Skip to main content

భారతదేశంలో బానిసత్వం

-ప్రేమ విఘ్నేశ్వర రావు .కె
భారతదేశం 21వ శతాబ్దంలో అగ్రరాజ్యం కాబోతోందన్న ఊహాగానాలు మోతెక్కుతున్నాయి. అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రరాజ్యాలతో పోటీపడే స్థాయికి చేరుకున్నామన్న భుజకీర్తులకు లోటు లేదు. కంప్యూటర్ రంగంలో దూసుకుపోతున్నామని అమెరికా అధ్యక్షుడికే ఈర్ష్య పుట్టే స్థాయికి చేరుకున్నాం. అక్షరాస్యతలో దూసుకుపోతున్నామని 2011 జనాభా గణాంకాలు ఢంకా మోగిస్తున్నాయి. అయితే నాణానికి మరో కోణాన్ని చూపిస్తూ గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ భారత మెరుపులు నేతి బీర చందమే అంటూ గాలి తీసేసింది. ప్రపంచ బానిసల్లో సగం మంది భారత్ లోనే ఉన్నారంటూ మన తళుకుల వెనుక విషాదాన్ని కళ్లకు కట్టింది .ఈ నేపథ్యంలో భారత దేశంలోని బానిసత్వం పై (వెట్టిచాకిరి) విశ్లేషణ.

బానిసత్వంలో 3 కోట్ల మంది
బానిస సమాజం అంతరించిందని గొప్పగా చెప్పుకుంటుంటాం. అది నిజం కాదన్నది మనం అంగీకరించాలి. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో 3 కోట్ల మంది ప్రజలు బానిసలుగా బతుకుతున్నారని ప్రపంచ బానిసత్వ సూచిక 2013 (గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2013) (జి.ఎస్.ఐ 2013) సర్వేలో తేలింది. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు అభివృద్ధి చెందాయి కాబట్టి ప్రపంచంలో ఇక బానిసత్వపు ఆనవాళ్ళు కనపడకూడదు. అయితే బానిసలు ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన సంఖ్యలో ఉన్నారని వాక్ ఫ్రీ ఫౌండేషన్ సంస్ధ నిర్వహించిన జి.ఎస్.ఐ 2013 సర్వే వెల్లడించింది. 2012 సంవత్సరంలో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ - ఐ.ఎల్.ఓ) చేసిన సర్వే బానిస బతుకులు నెట్టుకొస్తున్నవారి సంఖ్య 2.1 కోట్లని తెలిపింది. అయితే వాస్తవం దానికంటే ఘోరమని జి.ఎస్.ఐ 2013 సర్వేలో స్పష్టం అయింది.

76 శాతం మంది బానిసలు పది దేశాల్లోనే
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బానిసల్లో 76 శాతం మంది పది దేశాల్లో ఉన్నారని అధ్యయనంలో తేటతెల్లమైంది.
భారత్‌ - 1. 39 లక్షలు
చైనా - 29 లక్షలు
పాకిస్తాన్‌ - 21 లక్షలు
నైజీరియా – 7. 1 లక్షలు
ఇథియోపియా – 6.5 లక్షలు
రష్యా – 5.1 లక్షలు
థాయ్‌లాండ్‌ - 4.7 లక్షలు
కాంగో – 4.6 లక్షలు
మయన్మార్‌ - 3 .8 లక్షలు
బంగ్లాదేశ్‌ - 3. 4 లక్షలు

సాంద్రత పరంగా బానిసత్వం
సాంద్రత పరంగా చూస్తే మారిటానియా బానిసల సంఖ్యలో ప్రథమ స్ధానంలో ఉందని నివేదిక తెలిపింది. అక్కడ బానిసల సంఖ్య మొత్తం జనాభాలో 4.2 శాతం. భారతదేశం జన సాంద్రత పరంగా చూస్తే నాలుగో స్థానంలో ఉంది. అప్పు తీర్చలేక ఉచిత శ్రమకు కట్టుబడడం, వెట్టిచాకిరి ఈ రెండూ మన దేశంలో ప్రధానంగా పని చేస్తున్నాయని సర్వే తెలిపింది. మారిటానియా తర్వాత సాంద్రతలో హైతీ, పాకిస్థాన్ లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

సంపన్న దేశాల్లోనూ బానిసత్వం
బ్రిటన్‌, ఐర్లాండ్‌, న్యూజిలాండ్‌, స్విట్జర్లాండ్‌, స్వీడన్‌, నార్వే, లక్సెంబర్గ్‌, ఫిన్‌ల్యాండ్‌, డెన్మార్క్‌ వంటి సంపన్నదేశాల్లోనూ బానిసత్వపు ఛాయలు తొలగిపోలేదు. 162 దేశాల్లో అత్యంత తక్కువ మంది (100) బానిసలు ఐస్ లాండ్ లో ఉన్నారు. ఐస్ లాండ్ కంటే ఎక్కువగా వరుస క్రమంలో ఐర్లాండ్, బ్రిటన్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, స్వీడన్, నార్వే, లగ్జెంబర్గ్, ఫిన్లాండ్ ఉన్నాయి.

ఆధునిక బానిసత్వం
బానిసత్వం అంటే రోమన్, అమెరికన్ బానిసత్వాలే కానక్కరలేదు. “హింస, బలవంతం, మోసాల ద్వారా లాభార్జన కోసం, లైంగిక దోపిడి కోసం వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తూ స్వాధీనంలో లేదా నియంత్రణలో ఉంచుకోవడం”గా బానిసత్వాన్ని ‘వాక్ ఫ్రీ’ నిర్వచించింది. బానిసత్వ పరిస్ధితుల్లో బానిసత్వం కంటే విభిన్న బానిసత్వ పరిస్ధితుల్లో జీవిస్తున్నవారిని కూడ బానిసలుగా వాక్ ఫ్రీ గుర్తించింది.

రుణ బానిసత్వం, బలవంతంగా వ్యభిచారంలోకి దించడం, చిన్నారులను సైన్యంలో ఉపయోగించడం, బలవంతంగా పెళ్లిళ్లు చేయడం, అప్పు తీర్చలేక, విధిలేక వెట్టి చాకిరీ చేయడం, బలవంతపు పెళ్లిళ్లు, స్త్రీలు-పిల్లల అక్రమ రవాణా మొదలయిన దురాగతాలకు గురయినవారందరిని బానిసలుగా ఈ సంస్థ పరిగణించింది.

నేడు ఇంకా కొంతమంది వంశపారంపర్యంగా బానిసలుగా పుడుతున్నారనేది కఠిన వాస్తవం. ముఖ్యంగా పశ్చిమ ఆఫ్రికా, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో బానిసత్వఛాయలు బాగా ఉన్నాయని 162 దేశాలను సర్వే చేసి తయారు చేసిన జి.ఎస్.ఐ 2013 నివేదిక పేర్కొంది. వివిధ రూపాల్లో బానిసత్వం దాగి ఉందని ఈ నివేదిక తెలిపింది. దానికి ‘ఆధునిక బానిసత్వం’ అని పేరుపెట్టింది. భారత్ లో బానిసలకు మాత్రం బహుశా ఈ ‘ఆధునిక’ అనే విశేషణం అవసరం లేకపోవచ్చు.

రెండో స్థానంలో చైనా
చైనాలో బానిసత్వం మళ్ళీ తలెత్తడం మహా ఘోరం. దాదాపు 6 దశాబ్దాలుగా సోషలిజం అమలులో ఉన్న చైనాలో కూడా బానిసత్వం ఉందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. జి.ఎస్.ఐ 2013 సర్వేగణాంకాల ప్రకారం ఇండియా తర్వాత అత్యధిక సంఖ్యలో బానిసలున్నది చైనాలోనే. అక్కడ 29 లక్షల మంది బానిసత్వంలో మగ్గుతున్నారు.

భారతదేశం –బానిసత్వం
ప్రపంచ బానిసల్లో సగం మంది భారతదేశంలోనే ఉన్నారు. జి.సి.ఐ 2013 సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 2కోట్ల 98 లక్షలు బానిసల్లో కోటీ 40 లక్షలు భారత దేశంలోనే ఉన్నారు. అంటే దాదాపు సగం మంది.

భారతదేశం ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి వెట్టిచాకిరీ వ్యవస్థపై 1978లో అధ్యయనం జరిపించింది. ఆ సర్వే ప్రకారం 16 రాష్ట్రాల్లో 3,43,000 మంది వెట్టి కార్మికులు ఉన్నట్లు వెల్లడించింది. అదే ఏడాది ఆరంభంలో గాంధీ పీస్ ఫౌండేషన్, జాతీయ కార్మిక సంస్థ నివేదిక 10 రాష్ట్రాల్లో 26 లక్షల మంది వెట్టి కార్మికులున్నట్లు నిగ్గు తేల్చింది.

భారతదేశంలో వెట్టి చాకిరీపై చట్టబద్ధమైన నిషేధం ఉన్నప్పటికీ ఇప్పటికీ విస్తృతంగా బానిసత్వం కొనసాగుతోంది. పిల్లలు, మహిళలు ప్రత్యేకించి దళితులు వెట్టిచాకిరికి బలవుతున్నారు. క్వారీల్లో, కార్ఖానాల్లో, బియ్యం మిల్లుల్లో, ఇటుక బట్టీల్లో వెట్టి సమస్య తీవ్రంగా ఉందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అనేక మంది వెట్టి కార్మికులుగా ఇటుకల బట్టీలు, వ్యవసాయ పనులు, ధాన్యం మిల్లులు, అగ్గిపెట్టెల తయారీ, మందుగుండు సామగ్రి తయారీ, పట్టుపరిశ్రమ, మైనింగ్ తదితర రంగాల్లో మగ్గిపోతున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కుటుంబ పెద్దలే తమ పిల్లలను బలవంతంగా పనుల్లోకి పంపుతున్న పరిస్థితులు భారత్‌తో పాటు అనేక దేశాల్లో నేటికీ ఉన్నాయి. అమాయకులైన చిన్నారులు పలురకాలుగా దోపిడీకి, వేధింపులకు గురవుతున్నారు.

సాధారణంగా రుణం వల్ల యజమాని, కార్మికుల మధ్య కుదిరిన సంబంధాన్ని వెట్టి చాకిరిగా పేర్కొంటారు. వెట్టి కార్మికులకు స్వేఛ్చ ఉండదు. యజమాని కనుసన్నల్లో పనిచేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వారిని గదిలో పెట్టి బంధించడం వంటివి కూడా జరుగుతుంటాయి. మేఘాలయలోని జైంతియ పర్వత ప్రాంతాల్లో జరుగుతున్న మైనింగ్ తవ్వకాల్లో అనేక మంది నిరుపేద గ్రామీణ వలస కార్మికులు వెట్టి కార్మికులుగా బతుకులీడుస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదాహరణకు ఉద్యోగాలు శాశ్వతమవుతాయన్న ఆశతో తహసీల్దార్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, దేవాలయాల్లో చెత్త ఊడ్చే కార్మికులు ఎందరో దశాబ్దాల తరబడి నామమాత్ర వేతనాలతో నెట్టుకొస్తున్నారు.

భారతగ్రామాలు–బానిసత్వం
భారతదేశ గ్రామాలలో బానిసత్వం ఎక్కువగా ఉంది. బియ్యం మిల్లులు, ఇటుకల బట్టీలు, వ్యవసాయ సంబంధిత పనుల్లో పిల్లలు, మహిళలు, మగవారు బానిసలుగా పనిచేస్తున్నారు. తండ్రి , తాతలు చేసిన అప్పులు తీర్చలేకపోతే పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న సంఘటనలు ఇప్పటికీ గ్రామాల్లో కనిపిస్తున్నాయి.

పంజాబ్ –వెట్టిచాకిరీలో అగ్రస్థానం
పంజాబ్‌ హర్యానా రాష్ట్రాలలో వెట్టిచాకిరీ దురాచారం పెద్దయెత్తున ప్రాబల్యంలో ఉంది. ఒక పంజాబ్‌లోనే ఐదులక్షల మంది కట్టుబానిస కార్మికులు ఉన్నారంటే అక్కడ బానిస వ్యవస్థ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి పరిస్థితి కనిపించదు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులలో అగ్రస్థానాన్ని పొంది, ధాన్యాగారంగా పేరొందిన ఈ ప్రాంతంలో వెట్టిచాకిరీ సమస్య ఎక్కువగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

వ్యభిచారగృహాలు-బానిసత్వం
నరకకూపాల కంటే హీనంగా వుండే వ్యభిచార గృహాలలో సాగుతున్న బానిసత్వాన్ని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. పట్టుమని పదేళ్లు కూడా నిండని పసిమొగ్గలను బలవంతంగా ఈ నరక కూపాలకు ఈడ్చుకొస్తున్న దారుణ ఘటనలు ప్రతిరోజూ వెలుగుచూస్తూనే వున్నాయి. ఆడపిల్లలను ఎత్తుకెళ్లి, వ్యభిచార గృహాలకు కిడ్నాపర్ల ముఠాలు యథేచ్ఛగా తరలిస్తున్నా వాటిని నిరోధించే నాధుడే కరువయ్యారు. కొందరు కిడ్నాప్‌లు చేస్తుంటే, మరికొందరు దత్తత పేరుతో ఆడపిల్లలను వ్యభిచార గృహాలకు తరలిస్తున్న కఠోర వాస్తవాలూ వెలుగు చూస్తూనే వున్నాయి. ఇంకొందరు బలవంతంగా పెళ్లి చేసుకుని, ఆ తర్వాత వ్యభిచార గృహాలకు తరలిస్తున్న సంఘటనలకి భారత దేశంలో కొదవలేదు. ముక్కుపచ్చలారని ఆడపిల్లలకు దొంగ పెళ్లిళ్లు చేసి, విదేశాలకు తరలిస్తున్న సంఘటనలూ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ఇలా తీసుకెళ్తున్నవారిలో చాలామంది విదేశాల్లో దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. ఇంట్లో పనిమనుషులుగానూ, సెక్స్ వర్కర్‌లుగానూ భయంకర నరకాన్ని అనుభవిస్తున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు చదువులు చెప్పిస్తామనో, మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామనో ఆశ చూపి, వారిని పనిమనుషులుగా తీసుకెళ్లి, నరకాన్ని చూపిస్తున్న mmఘటనలు తరచూ వెలుగుచూస్తూనే వున్నాయి. బాల కార్మిక వ్యతిరేక చట్టాలను నిక్కచ్చిగా అమలుచేయాల్సిన ఐఏఎస్‌ అధికారుల ఇళ్లలోనూ బాలకార్మికులు ఉండే అమానవీయ దృశ్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

భారతదేశంలో బానిసత్వం – కారణాలు
భారతదేశంలో బానిసత్వం అనేక రకాలుగా ఉందన్నది వాస్తవం. కిడ్నాప్‌లు, బలవంతపు పెళ్లిళ్లు, పిల్లల విక్రయం, అమ్మాయిల అక్రమ తరలింపు, రుణభారం, ఉపాధి కోసం వలస పోవడం వంటివి బానిసత్వానికి కారణాలవుతున్నాయి. దీనితో పాటు ప్రధానంగా కుల వ్యవస్థ, పేదరికంతో పాటు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థతులు బానిసవ్యవస్థకు ప్రధాన కారణాలవుతున్నాయి. భారతదేశంలో వెట్టిచాకిరి కేవలం ఆర్థికపరమైనదే కాదు, సామాజిక ఆచారం కూడా.

భారత దేశంలో బానిసత్వాన్ని మతం-దైవం అనే శంఖంలో పోసి సిద్ధాంతీకరించడం జరిగింది. ఇది బానిసత్వ శ్రామిక వ్యవస్ధను అనేక దొంతరలు గల కుల వ్యవస్ధగా ఏర్పాటు చేయడానికి సహకరించింది. ఇలా బానిస వ్యవస్థను బందోబస్తు చేయడంతో బానిసత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ తిరుగుబాటుకు ఆదిలోనే పెద్ద ఆటంకం ఏర్పడింది. కొన్ని చోట్ల బానిస సమాజ దశను దాటుకుని ఫ్యూడల్ సమాజ దశలోకి అడుగుపెడుతుండగానే ఆంగ్లేయులు చొరబడి భారత దేశపు సహజ సామాజిక పరిణామ క్రమాన్ని తీవ్రంగా ఆటంకపరిచారు. వారి వల్ల బానిసత్వం, అర్ధ బానిసత్వం పోలేదు. ఇటు విప్లవాలూ రాలేదు. అందుకే ఇక్కడ బానిసలు ఎక్కువమంది ఉన్నారు .

 1. కుల వ్యవస్థ బానిసత్వం, వెట్టి చాకిరి, తరలింపు, నిర్బంధం తదితర మూలాలు భారతీయ కుల వ్యవస్థలో ఉన్నాయి. ఈ వ్యవస్థ సమాన హక్కులు, వ్యక్తిగత గౌరవాలను వ్యతిరేకిస్తోంది. కులం, లింగ పరంగా వివక్ష చూపిస్తోంది.
 2. పేదరికం: దేశంలో పేదరిక నిర్మూలనకు గరీబీ హఠావో, ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత వంటి పథకాలు చేసినా పేదరిక నిర్మూలన ఏనాడూ సవ్యంగా జరగలేదు. అందుకే తెచ్చిన అప్పులు తీర్చలేక గొడ్డుచాకిరీ చేసి ఆపై కన్నబిడ్డలనో రక్త సంబంధీకులనో తనఖా పెట్టాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
 3. భూసంస్కరణలు అమలుకు నోచుకోకపోవడం వ్యవసాయరంగంలో దళితుల పట్ల చూపే కులపరమైన వివక్ష వెట్టిచాకిరీకి ప్రధాన కారణం. భూసంస్కరణల విధానంలోని లోపాలే దీనికి కారణం. భూసంస్కరణలను బాగా అమలు చేసిన కేరళలో వెట్టిచాకిరి కనిపించదు. అదే గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల్లో భూసంస్కరణలు సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల ఇప్పటికీ అత్యధిక శాతం భూమి భూస్వాముల చేతుల్లో ఉండిపోయింది. దీనివల్ల భూమిలేని నిరుపేదలు, దళితులు ఈ భూస్వామ్యవర్గాల కబంధ హస్తాల్లో వెట్టిచాకిరికి బలవుతున్నారు. జీవనాధారానికి మరో ప్రత్యామ్నాయం లేక అత్యధిక గ్రామీణ జనాభా భూస్వాముల ఆధీనంలో పనిచేయాల్సి వస్తుంది. క్రమంగా రుణ వలయంలో చిక్కుకుని మొత్తం కుటుంబ సభ్యులందరూ భూస్వాములకు తరతరాలుగా వెట్టిచాకిరి చేయాల్సి వస్తుంది.
 4. పెట్టుబడిదారీ విధానం పెట్టుబడివ్యవస్థ విస్తృతమవుతున్నా ఇంకా వెట్టి దురాచారాలు కొనసాగుతుండం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం వెట్టిచాకిరీ ఎక్కువగా నూతన పెట్టుబడిదారులకు సేవలందిస్తోంది. నియామకం, కార్మికుల పర్యవేక్షణ కాంట్రాక్టర్ల ఆధీనంలో ఉంటున్నాయి. కాంట్రాక్టర్లు పేద ప్రాంతాల నుంచి కార్మికుల్ని తీసుకువస్తున్నారు. ముందుగా కార్మికులకు కొంత సొమ్ము ఇచ్చి వారి చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఇటువంటి లావాదేవీలు చట్టరీత్యా నేరం. కానీ అవి అమలుకు నోచుకోకపోవడం కార్మికుల పాలిట శాపంగా మారింది. ఈ సమస్యలు మానవహక్కుల ఉల్లంఘన, కార్మిక హక్కుల ఉల్లంఘన, వ్యక్తి గౌరవాలను దుర్వినియోగ చేయడం వంటి వాటికి సంబంధించినవి.
 5. వలసలు జీవనోపాధి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి 7కోట్ల 40 లక్షల మంది వలస బాట పట్టారు. భారత్‌లోనే అధిక సంఖ్యలో దేశీయ వలసలు కూడా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీనితో పాటుగా ఇతర దేశాలకు వలస పోతున్న వారి సంఖ్య కూడా మన దేశంలో ఎక్కువే. ప్రపంచ దేశాల్లో వలస బాట పట్టిన వారిలో 54 శాతం మంది మనదేశంలోనే ఉన్నట్లు తేలింది. 2011 నాటికి మన దేశంలో సుమారు 40 లక్షలమంది పట్టణ ప్రాంతాలకు వలస పోయారు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు మందికి వలసలు అనివార్యమయ్యాయి. ఉపాధి కోసం వలస పోతున్న జనాభాలో మహిళలు 80 శాతం మంది, యువత (15 నుంచి 29 ఏళ్ల లోపు ) 30 శాతం మంది, ఇంకా 15 మిలియన్ల మంది పిల్లలు ఉన్నట్లు 2011 నాటి జనగణన వివరాలు వెల్లడిస్తున్నాయి. వీరంతా గుత్తేదార్ల చేతుల్లో వెట్టికి బలవుతున్నారు. ప్రజారోగ్య సౌకర్యాలు, విద్యావకాశాలు మృగ్యమయిన పరిస్థితుల్లో గ్రామీణ ప్రజలు వెట్టికార్మికులుగా మారడమో లేదా పట్టణ ప్రాంతాలకు వలసపోవడమో చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చిన వారి పిల్లలు పెద్ద సంఖ్యలో చిన్న తరహా వస్త్ర పరిశ్రమలు, బాణసంచా తయారీ, తోలు పరిశ్రమలు, ఇటుక బట్టీలు, గ్రానైట్ తవ్వకాల యూనిట్లలలో వెట్టిచాకిరి కార్మికులుగా మారుతున్నారు. ఈ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు నగరాల్లో రెస్టారెంట్లు, హోటళ్లలో వెట్టి కార్మికులుగా, వెట్టి భిక్షగాళ్లుగా, లైంగిక వ్యాపారంలో బలిపశువులుగా మారుతున్నారు.
 6. యజమానుల దోపిడీ మనస్తత్వం యజమానుల దగ్గర తమ తండ్రి లేదా తాత ఎంత మొత్తం అప్పు తీసుకున్నాడో, కొన్నేళ్ళు గొడ్డుచాకిరీ చేశాక ఎన్నోవంతు బాకీ తీరిందో వెట్టి చేస్తున్న కార్మికులకు చచ్చినా తెలీదు. వడ్డీలపై చక్రవడ్డీలు వేసి తరాల తరబడి కట్టుబానిసలుగా సేవలు చేయించుకుంటున్నారు.
 7. వ్యవస్థీకృత లోపాలు పెత్తందారులకు పోలీసులు, నేతల అండదండలు వెట్టి వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయి. చట్టాన్ని రక్షించాల్సినవారే భక్షిస్తున్నారు. కంచె చేనును మేసిన చందంగా వ్యవహరిస్తున్నారు.
 8. ప్రభుత్వాల్లో చిత్త శుద్ధిలేమి స్థానికంగా వెట్టి కార్మికులున్నారని అంగీకరించడాన్ని రాష్ట్రాలు నామోషీగా భావిస్తున్నాయి. లోగడ ఐదేళ్ల కాలంలో 39 మంది వెట్టి కార్మికులనే ఢిల్లీ ప్రభుత్వం గుర్తించడాన్ని మానవహక్కుల సంఘం తప్పుబట్టింది. ఢిల్లీతో పాటు దేశంలోని 17 రాష్ట్రాల్లో 194 జిల్లాల్లో వెట్టిచాకిరి వ్యవస్థ లోతుగా వేళ్లూనుకుందని వివిధ సర్వేల్లో వెల్లడైనా దీనిపై ఆయా రాష్ట్రాలు నేరపూరిత మౌనం వహిస్తున్నాయి.
 9. చట్టాల అమలులో విఫలం వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన మన దేశంలో ప్రజలకు రుణబాధలు ఎక్కువ. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం లాభసాటి కానందున కోట్లాది మంది పట్టణ ప్రాంతాలకు వలసపోతూ కూలీలుగా కాలం వెళ్లదీస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా రుణబాధలు వెంటాడుతునే ఉంటాయి. పేదరికం నిర్మూలనకు ఎన్నెన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు పాలకులు చెబుతున్నా, మన దేశంలో బానిసత్వం జాడలు విస్తరించడం గమనార్హం. బాల కార్మికుల సంక్షేమం, హక్కుల విషయమై నిర్దిష్టమైన ప్రణాళికలు అమలు చేయాలని యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు గతంలో చేసిన సూచనలు మన దేశంలో నేటికీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. మహిళల అక్రమ తరలింపు, వేధింపులు, వ్యభిచారం, బాలల హక్కుల ఉల్లంఘన వంటి విషయాల్లో చట్టాలను పకడ్బందీగా అమలు చేయకపోవడం వల్ల బానిసత్వం ఓ మహమ్మారిలా విజృంభిస్తోంది.
 10. హక్కులు, చట్టాలపై అవగాహనరాహిత్యం నిరక్షరాస్యత, చైతన్యరాహిత్యం వల్ల వెట్టిలో మగ్గుతున్న కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి కానీ, వెట్టి చాకిరి నిషేధ చట్టం గురించి కానీ కనీస అవగాహన ఉండదు. ఇది బానిస వ్యవస్థ పెరగడానికి దోహదం చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో వెట్టి కార్మికులు
ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి డివిజన్లలోని 23 మండలాల్లోనే దాదాపు లక్ష మంది వెట్టి కార్మికులున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గుత్తేదారులు దగ్గర అప్పులు తీసుకుని అసలు వడ్డీలు చెల్లించలేని స్థితిలో వెట్టి కార్మికులుగా మారిన వారెంత మందో ఉన్నారు.

వెట్టిచాకిరి నివారణ చర్యలు

దోపిడీ నుండి రక్షణ పొందే హక్కు

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23, 24 పౌరులు దోపిడి నుండి రక్షణ పొందే హక్కును కల్పిస్తున్నాయి. ఆర్టికల్ 23 ప్రకారం మనుషుల క్రయవిక్రయాలు, బలవంతపు చాకిరీ నిషేధించబడింది. ఈ నిబంధన ఉల్లంఘించినవారు చట్టరీత్యా శిక్షార్హులు. ఈ ఆర్టికల్ కింద లభించిన హామీలు పౌరులకు, పౌరులు కానివారికి కూడా వర్తిస్తాయి. ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం నిషేధించబడింది.

వెట్టి చాకిరి వ్యవస్థ(నిషేధ) చట్టం 1976 (Bonded Labour System (Abolition) Act, 1976)
 1. ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి వెట్టిచాకిరి వ్యవస్థ రద్దు చేయబడింది. ప్రతి వెట్టి కార్మికుడిని వెంటనే విడుదల చేయాలి. వెట్టి చాకిరి నుంచి అతన్ని తక్షణమే తప్పించాలి.
 2. ఏదైనా నిబంధన, ఒప్పందం లేదా మరేదైనా మార్గం ద్వారా వెట్టి చాకిరీ చేస్తున్నట్లయితే అది తక్షణమే చెల్లకుండా పోతుంది లేదా వెంటనే రద్దవుతుంది. ( Any custom, agreement or other instrument by virtue of which a person was required to render any service as bonded labour was rendered void.)
 3. వెట్టి రుణ పరిహారం తిరిగి చెల్లించే అవసరం లేకుండా రద్దు చేయబడుతుంది (Liability to repay bonded debt was deemed to have been extinguished).
 4. వెట్టి కార్మికుని ఆస్తి తనఖా నుంచి విడుదల చేయబడుతుంది.( Property of the bonded labourer was freed from mortgage etc.)
 5. వెట్టి కార్మికుణ్ణి ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతం నుంచి వెళ్లగొట్టరాదు. (Freed bonded labourer was not to be evicted from homesteads or other residential premises which he was occupying as part of consideration for the bonded labour.)
 6. చట్టం అమలు చేసే విషయంలో జిల్లా మెజిస్ట్రేట్స్ కు కొన్ని విధులు, బాధ్యతలు ఉంటాయి. ( District Magistrates have been entrusted with certain duties and responsibilities for implementing the provisions of this Act.)
 7. జిల్లా స్థాయిలో, సబ్ డివిజినల్ స్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి. (Vigilance committees are required to be constituted at district and sub-divisional levels.)
 8. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ( Offences for contravention of provisions of the Act are punishable with imprisonment for a term, which may extend to three years and also with fine, which may extend to two thousand rupees.)
 9. ఈ చట్టం కింద నమోదైన ప్రతీ కేసు శిక్షార్హమైనదే. అదేవిధంగా బెయిలబుల్ కేసు కూడా. వెట్టి చాకిరిని నిర్మూలించడంలో జిల్లా మెజిస్ట్రేట్ పాత్ర అత్యంత కీలకమైంది. చట్టం జిల్లా మెజిస్ట్రేట్ కు కొన్ని బాధ్యతలు, విధులు ఇచ్చింది. వారు చట్ట నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూడాలి. వెట్టికార్మికులను గుర్తించడం, పునరావాసానికి సంబంధించి జిల్లా, సబ్ డివిజనల్ స్థాయిలో విజిలెన్స్ కమిటీలను నియమించాలని చట్టంలో పేర్కొన్నారు. విజిలెన్స్ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా జిల్లా మెజిస్ట్రేట్ గుర్తించిన వెట్టి కార్మికులను వెట్టి నుంచి విడుదల చేయాలి. విముక్తులైన వెట్టి కార్మికుల పునరావాసానికి సంబంధించి వారి ఆసక్తి, ప్రాధామ్యాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ భూ సంబంధ, భూ సంబంధేతర, నైపుణ్య ఆధార వృత్తులకు తగిన పథకాలను రూపొందించాలి. కేంద్ర ప్రాయోజిత పథకం కింద భారతప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ వెట్టికార్మికుని పునరావాసం కోసం ఒక్కొక్కరికి 20,000 రూపాయలు అందజేస్తుంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంటుంది. ఈశాన్యరాష్ట్రాల విషయంలో మొత్తం 20,000 రూపాయల్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.
వెట్టిచాకిరీ వ్యవస్థ ( నిర్మూలన ) చట్టం (1976) ప్రకారం ఏర్పాటుచేయాల్సిన జిల్లా, సబ్ డివిజనల్ స్థాయుల్లో అధికారులు, అనధికారులతో కూడిన విజిలెన్స్ కమిటీలు చాలా చోట్ల ఏర్పాటే కాలేదు. విజిలెన్స్ కమిటీలు ఏర్పడిన చోట్ల ఒరిగిందేమీ లేదు. అయితే ఈ పునరావాస కార్యక్రమం చాలా దయనీయంగా ఉంది. చాలా ఆలస్యంగా జరుగుతుంది. ముఖ్యంగా అంతర్ రాష్ట్ర వెట్టి వలస కార్మికుల విషయంలో పునరావాసం కార్యక్రమం సక్రమంగా అమలుకు నోచుకోవట్లేదు. ఈ విషయంలో సంబంధిత పాలనా వర్గాలు తమ వంతు చిత్తశుద్ధి చూపించట్లేదు. వెట్టి యజమానులను ప్రాసిక్యూట్ చేయడం చాలా బలహీనంగా ఉంది. వెట్టి కార్మికులు నిరుపేదలు, ఆస్తిలేనివారు కావడం వల్ల తిరిగి వెట్టిచాకిరి మార్గాన్నే అనుసరించాల్సిన దుస్థితి తలెత్తుతోంది.

వెట్టి చాకిరి వ్యవస్థ (నిషేధ) చట్టం 1976 కి ఒప్పంద కార్మికులు (నియంత్రణ, రద్దు) చట్టం 1970, రాష్ట్రాంతర వలస కార్మికులు (ఉపాధి నియంత్రణ, పని పరిస్థితులు) చట్టం 1979, కనీస వేతనాల చట్టం 1948 చట్టాలు అనుబంధంగా మద్దతు తెలుపుతున్నాయి.

మానవ హక్కుల సంఘం
1985లో పబ్లిక్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ తమిళనాడు అండ్ అదర్స్ కేసులో సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటీషన్ (The Supreme Court in the Writ Petition (No. 3922/1985) – Public Union for Civil Liberties Vs State of Tamil Nadu & Others) వెట్టిచాకిరి వ్యవస్థ నిషేధ చట్టం అమలును పర్యవేక్షించాల్సిందిగా జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆదేశించడం జరిగింది. అప్పటి నుంచి మానవ హక్కుల సంఘం ఈ చట్టాన్ని పర్యవేక్షిస్తోంది. వెట్టి చాకిరి నిర్మూలనకు ఒక కోర్ గ్రూప్ ను ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వెట్టి చాకిరి నిర్మూలనపై సదస్సులు నిర్వహిస్తోంది. వెట్టిచాకిరి పీడిత రాష్ట్రాల్లో వర్క్ షాపులను నిర్వహిస్తోంది. వెట్టిచాకిరి పీడిత ప్రాంతాల్లో అనూహ్య పర్యటనలు చేపడుతోంది. వెట్టిచాకిరిపై నిబంధనావళిని ప్రచురించి పంపిణీ చేస్తోంది.

పది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు
వెట్టి చాకిరి నిర్మూలనకు నేషనల్ రూరల్ లైవ్ లిహుడ్ మిషన్ పైలట్ ప్రాజెక్టును 10 జిల్లాల్లో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ గ్రామీణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వెట్టిచాకిరి కార్మికులను గుర్తించడం, సర్వేలు చేపట్టడం, పునరావాసం కల్పించడం, ప్రత్యామ్నాయ జీవనాధారం అనువైన పరిస్థితులు సృష్టించడం వంటివి చేపడతారు. ఎన్ ఆర్ ఎల్ ఎం కింద గయా (బీహార్), బస్తర్, కొండగావ్ (ఛత్తీస్ గఢ్), బోలాన్ గిర్, నౌపాడ (ఒడిశా), గుమ్లా (జార్ఖండ్), ప్రకాశం, చిత్తూరు (ఆంధ్రప్రదేశ్), కాంచిపురం, వెల్లూరు (తమిళనాడు) జిల్లాలకు నిధులు కేటాయిస్తారు. బంధువా 1947 ప్రచారంలో భాగంగా ఎన్జీవోల నుంచి ఈ ప్రాజెక్టులకు క్షేత్రస్థాయి మద్దతు లభిస్తుంది.

పరిష్కారం
 1. పెద్ద సంఖ్యలో ఉన్న అసంఘటిత కార్మికులలాగ ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్ళగలిగే స్వేచ్ఛ ఈ కట్టుబానిసలకు ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత కోసం పోరాడుతున్న కేంద్ర కార్మిక సంఘాలు, దేశంలో కోటిన్నర వరకు ఉన్న వెట్టి కార్మికుల దారుణమైన పరిస్థితిపై కూడా కేంద్రీకరించాల్సి ఉంటుంది.
 2. పేదలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సాధికారత చేకూర్చాలి. ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వేతర చర్యలు, రాజకీయ చైతన్యం వల్ల ఇది సాధ్యమవుతుంది.
 3. శ్రమ, మానవ హక్కులకు తగిన విలువ ఇవ్వడానికి చట్టాల్లో సక్రమైన మార్పులు తీసుకురావాలి.
 4. దేశంలోని అత్యంత బీద ప్రాంతాలలో తగిన అభివృద్ధి వ్యూహాలను అనుసరించాల్సిన అవసరముంది.
 5. కార్మికులందరికీ తిండి, బట్ట, పిల్లలకు చదువు, వైద్యం ఖర్చులు, వృద్ధాప్యంలో ఆధారం తదితర సామాజిక అవసరాలు తీర్చగల జీవన వేతనం లభించాలని రాజ్యాంగ ప్రవేశిక సూత్రాలు నిర్దేశిస్తున్నాయి. ఈ రాజ్యాంగ స్ఫూర్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శిరోధార్యం కావాలి.
 6. వెట్టి నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో ప్రజా సంఘాలు, పౌర సమాజం తోడ్పాటునివ్వాలి.
 7. వెట్టి చాకిరి నిషేధ చట్టం, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి సంబంధిత వర్గాలు/ వెట్టి చాకిరి కొనసాగుతున్న ప్రాంతాలు/ పరిశ్రమలు మొదలైన వాటి వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
 8. వెట్టి చాకిరి నిషేధం చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి.
 9. కనీస వేతన చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం, అక్రమంగా తరలింపు చట్టాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధిని చూపించాలి. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం, కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.
 10. వెట్టిని నిర్మూలించడం ఒక్కరోజులో అయ్యేపని కాదు. దీనికి దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. వెట్టి కార్మికులను గుర్తించడం, వారికి వెట్టి నుంచి స్వేచ్ఛను కల్పించడం, పునరావాసం కల్పించడం ఇవి వెనువెంటనే జరగాల్సిన పనులు. ఒకటి చేసి మరొకటి విడిచిపెడితే పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు. వెట్టి నుంచి విడుదల చేసినట్లు ధృవపత్రాలను వెట్టి కార్మికునికి తెలిసిన భాషలో అందజేయాలి. వెట్టి చాకిరి చేయించుకుంటున్న యజమానిని వెంటనే శిక్షించాలి. ఆలస్యం చేస్తే వెట్టి కార్మికునికి కల్పించే పునరావాస కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది.
 11. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లభించినప్పటికీ వెట్టికార్మికుడు నూతన జీవితం ప్రారంభించడానికి అదనపు సహాయ యంత్రాంగం లేకపోవడం మరో లోపం. ఆర్థిక సహాయం పెంచడం దీనికి పరిష్కారం కాదు. భారతదేశంలో కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలుచేయడమే దీనికి అసలైన పరిష్కారం. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వర్ణ జయంతి రోజ్ గార్ యోజన, ఎస్సీల స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ తదితర పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో వెట్టికార్మికులకు పునరావాసాన్ని కల్పించాలి. సమస్య వచ్చాక పరిష్కారం కోసం ఎదురుచూసే కన్నా అసలు సమస్యే తలెత్తకుండా రక్షణాత్మక చర్యలు చేపట్టాలి. వెట్టికి సామాజిక కోణాలను గుర్తించి ప్రజలను చైతన్యపరచడం, హక్కులపై అవగాహన కల్పించడం, వయోజనులకు అక్షరాస్యత, కార్మికులను వ్యవస్థీకరణ, సంపద సృష్టి, వొకేషనల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వంటివి చేపట్టాలి. బహుముఖంగా, బాగా పాతుకుపోయిన స్వభావం ఉన్న కారణాలకు సమగ్రమైన, దీర్ఘకాలిక వ్యూహం అవసరం.
Published date : 20 Nov 2013 05:50PM

Photo Stories