Skip to main content

భారతదేశంలో అంధ విశ్వాసాలు

ఒకవైపు బాబాకి కల వచ్చిందని నిధి కోసం అన్వేషించడానికి పురాతత్వ శాఖ నుంచి సామాన్యుల వరకు తవ్వకాలు మొదలుపెట్టారు. మరొకవైపు అశేష అనుయాయులున్న బాబా ఆధ్యాత్మిక ముసుగులో అనైతిక కార్యకలాపాలకు ఒడిగట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకొక వైపు అంధ విశ్వాసాలను వేలెత్తి చూపినందుకు హేతువాది అంతుచూశారు. ఇవన్నీ కొన్ని సంఘటనలే. ఇలాంటివి మన దేశంలో నిత్యకృత్యమవుతున్నాయి. ఈ ఉదంతాల్లో తప్పెవరిది అని ప్రశ్నించుకునే ముందు భారతీయుల్లో శాస్త్రీయ దృక్పథం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేకపోడమనే చెప్పాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 74 శాతం మంది అక్షరాస్యులున్నారు. మరోవైపు సూపర్ పవర్ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయినా మన భారతదేశంలో మూఢాచారాలు, అంధవిశ్వాసాలు కొనసాగుతుండటానికి కారణలేంటి? లోపం ఎక్కడుంది? మన విద్యావ్యవస్థలోనా? సమాజంలోనా? చట్టాల్లోనా? ఈ అంధవిశ్వాసాల అంతు చూడాలంటే ఏంచేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వ్యాసం.

90 శాతం మంది భారతీయులు మూర్ఖులు- జస్టిస్ మార్కండేయ కట్జూ
90 percent of Indians are stupid: Justice Markendya Kattu
అంతరిక్షంలో సుదూరంగా ఉన్న అంగారకుని మీదకు అంతరిక్ష నౌకలు పంపిస్తున్నాం. చంద్రుడిపై మానవ సహిత ప్రయోగాలకు సిద్ధమవుతున్నాం. ఆలోచనలు సుదూర అంతరాళం వైపు దూసుకుపోతున్నా మన విశ్వాసాలు మాత్రం పాతాళంలోనే ఉంటున్నాయి. విమానాల్లో ప్రయాణిస్తున్నాం. కానీ కూపస్తు మండుకాల్లా జీవిస్తున్నాం. కొత్త టెక్నాలజీని అంది పుచ్చుకుంటున్నాం. కానీ పనికిరాని నిరర్ధక ఆలోచనల్ని విడిచిపెట్టలేకపోతున్నాం. అక్షర జ్యోతులు వెలుగించుకుంటున్నాం. కానీ మూఢాచారాలతో అంధకారంలో మగ్గిపోతున్నాం. అంధవిశ్వాసాలను ప్రశ్నించినవారిని, సరైన మార్గం చూపించేవారిని నిర్హేతుకంగా హతమారుస్తున్నాం. సభ్యసమాజం సిగ్గుపడే మూఢ విశ్వాసాలతో మన మెదళ్లు కుంచించుకుపోతున్నాయి.

ఒక వైపు భారతదేశం 21వ శతాబ్దపు సూపర్ పవర్ గా మారబోతోందని ఊహాగానాలు ఆశలు రేకెత్తిస్తుంటే మరోవైపు 18వ శతాబ్దపు మూఢ విశ్వాసాలు ఇంకా మనదేశాన్ని విడిచిపెట్టకపోవడం శోచనీయం. భారతదేశమంతా ఒకే కాలంలో నివసించట్లేదు. కొన్ని ప్రాంతాలు 18 వ శతాబ్దంలో ఉండిపోయాయి. మరికొన్ని 19 వ శతాబ్దంలో ఉంటే ఇంకొన్ని 20వ శతాబ్దం నమ్మకాలతో కాళ్లీడుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాలు 21వ శతాబ్దపు వెలుగుల్లో ఉన్నాయి. ఎందుకీ వైరుధ్యం? ఈ వైరుధ్యంలోనూ అంధవిశ్వసాలు మాత్రం అన్ని వర్గాల్లోనూ, అన్ని ప్రాంతాల్లో బలంగా పాతుకుపోయి ఉండటం మన దేశ దౌర్భాగ్యం.

భారతదేశంలో మూఢాచారాలు
Superstitions in India
భారతదేశంలో మూఢాచారాలు విస్తృతంగా వ్యాపించిన సామాజిక సమస్య. అతీంద్రియ శక్తుల ఆధారంగా ఒక విశ్వాసం లేదా విధానం సంభవించిందని చెప్పడాన్నే మూఢాచారం అంటారు. ఇది ఆధునిక శాస్త్రాలకు విరుద్ధమైంది. భారతదేశం భౌగోళికంగా, సాంస్కృతికంగా ఎంత వైవిధ్యమో విశ్వాసాల పరంగా అంత విభిన్నమైంది. రాష్ట్రాల వారీగా ప్రాంతాల వారీగా అనేక మూఢ విశ్వాసాలు ఇప్పటికీ భారతదేశంలో కొనసాగుతున్నాయి. దిష్టి, శకునం, భూతాలు, దయ్యాలు, మంత్రాలు, తంత్రాలు ఇలా రకరకాల రూపేణా అంధ విశ్వాసాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకీ విశ్వాసం, అంధ విశ్వాసాల మధ్య అంతరం అత్యంత సన్నిహితం అవుతోంది.

శాస్త్రీయ దృక్పథాన్ని రాజ్యాంగ విధిగా గుర్తించిన ఏకైక దేశం భారత్. అయితే సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో ఘోరంగా విఫలమైంది. భారతీయ సమాజం సాంస్కృతికంగా, చారిత్రకంగా మత మూఢత్వం, అంధ విశ్వాసాలు, మూఢాచారాలతో నిండి ఉంది. భారతదేశం అవసరమైన సామాజిక సంస్కరణలను తీసుకురావడంలో విఫలమైంది.

సతి
Sati
సతీ సహగమనం అంటే భర్త మరణిస్తే భార్య కూడా భర్తతో పాటు చితిలో పడి మరణించడమనే దురాచారం ఉండేది. రాజారామ మోహన్ రాయ్ లాంటి సంఘసంస్కర్తల చొరవ వల్ల బ్రిటిష్ ఇండియా కాలంలో లార్డ్ విలియం బెంటిక్ సతి విధానాన్ని రద్దు చేశారు. భారతదేశం 1988లో సతి నిషేధ చట్టం తీసుకొచ్చింది. అయినప్పటికీ ఇప్పటికీ భారతదేశంలో అక్కడక్కడ ఈ దురాచారం కొనసాగుతోంది. 2002లో మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో 65 ఏళ్ల వృద్ధురాలిని బలవంతంగా ఆమె భర్త శవంతో పాటు దహనం చేశారు. 2006లో అదే రాష్ట్రంలో సాగర్ జిల్లాలో ఒక మహిళ భర్త చితిపై నిప్పంటించుకుని ఆత్మహత్యకు ఒడిగట్టింది. 2008లో చత్తీస్ ఘడ్ లో రాయ్ పూర్ జిల్లాలో 75 ఏళ్ల వృద్ధురాలు తన భర్త చితి దగ్గర తనకు నిప్పంటించుకుంది. 2009లో రాజస్థాన్ లో సికార్ జిల్లాలో ఇదేవిధంగా ప్రయత్నించిన ఓ మహిళను స్థానికులు అడ్డుకున్నారు.

మానవ బలి
Human sacrifice
వివిధ జబ్బులు నివారణకు, కోరిన కోర్కెలు నెరవేరేందుకు మానవులను బలి ఇచ్చే దుష్టాచారం కూడా భారతదేశంలో ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆచారాలు నేటికీ కొనసాగుతున్నాయి. మనుషులకు బదులు జంతువుల్ని బలివ్వడం మొదలుపెట్టారు. అయితే జీవ కారుణ్య సంస్థల జోక్యంతో దిష్టిబొమ్మలను బలివ్వడం ప్రారంభించారు. అయితే చాలా చోట్ల ఇప్పటికీ ఇటువంటి దురాచారం కొనసాగుతోంది. తన కుమారులకు కంటిచూపు రావడం కోసం ఒక అబ్బాయిని అపహరించి బలిచ్చిన ఉదంతం 2006లో ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. 2009లో మహారాష్ట్రలోని విదర్భలో పుత్రభాగ్యం కోసం 11 మంది చిన్నారులను బలివ్వాలన్న భూతవైద్యుడి సలహాతో ఐదుగురిని చంపిన దంపతుల కేసు సంచలన రేకెత్తించింది. పంటలు బాగా పండాలని ఒక బాలికను బలిచ్చిన ఉదంతం చత్తీస్ ఘడ్ లోని బీజా పూర్ జిల్లాలో 2011లో బయటపడింది.

స్వయం ప్రకటిత దైవాంశ సంభూతులు
Self proclaimed Gods
భారతదేశంలో అనేక మంది బూటకపు బాబాలు, స్వాములు, గురువులు, వేదాంతులు ఆధ్యాత్మికత ముసుగులో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తమకి దివ్యశక్తులు ఉన్నాయని, అతీంద్రియ అద్భుతాలు సృష్టిస్తామని నమ్మబలుకుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. అనుయాయులు వారిని అవతార పురుషులుగా, ప్రత్యక్ష దైవాలుగా భావిస్తున్నారు. దైవాంశ సంభూతులుగా ప్రకటించుకున్న వారు ముందటితరం బాబాలు, స్వామిజీల వారసులుగానో, దేవుడికి మానవరూపాలుగానో చెప్పుకుంటుంటారు. వీరికి దేశవ్యాప్తంగా , ప్రపంచవ్యాప్తంగా నెట్ వర్కులుంటాయి. అనేక వింత చేష్టలు చేస్తూ ఉంటారు. నోటి నుంచి లింగం తీయడం, చేతి నుంచి విభూధి, గొలుసులు, ఉంగరాలు తీయడం వంటి మార్మికత ప్రదర్శించి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరికొందరు స్వామీజీలుగా చెలామణి అవుతూ జలగల్లాగా నొప్పి తెలియకుండా నెత్తురును పీల్చేసే దుష్ట పన్నాగాలు పన్నుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని దౌండియా ఖేరా అనే ప్రాంతంలో వెయ్యి టన్నుల బంగారం ఉందని, 150 ఏళ్ల క్రితం రాజా రామ్‌బక్ష్ ఆ బంగారాన్ని అక్కడ పాతర వేసినట్టు స్వామి శోభన్ సర్కార్ అనే వ్యక్తి కలగనడం, ఆ కల ఆధారంగానే నిధి కోసం అన్వేషణ సాగడం, ఆ తవ్వకాల్లో భారత పురావస్తు శాఖ కూడా పాల్పంచుకోవడం జరిగింది. కొందరు స్వామీజీలు లైంగిక దోపిడీలకు పాల్పడటం, తమ పేరు ప్రఖ్యాతలతో వ్యాపార సామ్రాజ్యాలు(పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, హాస్పిటల్స్, స్థిరాస్థి) నిర్మించుకుని అపర కుబేరులు కావడం మన భారతదేశంలో షరామామూలే. నల్లధనానికి అత్యంత సురక్షిత ప్రాంతాలుగా ఈ స్వయం ప్రకటిత దైవాంశ సంభూతుల ఆశ్రమాలు కొలువుతీరుతున్నాయన్న విమర్శలూ ఉన్నాయి.

మంత్రతంత్రాలు
OOccult Arts
బాణామతి, చేతబడి, బ్లాక్ మ్యాజిక్ వంటి మంత్ర తంత్రాలు ప్రయోగిస్తున్నారంటూ మహిళలపై దాడులు చేస్తున్న సంఘటనలున్నాయి. పళ్లు ఊడగొట్టడం, చెవులు, ముక్కు కత్తిరించడం, గుండు గీయంచడం లేదా తల కత్తిరించడం, గాడిద మీద ఊరేగించడం, చెట్టుకు కట్టి కొట్టడం, కొరడాతో కొట్టడం, వాతలు పెట్టడం, నగ్నంగా ఊరంతా తిప్పటం, హత్యలకు ఒడిగట్టడం, సజీవ దహనం చేయటం, రాళ్లతో కొట్టి చంపడం, ఉరివేయడం, కత్తితో పొడిచి చంపడం వంటివి చేస్తున్నారు. విధవలు, విడాకులు తీసుకున్న మహిళలపైనే ఇలాంటి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. సాధారణంగా ఆ మహిలల ఆస్తులను కొల్లగొట్టేందుకే ఈ దురాచారాన్ని ఉపయోగించు కుంటున్నారు. గ్రామాల్లో భూతవైద్యులు కొందరిని మంత్రగత్తెలుగా ముద్రవేసి వారిని చంపేందుకు ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాలు ఇటువంటి హత్యలను ప్రభావవంతంగ నిర్మూలించడంలో విఫలమవుతున్నాయి. మంత్రాలు తంత్రాలకు పాల్పడుతున్నారనే నెపంతో 2008 నుంచి 2012 వరకు 768 మంది మహిళల్ని హత్యచేశారని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నూతన చట్టాలు రావాల్సిన అవసరముందని మహిళా కమిషన్ అభిప్రాయపడింది. అసోం, ఛత్తీస్ గఢ్, బీహార్, ఒడిశా రాష్ట్రాలలో ఇటువంటి హత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి

మరికొన్ని అంధ విశ్వాసాలు
Some other Superstitions
 1. పండుగలకు పశువుల్ని, పక్షుల్ని బలి ఇవ్వడం వల్ల కోర్కెలు నెరవేరుతాయని భావించడం
 2. బహిష్టు మహిళలు అశుద్ధులుగా భావించడం, వారిని వంట చేయటానికి, గుడిలో ప్రవేశించడానికి అనుమతించకపోవడం
 3. విధవరాళ్ల ముఖం చూస్తే అశుభంగా భావించడం. విధవ రాళ్లపై చూపుతున్న వివక్షకు ప్రత్యక్ష ఉదాహరణ ఉత్తర ప్రదేశ్ లోని బృందావనంకు 5000-6000 మంది తరలివెళ్లి పోవడం.
 4. పిల్లి ఎదురైనా, తుమ్ములు వచ్చినా బయల్దేరరాదని చెప్పడం.
 5. చెట్టు నుంచి పాలుకారితే దైవంగా పూజించడం, విగ్రహం నుంచి నీరు కారితే కన్నీరు భ్రమించి ప్రార్థనలు చేయడం, అయస్కాంత క్షేత్ర ప్రభావంతో లోహ విగ్రహాలు ద్రావణాలు సేవిస్తే మహిమలుగా విలువైన ఆహార పదార్థాలను వృథా చేయడం వంటివి మరికొన్ని ఉదాహరణలుగా చెప్పొచ్చు.
భారతదేశంలో శాస్త్రజ్ఞుల ప్రపంచ దృక్పథాలు, అభిప్రాయాలు
pPerceptions and Opnions of Indian scientists
ట్రినిటీ కాలేజీకి చెందిన ఇన్ స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ సెక్యులరిజం ఇన్ సొసైటీ అండ్ కల్చర్ భారతదేశానికి చెందిన సెంటర్ ఫర్ ఇంక్వైరీ సహాయంతో భారతదేశంలోని శాస్త్రజ్ఞుల ప్రపంచ దృక్పథం, అభిప్రాయాలపై సర్వే నిర్వహించింది. 130 సంస్థలకు చెందిన 1100 మంది సైంటిస్టుల మీద సర్వే చేయడం జరిగింది. 24 శాతం మంది సైంటిస్టులు దైవాంశసంభూతులు అద్భుతాలు చేస్తారని అభిప్రాయపడ్డారు. 49 శాతం మంది ప్రార్థనల వల్ల ప్రయోజనం ఉంటుందని, 16 శాతం మంది విశ్వాస స్వస్థత పై నమ్మకముందని, 14 శాతం మంది వాస్తుపై నమ్మకం ఉందని, మరో 14 శాతం మంది ఆస్ట్రాలజీపై నమ్మకముందని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో ఆస్ట్రాలజీ కోర్సును ప్రవేశపెట్టడాన్ని 31 శాతం మంది తీవ్రంగా వ్యతిరేకించారు.

పనిచేసేచోట మూఢాచారాలు (2012)
Practice of superstitions in working place
2012లో టీమ్ లీజ్ అనే నియామక సంస్థ పనిచేసేచోట మూఢాచారాలపై సర్వే నిర్వహిచింది. ఎనిమిది నగరాల్లో మొత్తం 800 కంపెనీల్లో ఈ సర్వే చేపట్టింది. 61 శాతం మూఢాచారాలను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. 51 శాతం మంది తాము పనిచేసే చోట మూఢాచారాలను అనుసరిస్తున్నట్లు వెల్లడించారు. వీటిని పాటించడం వల్ల ఉత్పత్తి పెరుగుతుందని 48 శాతం మంది స్పందించారు. అంతేకాదు ఆయా సంస్థల యాజమాన్యాలు కూడా మూఢాచారాలు కొనసాగించడానికి అనుమతిస్తుండటం గమనార్హం. 80 శాతం స్త్రీలు, 63 శాతం మంది పురుషులు తాము పనిచేసే స్థలంలో మూఢాచారాలు పాటిస్తున్నట్లు అంగీకరించారు.

కారణాలు
Causes
గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 20 కి.మీ. దూరంలో ఉంటాయి. అటువంటి సమంలో ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే అంత సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయం, వ్యయం లేక ప్రజలు దగ్గర్లోనే ఉండే స్థానిక మంత్రగాడు/ మంత్రగత్తెలను ఆశ్రయిస్తారు. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం తక్కువ. నిరక్షరాస్యత వల్ల వారిలో శాస్త్రీయ దృక్పథం పెంపొందదు. దీనివల్ల కూడా మూఢవిశ్వాసాలు అనుసరిస్తున్నారు.

సాధారణంగా మూఢనమ్మకాలకు ప్రధాన కారణం నిరక్షరాస్యత. అయితే భారతదేశంలో అక్షరాస్యులు కూడా మూఢాచారాలను విశ్వసిస్తున్నారు. నిరక్షరాస్యత, ఆరోగ్య సదుపాయాల లేమి మాత్రమే అంధ విశ్వాసాలకు కారణం కాదు. పట్టణాలు, నగరాల్లో సైతం ఉన్నత విద్యావంతులైన ప్రజలు కూడా కొన్ని సార్లు మూఢ నమ్మకాలను అనుసరిస్తున్నారు. అటు అభివృద్ధి చెందిన సమాజాలతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లోనూ ప్రజల్లో సైన్స్ పై అవగాహన లేకపోవడమే దీనికి కారణం. జీవితం పట్ల, సమాజం పట్ల శాస్త్రీయ దృష్టిని పెంపొందించడంలో విద్య అత్యంత కీలకమైనది. అయితే ఈ విషయంలో మన విద్యా వ్యవస్థ విఫలమైంది.

రాజకీయ నేతలు, ఐఏఎస్ లు అనుయాయులే:
Even Political leaders and IAS officers also followers of superstitions
సమకాలీన భారతదేశ సమాజంలో విశ్వాసం, రాజకీయాలు, ధనం సంపూర్ణంగా ఒక దానితో మరొకటి కలగలసిపోయాయి. తొలితరం రాజకీయ నాయకులు ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనను పెంపొందించేందుకు కృషి చేశారు. ఇప్పటి రాజకీయ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. బూటకపు బాబాలకు ప్రణమిల్లుతున్నారు. ప్రజలకు అశాస్త్రీయ సంకేతాలనిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం బాబాలు, స్వామీజీలను ఆశ్రయిస్తూ ప్రజలను పక్కదారిపట్టిస్తున్నారు.

రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ లు ఇలా ఎందరో దైవాంశసంభూతులుగా పిలవబడుతున్న బాబాలకు అనుయాయులుగా ఉంటున్నారు. అంతేకాదు బాబాలకు ఆశ్రమాలకు, పరిశ్రమలకు ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు కట్టబెట్టిన ఉదంతాలు, ఆశ్రమాలకు భారీగా నిధులు మళ్లించడం, పన్ను రాయితీలు కల్పించడం వంటి ఉదాహరణలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. అనేక నేరాలు కేసులు నమోదైనప్పటికీ అవన్నీ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని అవన్నీ మాఫీ చేసుకుంటున్న ఉదంతాలు కోకొల్లలు. క్షుద్ర పూజలు నిర్వహించడం కూడా జరిగాయి.

బాబాలు, స్వామీజీలను ఆశ్రయించడానికి కారణం:
Why they go for Babas and Swamijis
ప్రాచీన మానవ నాగరికత సమయంలో ప్రకృతి వైపరీత్యాలకు కారణాలను అవగాహన చేసుకోలేని పరిస్థితుల్లో విపత్తుల నుంచి భద్రత కోసం వివిధ కర్మకాండలను నిర్వహించేవారు. అయితే ఈనాటికి ప్రజలు అనేక దురాచారాలను కొనసాగించడానికి ప్రధాన కారణం వారి జీవన స్థితిగతుల్లో అనిశ్చితి, అస్థిరత కొనసాగడం. ఈ సంక్లిష్టతలను తొలగించే విషయంలో సరైన విధానాలు రూపొందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీంతో తమ సమస్యలు, కష్టాలు తీరేందుకు బాబాలను, దైవాంశసంభూతలమని చెప్పుకునే వారిని ఆశ్రయిస్తున్నారు. కనీస జీవన వసతులే మృగ్యమవుతున్నాయి. ప్రజారోగ్య వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం వల్ల కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం సంభవిస్తే చాలు అప్పుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి. ఇటువంటి మానవ దుస్థితే జనాన్ని ఒక విశ్వాసం వెంట, ఒక అతీంద్రయ శక్తుల కోసం అన్వేషణకు పురికొల్పుతోంది. తమ కష్టాలు తీర్చే అతీంద్రీయ శక్తుల కోసం శోధన దైవాశంసంభూతులు (గాడ్ మెన్/ గాడ్ ఉమెన్) పరిశ్రమను సృష్టిస్తోంది. వీరిలో అత్యధికులు ఆధ్యాత్మికం పక్కనపెట్టి సంపద ఆర్జన వైపే దృష్టిపెట్టారు. ఈ బూటకపు బాబాలను ప్రజలు అతిగా విశ్వసిస్తున్నారు. ఈ విశ్వాసాన్నే బాబాలు దుర్వినియోగం చేసి లైంగిక దుర్వినియోగానికి పాల్పడడం, అనేక అనైతిక కార్యకలాపాలకు ఒడిగట్టడం జరుగుతోంది. ఆధ్యాత్మికం పేరును అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

నేడు ప్రజలలో అక్షరాస్యత శాతం పెరిగినా, వృత్తి పరంగా శక్తి సామర్థ్యాలు ఉన్నా వ్యక్తిగత జీవితాలకు సంబంధించి హేతువాద ఆలోచన లోపిస్తోంది. ఇప్పటికీ అంధవిశ్వాసాలు అనుసరిస్తునే ఉన్నారు. స్వయం ప్రకటిత దైవాంశసంభూతుల మాటలను నమ్మి మోసపోతున్నారు. భారతదేశ మధ్య తరగతి ఆహారం, బట్టలు, నివాసం వంటి మౌలికావసరాల నుంచి బయటపడింది. ఇప్పుడు బట్టతల, జీవనశైలి వ్యాధులతో బాధపడుతోంది. ఈ సమస్యలను కడుపుమాడ్చుకోకుండా, ఎలాంటి కసరత్తులు చేయకుండా తేలిగ్గా పరిష్కరిస్తామని ఎవరైనా హామీ ఇస్తే చాలు వారు అటువైపు ఆకర్షితులవుతున్నారు.

దృశ్య శ్రవణ మాధ్యమాలు
Effects of Audio, visual media
మారుమూల ప్రాంతాలకు చేరువైన భారతీయ టెలివిజన్ నెట్ వర్క్ విస్తృతమైన ప్రభావం చూపుతోంది. శాస్త్రీయ విషయాలను ప్రసారం చేయడంలోనూ, జనాన్ని చైతన్యవంతుల్ని చేయడంలో మీడియాకు ప్రముఖ పాత్ర ఉంది. కానీ ఈ విషయంలో మీడియా ఘోరంగా విఫలమైంది. టెలివిజన్ ప్రజల్లో అంధవిశ్వాసాలను తొలగించే బదులు మరింత పాదుకొలిపేలా వ్యవహరిస్తోంది. కొన్ని టెలివిజన్ ఛానళ్లలో ధారావాహికలు, కార్యక్రమాలు ఆత్మ, ప్రేతాత్మ, క్షుద్ర పూజలు, దయ్యాలు,భూతాలు, మరుజన్మ, తాంత్రిక పూజలు తదితరాలపై విస్తృతమైన కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ప్రజల్ని జాగృతం చేయాల్సిన ఛానళ్లు వారిని మరింత అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాల వైపు మళ్లేలా చేస్తున్నాయి. అతీంద్రియ శక్తులు, అద్భుత శక్తుల గురించి కల్పిత కథనాలు ప్రసారం చేసి ప్రజల్ని మభ్యపెడుతున్నాయి. తమ ఛానళ్ల రేటింగ్, పేరు ప్రఖ్యాతలు పెంపొందించుకోవడానికి, వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. కొన్ని ఛానళ్లు అద్భుత శక్తులు, మంత్రాలు, తంత్రాలు బూటకమని చెబుతూ అనేక ప్రత్యక్ష చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. శాస్త్రీయ ఆలోచనను పెంపొందించడానికి బదులు జాతకాలు, కాల్పనిక కథలు, మంత్రాలు తంత్రాల గురించి ప్రచారం చేస్తున్నారు. దినపత్రికలు, రేడియో(ఎఫ్ఎం), టీవీ ఛానళ్లు ఏవీ దీనికి మినహాయింపు కాదు. స్వయం ప్రకటిత దైవజ్ఞులతో కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి బూటకపు ప్రకటనలకు పత్రికలు, టీవీ ఛానళ్లు చోటు కల్పిస్తున్నాయి. తద్వారా వ్యాపార ప్రయోజనాలు ముందుకెళ్లి బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు

ఎలక్ట్రానిక్ మీడియా ప్రైవేటీకరణ అనేక దుష్పరిణామాలకు దారితీసింది. టీవీ ఛానళ్లు అశాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తున్నాయి. అనేక భక్తి ఛానళ్లు వచ్చాయి కానీ ఒక్క భారతీయ సైన్స్ ఛానల్ కూడా రాలేదు. డిస్కవరీ, నేషనల్ జాగ్రఫిక్ ఛానల్, యానిమల్ ప్లానెట్ వంటి వాటిలో సైతం మూఢనమ్మకాలనే పెంపొందించే కార్యక్రమాలే కొనసాగడం శోచనీయం .

మీడియా ఛానళ్లు, విద్యా వ్యవస్థలో అశాస్త్రీయ విషయాలు నిరంతరం పర్యవేక్షించడానికి, తగిన మార్గదర్శకాలు అందించడానికి జాతీయ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2011 నవంబర్ లో, 2013 జూన్ లోనూ మూఢాచారాలను, అంధ విశ్వాసాలను ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రసారం చేయకుండా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 1995 నాటి కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ చట్టం ప్రకారం నిబంధనావళి ఉల్లంఘనలను గుర్తించడానికి ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్ ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ చర్యలు సత్ఫలితాలనివ్వలేకపోతున్నాయి. ఈ విషయంలో ఆర్టికల్ 19 ప్రకారం భావప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని మీడియా వాదిస్తోంది. అయితే నిర్మాణాత్మక, బాధ్యతాయుతమైన పాత్ర పోషించి, సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని తెలుసుకోవాలి.

నష్టాలు:
Loses
అసలు మూఢనమ్మకాలంటేనే నమ్మినవారినీ, నమ్మనివారినీ మానసికంగా, ఆర్థికంగా నాశనం చేసేవని అర్థంచేసుకోవాలి. అనేకసార్లు మూఢనమ్మకాలు ప్రాణాల్నే హరిస్తున్నాయి. వాస్తు అనేది ఒక మూఢనమ్మకం. దానిని నమ్మినవారు లక్షలాదిమంది మనదేశంలో ఉన్నారు. ఆ నమ్మకంతో వారు ఇళ్ళు కూలగొట్టుకుంటున్నారు. ఆస్తులు నాశనం చేసుకుంటున్నారు. మూఢనమ్మకాలున్న వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటాడు. ఇతరుల జీవితాలు నాశనం చేస్తాడు. లక్షలాది రూపాయల ధనం నాశనం చేసుకుంటాడు. ఇతరుల ధనం నాశనం చేస్తాడు.

అభివృద్ధి వర్సెస్ అంధ విశ్వాసాలు:
Development verses Blind beliefs
ప్రజల జీవన ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండే దేశాల్లో అతీంద్రీయ శక్తులపై నమ్మకం అత్యల్పంగా ఉంటుంది. ఆప్ఘనిస్థాన్, భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, సబ్ సహారా ఆఫ్రికాలలో మూఢవిశ్వాసాలు, ఆధ్యాత్మిక నమ్మకాలు అత్యధికంగా ఉంటాయి కాబట్టే అత్యంత వెనుకబడి ఉన్నాయి. పశ్చిమ ఐరోపా దేశాలు అభివృద్ధిలో ముందున్నాయంటే అందుకు కారణం అవి హేతువాద భావజాలం గలదేశాలు. ఉదాహరణకు ఫిన్లాండ్ లో అత్యుత్తమ జీవన ప్రమాణాలున్నాయి. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో హేతువాదులు ఉన్నారు కాబట్టి. అభివృద్ధి అంధ విశ్వాసాలు అడ్డంకిగా ఉంటాయి.

ప్రశ్నిస్తే ప్రాణాపాయం:
IIf you ask your life may be in danger
దేశంలో హింసా రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. మతచొరబాటు, మాఫియా మరింత అరాచకానికి దోహదం చేస్తున్నాయి. ఇటువంటి నేపథ్యం గల నాయకులు, వారి అనుంగులు చేసే అప్రజాస్వామిక పనులకు ఎవరైనా అడ్డొస్తే హత్యలు జరగాల్సిందే. మహారాష్ట్రలో హేతువాది ధబోల్కర్ ను హత్య చేసింది ఇటువంటి మత ఛాందస శక్తులే. ఎంతో మంది శాస్త్రజ్ఞులు ప్రజల మూఢత్వాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించినపుడు వారిపై ఎన్నో దాడులు జరిగాయి. ఇటువంటి ఘట్టాలు చరిత్రలో కోకొల్లలు. ధబోల్కర్ ని నడిరోడ్డుపై కాల్చి చంపడం, లౌకిక దేశమైన భారత్ లో దారుణం. కాలాలు వేరు, వ్యక్తులు వేరు కావచ్చు. కానీ సమాజాన్ని మూఢవిశ్వాసాల నుండి బయటికి తీసుకొచ్చి వారిని చైతన్య పరిచే వారు ఒకేలా దాడులకు గురవుతుండటం ఆనాటి నుంచి ఈనాటి వరకూ కొనసాగుతూనే వుంది.

చట్టాలు –రక్షణలు
Laws and Acts
కేవలం శాస్త్రీయ దృక్పథం, పద్ధతి, శాస్త్రీయ పరిజ్ఞానం ద్వారా మాత్రమే సమాజంలోని ప్రతీ ఒక్కరికీ కనీస వస్తువులు, సాంస్కృతిక సదుపాయాలు, సేవలు అందజేయగలం. దీన్ని గుర్తించడం ద్వారానే సంక్షేమ రాజ్య భావన పెంపొందించగలం – శాస్త్రీయ విధాన తీర్మానం,1958(“It is only through the scientific approach and method and the use of scientific knowledge that reasonable material and cultural amenities and services can be provided for every member of the community, and it is out of a recognition of this possibility that the idea of a welfare state has grown.” — Scientific Policy Resolution, 1958)

ఆర్టికల్ 51 ఎ(హెచ్)(Article 51 A (h), Constitution of India):
రాజ్యాంగం ఉపోద్ఘాతం (పీఠిక) లోనే మన దేశాన్ని సార్వభౌమ సమసమాజ, లౌకిక (సెక్యులర్‌), ప్రజాస్వామ్య గణతంత్రం (రిపబ్లిక్‌)గా ప్రకటించింది. ఆర్టికల్‌ 51 ఎ (హెచ్‌) ద్వారా పౌరుల ప్రాథమిక బాధ్యతలలో 'శాస్త్రీయ దృక్పథాన్ని, మానవత్వాన్ని, పరిశీలన, సంస్కరణల ఉత్సుకత'ను పెంపొం దించాల్సిన బాధ్యత ఉంచబడింది. ఈ ఆర్టికల్ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295ఎ కు పూర్తి విరుద్ధంగా ఉందని హేతువాదులు అభిప్రాయపడుతున్నారు.

డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ (Drugs and Magic Remedies Act (Objectionable Advertisements) Act, 1954)
మూఢ విశ్వాసాలకు సంబంధించి ఏకైక కేంద్ర చట్టం డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిటీస్ (అబ్జెక్షనబుల్ అడ్వర్ టైజ్ మెంట్స్)యాక్ట్ 1954(డిఎంఆర్ఎ).ఈ చట్టం కింద నేరస్తుడు తొలిసారి తప్పుచేస్తే ఆరు నెలలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. మరోసారి నేరం చేస్తే గరిష్ఠంగా ఏడాదిపాటు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఈ చట్టం కొన్ని రకాల వ్యాధులకు తాయెత్తులు, వశీకరణ వంటి మాంత్రిక, తాంత్రిక పరిష్కారాల ప్రకటనలను నిషేధిస్తోంది. ఈ చట్టం కింద 54 వ్యాధులున్నాయి. మార్మిక మందులు, నివారిణుల అమ్మకం, ప్రచారాలను కూడా ఈ చట్టం నిషేధిస్తోంది. అయితే ఇటువంటి అనేక ఉత్పత్తులు ప్రజలకు ఆటంకాలు లేకుండా అందుబాటులో ఉంటుండటం బట్టి ఈ చట్టం సక్రమంగా అమలుకునోచుకోవట్లేదని చెప్పవచ్చు. చట్టం పరిధిలో ఉన్న జాబితా వ్యాధుల్లో 14 వ్యాధులు నివారించదగ్గవే. నివారించడానికి వీలుకాని ఎయిడ్స్ వంటి వ్యాధులు ఈ జాబితాలో చోటు కల్పించకపోవడం చట్టం పున: సమీక్షపై అశ్రద్ధను ఎత్తిచూపుతోంది. ఈ కేటగిరీలకు చెందిన కొన్ని ప్రకటనలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కేబుల్ టీవీ ఛానల్స్ లో దర్శనమిస్తున్నాయి.

ఈ చట్టంలో అనేక తీవ్రమైన లోపాలున్నాయి. చట్టం అమలును పర్యవేక్షించే అమలు యంత్రాంగం గురించి చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు. వ్యాధుల నివారణకు మాంత్రిక, తాంత్రిక ఉపశమనాలకు సంబంధించి తప్పుడు, పక్కదారి పట్టించే ప్రకటనలు సమస్య గురించి చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదు. టెలివిజన్, ఇంటర్నెట్ లో ప్రకటనలకు సంబంధించి ఈ చట్టం నిష్ర్పయోజనమే. ఈ చట్టంలోని సెక్షన్ 9ఎ ప్రకారం కోర్టు అరెస్టు వారెంట్ లేనప్పటికీ పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసే అవకాశముంది. ఈ సెక్షన్ కింద జరుగుతున్న విచారణ గురించి సరైన సమాచారం ప్రజలకు అందుబాటులో లేదు. ప్రధాన ఆధారాలు లభించినప్పటికి ఈ చట్టం కింద నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని అదుపులోకి తీసుకుంటున్న జాడ లేనేలేదు.

భారతీయ శిక్ష్మాస్మృతి సెక్షన్ 295ఎ(Indian Penal Code, Section 295A)
హేతువాదులకు, మూఢాచార వ్యతిరేక ఉద్యమకారులకు, మతాన్ని విమర్శించే వారికి భారత శిక్షా స్మృతి లో సెక్షన్ 295 ఎ భంగకరంగా మారింది. ఈ సెక్షన్ కింద ఏదైనా వర్గానికి చెందిన మతాన్ని, మతపరమైన విశ్వాసాలను సంభాషణ లేదా లిఖిత మాటల ద్వారా కానీ, దృశ్య ప్రదర్శనల ద్వారా కానీ అవమానించి మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే దుశ్చర్యలకు పాల్పడినవారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. ఈ సెక్షన్ ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగబద్ధంగా లభించిన భావప్రకటన స్వేచ్ఛకు భంగకరమని విమర్శకుల వాదన.

భార్గవ వర్సెస్ యూజీసీ, ఆంధ్ర హైకోర్టు(2001 Bhargava vs UGC, Andhra High Court)
జ్యోతిష్యం కోర్సును యూనివర్సిటీల్లో ప్రవేశపెట్టాలన్న యూజీసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వ్యవస్థాపకులు పీఎం భార్గవ 2001లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సంబంధిత విషయంలో తమకి ప్రావీణ్యం లేదన్న కారణంతో పాటు, యూజీసీ స్పష్టంగా చట్టాన్ని ఉల్లంఘించనంతవరకు జోక్యం చేసుకోలేమని చెప్పి కోర్టు పిటీషన్ ను కొట్టివేసింది.

భార్గవ వర్సెస్ యూజీసీ, సుప్రీంకోర్టు 2004(2004 Bhargava vs UGC, Supreme Court)
జ్యోతిష్యం కోర్సును యూనివర్సిటీల్లో ప్రవేశపెట్టాలన్న యూజీసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వ్యవస్థాపకులు పీఎం భార్గవ 2004లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. ఆస్ట్రాలజీని సూడో సైన్స్(బూటకపు శాస్త్రం)గా అభివర్ణిస్తూ యూజీసీ నిర్ణయం భారత శాస్త్రీయ విశ్వసనీయతకు భంగం కలుగజేస్తుందని ఆరోపించారు. అయితే ఆస్ట్రాలజీ కోర్సు అనేది ఐచ్ఛికమని, ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాలనే నిబంధన లేదని, అనేక విదేశీ విశ్వవిద్యాలయాల్లోనూ ఈ కోర్సును ప్రవేశపెట్టారని భారతప్రభుత్వం తన వాదనను సమర్థించుకుంది. పిటీషన్ లో పేర్కొన్నట్టు ఎటువంటి ఆందోళనకరమైన అభ్యంతరాలు లేనందున ఈ కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది.

జన్ హిత్ మంచ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, బాంబే హైకోర్టు 2011(2011 Janhit Manch vs Union of India, Bombay High Court)
ఆర్టికల్ 266 కింద హైకోర్టుకు ఉన్న అధికారాలను సద్వినియోగం చేసుకుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 51(ఎ)(హెచ్) లో పేర్కొన్నట్లు ప్రతీ పాఠశాలలో తప్పనిసరిగా శాస్త్రీయ దృక్పథాన్ని బోధించాలని ఆదేశించాలంటూ 2010లో జన్ హిత్ మంచ్ అనే స్వచ్ఛంద సంస్థ మహారాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. అంతేకాదు ది డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమిడీస్ (అబ్జక్షనబుల్ అడ్వర్టయిజ్ మెంట్స్) యాక్ట్ 1954 ప్రకారం వాస్తు శాస్త్రం, ఫెంగ్ షుయ్, టారో కార్డ్స్ మొదలైన ప్రకటనల్లో వినోదం కోసం మాత్రమే అనే ప్రకటన ఉండాలని ఆదేశించమని పిటీషనర్ కోరారు. భార్గవ వర్సెస్ యూజీసీ 2004 కేసును ఉటంకించిన హైకోర్టు ఈ పిటీషన్ ను కొట్టివేసింది. అలాగే ఆర్టికల్ 266 ను ఉపయోగించి ఆర్టికల్ 51(ఎ)(హెచ్)ను అమలు చేయడం చాలా అస్పష్టతతో కూడి ఉన్నదని కోర్టు స్పష్టం చేసింది.

మంత్రతంత్ర వ్యతిరేక చట్టాలు
(Anti-whichcraft legislation)
ప్రస్తుతానికి ఐదు రాష్ట్రాలు మంత్రతంత్రాల నిరోధక చట్టాలు తీసుకువచ్చాయి. బీహార్, ఒడిశా, జార్ఖండ్, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర యాంటీ విచ్ క్రాఫ్ట్ చట్టాలు తెచ్చాయి. చట్టాలు తెచ్చినప్పటికీ ఇంకా దురాచారాలు కొనసాగుతుండటం వాటిని అమలు అధ్వానంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి.

పరిష్కారం:
Solutions
 1. చట్టం ద్వారానే అంధ విశ్వాసాలను నియంత్రించలేం. మూఢ విశ్వాసాలు మన సమాజంలో అత్యంత లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. బాల్యం నుంచే శాస్త్రీయ ఆలోచనను పెంపొందించాల్సిన అవసరం ఉంది.
 2. ప్రాథమిక విద్య స్థాయి నుంచి ఉన్నత పాఠశాల స్థాయి విద్య వరకు పాఠ్యప్రణాళికలలో హేతువాద దృక్పథ పాఠ్యాంశాలను భాగం చేయాలి.
 3. సైన్స్ ఎగ్జిబిషన్లను విస్తృతంగా ప్రోత్సహించాలి.
 4. చుట్టూ ఉన్న సమాజంలో చోటుచేసుకుంటున్నవాటితో పాటు మౌలిక శాస్త్రీయ సూత్రాలపై ప్రశ్నించేలా పిల్లలను ప్రోత్సహించాలి.
 5. అతీంద్రయ ఉపశమన చర్యలను నియంత్రించేందుకు ప్రభుత్వం సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలి.
 6. యథా రాజా తథా ప్రజా అంటారు. ప్రముఖులే దైవజ్ఞులకు ప్రణమిల్లుతుంటే సామాన్యులు వారిని అనుసరించకమానరు. కాబట్టి రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు దైవాంశ సంభూతలను ఆశ్రయించడాన్ని అడ్డుకట్టవేయాలి. ప్రజలకు తప్పుడు సంకేతాలనివ్వడం మానుకోవాలి.
 7. మూఢవిశ్వాసాలను నివారించడానికి గ్రామీణ ప్రజల్లో, విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనను పెంపొందించేందుకు ప్రభుత్వం స్వయంసేవాసంఘాల(స్వచ్ఛంద సేవాసంఘాల) సేవలను ఉపయోగించుకోవాలి.
 8. ప్రజల్ని నిరంతరాయంగా చైతన్య వంతుల్ని చేయాలి. అద్భుత శక్తులకు సంబంధించి వాస్తవాలను వెలికి తీసే ప్రదర్శనలు ఇవ్వాలి. అతీంద్రియ మహిమల వెనుక మోసంపై ప్రచారం చేయాలి.
 9. స్వయం ప్రకటిత దైవాంశసంభూతుల మోసాలను బహిర్గతం చేస్తే, ప్రభుత్వ దర్యాప్తు యంత్రాంగం రంగంలోకి దిగుతుంది. అప్పుడు ఆధ్యాత్మికం పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలను ప్రజలు తెలుసుకోగలుగుతారు.
 10. సమాజంలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేవారిని, శాస్త్రీయ దృక్పథాన్ని పురిగొల్పేందుకు తోడ్పడేవారిని మత ఛాందస శక్తులు, సంకుచిత వర్గాలు లక్ష్యంగా చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లు ఉండాలి. అప్పుడే నిర్భయంగా వాస్తవాన్ని వెళ్లడించడం సాధ్యమవుతుంది. అది ప్రజలకు, హేతువాదులకు ప్రయోజనం కలిగిస్తుంది.
 11. భావప్రకటన స్వేచ్ఛ హక్కుతో పాటు సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే బాధ్యత కూడా మీడియాకు ఉందని గ్రహించాలి. మీడియాపై పర్యవేక్షణకు ఒక సమగ్ర వ్యవస్థను లేదా చట్టాన్ని రూపొందించాలి. తద్వారా నియమ ఉల్లంఘనలకు పాల్పడినవారిపై భారీ జరిమానా, అవసరమైతే కారాగార శిక్ష లేదా కొన్ని రోజుల పాటు ప్రసారాలపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు చేపట్టవచ్చు.
 12. మతాన్ని, ఆధ్యాత్మికతను తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులపై నియంత్రణ, పర్యవేక్షణకు ఒక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
ఏదీ మూఢంగా నమ్మకండి. ఎక్కడ చదివినా సరే...ఎవరు చెప్పినా సరే...చివరికి నేను చెప్పినా సరే..అది మీ తర్కానికి, హేతువుకి, మీ లోకజ్ఞానానికి అంగీకారమైతే తప్ప – గౌతమ బుద్ధుడు
ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మానవుడు తలెత్తుకు తిరుగుతాడో
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలదో
ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై
ఇరుకైన గోడల మధ్య మగ్గిపోదో
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని
మతాంధ విశ్వాసపు ఎడారిలో ఇంకిపోదో
ఆలోచనలు ఆచరణలో నిత్యం విశాల పథాల వైపు
ఎక్కడ మనస్సు పయనిస్తుందో
ఆ స్వేచ్ఛా మార్గం వైపు తండ్రీ
నన్ను, నా ప్రజలను నడిపించు – రవీంద్రనాథ్ ఠాగూర్
Published date : 09 Dec 2013 06:18PM

Photo Stories