Skip to main content

ఆహార భద్రత - ప్రభుత్వాల బాధ్యత

ఆహారమంటే సమ్మిళిత పదార్థాలతో సరిపడినంత పరిమాణంలో, పోషక విలువలతో ఉన్న సమతుల్యాహారం. ఈ సమతుల ఆహారాన్ని ఆరోగ్యంగా జీవించేందుకు అన్నివేళలా అన్ని వర్గాల ప్రజలకు అందించటమే ఆహార భద్రత.

ఆహార భద్రత అవసరమేమిటి?
పౌష్టికాహారం ప్రజలందరికీ అందితేనే ఆరోగ్యం సాధ్యం. ప్రపంచ దేశాలలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆకలి, పౌష్టికాహార లోపం, దారిద్య్రం వంటి సమస్యలు మానవ జాతి గౌరవానికి, మనుగడకు సవాలుగా మారుతున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఆహార వ్యవసాయ సంస్థ నివేదికల ప్రకారం - ప్రపంచంలో 25 శాతం దేశాలు ఇంకా దారిద్య్రాన్ని, ఆకలిని అనుభవిస్తూనే ఉన్నాయి. ఆఫ్రికా దేశాలైన ఉగాండా, సోమాలియా, కెన్యాలలో ప్రజలకు సరిపడ ఆహారం లేక నిస్సహాయంగా, దయనీయంగా సంపన్న దేశాలను అర్థిస్తుండటం విచారకరం.

భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయా?
అభివృద్ధి రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతున్న భారత్‌లో ఆహార లభ్యత, పౌష్టికాహారం విషయంలో జాతి గర్వించే పరిస్థితులు లేవు. జాతీయ ఆహార సర్వే ప్రకారం (2006)- 42 శాతం బాలలు వయసుకు తగ్గ బరువు లేరు. 50 శాతం శిశు మరణాలకు పౌష్టికాహార లోపమే ప్రధాన కారణం. 19 శాతం పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రపంచంలో నమోదవుతున్న ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో అత్యధికం మన దేశంలోనే. గుండెను పిండే ఈ గణాంకాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసు కొని సమస్యను అధిగమించే కార్యాచరణకు ఉపక్రమించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆ దిశగా చేసిన ప్రయత్నమే ఆహార భద్రత చట్టం.

ఆహార భద్రతా చట్టం - ముఖ్యాంశాలు:
జాతీయ అభివృద్ధి మండలి ఆహార భద్రతకు సంబంధించిన విధివిధానాలను పరిశీలించేందుకు సి.రంగరాజన్ అధ్యక్షతన కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం ఆహార భద్రతా బిల్లు 2011ను డిసెంబర్ 22, 2011లో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల స్థాయీ సంఘం పరిశీలన తర్వాత మార్పులు చేర్పులతో ఈ బిల్లును పార్లమెంట్ ఏప్రిల్ 2013లో ఆమోదించింది.

చట్ట ఉద్దేశం: దేశ పౌరులందరూ గౌరవ ప్రదంగా జీవించడానికి అవసరమైన పోషక విలువలతో కూడిన తగినంత సంతులిత ఆహారాన్ని పొందేందుకు అవకాశాలను కల్పించడం, దీనికి ‘లైఫ్‌సైకిల్’ పద్ధతిని అనుసరిస్తారు.

ఆహార భద్రత వర్తించే వర్గాలు:
గ్రామీణ ప్రాంతాలలో 75 శాతం, పట్టణ ప్రాంతాలలో 50 శాతం జనాభాకు ఇది వర్తిస్తుంది. దేశంలోని దాదాపు 80 కోట్ల ప్రజానీకానికి ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా.

ఆహార పంపిణీ:
  1. అంత్యోదయ వర్గాల కుటుంబాలకు నెలకు 35 కిలోలు, ప్రాధాన్యత వర్గాలకు నెలకు 5 కిలోలు.
  2. బియ్యం కిలో మూడు రూపాయలకు, గోధుమలు కిలో రెండు రూపాయలకు, తృణ ధాన్యాలు కిలో రూపాయికి సమకూరుస్తారు.
  3. ఆరు నెలల నుంచి 6 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న బాలలకు వయస్సు ఆధారంగా సముచిత ఉచిత భోజనం అంగన్‌వాడీల ద్వారా ఏర్పాటు.
  4. 6-14 సంవత్సరాల వయసున్న పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనం పాఠశాల పనిదినాలలో ఏర్పాటు చేస్తారు.
  5. ఆరు నెలలలోపు వయసున్న పిల్లలకు ప్రత్యేక ‘‘బ్రెస్ట్ ఫీడింగ్’’ ఏర్పాటు.
  6. గర్భిణులకు, తల్లులకు ఉచిత భోజనం. అలాగే ప్రసూతి అవసరాలకు రూ. 6000 నగదు అందిస్తారు.
లబ్ధిదారులఎంపిక:
ఏ పథకమైనా ఉద్దేశించిన లక్ష్యం నెరవేరాలంటే నిజమైన లబ్ధిదారుల గుర్తింపు సక్రమంగా జరగాలి. దారిద్య్రరేఖ దిగువనున్న వర్గాలు, అంత్యోదయ వర్గాలతోపాటు ఇతర ప్రాధాన్యతా వర్గాలను ప్రభుత్వం గుర్తించి వర్తింప చేస్తుంది. అవసరమనుకున్న అన్ని వర్గాలకు వర్తించేందుకు ప్రభుత్వం విధి, విధానాలను ఖరారు చేస్తుంది.

ఆహార కమిషన్లు:
ఆహారభద్రత చట్టం అమలు పర్యవేక్షణ, మూల్యాంకనానికి సంబంధించి జాతీయ, రాష్ర్ట స్థాయిల్లో ఆహార కమిషన్లు ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక చైర్మన్, ఐదుగురు ఇతర సభ్యులుంటారు. ఇద్దరు మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒక సభ్యుడు ఉండేలా ఏర్పాటు చేశారు. చట్టం అమల్లో ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేసినా, అక్రమాలకు పాల్పడినవారికి రూ. 5000 జరిమానా విధించే అధికారం ఆహార కమిషన్లకు కల్పించారు.

ప్రజాపంపిణీ వ్యవస్థలో సంస్కరణలు:
ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందించేందుకు చౌకధర దుకాణాల ద్వారా ప్రజాపంపిణీ పద్ధతిని ప్రస్తుతం అమలు చేస్తు న్నారు. ఈ పద్ధతిలో మితిమీరిన అవినీతి, సకాలంలో వస్తువులు అందకపోవడం, మధ్యవర్తుల బెడద వంటి సమస్యలు అధిగమించేందుకు వస్తువులను నేరుగా ప్రజలకు చేరవేయాలనే ప్రతిపాదన చేశారు. కంప్యూటరైజ్డ్ అప్లికేషన్లు, ఎండ్ టూ ఎండ్ పద్ధతి, ఆధార్ కార్డుల ఆధారంగా లోపాలను సవరించాలని నిర్దేశించారు.

పారదర్శకత-ప్రభుత్వాల జవాబుదారీతనం:
ఆహార భద్రత చట్టంలోని విధానాల అమల్లో మరింత పారదర్శకత సాధించేందుకు, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రెండంచెల నిర్మాణ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆహార కమిషన్లు, జిల్లాస్థాయిలో అధికారులను నియమించి ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరిస్తారు. అన్నింటికీ సంబంధిత అధికారులను బాధ్యులని చేస్తారు. తద్వారా అధికార గణం క్రియాశీలకంగా పనిచేసే పరిస్థితులు ఏర్పడతాయి.

సాధ్యాసాధ్యాలు- తాజా పరిస్థితులు:
దేశంలోని 120 కోట్లకు పైన ఉన్న జనాభాలో 80 కోట్ల మందికి ఈ చట్టం ద్వారా ఆహార భద్రత సాధ్యమేనా అనేది సమంజసమైన సందేహమే. ఆహారాన్ని అందించాలంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని 230 మిలియన్ టన్నుల నుంచి 250 మిలియన్ టన్నులకు చేరేలా చూడాలి.

పన్నెండో పంచవర్ష ప్రణాళికలో వ్యవసా య రంగంలో నాలుగు శాతం, ఆహార ధాన్యాల రంగంలో రెండుశాతం, ఉద్యాన, పశుగణం, మత్స్య రంగాలలో ఆరుశాతం వృద్ధిరేటును సాధించాలని నిర్దేశించారు. నిజంగా ఆ మేరకు వృద్ధి సాధిస్తే ఆహార భద్రతకు ఢోకా లేనట్టే. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆశాజనకంగా లేదు. స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) వ్యవసాయరంగం వాటా క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 1950లో 56 శాతం ఉన్న ఈ వాటా ప్రస్తుతం 15 శాతానికి దిగజారింది. దేశంలో 58 శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగమేనని తాజా ఆర్థిక సర్వే స్పష్టీకరించింది. ఈ మేరకు నిధుల కేటాయింపులు లేవు. ఈ ఏడాది ఆహార ధాన్యాల దిగుబడి ఒక కోటి టన్నులకు మించదని అంచనా. కానీ, భవిష్యత్ అవసరాల కోసం 30 కోట్ల టన్నుల దిగుబడులు ఉండాలి.

ఆహార భద్రతకు సోపానాలు-మార్గాలు:
ఆహార భద్రత చట్టం ఉద్దేశాలు, లక్ష్యాలు నెరవేరాలంటే కచ్చితమైన విధి, విధానాలు అమలు చేయాలి. ఓట్లు, నోట్ల రాజకీయాలను పక్కన పెట్టి పక్కా మార్గాలను అన్వేషించాలి. అందులోని కొన్ని ఉత్తమ మార్గాలు..
  1. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు బాగా పెరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ, విద్య, పరిశోధన, విస్తరణలపై వ్యయాన్ని గణనీయంగా పెంచాలి.
  2. సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు క్రిమిసంహారక మందులు సరసమైన ధరలకు అందించాలి. దేశానికి ‘వెన్నెముక’ అయిన రైతు కిలోమీటర్ల పొడవున ‘యార్డు’లలో రోజంతా నిలబడినా ఫలితం లేక దయనీయ పరిస్థితిలో వెనుతిరగడం బాధాకరం.
  3. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రైతును విముక్తి చేయాలంటే సంస్థాగత రుణాలు రైతులందరికీ అందుబాటులోకి తేవాలి.
  4. ప్రతి ఉత్పత్తి దారుడికి తన వస్తువుకు ధర నిర్ణయించే అధికారం ఉంది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఖర్చుకు, రాబడికి ఎంతో వ్యత్యాసం. అధిక వడ్డీ రుణాలు, అప్పుల ఊబిలో చిక్కుకొని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ దుస్థితి తొలగాలంటే ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి.
  5. వాతావరణంలో సంభవిస్తున్న పెనుమార్పులను, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చే వంగడాల రూపకల్పనకు కృషి చేయాలి. తక్కువ నీటి వినియోగంతో వరిసాగు చేసే ‘శ్రీ’ పద్ధతులను, కూలీల కొరతను అధిగమించేందుకు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలి.
  6. పర్యావరణానికి తక్కువ హానికలిగించే, జీవ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని, ఖర్చులను తగ్గించి నాణ్యమైన ఉత్పత్తులను ప్రోత్సహించాలి. దేశంలో ఇప్పటికే 62 శాతం వర్షాధార వ్యవసాయమే సాగవుతోంది. మొత్తం వ్యవసాయ ఉత్పత్తులలో 45 శాతం మెట్ట ప్రాంతాలనుంచే వస్తున్నాయి. ‘‘వానపడితే పంట లేక పోతే మంట, అకాల వర్షాల తంటా’’ అనే పరిస్థితుల నుంచి రైతులకు విముక్తి లభించాలంటే సాగునీటి సౌకర్యం కల్పించాలి.
  7. వాటర్‌షెడ్లు, సూక్ష్మ నీటిసాగు పద్ధతులైన బిందు, తుంపర సేద్యాలను ప్రోత్సహించాలి. భూగర్బ జలాలు నానాటికీ అడుగంటుతున్నాయి. కాబట్టి చెరువులు, కుంటల కింది వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.
  8. తగినమేర నాణ్యమైన విద్యుత్ సరఫరా. గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మార్కెట్ సంస్కరణలు చేపట్టి దళారీ వ్యవస్థను రూపుమాపాలి. రైతు సంఘాలకు, రైతు మిత్ర, స్వయం సహాయక బృందాలకు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోళ్లలో ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించే ప్రక్రియను రైతులకు చేరువ చేయాలి. విస్తరణ కార్యక్రమాల కోసం ఇంటర్నెట్, మొబైల్, జీపీఎస్ వంటి ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని, సేవలను విస్తృతస్థాయిలో ఉపయోగించుకోవాలి.
  9. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ ఆహార ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే సత్ఫలితాలు సాధించవచ్చు.
  10. ఆహార భద్రతకు భరోసా ఇచ్చే అత్యంత ముఖ్య అంశం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి. యువశక్తి వ్యవ సాయంలోకి రావాలి. వ్యవసాయమంటే పెదవి విరిచే పరిస్థితులను తొలగించాలి. మహిళా భాగస్వామ్యాన్ని పెంచాలి. ఇజ్రాయెల్ లాగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా వ్యవసాయ ఉత్పత్తి/దిగుబడిలో భాగస్వామ్యం కావాలి.
  11. ఆహార వృథాను అరికట్టాలి. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత తీసుకోవాలి. ప్రపంచంలో 1/3 ఆహారం వృథా అవుతోందని డబ్ల్యుహెచ్‌ఓ, ఎఫ్‌ఎఒ సంయుక్త నివేదిక పేర్కొంది. ప్రతి సంవత్సరం 1.3 బిలియన్ టన్నుల ఆహారం ప్రపంచవ్యాప్తంగా వృథా అవుతోందని వెల్లడైంది. అభివృద్ధి చెందిన దేశాలలో సగటున 222 మిలియన్ టన్నుల ఆహారం, ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. ఈ వృథా సబ్‌సహారన్ ఆఫ్రికా దేశాల ఆహార ఉత్పత్తికి సమానం. భారత్‌లో కూడా చాలా సందర్భాలలో ఆహారం వృథా కావడం మనం గమనించవచ్చు. ‘‘ఆహారం పరబ్రహ్మ స్వరూపం’’ అన్నారు. దాని పట్ల గౌరవం ఉండాలి. బాధ్యతతో వ్యవహరించాలి. మన జీవనానికి, ఆరోగ్యానికి కారణమైన ఆహారాన్ని ఏ స్థితిలోనూ వృథా చేయకూడదు. ఆహారాన్ని వృథా చేయడం సామాజిక నేరం, మానవ పాపంగా పరిగణించాలి.
దేశ భవిష్యత్ ‘ఆహారధాన్యాల’పై ఆధారపడుతుందే కానీ ‘ఆయుధాల’పై కాదు అనేది ఇప్పటికే గుర్తించిన వాస్తవం.

Future Belongs to Nations With
"Grains'' not With "Guns''

‘‘అన్నాత్ భవంతి భూతాన్ని పర్జన్యాత్ అన్న సమ్భవ’’.
Published date : 25 Apr 2013 08:16PM

Photo Stories