Turkey Syria Earthquake: టర్కీ, సిరియా సరిహద్దుల్లో వరుస భారీ భూకంపాలు.. 4,500 మందికి పైగా దుర్మరణం
తర్వాత కొద్ది గంటల్లోనే 7.6, 6 తీవ్రతతో మరో రెండు భూకంపాలు సంభవించడంతో నష్ట తీవ్రత మరింత పెరిగింది. అంతకుముందు, ఆ తర్వాత కూడా 80కి పైగా శక్తిమంతమైన ప్రకంపనలు మధ్యప్రాచ్యాన్ని వణికించాయి. ఇప్పటిదాకా కనీసం 4,500 మందికి పైగా దుర్మరణం పాలైనట్టు తేలింది. 20,000 మందికి పైగా గాయపడ్డారు. వేల సంఖ్యలో భవనాలు తదితర నిర్మాణాలు కళ్లముందే కుప్పకూలాయి. ఎటు చూసినా శిథిలాలు, శవాలతో పలు నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. శిథిలాల కింద చాలామంది ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో ప్రాణనష్టం మరింత భారీగా ఉంటుందని భావిస్తున్నారు. మృతుల సంఖ్య ఎంతకు పెరుగుతుందో శిథిలాలన్నింటినీ పూర్తిగా తొలగిస్తే గానీ తేలదంటూ టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ఇరు దేశాలకు ఆపన్న హస్తం అందించారు. హుటాహుటిన విపత్తు స్పందన దళాలను (ఎన్డీఆర్‌ఎఫ్), వైద్య బృందాలను, సహాయ సామగ్రిని పంపారు. నాటో, ఈయూ కూటములతో పాటు ప్రపంచ దేశాలన్నీ సాయానికి పెద్ద ఎత్తున ముందుకొస్తున్నాయి.
ఎటుచూసినా శవాలు, క్షతగాత్రులే..
శక్తిమంతమైన తొలి భూకంపం టర్కీ, సిరియా సరిహద్దు సమీపంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సంభవించింది. దీని కేంద్రం ఆగ్నేయ టర్కీలోని కహ్రమాన్మరాస్ ప్రావిన్సులో గాజియాన్‌తెప్‌కు 35 కిలోమీటర్ల దూరంలో భూమికి 18 కిలోమీటర్ల దిగువన ఉన్నట్టు గుర్తించారు. భూకంపం తాలూకు ప్రకంపనలు ఏకంగా అటు ఈజిప్టు రాజధాని కైరో దాకా, ఇటు లెబనాన్ రాజధాని బీరూట్ దాకా పాకాయి! దీని ధాటికి దక్షిణ టర్కీలోని పది ప్రావిన్సులతో పాటు ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. డెమాస్కస్‌తో పాటు టర్కీ, సిరియాల్లోని పలు నగరాల్లో జనం హాహాకారాలు చేస్తూ ఒక్క ఉదుటున వీధుల్లోకి పరుగులు తీశారు. గంటల వ్యవధిలోనే 100 కిలోమీటర్ల దూరంలో 7.5 తీవ్రతతో రెండో భూకంపం వచ్చింది. దాంతో నష్ట తీవ్రత మరింత పెరిగింది. సిరియాలోని అలెప్పో, హమా మొదలుకుని టర్కీలోని దియార్బకీర్ నగరం దాకా 330 కిలోమీటర్ల పై చిలుకు ప్రాంతం తీవ్రంగా దెబ్బ తిన్నది. సిరియాలో ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. అరకొర సౌకర్యాల నడుమే వారికి చికిత్స అందిస్తున్నారు. భూ ప్రకంపనలు ఇంగ్లండ్ దాకా కొనసాగాయి.
వలసలతో ట్రాఫిక్ జామ్
వరుస ప్రకంపనలతో టర్కీవాసులు బెంబేలెత్తుతున్నారు. భారీ సంఖ్యలో మూటాముల్లే సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు బయల్దేరుతుండటంతో దేశంలో చాలాచోట్ల ట్రాఫిక్ జామ్‌లు కనిపిస్తున్నాయి. దాంతో ఎమర్జెన్సీ, సహాయ బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరడం కష్టంగా మారుతోంది. ప్రజలు రోడ్లపైకి రావద్దని ప్రభుత్వ వర్గాలు విజ్ఞప్తి చేయాల్సి వస్తోంది.
• శిథిలాల కింద వేలాది కుటుంబాలు చిక్కుబడ్డాయి! వాటి నుంచి బాధితుల ఆక్రందనలు హృదయ విదారకంగా వినిపిస్తున్నాయి.
• వణికించే చలి సహాయక చర్యలకు అడ్డంకిగా మారుతోంది.
• మసీదులు తదితరాల్లో నిర్వాసితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.
• యంత్రాల సాయంతో శిథిలాలను హుటాహుటిన తొలగించేందుకు సిబ్బంది పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారు.
• టర్కీలోని ప్రసిద్ధ చారిత్రక, వారసత్వ భవనాలు, కట్టడాలు కూడా భూకంపం వల్ల దెబ్బ తిన్నాయి.
• వాయవ్య సిరియాలో ఇద్లిబ్ ప్రావిన్సు తదితరాలు కొన్నేళ్లుగా విపక్ష రెబెల్స్ అ«దీనంలో ఉండటం అక్కడ సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది.
• ప్రపంచంలోనే భూకంప రిస్కు తీవ్రత అత్యంత ఎక్కువగా ఉన్న దేశాల్లో టర్కీ ఒకటి.
• 1999లో వాయవ్య టర్కీని అతలాకుతలం చేసిన శక్తిమంతమైన భూకంపం 18 వేల మందికి పైగా బలి తీసుకుంది.