Skip to main content

అభివృద్ధి దివిటీ స్మార్ట్ సిటీ

డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్.
యావద్భారతావని ఇప్పుడు స్మార్ట్ జపం చేస్తోంది. నరేంద్ర మోదీ కొలువు దీరిన వేళ స్మార్ట్ సిటీల ఏర్పాటును ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రస్తావించింది. తొలి దశగా వంద స్మార్ట్ నగరాలను నెలకొల్పేందుకు సంకల్పించింది. ప్రాంతాల వారీ ప్రాధాన్యమిస్తూ నగరీ కరణ బాట పట్టడం శుభసూచికమే అని చెప్పాలి. అయితే శతకోటి జన భారతంలో ఈ స్మార్ట్‌సిటీలు ప్రాథమిక అవసరాల లోటును తీరుస్తాయా? ఆర్థిక అసమానతలను రూపు మాపి అసలు సిసలైన అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తాయా?

స్మార్ట్ సిటీ-ఆవశ్యకత:
దేశంలో సహజంగా పట్టణ ప్రాంతాల్లో జనాభా వృద్ధి రేటు అధికం. దీనికి తోడు గ్రామీణులు పట్టణాలకు వలస బాట పట్టడంతో అక్కడ జనాభాలో పెరుగుదల ఏర్పడింది. 2011 గణాంకాల ప్రకారం... గుజరాత్‌లో 42.6 శాతం, మహారాష్ట్రలో 45.2 శాతం ప్రజలు పట్టణాల్లోనే నివశిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ (విభజనకు ముందు) మినహా మిగతా రాష్ట్రాల్లోని జనాభాలో 35 శాతానికి పైగా పట్టణ జనాభా నమోదయింది. తమిళనాడు మొత్తం జనాభాలో 48.5 శాతం, కేరళలో 47.7 శాతం, కర్ణాటకలో 38.6 శాతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 33.5 శాతం పట్టణ ప్రాంతాల్లోనే జీవనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పట్టణాలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పట్టణీకరణ ప్రక్రియ పెద్ద నగరాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాలలోనే కేంద్రీకృతమైనందువల్లవాటి వృద్ధిలో వ్యత్యాసాలు పెరిగాయి.

గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలతో పెద్ద నగరాల్లో స్వాతంత్య్రానంతరం జనాభా వృద్ధి అధికమైంది. 1971-81 మధ్య కాలంలో బెంగళూరు జనాభా 75.6 శాతం పెరిగింది. 1981-1991 కాలంలో పశ్చిమబెంగాల్‌లోని అజాన్సోల్ పట్టణంలో జనాభా పెరుగుదల ఏకంగా 108.7 శాతం కాగా ఫరీదాబాద్ (హర్యానా)లో 85.5 శాతం, గౌహాతి(అసోం)లో 188.3 శాతం, థానే (మహారాష్ట్ర)లో 105.9 శాతం, విశాఖపట్టణం (ఆంధ్రప్రదేశ్)లో 75 శాతం, భువనేశ్వర్ (ఒడిశా) లో 87.7 శాతం నమోదైంది. 1991-2001 మధ్య కాలంలో సూరత్ (గుజరాత్)లో 85.1 శాతం, నాసిక్ (మహారాష్ట్ర)లో 58.9 శాతం జనాభా పెరిగింది. 2001-2011 మధ్యలో ఢిల్లీ, గ్రేటర్ ముంబయి, కోల్‌కత నగరాల్లో జనాభా పెరుగుదల అధికంగా నమోదైంది. గత రెండు దశాబ్దాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో వృద్ధి స్తంభించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి.

ఐరోపా సమాఖ్య వ్యూహాల బాటలో:
1991-2001 కాలంలో వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్న 70 లక్షల మంది ఆ రంగానికి దూరమయ్యారు. పెరిగిన వలసలతో పట్టణ ప్రాంతాల్లో పలు సమస్యలు చుట్టుముట్టాయి. నిరుద్యోగితా రేటు అధికమైంది. భౌతిక , సాంఘిక అవస్థాపనల విషయంలో పట్టణ ప్రాంతాల పురోగతి మందగించింది. ఈ నేపథ్యంలో 2014 మేలో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) ప్రభుత్వం స్మార్ట్ సిటీలు అనే అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా దేశంలో తొలి దశగా 100 స్మార్ట్ సిటీలు నెలకొల్పడానికి సంకల్పించింది. ఇందుకు అభివృద్ధి చెందిన దేశాలు తమ వంతు సహకారం అందించడానికి ముందుకొచ్చాయి. దీంతో స్మార్ట్ సిటీల ఏర్పాటు భారత్‌లో ప్రధాన చర్చనీయాంశం అయింది. మెట్రో పాలిటన్ నగరాల్లో స్మార్ట్ అర్బన్ గ్రోత్ సాధించడానికి యూరోపియన్ యూనియన్ అనుసరించే వ్యూహాలను రూపొందించడంపై దృష్టి సారించింది.

స్మార్ట్ సిటీ-నిర్వచనాలు:
స్మార్ట్ సిటీని నిర్వచించడానికి ఫ్రాస్ట్ అండ్ సులిబాన్‌లు ప్రధానంగా ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.
 1. స్మార్ట్ గవర్నెన్స్
 2. స్మార్ట్ ఎనర్జీ
 3. స్మార్ట్ బిల్డింగ్
 4. స్మార్ట్ మొబిలిటీ
 5. స్మార్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్
 6. స్మార్ట్ టెక్నాలజీ
 7. స్మార్ట్ హెల్త్ కేర్
 8. స్మార్ట్ సిటిజన్
స్మార్ట్ సిటీస్ కౌన్సిల్ నిర్వచనం ప్రకారం..
నగరాలకు సంబంధించి అన్ని ప్రధాన కార్యక్రమాల్లో డిజిటల్ టెక్నాలజీ అనుసంధానించినట్లయితే ఆ నగరమే స్మార్ట్ సిటీ.

ఐఈఈఈ స్మార్ట్ సిటీస్ వివరణ:
స్మార్ట్ ఎకానమీ, స్మార్ట్ మొబిలిటీ, స్మార్ట్ ఎన్విరాన్‌మెంట్, స్మార్ట్ పీపుల్, స్మార్ట్ లివింగ్, స్మార్ట్ గవర్నెన్స్ అనే లక్ష్యాలను సాధించే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, ప్రభుత్వం, సమాజాన్ని ఒకే చోటకు చేర్చడం

బిజినెస్ డెరైక్టరీ మాటల్లో:
సుస్థిర వృద్ధి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ముఖ్యమైంది ఆర్థిక వ్యవస్థ స్థాయి పెంపు. ఈ విషయం లో ప్రగతి సాధించిన పట్టణ ప్రాంతమే స్మార్ట్ సిటీ.

స్మార్ట్‌సిటీ ప్రస్థానం:
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో స్మార్ట్ సిటీ అనే పేరు ఆవిర్భవించింది. 2008లో ఐ.బి.ఎం స్మార్టర్ ప్లానెట్ ఇనీషియేటివ్ (I.B.M smarter planet initiative)లో భాగంగా స్మార్టర్ సిటీస్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. 2009 ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు స్మార్ట్ సిటీలపై ఆసక్తి కనబరిచాయి. దక్షిణ కొరియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, చైనాలు స్మార్ట్ సిటీల ఏర్పాటు, పరిశోధనపై అధిక పెట్టుబడులు పెట్టాయి. ఇదివరకే అంతర్జాతీయ వాణిజ్య జిల్లా వెరోనాలో ఈ సిటీలు ప్రాచుర్యం పొందాయి. ఇక మనదేశం విషయానికి వస్తే.. కోచి, అహ్మదాబాద్, ఔరంగాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని మనేసర్, ఖుష్‌కెరా (రాజస్థాన్), కృష్ణపట్నం, పొన్నే (తమిళనాడు), తుంకూరు (కర్ణాటక) ప్రాంతాల్లో స్మార్ట్ సిటీలు నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో ప్రత్యేక పెట్టుబడి ప్రాంతాలు లేదా ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటవుతాయి. ఆయా ప్రాంతాలలో పన్ను నిర్మాణతలో నియంత్రణల సడలింపు ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఆశయం అభినందనీయం:
భారత ప్రభుత్వం 2020 నాటికి 100 స్మార్ట్‌సిటీల అభివృద్ధి లక్ష్యాన్ని చేపట్టింది. భారత్‌లో స్మార్ట్‌సిటీల ఏర్పాటు ప్రపంచ బ్యాంకు సమ్మిళిత గ్రీన్ గోల్‌కు అనుగుణంగా ఉంది. శీఘ్రగతిన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుస్థిర వృద్ధి సాధనకు స్మార్ట్‌సిటీల ఏర్పాటు దోహదపడగలదని పలువురి నిపుణుల అభిప్రాయం. మధ్య తరహా నగరాలను ఆధునికీ కరించడం ద్వారా 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 2014-15 కేంద్ర బడ్జెట్‌లో వీటి కోసం రూ. 7060 కోట్లను కేటాయించారు. దీర్ఘకాలంగా విఫలమైన ప్రాంతీయ ప్రణాళికకు ఉప ఉత్పత్తిగా భారత్‌లో పట్టణీకరణను భావించారు. పట్టణాల్లో జరుగుతున్న వ్యయాన్ని మించి లబ్ధిచేకూరేలా ప్రయత్నించినపుడే అధికవృద్ధి సాధ్యమవుతుంది. పట్టణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించడంతోపాటు అధిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా స్మార్ట్ సిటీల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం అభినందనీయం.

అమెరికా, సింగపూర్ సహకారం:
జపాన్, సింగపూర్, అమెరికా, గ్లోబల్ పెన్షన్ ఫండ్‌లు భారత్‌లో 100 స్మార్ట్‌సిటీల అభివృద్ధికి తమ సహకారం అందించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. గ్రేటర్ నొయిడాలో రూ.30వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాగలవని అంచనా. స్మార్ట్ సిటీల ఏర్పాటులో భారతీయ సంస్థలతో కలిసి పనిచేయడానికి అమెరికా ఆసక్తి కనబరు స్తోంది. భారత్‌లో రైల్వే వ్యవస్థ, పరికరాల అభివృద్ధి, విమానాశ్రయాలు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ, ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహణ, వాటి మరమ్మతు, భద్రతా వ్యవస్థను ఆధునికీకరించడం, రక్షిత నగరాల ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ, నౌకాశ్రయాల అభివృద్ధికి భారత్‌కు అమెరికా సహకారం ఎంతో అవసరం. అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిలో భారత్, అమెరికాలు పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకున్నప్పుడే స్మార్ట్‌సిటీల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది. అటు సింగపూర్ కూడా స్మార్ట్‌సిటీల నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు సన్నద్ధంగా ఉంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అభివృద్ధిలోనూ పాలుపంచుకోవాలని అభిలషిస్తోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, సింగపూర్ ప్రధాని లీ సియెన్ లుంగ్‌ల మధ్య జరిగిన సంభాషణలలో ఆయా రంగాలలో సహకారానికి సంబంధించి కమిటీలను ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. స్మార్ట్‌సిటీల అభివృద్ధితో పాటు 500 పట్టణాలు, నగరాల్లో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, పట్టణ గృహనిర్మాణ కార్యక్రమం, చారిత్రక, వారసత్వ నగరాల అభివృద్ధికి సంబంధించి అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. అత్యాధునిక రవాణా వ్యవస్థ, వివిధ సేవల బట్వాడాలో భాగంగా ఈ-అర్బన్ గవర్నెన్స్, ఘన వ్యర్థాల నిర్వహణ- నీటి యాజమాన్యంలో సహకరించాలని సింగపూర్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది.

కోచి స్మార్ట్‌సిటీగా రూపుదాల్చితే:
ప్రతిపాదిత కోచి స్మార్ట్‌సిటీగా రూపుదాల్చితే... లక్షమంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. కేరళ రాష్ట్రం ఉత్తమ ఐటీ హబ్‌గా అవతరిస్తుంది. విద్యావంతులైన మహిళా ఐటీ నిపుణులకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు లభిస్తాయి. కేరళ ప్రజల జీవన ప్రమాణాల పెరుగుతాయి. పేపర్, మీడియా పరిశ్రమ వృద్ధి చెందుతుంది.

20 ఏళ్లలో 500 నగరాలు:
సగటున ప్రతి నిమిషానికి గ్రామీణ ప్రాంతాల నుంచి 30 మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు. 2050 నాటికి అదనంగా 700 మిలియన్ల వలస ప్రజల అవసరాలు తీర్చాలంటే రాబోయే 20 ఏళ్లలో 500 కొత్త నగరాలను దేశంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 2050 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభాలో నగర జనాభా వాటా 70 శాతంగా ఉంటుందని అం చనా. భారత్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించే అవకాశాలు ఉ న్నాయి. పెరుగుతున్న పట్టణ జనాభాకు సకల సౌకర్యాలు కల్పించాలంటే దేశంలో 500 నగరాల ఏర్పాటు అవసరం.

సుస్థిర వృద్ధి:
పట్టణాల్లోని ప్రజలు నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు తక్షణ పరిష్కారంలో భాగంగా స్మార్ట్‌సిటీల ఏర్పాటు వెలుగులోకి వచ్చింది. వనరులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా స్మార్ట్‌సిటీలు నవకల్పనకు ఊతమిస్తాయి. తద్వారా ఆరోగ్యకరమైన పోటీతత్వం, సమ్మిళిత ఆర్థికవృద్ధి సాధ్యమవుతుంది.

విధానాలే ప్రామాణికం:
అవస్థాపనా సౌకర్యాల కల్పనతో పాటు అధిక పెట్టుబడుల్ని ఆకర్షించేలా స్మార్ట్‌సిటీల ఏర్పాటు అభినందనీయం. అయితే ఈ సుందర నగరాలు మౌలిక వసతులతో విరాజిల్లేలా రూపుదిద్దుకోవాలి. ఇందుకోసం నియంత్రణల సడలింపు, పన్ను నిర్మాణతలో మార్పులతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలి. స్మార్ట్‌సిటీల ఏర్పాటులో పక్షపాత ధోరణికి పాల్పడకుండా, పాలక ప్రభుత్వాలు పట్టణాభివృద్ధికి పాటుపడాలి. అలా జరిగినప్పుడే స్మార్‌‌ట సిటీలు అభివృద్ధి దివిటీలుగా ఆవిర్భవిస్తాయి.

ప్రయోజనాలు
అవస్థాపనా సౌకర్యాల కల్పనతోపాటు సుస్థిర రియల్ ఎస్టేట్, సమాచారం, మార్కెట్ సౌకర్యాలు ఉన్న పట్టణ ప్రాంతంగా స్మార్ట్ సిటీలు ఆవిర్భవించాలి. స్మార్ట్ టెక్నాలజీని అమలు చేయడం ద్వారా కింది ప్రయోజనాలు చేకూరుతాయి.
 1. సమర్థవంతమైన పబ్లిక్ రవాణా వ్యవస్థ
 2. వ్యర్థ నీటి రీసైక్లింగ్ (Sewage Water Recycling)
 3. నీటి వృథాను అరికట్టే సెన్సార్స్, యాజమాన్యం.
 4. గ్రీన్ స్పేసెస్
 5. భౌతిక, సాంఘిక అవస్థాపనా సౌకర్యాల కల్పన
 6. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో ఉపాధి
 7. వస్తు, సేవల లభ్యత
 8. ప్రజల జీవన ప్రమాణాల్లో పెరుగుదల
 9. సహజ వనరుల సమర్థ వినియోగం
 10. గవర్నెన్స్‌లో పౌరుల భాగస్వామ్యం
 11. పర్యావరణ పరిరక్షణ - యాజమాన్యం
 12. స్మార్ట్ పట్టణాభివృద్ధి సాధన
 13. సుస్థిర వృద్ధి
 14. గ్లోబల్ నెట్ వర్కింగ్
 15. సృజనాత్మక పరిశ్రమ
 16. ఆధునిక సమాచార వ్యవస్థ అందుబాటు
 17. ఈ-అర్బన్ గవర్నెన్స్ 18. పారిశ్రామికీకరణ
 18. భద్రతా వ్యవస్థ ఆధునికీకరణ
Published date : 21 Nov 2014 02:53PM

Photo Stories