Skip to main content

విద్య-ఉపాధి-వేతనాలు

డా॥తమ్మా కోటిరెడ్డి, పొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్
సాంకేతిక ప్రగతి, ఉపాధి కల్పన మధ్య సంబంధాన్ని నిర్లక్ష్యం చేయలేం. అభివృద్ధి విధానాలన్నీ ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పన నిరాటంకంగా కొనసాగేందుకు దోహదపడేవిగా ఉండాలి. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యార్థిపై చేసే తలసరి వ్యయంతో పోల్చితే యూనివర్సిటీ, ఉన్నత విద్యా స్థాయిలో చేసే తలసరి వ్యయం ఎక్కువగా ఉంది. వృద్ధి ప్రక్రియలో పాఠశాల విద్యకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. వృద్ధి స్వభావం.. ఉపాధి నిర్మాణత, ప్రత్యేక నైపుణ్యతలకు సంబంధించి శ్రామిక డిమాండ్‌ను నిర్ణయిస్తుంది. చలనాత్మక ఆర్థిక వ్యవస్థలో విద్య అందుబాటు; ప్రభుత్వ జోక్యం ద్వారా పరపతి, శ్రామిక మార్కెట్‌కు సంబంధించిన అసంపూర్ణతలను తగ్గిస్తే.. సమాజం అధిక ప్రయోజనం పొందుతుంది.

ప్రభుత్వం విద్యపై చేసే వ్యయం.. సాంఘిక ప్రతిఫల రేటు, ప్రాథమిక, సెకండరీ విద్యా స్థాయి పెరుగుదల, అధిక ప్రతిఫలం, దీర్ఘకాల వృద్ధికి అనువైన వాతావరణం ఏర్పరచడం తదితర అంశాల ఆధారంగా ఉండాలి. కేవలం వనరుల పంపిణీ మాత్రమే ‘విద్య’ పరంగా లింగ సంబంధిత అసమానతలను తొలగించలేదు. పాఠశాల, ఉన్నత విద్యా వ్యవస్థలో వికేంద్రీకరణ, అధిక సరళత, పరీక్షల ప్రక్రియలో మార్పు, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి సంస్కరణలు చేపట్టాలి. ఆయా సంస్కరణలు విజయవంతం కావాలంటే పెద్ద మొత్తంలో ప్రభుత్వ వ్యయం అవసరం. భారత ప్రభుత్వం పాఠశాల స్థాయిలో సంప్రదాయ విద్యకు తగిన మద్దతు అందిస్తోంది. కానీ, వృత్తి విద్యా శిక్షణ, నైపుణ్యాతాభివృద్ధిపై ప్రభుత్వ పెట్టుబడులు పెరిగినప్పుడే ఆర్థికాభివృద్ధి ప్రక్రియ వేగవంతమవుతుంది. ప్రభుత్వ విధానాలు ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేవిగా ఉండాలి. ఈ దిశగా మహిళలకు సంబంధించి విద్య, ఆరోగ్య ప్రమాణాలు, స్కిల్ డెవలప్‌మెంట్ పెంపుపై దృష్టిసారించాలి. ఆర్థిక వ్యవస్థలో సాంఘిక- ఆర్థికాభివృద్ధికి విద్య, నాణ్యతలను ముఖ్య కారకాలుగా గుర్తించాలి.

విద్య-ఉపాధి
అనేక అనుభవపూర్వక ఆధారాల ప్రకారం విద్యా స్థాయి, శాశ్వత ఉపాధికి మధ్య సంబంధం జీవన నాణ్యతపై ప్రభావం చూపుతుంది. విద్యాస్థాయిలో పెరుగుదల వల్ల భారతదేశంలో శాశ్వత ఉపాధి పెరిగింది. ఫలితంగా పేదరిక స్థాయి తగ్గింది. ప్రాథమిక విద్యతో పోల్చితే ఉన్నత విద్య.. ఉపాధి పెరుగుదల, పేదరికం తగ్గింపునకు ఎక్కువగా దోహదపడుతుంది. విద్య, సాంకేతిక శిక్షణలను ఉపాధి పెంపునకు మూలస్తంభాలుగా పేర్కొనవచ్చు. తక్కువ నైపుణ్యత, అల్ప ఉత్పాదకత, తక్కువ వేతన ఆర్థిక వ్యవస్థ తదితర లక్షణాల నుంచి ఆర్థిక వ్యవస్థ బయటపడాలంటే విద్యా స్థాయిని పెంచే చర్యలు అవసరం. నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి నాణ్యతలను పెంపొందించడం.. ఆర్థిక వ్యవస్థ ముందున్న సవాళ్లుగా చెప్పొచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో విద్య, శ్రామికుల నైపుణ్యత తక్కువగా ఉంది. కేవలం 5 శాతం గ్రామీణ మహిళలు, 13 శాతం గ్రామీణ పురుషులు మాత్రమే హయ్యర్ సెకండరీ, అంతకు మించిన విద్యను అభ్యసించారు. కాగా, పట్టణ శ్రామికుల్లో మహిళలకు సంబంధించి గ్రాడ్యుయేట్, ఆపై అభ్యసించిన వారి శాతం గణనీయంగా పెరిగినట్లు నేషనల్ శాంపుల్ సర్వే వెల్లడించింది.

నైపుణ్య అభివృద్ధి
పనిచేసే జనాభాలో ైనైపుణ్య అభివృద్ధి.. ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యాంశంగా ఉంది. భారతదేశంలో నైపుణ్యతాభివృద్ధి ప్రక్రియ సమీక్ష ప్రకారం 2009-10లో 15 నుంచి 19 సంవత్సరాల వయోవర్గ శ్రామికశక్తిలో వృత్తి విద్యా శిక్షణ పొందినవారు కేవలం 10 శాతం మాత్రమే. సేవారంగంలోని మొత్తం శ్రామికుల్లో 33 శాతానికి పైగా; తయారీ రంగంలో సుమారు 33 శాతం; వ్యవసాయ రంగంలో 27 శాతం శ్రామికులు మాత్రమే వృత్తి విద్యా శిక్షణ పొందారు. తయారీయేతర అనుబంధ రంగాల్లోని మొత్తం శ్రామికుల్లో 9 శాతం మంది మాత్రమే వృత్తి విద్యా శిక్షణ తీసుకున్నారు.

విద్య-శ్రామికుల వేతనాలు
భారత ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా సంస్కరణల కాలంలో నైపుణ్యత గల శ్రామికశక్తి, నైపుణ్యత లేని శ్రామికశక్తి మధ్య వేతన వ్యత్యాసాలు బాగా పెరిగాయి. అనేక ఉపాధి కేటగిరీల్లో పురుషులతో పోల్చితే మహిళా శ్రామికుల వేతనాలు తక్కువ. తాత్కాలిక ఉపాధితో పోల్చితే శాశ్వత ఉపాధిలో విద్య-వేతనాలకు సంబంధించిన జెండర్ అసమానతలను తగ్గిస్తుంది. నేషనల్ శాంపుల్ సర్వే అంచనాల ప్రకారం 2011-12లో శాశ్వత ఉపాధిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పురుషులు, మహిళల మధ్య వేతన వ్యత్యాసం విద్యా స్థాయి పెరిగే కొద్దీ తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఉపాధిలో ఏవిధమైన విద్యను అభ్యసించని మహిళ వేతనం.. పురుషుడి వేతనంలో 53 శాతం కాగా, గ్రాడ్యుయేట్ మహిళ వేతనం గ్రామీణ ప్రాంతాల్లో అదే విద్యను అభ్యసించిన పురుషుడి వేతనంలో 70 శాతంగా ఉంది. కానీ, పట్టణ ప్రాంతాల్లో మాత్రం పురుషులు, మహిళల మధ్య వేతన వ్యత్యాసం తక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన మహిళ వేతనం.. పురుషుడి వేతనంలో 62 శాతం కాగా, సెకండరీ విద్యను అభ్యసించిన మహిళ వేతనం.. పురుషుడి వేతనంలో 86 శాతంగా, గ్రాడ్యుయేట్ చేసిన మహిళా వేతనం.. పురుషుడి వేతనంలో సగటున 76 శాతంగా నమోదైంది.

భారత్‌లో విద్య అందుబాటు
భారత్‌లో ‘విద్య’.. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సంయుక్త బాధ్యత. విద్యా హక్కును రాజ్యాంగంలో పొందుపరిచారు. 14 సంవత్సరాల లోపు వయోవర్గానికి రాజ్యాంగంలో ఉచిత, తప్పనిసరి విద్యను నిర్దేశించారు. భారత్‌లో పాఠశాల విద్య నాలుగు దశలుగా ఉంది. అవి..1. ప్రాథమిక; 2. అప్పర్ ప్రైమరీ; 3. సెకండరీ; 4. హయ్యర్ సెకండరీ. ప్రాథమిక, అప్పర్‌ప్రైమరీ దశలను ఎలిమెంటరీ విద్యగా పరిగణిస్తారు. జాతీయ విద్యా వ్యవస్థ 10+2 పాఠశాల విద్యా ప్రక్రియను కలిగి ఉంది.
2000-01 నుంచి 2013-14 మధ్యకాలంలో భారతదేశంలో ప్రాథమిక పాఠశాలలు 6,38,738 నుంచి 8,58,916కు; అప్పర్ ప్రైమరీ పాఠశాలలు 2,06,269 నుంచి 5,89,796కు పెరిగాయి. దేశంలోని 98 శాతం గ్రామీణ నివాస ప్రాంతాలు కిలోమీటర్ లోపే ప్రాథమిక పాఠశాలను కలిగి ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 2000-01 నుంచి 2013-14 మధ్యకాలంలో 113.8 మిలియన్ల నుంచి 132.4 మిలియన్లకు పెరిగింది. ఇదే కాలంలో అప్పర్ ప్రైమరీలో విద్యార్థుల నమోదు 42.8 మిలియన్ల నుంచి 66.5 మిలియన్లకు పెరిగింది. 2013-14లో ప్రాథమిక విద్యలో నికర నమోదు నిష్పత్తి 88.1 శాతంగా నమోదైంది. 2009-10 తదుపరి కాలంలో ప్రాథమిక విద్యలో డ్రాప్-అవుట్ రేటులో స్థిరమైన తగ్గుదల సంభవించింది. 2009-10, 2012-13 మధ్యకాలంలో ప్రాథమిక విద్యలో సగటు సాంవత్సరిక డ్రాప్-అవుట్ రేటు 9.1 శాతం నుంచి 4.7 శాతానికి తగ్గింది. ప్రాథమిక విద్య నుంచి అప్పర్ ప్రైమరీ విద్యకు వెళ్లినవారు 2007-08లో 81.1 శాతం కాగా, 2012-13లో 89.6 శాతం.
విద్యాభివృద్ధి ప్రక్రియను నియంత్రించేందుకు 1953లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యా పరిశోధనను ప్రోత్సహించేందుకు ఐకార్ (ఐసీఏఆర్), ఎన్‌పీఎల్, సీఎస్‌ఐఆర్, డీఏఈ వంటి జాతీయ సంస్థలు, లేబొరేటరీలను ఏర్పాటు చేశారు.
ప్రాథమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2000-01లో 95.7 శాతం కాగా, 2010-11లో 116 శాతానికి పెరిగి.. 2013-14లో 101.4 శాతానికి తగ్గింది. 2000-2001 నుంచి 2013-14 మధ్యకాలంలో ప్రాథమిక విద్య నమోదు నిష్పత్తిలో పెరుగుదల 5.7 శాతంగా ఉంది. ఇదే కాలంలో బాలుర స్థూల నమోదు నిష్పత్తిలో 4.7 శాతం తగ్గగా, బాలికల స్థూల నమోదు నిష్పత్తిలో 16.8 శాతం పెరిగింది.
2005-06లో ప్రాథమిక విద్యలో నికర నమోదు నిష్పత్తి 84.5 శాతం కాగా, 2013-14లో 88.08 శాతం. బాలురతో పోల్చితే (87.2 శాతం) బాలికల్లో నికర నమోదు నిష్పత్తి (89.26) ఎక్కువగా ఉంది.
12వ ప్రణాళికలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు రూ.3,43,028 కోట్ల స్థూల బడ్జెటరీ మద్దతు ప్రకటించారు. ఈ మొత్తంలో సర్వశిక్షా అభియాన్‌కు రూ.1,92,726 కోట్లు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కు రూ.27,466 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి రూ.32,681 కోట్లు కేటాయించారు.

ప్రాథమిక విద్యను పెంపొందించేందుకు భారత ప్రభుత్వం ప్రణాళికా యుగంలో సర్వశిక్షా అభియాన్, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం (డీపీఈపీ), ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, మధ్యాహ్న భోజన పథకం తదితర కార్యక్రమాలను అమలుచేసింది. వీటితోపాటు సమాజంలో అన్ని వర్గాల పిల్లలు కుల, మత, లింగ సంబంధిత తేడా లేకుండా అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు నేషనల్ బాల భవన్, నవోదయ విద్యాలయ సమితి, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ తదితరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

విద్యా స్థాయి పరంగా శాశ్వత శ్రామికుల వేతనాలు (రోజుకు రూపాయల్లో..)

విద్య

గ్రామీణ‌

పట్టణ

పురుషులు మహిళలు పురుషులు మహిళలు
నిరక్షరాస్యులు 178 95 208 129
ప్రాథమిక 189 102 222 139
మిడిల్ సెకండరీ 217 112 252 138
హయ్యర్ సెకండరీ 338 229 383 328
గ్రాడ్యుయేట్, అంతకు పైన 550 378 792 607
మొత్తం 320 203 463 360
Published date : 17 Mar 2018 01:45PM

Photo Stories