. అనేక బ్యాంకుల గవర్నెన్స్ విధుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని కమిటీ సూచించింది. బ్యాంకుల జాతీయకరణ చట్టం 1970, 1980తో పాటు ఎస్‌బీఐ చట్టం, ఎస్‌బీఐ అనుబంధ చట్టాన్ని పునఃసమీక్షించాలి. అన్ని బ్యాంకులను కంపెనీల చట్టం పరిధిలోకి తీసుకురావాలి. అలాగే బ్యాంక్ పెట్టుబడి కంపెనీని ఏర్పాటు చేసి, ప్రభుత్వం బ్యాంకులలోని తన హోల్డింగ్స్ ను దీనికి బదిలీ చేయాలని సూచించింది. బ్యాంకుల గవర్నెన్స్‌కు సంబంధించి ప్రభుత్వానికి ఉన్న అధికారాలను బ్యాంక్ పెట్టుబడి కంపెనీకి బదిలీ చేయాలని కమిటీ సూచించింది.
  2. బోర్డు నియామకాల ప్రక్రియకు సంబంధించి (హోల్ టైమ్ డెరైక్టర్ల నియామకాలు కూడా కలిపి) మూడు దశల ప్రక్రియను కమిటీ సూచించింది. మొదటి దశలో బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించే వరకు బోర్డు నియామకాలకు సంబంధించి తగిన సలహాలనివ్వడానికి ఎ బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో ఏర్పాటు చేయాలి. బోర్డు బ్యూరోలో మాజీ సీనియర్ బ్యాంకర్లు సభ్యులుగా ఉంటూ బ్యాంక్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌తోపాటు ఇతర బోర్డు నియామకాలకు సంబంధించి సూచనలు అందిస్తారు. రెండో దశలో ఈ బాధ్యతను బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ చేపడుతుంది. మూడో దశలో బీఐసీ తన అధికారాలను బ్యాంక్ బోర్డులకు బదిలీ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం అవసరమని కమిటీ తెలిపింది.
  3. అనేక బహిర్గత అడ్డంకులు కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల గవర్నెన్స్‌లో సమస్యలు ఏర్పడుతున్నాయని కమిటీ అభిప్రాయపడింది. బ్యాంకింగ్ రంగంపై ద్వంద్వ నియంత్రణ (ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐల జోక్యం, ఆర్‌టీఐ చట్టాన్ని పరిమితంగా వినియోగించడం, ప్రత్యేకమైన నైపుణ్యాలు కొరవడటం లాంటి అంశాలను గవర్నెన్స్‌లో సమస్యలు ఏర్పడటానికి కారణాలుగా కమిటీ వివరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వ వాటాను 50 శాతం కన్నా తక్కువకు తగ్గించి ఇతర ఎగ్జిక్యూటివ్ మెజర్స్ తీసుకున్నట్లయితే అన్ని విధా లైన బహిర్గత అడ్డంకులు తొలుగుతాయని కమిటీ అభిప్రాయపడింది.
  4. మానవ వనరుల విధానంలో మార్పు ఆవశ్యకతను కమిటీ నొక్కిచెప్పింది. అగ్రస్థాయి మేనేజ్‌మెంట్‌లో యువత ఆవశ్యకతను గుర్తించాలని స్పష్టం చేసింది. యువతీ,యువకులు ఎక్కువకాలం బ్యాంకింగ్ రంగ అభివృద్ధికి సహకారం అందించగలరని, అలాంటప్పుడే వారసత్వ ప్రణాళిక (సక్సెషన్ ప్లానింగ్) సక్రమంగా ఉంటుందని కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది.
  5. పలు వర్గాలకు చెందిన పెట్టుబడిదారులు ప్రభుత్వ రంగ బ్యాంకులలో అధిక వాటా కొనుగోలు చేసే విధంగా వారిని అనుమతించాలని కమిటీ సూచించింది. దీనిలో భాగంగా ఆథరైజ్డ్ బ్యాంక్ ఇన్వెస్టర్స్‌ను ఏర్పాటు చేయాలి. ఏ విధమైన నియంత్రణలు లేకుండా ఆథరైజ్డ్ బ్యాంక్ ఇన్వెస్టర్స్ 20 శాతం ఈక్విటీ వరకు అనుమతించాలి.
  6. రుణ ఆస్తుల ఫోర్ట్‌ఫోలియో నాణ్యతపై బోర్డులు తగిన దృష్టి సారించాలి. సరైన అమ్మకపు విధానాలతో కూడిన థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్‌ను బోర్డు తప్పని సరిగా నిర్వచించాలి. వివిధ వయో వర్గాలు, ఖాతాదారుల ఆదాయం, సంపద, ఖాతాదారుల నష్ట భయాన్ని తగ్గించే విధంగా ప్రొడక్ట్స్‌ను బోర్డు ప్రవేశపెట్టాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లకు లాభ ఆధారిత కమీషన్ విధానాన్ని అనుమతించాలి.
  7. ప్రస్తుతం ఉన్న గవర్నెన్స్ అదే విధంగా కొనసాగితే ద్రవ్య స్థిరత్వం కొరవడుతుందని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి రెండు అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుల ప్రైవేటీకరణతోపాటు విలీనాలను ప్రోత్సహించడం లేదా కొత్త గవర్నెన్స్‌ను డిజైన్ చేయడం లాంటి ఆప్షన్స్‌ను కమిటీ సూచించింది. ఈ విధమైన చర్యల ద్వారా మార్కెట్ ప్రతిఫలంతో సంబంధం లేకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని సమయాలలో బ్యాంకుల మూలధనంపై ఆధారపడటం తగ్గుతుందని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
  8. ప్రైవేటు రంగ బ్యాంకులలో డెరైక్టర్ల నియామకం విషయంలో పాటించే కనిష్ట, గరిష్ఠ వయోనిబంధన కంపెనీల చట్టంలో పొందు పరిచిన విధంగా ఉండాలి. పాత ప్రైవేటు రంగ బ్యాంకులలో డెరైక్టర్ల నియామకానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ అనుమతి అవసరమనుకుంటే ఆ విధమైన ప్రతిపాదనలు రిజర్వ్‌బ్యాంక్ వెల్లడించాలని కమిటీ అభిప్రాయపడింది. పూర్తి కాలపు డెరైక్టర్ల గరిష్ఠ వయోపరిమితి 65 సంవత్సరాలుగా ఉండాలని కమిటీ సూచించింది.
  9. ప్రభుత్వ రంగ బ్యాంకులు వ్యూహాత్మక దృక్పథం అలవరుచుకునే విధంగా బోర్డుల నాణ్యతను మెరుగుపరచాలని కమిటీ సూచించింది. వ్యాపారాభివృద్ధి వ్యూహం, ఫైనాన్షియల్ రిపోర్టులు రూపొందించడం, నష్టభయం, ఫిర్యాదులు, ఖాతాదారుల భద్రత, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, మానవ వనరుల లాంటి ఏడు అంశాలలో బోర్డుల పనితీరును మెరుగుపరచాలని కమిటీ అభిప్రాయపడింది.
  10. ఓనర్‌షిప్‌తో సంబంధం లేకుండా ఒకే విధమైన లెసైన్సింగ్ విధానాన్ని రూపొందించడం అవసరమని కమిటీ సూచించింది.
  11. ప్రభుత్వ రంగ బ్యాంకులలో షేర్‌హోల్డర్ల ఓటింగ్‌రైట్స్‌ను 10 శాతం నుంచి 26 శాతానికి పెంచాలి.
  12. బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీని స్వతంత్ర సంస్థగా ప్రకటించడానికి ప్రభుత్వానికి అధికారం ఉండాలని కమిటీ అభిప్రాయపడింది. సింగపూర్ వలె బ్యాంక్ ఈక్విటీల కొనుగోలులో ఇంటర్మీడియట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలను ప్రోత్సహించాలి.
సిఫార్సులపై అనుకూల వాదనలు:
  • 2018 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు 5.87 లక్షల కోట్లు మూలధనం అవసరమవుతుందనే కమిటీ అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని కమిటీ సిఫారసులను కొంతమంది బ్యాంకింగ్ రంగ నిపుణులు ఆహ్వానించారు. బ్యాంకులలో డెరైక్టర్ల నాణ్యత మెరుగవడానికి ఈ సిఫార్సులు దోహదపడతాయని అభిప్రాయపడుతున్నారు. గవర్నెన్స్ మెరుగవడానికి, పారదర్శకత పెంపొందించడానికి ఈ సిఫార్సులు దోహదపడగలవని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
  • ఆర్‌బీఐ కమిటీ సిఫార్సులు ప్రభుత్వ రంగ బ్యాంకులలో కార్పోరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపరిచి ఆయా బ్యాంకులకు క్రెడిట్ పొజిషన్ కల్పించగలవని మూడీస్ నివేదిక అభిప్రాయపడింది. బ్యాంకులు స్వతంత్ర బోర్డుల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయగలిగినపుడు బ్యాంక్ పెట్టుబడి కంపెనీ తనకున్న విస్తృత అధికారాలను బ్యాంక్ బోర్డులకు బదిలీ చేయగలదని తద్వారా బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ యజమానిగా కాకుండా ప్రాథమికంగా పెట్టుబడి దారునిగానే ఉంటుందని నివేదిక పేర్కొంది. ప్రభుత్వం తన వాటాను ప్రభుత్వ రంగ బ్యాంకులలో 50 శాతం లోపు తగ్గించుకోవాలనే ఆలోచన ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ రాబోయే రోజుల్లో కమిటీ సూచనలను అమలు చేయవచ్చని మూడీస్ నివేదిక పేర్కొంది.
పతికూల వాదనలు:
  • ప్రభుత్వ రంగ బ్యాంకులలో కార్పోరేట్ గవర్నెన్స్‌పై ఏర్పాటైన పి.జె. నాయక్ కమిటీ సిఫార్సులు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ వైపు నడిపించే విధంగా ఉన్నాయని అనేక బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పది లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు, అధికారులతో కూడిన ఐదు జాతీయ ఆర్గనైజేషన్స్ నాయక్ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నారని మహారాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలిపింది. దేశవ్యాప్తంగా మే 23న ఐదు బ్యాంక్ అసోసియేషన్‌లు ధ ర్నాలు నిర్వహించాయి.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ప్రతీప్ చౌధురి నాయక్ కమిటీ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకించారు.
  • నాయక్ తన నివేదిక రూపకల్పనకు అవసరమైన సమాచారాన్ని రిజర్వ్‌బ్యాంక్ వద్ద తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు.
  • ప్రభుత్వ రంగ బ్యాంకులలో టాప్ అపాయింట్‌మెంట్స్ విషయంలో ఆర్‌బీఐ బాధ్యత ఉంటుందని, ప్రభుత్వ రంగ సంస్థల బోర్డులలో గవర్నెన్స్ లోపించినపుడు ఆర్‌బీఐ జోక్యం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ విషయాలను నాయక్ కమిటీ విస్మరించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
Published date : 20 Jun 2014 02:42PM

Photo Stories