Skip to main content

మావోయిజం దేశ భద్రతకు పెనుసవాల్‌గా మారిందా?

డా॥బి.జె.బి.కృపాదానం, సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్
ఇటీవల కాలంలో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ప్రముఖ రాజకీయ నాయకులను చంపడంతో మధ్య, తూర్పు భారతదేశంలో అంతర్గత భద్రత ఎంత పేలవంగా ఉందో అర్థమౌతుంది. మావోయిస్టు ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో భారత ప్రభుత్వం విఫలమైందనిపిస్తుంది. నక్సల్స్ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా 230 జిల్లాలలో 20 రాష్ట్రాలకు విస్తరించాయి. గత దశాబ్దంలో జరిగిన ఉగ్రవాద సంఘటనలలో 60 శాతం మావోయిస్టులు చేసినవే. భయపెట్టడం, అమాయకులైన ప్రజలను చంపడం, ప్రతీకార హత్యలు చేయడం, బలవంతంగా ఎత్తుకుపోవడం వీరనుసరించే ఎత్తుగడలు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను విధ్వంసం చేయడం, మందుపాతరలు పేల్చి పోలీసు, భద్రతా దళాలను చంపడం వీరనుసరించే ఇతర పద్ధతులు. మావోయిస్టులు బలంగా ఉన్న ప్రాంతాలలో పన్నులు వసూలు చేయడం, కంగారు న్యాయస్థానాల ద్వారా తక్షణ న్యాయాన్నందించడం వీరి ఇతర చర్యలు.

మావోయిస్టులు హింసాయుత మార్గాల ద్వారా బడాభూస్వాములు, వ్యాపారస్తులు, బహుళజాతి సంస్థలు, అవినీతిపరులైన ప్రభుత్వోద్యోగులు, కాంట్రాక్టర్ల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం, నక్సల్స్ వార్షికంగా 1,500 - 2,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం ఆయుధాలు సమకూర్చుకోవడానికి వినియోగిస్తున్నారు. భద్రతా దళాల మీద దాడి చేయడం ద్వారా వీరు రాజ్యాధికారాన్ని సవాలు చేస్తున్నారు. ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో భద్రతా దళాలకు అపారనష్టం కలిగిస్తున్నారు. అనేక సందర్భాలలో వీరిదే పైచేయిగా ఉంటుంది. మావోయిస్టులు కొనసాగిస్తున్న నిర్విరామ (protracted) ప్రజాయుద్ధం ధ్యేయం అంతిమంగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం. తుపాకీగొట్టం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకోవాలనే మావో నినాదాన్ని వీరు అక్షరాలా పాటిస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వంతో చర్చలకు సుముఖత చూపించడం వీరనుసరిస్తున్న యుద్ధం, ఇతర మార్గాల ద్వారా (War by other means) అనే వ్యూహంలో అంతర్భాగమేనని విమర్శకులు వాదిస్తున్నారు.

మావోయిస్టులు తాము సాధించిన విజయాలను పదిలం చేసుకుంటూ మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. తమ సైనిక పాటవాన్ని పెంపొందించుకుంటూ, వ్యూహాత్మకంగా రాజ్యం మీద ఎదురుదాడి జరుపుతున్నారు. అయితే వీరిని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రతిచర్యలు అంతంత మాత్రమే.

ఈ ఉదాసీనతకు ముఖ్య కారణాలు:
  • నక్సల్స్ ఉగ్రవాదం జమ్మూకాశ్మీర్‌లో కొనసాగుతున్న చొరబాటు (insurgency)కార్యకలాపాలంతా ఆవేశపూరితమైన (emotive) అంశం కాదు.
  • నక్సలైట్లు ఉగ్రవాదులా లేక సామాజిక న్యాయంకోసం పోరాడుతున్న ఉద్యమ కారులా అనే వివాదం.
  • నక్సలైట్స్ ప్రమాదం గురించి మీడియా అతిగా చూపిస్తున్నదనే వాదన.

నక్సల్ ప్రభావిత రాష్ట్రాలలో పోలీసు బలగాలు, నిఘా వ్యవస్థల మధ్య సమన్వయ లోపం వాస్తవం. నక్సల్ కదలికలకు సంబంధించిన సమాచార సేకరణలో పోలీసు యంత్రాంగం విఫలమౌతుంది. పోలీసు బలగాలకు, కేంద్ర సాయుధ బలగాలకు ఇస్తున్న శిక్షణ అరకొరగానే ఉంది. అధునాతన ఆయుధాలు వీరికి అన్ని సమయాలలో అందుబాటులో ఉండటం లేదు. ఇంకొకవైపు నక్సలైట్లు ఆయుధాల వాడకంలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందుతున్నారు. వీటన్నిటికంటే ముఖ్యం నక్సల్స్‌లో ఉన్న అంకితభావం. ప్రాణాలకు తెగించి తాము నమ్ముకున్న ఆశయాలను ఆచరణాత్మకం గావించడానికి వారు సిద్ధంగా ఉండటం. పోలీసు, సాయుధబలగాలు యాంత్రికంగా తమ విధులు నిర్వహిస్తాయే తప్ప, అంకితభావం అంతగా కనిపించదు. నక్సల్ ఉద్యమాన్ని అణచివేయడానికి సైన్యాన్ని ఉపయోగించాలనే వాదన కూడా ఉంది. సైన్యం.. సరిహద్దుల గస్తీ, కాశ్మీర్‌లో ఉగ్రవాద నివారణ, ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లో వేర్పాటువాద సంస్థల హింసాత్మక కార్యకలాపాలను అరికట్టడం, మొదలైన భద్రతా చర్యలలో చురుకుగా పనిచేస్తుంది. అదనంగా నక్సల్ అణచివేత బాధ్యతను అప్పగించినప్పటికీ చాలినన్ని వనరులు లేనందువల్ల తగిన న్యాయం చేయలేదేమో అనిపిస్తుంది. అయినా సైనిక దళాలు విదేశీ శత్రువులతో పోరాడడానికే కానీ స్వదేశీ ఉద్యమకారులతో యుద్ధం చేయడానికి కాదు. పరోక్షంగా సైనిక దళాలు సివిల్ పోలీసులకు, సాయుధ పోలీసు బలగాలకు తగిన శిక్షణ, కీలక సమాచారాన్ని అందించడం ద్వారా నక్సల్ అణచివేత చర్యలకు సహాయపడుతున్నాయి.

నక్సలిజం ఆవిర్భావం
నక్సలైట్ ఉద్యమం 60వ దశకం చివరి భాగంలో రైతు పోరాటంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్‌బరి ప్రాంతంలో ప్రారంభమైంది. చారుమజుందార్, కాను సన్యాల్ ఈ ఉద్యమ నాయకులు. మార్క్సిస్ట్ పంథాననుసరించి ఈ ఉద్యమం సాయుధ పోరాటంతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఏడో దశకంలో ఈ ఉద్యమ కార్యకలాపాల్ని అణచివేయడంలో భారతప్రభుత్వం కొంత విజయం సాధించింది. దాంతో ఉద్యమం బలహీనపడి సైద్ధాంతిక విభేదాల ఫలితంగా అనేక పార్టీలుగా చీలిపోయింది. 2004లో రెండు ప్రధానపార్టీలు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు, లెనినిస్టు) పీపుల్స్‌వార్ గ్రూప్, మావోయిస్ట్ కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ)తో కలిసి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)గా రూపొందాయి. ఈ పార్టీ ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఒక శక్తిమంతమైన రాజకీయశక్తిగా పరిణామం చెందింది. ఈ పార్టీ కార్యకర్తలు ప్రధానంగా దళితులు (SCs), ఆదివాసీలు (STs). 2005-06 నుంచి భారత ప్రభుత్వం మావోయిజాన్ని అణచివేయడానికి కొన్ని వేలమంది సాయుధ బలగాలను ఉపయోగిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు చట్టబద్ధమైన ప్రభుత్వం పనిచేయడంలేదనే చెప్పొచ్చు. బీహార్, జార్ఖండ్, మహారాష్ర్ట, ఆంధ్రప్రదశ్, ఉత్తరప్రదేశ్‌లలో వీరి ప్రభావం గణనీయంగా ఉంది.

భిన్నాభిప్రాయాలు:
మావోయిజం విషయంలో కనీసం మూడు భిన్నాభిప్రాయాలున్నాయి.

  1. భద్రతా దృక్పథంలో చూస్తే మావోయిస్టులు ఉగ్రవాదులు. ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వశాఖ, భద్రతా నిపుణులు మావోయిస్టులను బలవంతంగా డబ్బులు వసూలు చేసే నేరపూరిత ముఠాగా చిత్రీకరిస్తున్నారు. అభివృద్ధి నిరోధక శక్తులుగానూ వర్ణిస్తారు. పారిశ్రామికీకరణను వ్యతిరేకిస్తూ దేశ ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తారు. ఈ వాదనలో నిజం లేదు. మావోయిస్టులు హింసాత్మక చర్యలకు పాలుపడుతున్నారనేది వాస్తవమే కాని వారు ప్రజా కంటకులు కాదు. అణగారిన వర్గాల నుంచి వీరికి గణనీయమైన మద్దతు లభిస్తుందనే నిజాన్ని విస్మరించకూడదు.
  2. పేదరికం, వెనుకబాటుతనం ప్రధానంగా మావోయిజం వైపు ఆకర్షించడానికి కారణమనే వాదం ఉంది. ఇది ఉదారవాద దృక్పథం. ఐతే ఇతర వెనకబడిన ప్రాంతాలలో మావోయిజం ప్రభావం ఎందుకు లేదనే ప్రశ్నకు జవాబులేదు. మావోయిజం సిద్ధాంతంలో ప్రధానాంశం రాజ్యాధికారాన్ని హింసాయుత మార్గాల ద్వారా సాధించడం.
  3. విప్లవాత్మక దృక్పథం. ఇది మావోయిస్టులది. వారిని సమర్థించే వారి ఆలోచనాసరళి. సమాజం వ్యవస్థీకృతమైన (structural) హింసను ఉపయోగించి బలహీనులను అణచివేస్తుంది. అందుకే ప్రజలను చైతన్యవంతం చేసి సాయుధ పోరాటానికి దిగి, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని చెబుతారు. అందుకు సామ్రాజ్యవాద విధానాన్ని, భూస్వామ్య వ్యవస్థను ప్రోత్సహిస్తున్న బూర్జువా ప్రభుత్వాన్ని కూలదోయవలసిన ఆవశ్యకతను వక్కాణిస్తారు. అయితే ఆధునిక రాజ్యం శక్తిమంతమైంది. దాన్ని ముఖాముఖి ఎదుర్కొని గెలిచే అవకాశం ప్రస్తుతానికి మావోయిస్టులకు లేదు. ప్రత్యామ్నాయ ఆలోచనా సరళిని మావోయిజం ఒప్పుకోదు.
ఈ ప్రజాస్వామ్య యుగంలో ప్రజలు వైవిధ్యాన్ని హర్షిస్తారు. శాంతియుత విధానాల ద్వారా మార్పును కోరతారు. హింస వైపు అందరూ ఆకర్షితులవుతారనుకోవడం సహేతుకం కాదేమో!

పేద, అణగారిన వర్గాల్లోనే అధికం:
పైన వివరించిన మూడు దృక్పథాలతో ఉదారవాద దృక్పథం ఆచరణాత్మకమేమోననిపిస్తుంది. కల్లోల ప్రాంతాలలో అభివృద్ధి కార్యకలాపాల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లేంటి, వాటినెలా అధిగమించాలనే అంశంపై విస్తృత పరిశోధనలు జరిగాయి. ప్రణాళికా సంఘం నియమించిన నిపుణుల కమిటీ కూడా సుదీర్ఘ అధ్యయనం చేసింది. దీని ప్రకారం నక్సల్ ఉద్యమం పేద ప్రజలైన దళితులు, ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో ప్రభావితంగా ఉంటుంది. దీనికి కారణం ఈ వర్గాలలో ఎక్కువ మంది పేదలే. బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో గ్రామీణ పేదరికం ఈ వర్గాలలో (SC, ST) ఎక్కువ మోతాదులో ఉంది. 70 శాతం పేద దళితులు, 63 శాతం పేద ఆదివాసీలు ఈ రాష్ట్రాలలోనే ఉన్నారు. అదే పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో దళితులు, ఆదివాసీలు ఉన్నప్పటికీ నక్సల్ ప్రభావం అంతగా లేదు. దీనికి కారణం ఈ రాష్ట్రాలలో పేదరికం పైన ప్రస్తావించిన రాష్ట్రాల కంటే తక్కువ. దీన్ని బట్టి పేదరికానికి, నక్సలిజం ఉద్ధృతం కావడానికి దగ్గర సంబంధం ఉందని తేటతెల్లమవుతుంది. పేదరికం లేమి (Deprivation)కి దారితీస్తుంది. దానితోపాటు అన్యాయానికి, అవమానానికి గురికావడం, అత్యాచారానికి (ముఖ్యం స్త్రీలు) గురికావడం, మొదలైన సంఘటనలు వ్యక్తి పరాయీకరణ (alienation)కు దారితీస్తాయి. ఆ పరిస్థితుల్లో తమ దౌర్భాగ్యానికి కారణమైన సమాజం మీద అసహ్యం, అసహనం పెరిగి దాని నుంచి బయటపడటానికి మార్గాలు వెతకడం జరుగు తుంది. పేద ప్రజలకు మావోయిజం దోపిడీ నుంచి విముక్తికి సాధనంగా కనిపించింది. ఇది సరైన ప్రత్యామ్నాయమే అన్నది వేరే అంశం.

భూ సంస్కరణల అమలు వల్ల లభ్యమైన మిగులు భూమి సన్నకారు రైతులకు, వ్యవసాయ కూలీలకు లభిస్తుందనేది అడియాస అయింది. వ్యవసాయ కూలీలకు కనీస వేతనం లభించకపోవడం, అణగారిన వర్గాలలో నెమ్మదిగా చైతన్యం రావడం, వారు కొనసాగుతున్న వర్గ పూరిత సామాజిక వ్యవస్థను ప్రశ్నించడం జరుగుతుంది. దీంతో ఒకవైపు సంపన్న వర్గం, వారికి కొమ్ముకాసే ప్రభుత్వం ఇంకోవైపు అణచివేత చర్యలకు పూనుకోవడం. దీని పర్యవసానం పీడిత ప్రజలు వారి కోసం ఉద్యమిస్తున్నామన్న మావోయిస్టులకు ఆకర్షితులు కావడం సహజమే. దాదాపు 90 శాతం మావోయిస్టులు దళితులు, ఆదివాసులే. వీరు అన్ని రకాలైన దోపిడీకి గురవుతున్నారు. నక్సలైట్లు వీరికి ఆరాధ్యులు.

పేదప్రజల మీద మావోయిస్టుల ప్రభావాన్ని తొలగించాలంటే మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలంటే కింది చర్యలను చిత్తశుద్ధితో అమలు చేయాలి.

  • పేదల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఉద్దేశించిన PESA, NREGA, The ST and other Traditional forest Dwellers Act, SC, ST (prevention of Atrocities) అఛ్టి లాంటి చట్టాలను కచ్చితంగా అమలు చేయాలి. నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ (National SC, ST Commission), NWC, మైనారిటీ కమిషన్ (Minority Commission), బీసీ కమిషన్ (BC Commission) మొదలైన వాటికి మరిన్ని అధికారాలిచ్చి వాటితో క్రియాశీలకంగా పనిచేయించాలి.
  • భూ సంస్కరణలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. పేద ప్రజలకు, వ్యవసాయం లాభసాటి కార్యకలాపంగా రూపొందించాలి. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడం, ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపరాదు.
  • పారిశ్రామికీకరణ పేరుతో రైతుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటున్న భూమికి తగిన నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి.
  • జీవన భృతి కల్పించాలి.
  • విద్య, ఆరోగ్యం, శుద్ధమైన తాగునీరు, రవాణా సౌకర్యాలు వంటి ప్రాథమిక సేవలందించాలి.
  • ప్రభుత్వం ప్రజల న్యాయమైన డిమాండ్లను తీర్చడానికి ముందుకు రావాలి.
  • ప్రణాళికా వ్యవస్థను పటిష్టం చేయాలి.
  • దిగువ స్థాయిలో పనిచేసే ఉద్యోగుల వైఖరిలో మార్పు రావాలి. ప్రజల ఇబ్బందులేంటో తెలుసుకొని, వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. ఉద్యోగస్వామ్యం ప్రజాసేవకు అంకితం కావాలి.
Published date : 11 Jul 2013 12:08PM

Photo Stories