Skip to main content

Agriculture: వ్య‌వ‌సాయంలో సాగు ఖ‌ర్చు కంటే మ‌ద్ద‌తుధ‌రే ఎక్కువ : కేంద్రం

దేశంలో సాగు ఖర్చుకు మించి మద్దతు ధరలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 23 రకాల పంటల సాగుకు అయ్యే ఖర్చు ఎంత? వాటికి అందుతున్న మద్దతు ధర ఎంత అనే దానిపై తాజాగా ఒక అధ్యయన నివేదిక విడుదల చేసింది.
Agriculture

వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌ (సీఏసీపీ) మేరకు సాగు ఖర్చులను దేశ వ్యాప్తంగా లెక్కలోకి తీసుకొని వీటి సరాసరిని నివేదికలో పొందుపరిచింది. 2022–23లో వరి ఉత్పత్తి ఖర్చు క్వింటాల్‌కు రూ. 1,360 ఉండగా, కనీస మద్దతు ధర రూ. 2,060గా కేంద్రం నిర్ధారించిన సంగతి తెలిసిందే.

పత్తి ఉత్పత్తి ఖర్చు రూ. 4,053 ఉండగా, దాని మద్దతు ధర రూ. 6,080గా ఉంది. అలాగే మొక్కజొన్న సాగు, ఉత్పత్తి ఖర్చు రూ. 1,308 ఉండగా, దాని మద్దతు ధర రూ. 1,962గా ఉంది. కంది ఉత్పత్తి ఖర్చు రూ. 4,131 కాగా, మద్దతు ధర రూ. 6,600 ఉంది. ఇక సోయాబీన్‌ ఉత్పత్తి ఖర్చు ధర రూ. 2,805 కాగా, మద్దతు ధర రూ. 4,300 ఉంది. వేరుశనగ సాగు ఖర్చు రూ. 3,873 కాగా, 5,850గా ఉంది. ఉత్పత్తి వ్యయంపై కనీసం 50% లాభం కలిగించేలా కనీస మద్దతు ధరలు నిర్ధారించినట్లు కేంద్రం తన నివేదికలో స్పష్టం చేసింది. ఇలా మూడేళ్ల సాగు ఖర్చు, వాటికిచ్చిన మద్దతు ధరల వివరాలను పొందుపరిచింది.  
వరి సాగు ఖర్చు ఎకరానికి రూ. 40 వేలు... 
సాధారణ వరి రకం పండించేందుకు నారుమడి సిద్ధం చేయడం మొదలు విత్తనాలు, నాట్లు, ఎరువులు, కలుపుతీత, చివరకు పంట కోత, కూలీల ఖర్చు, కుటుంబ సభ్యుల శ్రమ మొత్తం కలుపుకుంటే ఎకరానికి రూ. 40 వేలు ఖర్చు (24 క్వింటాళ్లు) అవుతున్నట్లు లెక్కగట్టింది. ఆ ప్రకారమే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను ఖరారు చేసింది. ఎకరా ఖర్చు ప్రకారం క్వింటా వరి పండించాలంటే రూ. 1,666 ఖర్చు అవుతుందని నిర్ధారణ చేసింది. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి ఎంఎస్‌పీ రూ. 2,499గా ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు.

Paddy


ప‌త్తి మ‌ద్ద‌తుధ‌ర పెంచాలి..!
ప్రస్తుతం వరి ఎంఎస్‌పీ రూ. 2,060గా ఉండగా.. దీన్ని మ‌రింత‌ పెంచాలని కోరుతున్నారు. అలాగే తెలంగాణ‌లో అత్యధికంగా సాగు చేసే పత్తికి కూడా ఎకరాకు రూ.40 వేలు ఖర్చుకానుంది. ఎకరాకు పత్తి ఏడు క్వింటాళ్లు దిగుబ‌డి వ‌స్తుంది. కాబట్టి క్వింటాకు రూ. 5,714 ఖర్చు కానుంది. ఈ లెక్కన స్వామినాధన్‌ సిఫార్సుల ప్రకారం రూ. 8,574 పెంచాలని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం పత్తి మద్దతు ధర రూ. 6,080 మాత్రమే ఉండగా, మరో రూ. 2,491 వరకు పెంచాల్సి ఉంటుంది. 

మొక్కజొన్నకు ఎకరాకు రూ. 32 వేల వరకు ఖర్చుకానుంది. ఎకరాకు 15 క్వింటాళ్లు పండిస్తారు. క్వింటాకు రూ. 2,133 ఖర్చు కానుంది. ఆ ప్రకారం మద్దతు ధర రూ. 3,199 ఇవ్వాలని అంటున్నారు. కందికి రూ. 21 వేల వరకు ఖర్చుకానుంది. ఎకరాకు 4 క్వింటాళ్లు పండుతుంది. క్వింటాలుకు రూ. 5,250 ఖర్చు వస్తుంది. ఆ ప్రకారం మద్దతు ధర రూ. 7,875 పెంచాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం దీనికి రూ. 6,600 మద్దతు ధర ఉంది.
ప‌ట్టించుకోని కేంద్రం..!
సోయాబీన్‌కు రూ. 32 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఎకరాకు 5 క్వింటాళ్లు పండుతుంది. దీనికి క్వింటాలుకు రూ. 6,400 ఖర్చు కానుంది. ఆ ప్రకారం మద్దతు ధర రూ. 9,600 చేయాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే ఖ‌ర్చుల‌కు త‌గ్గ మ‌ద్ద‌తుధ‌ర ద‌క్క‌డం లేద‌ని రైతులు, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మొత్తుకుంటున్నా కేంద్రం మాత్రం పెడ‌చెవిన పెడుతుండ‌డం గ‌మ‌నార్హం. 

Published date : 18 Feb 2023 05:43PM

Photo Stories