Skip to main content

పర్యావరణానికి ప్రాణాధారం కాప్-21

ప్రపంచ వ్యాప్తంగా మనిషి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. శీతోష్ణస్థితి మార్పు. భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగటంతో సంభవించే భూతాపం ద్వారా శీతోష్ణస్థితి మార్పు చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాలు ఇప్పటికే స్వల్ప నుంచి తీవ్రస్థాయిలో ప్రభావితమవుతున్నాయి. సముద్ర మట్టం పెరిగి లోతట్టు తీర ప్రాంతాలు, దీవులు ముంపునకు గురవుతున్నాయి. వ్యవసాయ ఉత్పాదకత తగ్గి.. ఆసియా, ఆఫ్రికాలో తీవ్రస్థాయి ఆహార సంక్షోభం నెలకొంది. తీవ్ర నీటి కొరత, వ్యాధులు ప్రబలటం, జీవ వైవిధ్య నష్టం, అధిక వేసవి ఉష్ణోగ్రతలు మొదలైన శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలు కనిపించాయి. ఇప్పటికే ఈ ప్రభావాలు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమవుతున్నాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రపంచంలోని అన్ని దేశాలు భూతాపాన్ని నియంత్రించాలని 2015, డిసెంబర్‌లో ప్యారిస్ నగరంలో జరిగిన కాన్ఫరెన్‌‌స ఆఫ్ పార్టీస్-21(కాప్-21) సదస్సులో తీర్మానించాయి. పారిశ్రామికీకరణకు ముందున్న భూమి ఉపరితల ఉష్ణోగ్రతల కంటే.. రెండు డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడాలని ఐక్యరాజ్యసమితి శీతోష్ణస్థితి మార్పు ఒప్పందం (యునెటైడ్ నేషన్‌‌స ఫ్రేమ్ వర్‌‌క కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్(యూఎన్‌ఎఫ్‌సీసీసీ) సభ్యదేశాలన్నీ నిర్ణయించాయి. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు.. తాము తగ్గించనున్న ఉద్గారాలపై స్పష్టతతో పాటు అవలంబించే మార్గాలను ఈ సమావేశంలో ప్రకటించాయి. ప్యారిస్ ఒప్పందంలో తీసుకున్న తీర్మానాల అమలు ద్వారా.. భావితరాలకు నివాసయోగ్యంగా భూమిని మార్చేందుకు వీలవుతుంది.

శీతోష్ణస్థితి మార్పు
దీర్ఘకాలంపాటు భూమి శీతోష్ణస్థితిలో ఎన్నో మార్పులు సంభవించాయి. సహజ, మానవజనిత కారణాల ద్వారా సంభవిస్తున్న శీతోష్ణస్థితి మార్పునకు మూలం.. భూతాపం (గ్లోబల్ వార్మింగ్). భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు అవాంఛనీయ పెరుగుదల భూతాపానికి దారితీస్తుంది. మానవ శక్తి వినియోగ చర్యల ద్వారా ‘కార్బన్ డై ఆక్సైడ్’ అధిక మోతాదులో విడుదలై భూతాపానికి కారణమవుతుంది. భూమిపైకి చేరుతున్న సౌరపుటంలో అత్యధికం తిరిగి రోదసిలోకి పరావర్తనం చెందుతుంది. కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువులు ఈ సౌరశక్తిని కొద్దిగా గ్రహించి దీన్ని ఉష్ణంగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. ఫలితంగా కార్బన్ డై ఆక్సైడ్ లాంటి వాయువులు భూమిపై వేడి పెరగటానికి కారణమవుతూ.. భూమి ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ వచ్చాయి. 1750కు పూర్వం 6.5 లక్షల ఏళ్లపాటు కార్బన్ డై ఆక్సైడ్ 120 ppm (Parts Per Million) మోతాదులో పెరిగింది. ఆ తర్వాత 2012 వరకు 262 ఏళ్లలో అత్యల్ప సమయంలో అదే మోతాదులో కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం ద్వారా భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగి భూతాపం సంభవించింది.

ప్రారంభంలో శీతోష్ణస్థితి మార్పునకు కారణం కార్బన్ డై ఆక్సైడ్ మాత్రమే అని గుర్తించారు. ఆ తర్వాత దాంతోపాటు అనేక ఇతర ఉద్గారాలు భూతాపానికి, తద్వారా శీతోష్ణస్థితి మార్పునకు కారణమవుతున్నట్లు గ్రహించారు. శీతోష్ణస్థితి మార్పు అధ్యయనాన్ని నిర్వహించిన ‘ఇంటర్-గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్’ ప్రకారం భూతాపానికి కారణమవుతున్న ముఖ్యమైన ఉద్గారాల వివరాలు..

ఉద్గారం

మూలం

కార్బన్ డై ఆక్సైడ్

బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వినియోగం, అడవుల నరికివేత.

మీథేన్

ఘన వ్యర్థ పదార్థ వినియోగం, పశువుల పేగుల నుంచి, వరి మడుల నుంచి.

నైట్రస్ ఆక్సైడ్

నత్రజని ఎరువులు, విస్ఫోటక పదార్థాల ఉత్పాదకత, వినియోగం.

పర్‌ఫ్లోరో కార్బన్స్,

హైడ్రో ఫ్లోరోకార్బన్స్,

సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్

రిఫ్రిజరెంట్ల్లు, వివిధ రకాల ఎరోసోల్ స్ప్రేల వినియోగం

పై వాయువులన్నీ హరితవాయువు తెర మాదిరిగా సౌరశక్తిని గ్రహించి, తిరిగి దాని పరావర్తనాన్ని అడ్డుకుంటాయి కాబట్టి వీటిని హరితవాయువు ఉద్గారాలు అని పిలుస్తారు.

భూతాపం ద్వారానే శీతోష్ణస్థితి మార్పు సంభవిస్తుందని ఐపీసీసీ 1990లో విడుదల చేసిన తన మొదటి నివేదికలో స్పష్టం చేసింది. ఆ తర్వాత 1992 జూన్ 3-14 మధ్య ఐక్యరాజ్యసమితి బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో యునెటైడ్ నేషన్స్ కాన్ఫరెన్‌‌స ఆన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్(యూఎన్‌సీఈడీ) లేదా ధరిత్రి సదస్సును నియంత్రించే యునెటైడ్ నేషన్‌‌స ఫ్రేమ్ వర్‌‌క కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) అనే అంతర్జాతీయ ఒప్పందాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలు హరితవాయు ఉద్గారాలను తగ్గించే విధానాలను రూపొందించుకొని అమలు చేయాలని నిర్ణయించాయి. ఈ ఒప్పందం 1994 లో అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం పై సంతకాలు చేసిన సభ్య దేశాల మధ్య జరిగిన మొదటి సమావేశం కాన్ఫరెన్‌‌స ఆఫ్ పార్టీస్-1(కాప్-1). ఇది బెర్లిన్‌లో జరిగింది. యూఎన్‌ఎఫ్‌సీసీసీపై సంతకాలు చేసిన సభ్యదేశాలన్నింటినీ మూడు రకాలుగా వర్గీకరించొచ్చు.
  1. అనెక్స్-1 దేశాలు: పారిశ్రామిక, పరివర్తన దశలో ఉన్న దేశాలు.
  2. అనెక్స్-2 దేశాలు: అభివృద్ధి చెందిన దేశాలు.
  3. అభివృద్ధి చెందుతున్న దేశాలు.

క్యోటో ప్రోటోకాల్
1997లో జపాన్‌లోని క్యోటో నగరంలో కాప్-3 సదస్సులో క్యోటో ప్రోటోకాల్ అనే ఒప్పందాన్ని రూపొందించారు. ఈ ఒప్పందం ప్రకారం అనెక్స్-1 దేశాలన్నీ 2012 నాటికల్లా తమ ఉద్గారాలను 1990 నాటి ఉద్గారాల స్థాయిలో 5.2 శాతం మేరకు తగ్గించాలన్నది లక్ష్యం. అధిక హరితవాయువు ఉద్గారాల విడుదలకు కారణమైనప్పటికీ, అమెరికా ఈ ఒప్పందం నుంచి వైదొలగింది. యూరోపియన్ యూనియన్, రష్యా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ప్రధానంగా ఈ ఒప్పందాన్ని అమలు చేశాయి. 2005, ఫిబ్రవరి 16న ఇది అమల్లోకి వచ్చి, 2012, డిసెంబరు 31 వరకు కొనసాగింది. చైనా, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఒప్పందంలో మినహాయింపు లభించింది. అయితే 2012 తర్వాత అనుసరించాల్సిన వ్యూహంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఉద్గారాల తగ్గుదలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించాయి.

వివిధ ఒప్పందాలు
  • 2012 తర్వాత అమలయ్యే నూతన ఒప్పంద రూపకల్పనకు తర్వాత కాప్‌లు ప్రయత్నించినప్పటికీ, ఫలితం శూన్యం. దీనికి 2009లో కోపెన్‌హాగన్‌లో జరిగిన సదస్సులో నూతన ఒప్పంద రూపకల్పనకు కాప్ - 15 ద్వారా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ సమావేశంలో స్వచ్ఛంద ఉద్గారాల తగ్గుదల (వాలెంటరీ ఎమిషన్ రిడక్షన్స్) అనే అంశాన్ని ప్రస్తావించారు.
  • 2011లో జరిగిన కాప్-17లో డర్బన్ ఫ్లాట్‌ఫాం పేరుతో ఒక కొత్త నిర్ణయాన్ని సభ్యదేశాలన్నీ తీసుకున్నాయి. దీని ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం ఉద్గారాల తగ్గింపునకు కట్టుబడి ఉండేలా ఒక కొత్త ఒప్పందాన్ని 2015 నాటికి ప్రకటించి 2020 నాటికి అమల్లోకి తీసుకురావాలి. ఇందుకు భారత్ కూడా అంగీకరించింది.
  • 2012లో దోహాలోని కాప్-18లో కూడా ఇవే చర్చలు జరిగాయి. అభివృద్ధి చెందుతున్న పేద దేశాలు శీతోష్ణస్థితి మార్పు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఒప్పుకున్నాయి.

కాప్ - 20 : లీమా కాల్
పెరూలోని లీమా నగరంలో కాప్-20 సమావేశం 2014, డిసెంబరు 1-14 మధ్య జరిగింది.
  • లీమా కాల్ పేరుతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని దేశాలు ఉద్గారాల తగ్గింపునకు కట్టుబడి ఉండేవిధంగా ఒక సరికొత్త ‘క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్’ను రూపొందించాలి.
  • 2015లో ప్యారిస్ సమావేశంలో ఈ ఒప్పందాన్ని రూపొందించేందుకు వీలుగా కొన్ని నియమాలను సభ్యదేశాలు అంగీకరించాయి.
  • ఒక్కో సభ్య దేశం తాము తగ్గించగల ఉద్గారాల మోతాదు (ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్‌‌డ కాంట్రిబ్యూషన్‌‌స)పై నిర్ణయం తీసుకొని ప్రకటించాలి.
  • శీతోష్ణస్థితి మార్పుపై అన్ని సభ్యదేశాలు ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు అమలు చేయాలి. అదేవిధంగా పాఠశాల స్థాయిలో దీనిపై ప్రత్యేక అంశాలను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి.
  • అభివృద్ధి ప్రణాళికల్లో శీతోష్ణస్థితి మార్పును తప్పనిసరిగా పరిగణించాలి.
  • 2020 వరకు క్యోటో ప్రోటోకాల్ రెండో దశను అమలు చేయనున్నట్లు అనెక్స్-1 దేశాలు ప్రకటించాయి.

కాప్-21
ఒక సమగ్ర యూనివర్సల్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్ కోసం దాదాపు 195 దేశాలు ఫ్రాన్‌‌సలోని ప్యారిస్ నగరంలో 2015 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు సమావేశమయ్యాయి. ఈ సమావేశం వాడివేడీ చర్చల తర్వాత 195 దేశాలు ఒక సరికొత్త ప్యారిస్ ఒప్పందాన్ని అంగీకరించాయి.
  • భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదలను రెండు సెంటిగ్రేడ్‌లలోపు నియంత్రించే వీలుగా ప్రపంచ స్థాయి కార్యాచరణ ప్రణాళిక అమలును ఈ ఒప్పందంలో రూపొందించారు.
  • 2020లో ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది.
  • ఈ శతాబ్దం చివరి నాటికి ఈ ఒప్పందం అమలు ద్వారా శీతోష్ణస్థితి మార్పును పూర్తిగా నియంత్రించే వీలుంటుంది.

ఉద్గారాల తగ్గింపునకు సభ్య దేశాలు అంగీకరించిన ముఖ్యాంశాలు
  • పారిశ్రామికీకరణకు ముందున్న సగటు ఉష్ణోగ్రతలతో పోల్చితే.. ప్రస్తుతం ఉష్ణోగ్రతల పెరుగుదలను రెండు డిగ్రీల లోపు నియంత్రించాలి.
  • సాధ్యమైనంత వరకు ఈ ఉష్ణోగ్రతల పెరుగుదలను ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌కు నియంత్రించాలి. దీని ద్వారా శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలను పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంటుంది.
  • టెక్నాలజీ వినియోగం ద్వారా ఉద్గారాల తగ్గింపునకు కృషి చేయాలి. ఈ అంశంలో అభివృద్ధి చెందిన దేశాలు సాయం అందించాలి.
  • ప్యారిస్ ఒప్పందానికి ముందు సభ్యదేశాలన్నీ తాము తగ్గించే ఉద్గారాల సమాచారాన్ని అందించాయి. అయితే, ఈ స్థాయిలో ఉద్గారాల తగ్గింపు.. సమస్య తీవ్రతను తగ్గించే విధంగానే ఉన్నాయి. కానీ, పూర్తిగా నిర్మూలించే విధంగా లేవని కూడా ప్యారిస్ సమావేశంలో గుర్తించారు.
  • ఈ ఒప్పందం అమలు పారదర్శకతపై సభ్యదేశాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సమావేశమై మరింత స్థాయిలో ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను ఏర్పరచుకోవాలి.
  • యూరోపియన్ యూనియన్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు.. తమ నిధుల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయం అందించి, శీతోష్ణస్థితి అనుకూలతలను పటిష్టం చేయాలని నిర్ణయించాయి.
  • 2025 వరకు ఏటా వంద బిలియన్ ఆర్థిక నిధులను సమకూర్చాలని కూడా అభివృద్ధి చెందిన దేశాలు నిర్ణయించాయి.

భారత్ కీలక పాత్ర
  • శీతోష్ణస్థితి మార్పు ద్వారా తీవ్రంగా ప్రభావితం కానున్న దేశాల్లో భారత్ ఒకటి.
  • దీన్ని గుర్తించిన భారత ప్రభుత్వం అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉద్గారాల తగ్గింపునకు కట్టుబడి ఉండాలని నిర్ణయించింది. దీంతోపాటు, శీతోష్ణస్థితి మార్పు నియంత్రణకు సంబంధించిన ప్యారిస్ ఒప్పందం రూపకల్పనలో కీలకపాత్ర వహించింది.
  • 2015, అక్టోబర్ 2న భారత్ తన ఉద్గారాల తగ్గింపు ప్రణాళికను ప్రకటించింది. 2005 నాటి ఉద్గారాల్లో.. 33-35 శాతం ఉద్గారాలను 2030 నాటికి తగ్గించనున్నట్లు భారత్ ప్రకటించింది.
  • దీంతోపాటు 2030 నాటికి 2.5-3 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ సమాన ఉద్గారాలను తగ్గించే వీలుగా అటవీ చట్టాన్ని విస్తరించనున్నట్లు కూడా భారత్ ప్రకటించింది.
  • ఉద్గారాల తగ్గింపునకు భారత్ చర్యలు: దేశంలో సౌరశక్తి విస్తరణ; ఉత్పాదకత, శక్తి సామర్థ్యం పెంపు; సమర్థవంతమైన వ్యర్థ వినియోగం; కాలుష్య రహిత రవాణా వ్యవస్థ
Published date : 14 Jan 2016 05:16PM

Photo Stories