Turkey Earthquake: భూప్రళయం.. జన విలయం
కన్నీరాగని జన విలయం. సిరియా సరిహద్దులకు సమీపంలో టర్కీ (నూతన నామం తుర్కియా) ఆగ్నేయ ప్రాంతంలో, ఆ పొరుగునే వాయవ్య సిరియాలో ఫిబ్రవరి 6వ తేదీ తెల్లవారుజామున తీవ్రస్థాయిలో వచ్చిన భూకంపం, ఆపైన ఆగని ప్రకంప నల దృశ్యాలు కదిలించేస్తాయి. 2021 ఆగస్ట్‌లో దక్షిణ అట్లాంటిక్‌లో వచ్చిన ప్రకంపన తర్వాత అమె రికా భూగర్భ సర్వేక్షణ సంస్థ రికార్డ్ చేసిన ప్రపంచంలోని అతి పెద్ద భూకంపం ఇదే. ఇప్పటికి కనీసం 7 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 6 వేల భవనాలు కుప్పకూలాయి. మరో 11 వేల భవనాల పరిస్థితీ అనధికారికంగా అలానే ఉంది. అంకెలు శరవేగంతో మారుతుండడంతో మృతుల సంఖ్య 10 వేలు దాటినా ఆశ్చర్యం లేదు. బాధితుల సంఖ్య 2.3 కోట్ల దాకా ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్క. ఇది 21వ శతాబ్దిలోకెల్లా అతి పెద్ద ప్రకృతి వైపరీత్యం అంటున్నది అందుకే.
భూఉపరితలానికి దిగువన భూఫలకాల మధ్య ఘర్షణతో భూకంపాలు వస్తాయని లెక్క. ప్రపంచంలో ప్రధానంగా అరేబియన్, యురేషియన్, ఇండియన్, ఆఫ్రికన్, మరో చిన్నదైన అనటోలియన్ భూఫలకాలున్నాయి. మధ్యప్రాచ్యంలో భూకంపాలకు ఇవే కారణం. తాజాగా అనటోలియన్, అరేబి యన్ భూఫలకాల మధ్య 100 కిలోమీటర్ల పైగా దూరం పగులు, ఒరిపిడితో 7.8 రిక్టర్ స్కేల్ స్థాయి భూకంపం టర్కీ, సిరియాలను తాకింది. టర్కీలో చారిత్రక గాజియన్‌టెప్ సమీపంలో జన సమ్మర్ద ప్రాంతంలో భూకంప కేంద్రం నెలకొంది. సోమవారమే 12 గంటల్లో 3 సార్లు భూమి కంపించింది. రెండోరోజూ 2 తీవ్ర కంపనలొచ్చి, సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్‌లలో ప్రభావం చూపాయి. భూకంప అనుబంధ అనంతర ప్రకంపనలైతే డజన్లలో వస్తున్నాయి. వారసత్వ కట్టడాలూ దెబ్బతిన్నాయి.
Spy Balloon: నిఘా బెలూన్లు అంటే ఏమిటీ.. ఎప్పటి నుంచి వాడుకలో ఉన్నాయి?
హృదయవిదారక జగత్ప్రళయ దృశ్యాలతో, వేలాది మరణాలు సంభవించిన భూకంప బాధిత ఆగ్నేయ ప్రావిన్సులు పదింటిలో మూడు నెలలు ఎమర్జెన్సీ విధించారు టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్. ఒక పక్క వాన, మరోపక్క చలికాలపు మైనస్ డిగ్రీల అతి శీతల గాలుల్లో సహాయక చర్యలూ కష్టమే. శిథిలాల కింద నుంచి ఆర్తనాదాలు, మూలుగులు వినిపిస్తున్నా వారిని కాపాడే వ్యక్తులు, వసతులు కరవయ్యాయి. కొనవూపిరితో కొట్టుకుంటున్నవారూ చలిలో గడ్డకట్టుకు పోతున్న పరిస్థితుల్లో... వట్టి చేతులతోనైనా శిథిలాలను తవ్వి అయినవాళ్ళను కాపాడుకోవాలన్న విఫల ప్రయత్నాలు సాగుతున్న వేళ.. భారత్ సహా 45 దేశాలు మానవతా దృక్పథంతో అత్యవసర సామగ్రితో సాయానికి దిగాయి.
అసలే యుద్ధంతో, భౌగోళిక రాజకీయాలతో, ఆపైన కరోనాతో, తర్వాత కలరాతో కన్నీట మునిగిన సిరియాకు తాజా భూకంపం దెబ్బ మీద దెబ్బ. యుద్ధంతో ఆ దేశం వదిలి దక్షిణ టర్కీలో క్రిక్కిరిసిన పరిస్థితుల్లో బతుకీడుస్తున్న వారికీ, సిరియాలోనే తిరుగుబాటుదారుల చేతిలోని ఇడ్లిబ్ నగరంలో చమురు కొరత, ఆకాశాన్నంటే ధరల మధ్య అంతర్జాతీయ మానవతా సాయంతో ప్రాణాలు నిలబెట్టుకుంటున్నవారికీ ఇప్పుడు కాలి కింద భూమినీ ప్రకృతి లాగేసింది. వైట్ హెల్మెట్స్ లాంటి çసంస్థలు సేవలందించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నా, సామగ్రి కొరతతో కష్టమవుతోంది. ఈ అత్యవసర సమయంలోనూ శరణార్థుల సాయానికి దోవలన్నీ సిరియా మూతబెడితే, బాధితులకు కనీసం తిండి, మంచినీళ్ళు, మందులు అందేదెలా? దౌత్య, రవాణా వసతుల పరంగా పెను సవాలైన దీన్ని అంతర్జాతీయ సమాజం పరిష్కరించకుంటే ఇది మరో పెను మానవవిషాదం.
Budget Details 2023 : అసలు బడ్జెట్ అంటే ఏమిటి? ఎందుకు ప్రవేశపెడతారు ? ప్రయోజనం ఏమిటి ? ఎలా అమలు చేస్తారు ?
నిజానికి, భౌగోళికంగా భూకంప ప్రేరక ప్రాంతంలో టర్కీ ఉంది. టర్కీ, సిరియా, జోర్డాన్లున్న తూర్పు మధ్యధరా ప్రాంతాన ఆఫ్రికన్, అరేబియన్, యురేషియన్ భూఫలకాల మధ్య సంక్లిష్ట సంబంధాలున్నాయి. అనటోలియన్ బ్లాక్ సరేసరి. అందుకే, టర్కీలో శతాబ్దాలుగా భూవిలయాలు పరిపాటి. అక్కడ 1939 నాటి భూకంపంలో 33 వేల మంది చనిపోయారు. ఈసారి ఈ శతాబ్దిలో కెల్లా బలమైన భూకంప తాకిడితో ఆ దేశం చిగురుటాకులా వణికింది. లోతైన భూకంపాలు సంభ విస్తే వాటి తాకిడి భూ ఉపరితలానికి తాకేసరికి చాలావరకు శక్తి కోల్పోయి, కొంత తక్కువ నష్టం కలిగి స్తాయి. కానీ, లోతు లేని భూకంపాలు శక్తిమంతంగా పైకి తాకి, పెను విధ్వంసం రేపుతాయి. తాజా భూకంపం అలాంటిదే. అయితే ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ముందే ఊహించి, హెచ్చరించే వ్యవస్థలు నేటికీ లేవు. కాంతి వేగం కన్నా చాలా నిదానంగా, సెకనుకు 5 నుంచి 13 కి.మీ.ల దూరం ప్రయాణించే భూకంప తరంగాలు ఉపరితలం చేరడానికి సెకన్ల ముందే తెలుసుకోగలుగుతున్నాం.
టర్కీతో పోలిస్తే హిమాలయ ప్రాంతానికి భూకంపాల ముప్పు ఎక్కువ. ఉపరితలం కింద ఒత్తిడి అనూహ్యంగా పేరుకున్న హిమాలయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. భారత్‌లో 59 శాతం ప్రాంతానికి అలా ప్రమాదం పొంచివుంది. టర్కీ ఘటన మనకు మేలుకొలుపు. దీన్నుంచి తక్షణం పాఠాలు నేర్చుకోవాలి. రెండు వారాల క్రితం నేపాల్‌లో భూకంపం తాలూకు ప్రకంపనాలు ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కనిపించాయని మర్చిపోరాదు. ఏటా జనవరి 16న జాతీయ భూకంప దినం జరుపుతూ నేపాల్ లాంటివి జనచైతన్యం పెంచుతుంటాయి. అలాంటి ఆలోచనల్ని మనమూ ఆచరణలో పెట్టాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకొనే కన్నా తెలివిగా, ముందుజాగ్రత్తతో ఉండాలి. ముందస్తుగా కార్యాచరణకు సిద్ధమవ్వాలి. బాధిత దేశాల పునరుజ్జీవనానికి చేయూత నిస్తూనే ఈ పనిలోకీ దిగాలి. హృదయ విదారక ప్రళయసదృశ దృశ్యాలు గుర్తుచేస్తున్నదదే.
☛ Union Budget : బడ్జెట్ తయారీ వెనుక ఉన్న కథ ఇదే.. ఆరు నెలల నుంచి..