Skip to main content

‘కాగ్’ 2జీ నివేదిక సరైందేనా!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కొత్త మలుపులు తిరుగుతోంది. స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వేతర సంస్థలకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల దేశ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లమేరకు నష్టం వాటిల్లిందంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2010లో రాష్ట్రపతికి ఇచ్చిన నివేదికతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పట్నించి దీనిపై అనేక దశల్లో విచారణ జరుగుతోంది. అయితే నిజానికి 2జీ స్పెక్ట్రం కేటాయింపుల ద్వారా వచ్చిన నష్టం రూ. 2,645 కోట్లు మాత్రమేనని, ఆ మొత్తాన్ని అతిగా పెంచేసి రూ.1.76 లక్షల కోట్లుగా నివేదిక తయారు చేశారని, తనపై ఒత్తిడి తెచ్చి ఆ నివేదికపై సంతకం చేయించారని కాగ్ నివేదిక సమర్పించిన సమయంలో ఆ సంస్థకు డైరక్టర్ జనరల్‌గా ఉన్న ఆర్.పి.సింగ్ ఇటీవల వెల్లడించడంతో ఈవ్యవహారం సరికొత్త మలుపు తిరిగినట్లయింది. రెండు సంవత్సరాలుగా ఈ కుంభకోణంపై దర్యాప్తు జరుగుతున్నా నోరు మెదపని ఆర్.పి.సింగ్ హఠాత్తుగా తెరపైకి వచ్చి, కాగ్ లెక్కల్ని తప్పుపట్టడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసమే ఈ కొత్త గళాన్ని తెరపైకి తీసుకువచ్చాయని, దర్యాప్తుని పక్కదారి పట్టించడానికే ఇదంతా జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, దీని వల్ల ప్రభుత్వానికి ఏవిధంగా ఎంత మొత్తంలో నష్టం వాటిల్లింది, నష్టాన్ని కాగ్ ఏవిధంగా అంచనా వేసింది, ఆర్.పి.సింగ్ వాదన సరైందేనా మొదలైన అంశాలపై విశ్లేషణ...

ఆర్.పి. సింగ్ వాదన:
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో వాస్తవంగా ప్రభుత్వానికి జరిగిన నష్టం రూ.2,645 కోట్లేనని, అయితే దానిని అతిగా పెంచేసి రూ.1.76లక్షల కోట్లుగా నివేదిక తయారు చేశారని ఆర్.పి.సింగ్ వెల్లడించారు. కేవలం తీవ్ర స్థాయిలో తనపై ఒత్తిడి తీసుకురావడం వల్లే తనకు ఇష్టం లేకపోయినా ఆ నివేదికపై సంతకం చేయాల్సొచ్చిందని, ఈ విధంగా నివేదికని రూపొందించడంలో పీఏసీ చైర్మన్ మురళీ మనోహర్ జోషిది కీలక పాత్ర అని, నివేదికని విడుదల చేయడానికి ముందురోజే కాగ్ లోని అత్యున్నత అధికారులతో జోషీ మాట్లాడారని ఆర్.పి.సింగ్ ఆరోపించారు.

విశ్లేషకుల అభిప్రాయం:
కాగ్ కు డెరైక్టర్ జనరల్‌గా పనిచేసిన తనపై ఒత్తిడి తీసుకు రావడం వల్లే సంతకం పెట్టానని ఆర్.పి.సింగ్ ప్రకటించడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. దేశంలోని అత్యున్నత సంస్థల్లో ఒకటైన కాగ్‌కు డైరక్టర్ జనరల్ పదవిలో ఉండి, తనపై ఒత్తిడి తీసుకువచ్చారని చెప్పడం విడ్డూరంగా ఉందని, ఒక వేళ ఆయన చెప్పిన విధంగా జరిగి ఉంటే ఆవిషయాన్ని అప్పుడే ప్రకటించకుండా ఆయన ఎందుకు మౌనం వహించారని, 2 సంవత్సరాలు తీవ్ర స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ విషయం వెల్లడించడం వెనుక అంతరార్థం ఏంటో ఆర్.పి. సింగ్ వెల్లడించాలని విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్.పి.సింగ్ వెల్లడించిన విషయాలు ఓదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని వారు అభిప్రాయ పడ్డారు. పీఏసీ చైర్మన్ జోషి తనపై ఒత్తిడి చేశారని ప్రకటించి ఆ తర్వాత ‘పీఏసీలోని ఓ వ్యక్తి’ అంటూ ఆర్.పి. సింగ్ మాట మార్చారని ఓ అత్యున్నత అధికారిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట మార్చడం సరైందేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. స్పెక్ట్రమ్ కుంభకోణంపై పార్లమెంటులో 2010 నవంబర్ 17న కాగ్ నివేదిక ప్రవేశపెట్టిందని, తర్వాత సుమారు 6 నెలలకు కాగ్ అధికారుల్ని పీఏసీ చైర్మన్ జోషిని 2011 ఏప్రిల్ 22న కలిశారని, దీనిని బట్టి ఆర్.పి. సింగ్ ఆరోపించినట్లుగా పీఏసీ ఒత్తిడి చేసే అవకాశం లేదని వారు అభిప్రాయ పడ్డారు.

నష్టం జరిగిందనడానికి కారణాలు:
1. ప్రభుత్వం నుంచి చౌకగా స్పెక్ట్రమ్‌ను పొందిన కొన్ని కంపెనీలు దానిని వేల కోట్ల లాభానికి విదేశీ కంపెనీలకు అమ్ముకున్నాయి. ప్రభుత్వం వేలం నిర్వహించి ఉంటే పోటీ మార్కెట్‌లో ఎక్కువ ధర లభించి ఉండేది. అలా కాకుండా ‘ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన’ స్పెక్ట్రమ్‌ను కేటాయించడం వల్ల ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది.
2. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపు జరిగింది 2008లో, కానీ కంపెనీలు మాత్రం 2001 నాటి ధరల ప్రకారం రుసుములు చెల్లించాయి. 2001లో దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య 40 లక్షలే. కానీ 2008లో వీరి సంఖ్య 30 కోట్లు. దీనిని టెలికం శాఖ ఉద్దేశపూర్వకంగా విస్మరించడమే కుంభకోణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగ్ నివేదిక రూపొందిన విధానం:
2జీ కుంభకోణంలో కాగ్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెడుతూ నష్టం అంచనాకు తాము మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు కాగ్ వినోద్‌రాయ్ ప్రకటించారు. అవేమిటంటే...
1. అంతర్జాతీయ లెసైన్సు కోసం స్టెల్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వద్ద ఓ ప్రతిపాదన ఉంచింది. ఆ ప్రతిపాదనలో ప్రస్తావించిన మొత్తాన్ని, స్వాన్, యూనిటెక్ కంపెనీల ఈక్విటీలను, 3జీ స్పెక్ట్రమ్ వేలంలో లభించిన ధరను, ఈ మూడింటి ఆధారంగా నష్టాన్ని అంచనా వేసినట్లు వినోద్‌రాయ్ చెబుతున్నారు.

మూడు దశల్లో కాగ్ ఆడిట్
కాగ్ ఆడిట్ మూడు దశల్లో జరుగుతుంది. ముగ్గురు సభ్యులున్న బృందం ఈ ఆడిట్‌లో పాల్గొంటుంది. ఆడిట్‌కు నిర్దిష్ట మార్గదర్శకాలు ఉన్నాయి. వాటి ప్రకారమే మదింపు జరుగుతుంది. 2జీపై వివిధ దశల్లో వివిధ రకాల అంకెలు తెరపైకి వచ్చాయి.
  • తొలి దశలో జరిగే ఫీల్డ్ ఆడిట్‌లో రూ.26,000 కోట్లు, రూ.48,000 కోట్లుగా అంచనా వేశారు.
  • డెరైక్టర్ జనరల్ కార్యాలయం దీనిని పరిశీలించి అంచనాలను పునర్లిఖిస్తుంది. రూ.2,645 కోట్లు, రూ.2,651 కోట్లు, రూ.36,000 కోట్లుగా అది నివేదికలో పేర్కొంది. డీజీ కార్యాలయమే రూ.1,02,000 కోట్లు, రూ.65,000 కోట్ల గణాంకాలను నివేదికలో ప్రస్తావించింది.
  • మూడో దశలో కాగ్ ప్రధాన కార్యాలయం గతంలో అందుబాటులో లేని రికార్డులను కూడా పరిశీలించి తుది నివేదికను తయారుచేస్తుంది. ఈ పరిశీలన తర్వాతే 2జీ కుంభకోణం రూ.58,000 కోట్ల నుంచి రూ.1,76,000 కోట్లుగా తేలింది. దీనినే తుది నివేదికలో పేర్కొన్నారు.
కాగ్ స్వరూపం...
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సంస్థ కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల నిధుల ఖర్చును తనిఖీ చేసే అత్యున్నత సంస్థ. కేంద్రప్రభుత్వ ఖర్చుల వివరాలు రాష్ర్టపతికి, రాష్ర్టప్రభుత్వాల ఖర్చుల వివరాలు గవర్నర్లకు నివేదికల రూపంలో అందజేస్తుంది. వీటిని పార్లమెంటు, అసెంబ్లీల సమావేశాల సమయంలో సభల్లో ప్రవేశపెడతారు. రాష్ట్రాలలో అకౌంటెంట్ జనరల్ కార్యాలయాలు కాగ్ పరిధిలోనే పనిచేస్తాయి. సంస్థలో అత్యున్నతాధికారి (కాగ్)ని ప్రధానమంత్రి ప్రతిపాదన మేరకు రాష్ర్టపతి నియమిస్తారు. కాగ్ పదవీకాలం ఆరేళ్లు. ప్రస్తుత కాగ్ వినోద్‌రాయ్ 2008 జనవరి 7 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంస్థలో దాదాపు ఆరువేల మంది అధికారులతో పాటు మొత్తం 60 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగ్ కింద ఐదుగురు డిప్యూటీ కాగ్‌లుంటారు. ఈ డిప్యూటీలకు అనుబంధంగా వివిధ రంగాలకు సంబంధించి 10 మంది డెరైక్టర్ జనరల్‌లుంటారు.

స్పెక్ట్రమ్ అంటే...
స్పెక్ట్రమ్ అంటే గాలి మాధ్యమంగా సమాచారాన్ని చేరవేసే రేడియో తరంగాల శ్రేణి. అంటే వైర్‌లెస్ ప్రసారాలను మోసుకుపోయే విద్యుదయస్కాంత తరంగాల క్షేత్రం. మీడియా బ్రాడ్‌కాస్టర్ల నుంచి మిలటరీ వరకూ అందరికీ అవసరమైన స్పెక్ట్రమ్ పరిమిత స్థాయిలో ఉన్న జాతీయ వనరు కావడంతో టెలికం ఆపరేటర్లు ప్రభుత్వం నుంచి దీనిని కొనుగోలు చేస్తారు. వివిధ ఫ్రీక్వెన్సీలలో ఈ స్పెక్ట్రమ్‌ను వాడుకోవడానికి ప్రభుత్వం లెసైన్సులు మంజూరు చేస్తుంది. 2జీ అంటే సెకండ్ జనరేషన్ వైర్‌లెస్ టెలిఫోన్ టెక్నాలజీ సేవలు. ఇవి అందుబాటులోకి వచ్చాక అంతకుముందున్న టెలిఫోన్ వ్యవస్థలను 1జీ టెక్నాలజీగా వ్యవహరించడం మొదలుపెట్టారు. 1జీ నెట్‌వర్క్‌లో రేడియో సిగ్నల్స్ అనలాగ్ పద్ధతిలో ఉండగా 2జీలో అవి డిజిటల్ పద్ధతిలో ఉంటాయి. 2జీ స్పెక్ట్రమ్ లెసైన్సులను 2007లో వేలం వేయగా... 3జీ స్పెక్ట్రమ్ లెసైన్సులను 2011లో వేలం వేశారు.

2జీ స్పెక్ట్రం అక్రమాల క్రమం...
  • 2001 నాటి ధరలకు 2008లో స్పెక్ట్రమ్ కేటాయించారు.
  • వేలానికి వెళ్లకుండా ‘మొదట వచ్చిన వారికి మొదట’ ప్రాతిపదికన కేటాయింపులు జరిపారు. అలా కాకుండా వేలం వేసిఉంటే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేది.
  • ‘మొదట వచ్చిన వారికి మొదట కేటాయింపు’లో కొన్ని మార్పులు చేసి ‘ప్రవేశ రుసుం మొదట చెల్లించిన వారికే మొదట కేటాయింపు’ అని నిర్ణయించారు. ఈ ప్రాతిపదికన అర్హత లేని కంపెనీలకే లెసైన్సులు దక్కాయి.
  • ఒక్కో లెసైన్సు విలువ సుమారు రూ.7442 కోట్లు ఉండాలి. కానీ 9 కంపెనీలు సగటున రూ.1600 కోట్లకే లెసైన్సులు సంపాదించాయి.
  • రియల్ ఎస్టేట్ సంస్థలైన స్వాన్, యూనిటెక్‌లు ఇలాగే ప్రవేశించాయి. లెసైన్సు దక్కించుకునే నాటికి ఈ రెండు కంపెనీలకు టెలికం రంగంలో ఎటువంటి అనుభవమూ లేదు.
  • స్వాన్ సంస్థ రూ.1537కోట్లకు (13 సర్కిళ్లు) లెసైన్సులు పొందింది. తర్వాత 45 శాతం వాటాను యూఏఈకి చెందిన ఎటిసలాట్‌కు రూ.4,500 కోట్లకు అమ్మేసింది.
  • యూనిటెక్ సంస్థ రూ.1651 కోట్లకు (22 సర్కిళ్లు) లెసైన్సులు సంపాదించి 60 శాతం వాటాను 6,120 కోట్లకు నార్వేకి చెందిన టెలినార్ కంపెనీకి అమ్మేసింది.
Published date : 07 Dec 2012 07:16PM

Photo Stories