Skip to main content

CoP26 summit: ఈ లక్ష్యం కఠినమే!

అనూహ్యం... అపూర్వం. గ్లాస్గోలో ‘పర్యావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల 26వ సదస్సు’ (కాప్‌–26)లో భారత ప్రధాని మోదీ చెప్పిన మాటలు, చేసిన బాసలను అభివర్ణించడానికి ఇలాంటి పదాలే సరిపోతాయి.
26th Conference of Partners on Environmental Issues
26th Conference of Partners on Environmental Issues

శిలాజేతర ఇంధనశక్తి సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు పెంచడం... పునరుద్ధరణీయ వనరుల నుంచే 50 శాతం విద్యుత్‌ అవసరాలను తీర్చుకోవడం... కర్బన ఉద్గారాలను వంద కోట్ల టన్నులు తగ్గించడం... ఒక యూనిట్‌ విద్యుదుత్పత్తికి ఎన్ని గ్రాముల కార్బన్‌డయాక్సైడ్‌ విడుదలవుతోందనే ‘కర్బన తీవ్రత’ లెక్కను 45 శాతం కన్నా తక్కువకు తీసుకురావడం... ఈ లక్ష్యాలను ఎనిమిదేళ్ళలో 2030 నాటికి చేరుకొంటామని ప్రపంచ వేదికపై మోదీ భారీ వాగ్దానం చేశారు. దేశంలో విడుదలయ్యే గ్రీన్‌ హౌస్‌ వాయువులకు దీటుగా అంతే మొత్తంలో పర్యావరణం నుంచి కర్బన ఉద్గారాలను తొలగించి, నికరంగా చెల్లుకు చెల్లు అనేది తుది లక్ష్యం. ఆ ‘నెట్‌ జీరో’ (కర్బన తటస్థత) లక్ష్యాన్ని సైతం 2070 నాటికి సాధిస్తామన్నారు. పర్యావరణ హితైషిగా భారత్‌ పెట్టుకున్న ఈ లక్ష్యాలన్నీ ఆహ్వానించదగ్గవే. అయితే, వీటిని చేరే వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడున్న ప్రశ్న. 

పర్యావరణానికి ప్రాణాధారం కాప్-21

నిజానికి, 2050 నాటి కల్లా కర్బన తటస్థతను సాధించేలా దేశాల నుంచి మాట తీసుకోవాలన్నది ప్రయత్నం. అంతకన్నా ఇరవై ఏళ్ళు ఆలస్యంగా 2070 గడువును పెట్టుకోవడం మిగతా ప్రపంచానికి నిరాశాజనకమే. అయితే, కఠోరమైన ప్రభుత్వ, రాజకీయ శ్రమతో తప్ప, అతి తక్కువ గడువులో అందుకోవడానికి వీల్లేని అనేక భారీ లక్ష్యాలను ఇలా ఉన్నట్టుండి భారత భుజస్కంధాల మీదకు మోదీ ఎత్తుకోవడం ఎవరూ ఊహించని విషయం. నిజానికి, ఆ మధ్య భారత్‌కు వచ్చి, చర్చించిన పాశ్చాత్య పర్యావరణవాదులకు ఇలాంటి లక్ష్యాలపై మన సర్కారు ఎలాంటి హామీ ఇవ్వలేదు. గత నెలే తుది గడువు అయినా సరికొత్త ‘జాతీయ నిర్ధారిత భాగస్వామ్యాల’ (ఎన్‌డీసీల)నూ మనం పేర్కొనలేదు. గ్లాస్గో సదస్సుకు కొద్ది గంటల ముందే రోమ్‌లో ముగిసిన ‘జి–20’ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులోనూ మన దేశం పర్యావరణ మార్పుపై కొత్త బాసలూ చేయలేదు. పైపెచ్చు, అభివృద్ధి చెందిన దేశాలు నిధులిచ్చి సాంకేతికతను బదలాయించాలనీ, న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూపులో భారత్‌కు సభ్యత్వమిచ్చే దాకా శిలాజేతర ఇంధనాలకు మారలేమనీ, బొగ్గుతో నడిచే విద్యుత్‌ కేంద్రాలకు స్వస్తి పలకలేమనీ ‘జి–20’లో భారత సన్నాహాలన్నీ చూసిన కేంద్రమంత్రే కుండబద్దలు కొట్టారు. అలాంటిది కొన్ని గంటల తేడాలో భారత పర్యావరణ లక్ష్యాలపై గ్లాస్గోలో మోదీ ఇచ్చిన కొత్త హామీల ట్విస్టు అనూహ్యం. ఆశ్చర్యకరం.  

జనాభా రీత్యా ప్రపంచంలో 17 శాతం ఉన్న భారత్, మానవాళి మొత్తం ఉద్గారాల్లో 6.8 శాతానికి కారణం. లెక్క వేస్తే మన దేశ కర్బన ఉద్గారాలు 246 కోట్ల టన్నులు. వచ్చే 2030 నాటికి ఇది 400 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా. మరి, తాజా వాగ్దానం మేరకు 100 కోట్ల టన్నుల ఉద్గారాలను తగ్గించాలంటే, ఆషామాషీ కాదు. అటవీ పెంపకం మార్గాన్ని ఎంచుకుంటే – ఒక చెట్టు తన వందేళ్ళ జీవితకాలంలో ఒక టన్ను కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చుకుంటుంది. వంద టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చుకోవాలంటే– ఎకరానికి 500 చెట్లు లెక్కన చూసినా, 20 లక్షల ఎకరాల్లో, అంటే ఏటేటా దాదాపు త్రిపుర రాష్ట్రమంత విస్తీర్ణంలో అడవులను పెంచాలి. లేదంటే, ఆటోమోటివ్‌ రంగంలో పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారాలి. స్టీలు లాంటి రంగాల్లో హైడ్రోజన్‌ లాంటి శుద్ధ ఇంధనాల వైపు మళ్ళాలి. ఇవన్నీ అంత త్వరగా సాధ్యమా అన్నది విశ్లేషకుల ప్రశ్న. 

ప్రపంచగతిని మార్చిన వ్యాధులు - వివరాలు

భారత విద్యుత్‌ అవసరాల్లో ప్రస్తుతం 12 శాతమే పునరుద్ధరణీయ ఇంధనాలు తీరుస్తున్నాయి. దాన్ని కేవలం 8 ఏళ్ళలో 50 శాతానికి పెంచడం భగీరథ ప్రయత్నమే. అలాగే, 2070 నాటికి నెట్‌ జీరో కోసం మధ్యలో ఏదో ఒక ఏడాదిని గరిష్ఠ వత్సరంగా తీసుకొంటే అక్కడ నుంచి ఉద్గారాలను తగ్గించుకుంటూ రావాలి. మచ్చుకు 2040ని పీక్‌ ఇయర్‌గా ఎంచుకుంటే, 0.1 శాతమే ఉన్న ఎలక్ట్రిక్‌ కార్ల వాటా 2040 నాటికి 75 శాతానికి పెరగాల్సి ఉంటుంది. ఇలా బోలెడు లెక్కలు. నిజానికి, ఇతర ప్రధానదేశాలకు భిన్నంగా ఇటీవలి దాకా నెట్‌ జీరో లక్ష్యాన్ని భారత్‌ ప్రకటించనే లేదు. ఇప్పుడిలా ఉన్నట్టుండి ప్రకటన చేసిందంటే, దౌత్యపరమైన ఒత్తిళ్ళు పని చేసి ఉండవచ్చు. అయితే, 2050 కల్లా అభివృద్ధి చెందిన దేశాలు నెట్‌ జీరోకు కట్టుబడి ఉంటేనే, తానూ తన హామీకి కట్టుబడతానని భారత్‌ మెలిక పెట్టి ఉండాల్సిందని నిపుణుల మాట. ఎందుకనో మన పాలకులు ఆ పని చేయలేదు. 

మరోపక్క, వర్ధమాన ద్వీపదేశాలు పర్యావరణానికి ఏమంత హాని చేయకపోయినా, భూతాపోన్నతితో భారీగా దెబ్బతింటాయి కాబట్టి, వనరుల కల్పనతో వాటిని ఆదుకోవడానికి ‘ఐరిస్‌’ పేరిట భారత్‌ కొత్త పథకం ప్రకటించింది. పర్యావరణ అనుకూల జీవనశైలి, ప్రపంచ సౌరశక్తి గ్రిడ్‌ ఆవశ్యకత అంటూ ‘ఒక సూర్యుడు– ఒకటే ప్రపంచం – ఒకటే గ్రిడ్‌’ లాంటి భారత ప్రధాని మాటలు చప్పట్లందుకున్నాయి. తొలినాటి సమావేశంలో నిర్ణీత సమయం కన్నా పది నిమిషాలు ఎక్కువే మాట్లాడిన మోదీ ఆలోచనలు ఆకర్షణీయమే. అనుమానం లేదు. ఇప్పుడిక ఆచరణాత్మక వ్యూహమే అవసరం. అదే అసలైన సవాలు. తాజా ఎన్‌డీసీల పత్రాన్ని సర్కారు సమర్పిస్తే, లక్ష్యసాధనకు వేసుకున్న ప్రణాళిక ఏమిటో స్పష్టమవుతుంది. ఇప్పటికైతే, ఇచ్చిన మాట నెరవేర్చడంలో వెనుకబడ్డ అనేక అభివృద్ధి చెందిన దేశాలకు మన వాగ్దానాలు స్ఫూర్తినివ్వవచ్చు. రేపు 2030 కల్లా పెట్టుకున్న లక్ష్యాలను మనం సాధించగలిగితే, పర్యావరణ పరిరక్షక అభివృద్ధిలో ప్రపంచానికి భారతే దిక్సూచి.

For more Latest General Essays

Published date : 06 Nov 2021 02:03PM

Photo Stories