ప్రపంచ పోటీతత్వ సూచీ (2017-18)
Sakshi Education
డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్).. 2017-18కు సంబంధించి మొత్తం 137 దేశాలతో రూపొందించిన ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్ 40వ స్థానం పొందింది. స్విట్జర్లాండ్, అమెరికా, సింగపూర్‌లు సూచీలో మొదటి మూడు స్థానాలను పొందగా.. చైనా 27, రష్యా 38 స్థానాల్లో నిలిచాయి. బ్రిక్స్ దేశాలకు సంబంధించి భారత్ మూడోస్థానం పొందింది. దక్షిణాసియాలో మొదటి స్థానంలో నిలిచిన భారత్.. అవస్థాపనా సౌకర్యాలు, ఉన్నత విద్య, శ్రామిక మార్కెట్ సామర్థ్యం తదితర అంశాల్లో తన స్థితిని మెరుగుపరచుకున్నట్లు నివేదిక పేర్కొంది. సరైన గణాంకాలు లభ్యంకానందున బార్బడోస్, బొలీవియా, ఐవరీకోస్ట్, గాబన్, ఎఫ్‌వైఆర్ మాసిడోనియాలను సూచీ పరిగణనలోకి తీసుకోలేదు. సంక్షోభం అనంతరం గత పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా విత్తమార్కెట్లో అనిశ్చితి కొనసాగుతున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా, ఇండియా, ఇండోనేషియాలు నవకల్పనా కేంద్రాలుగా రూపొందినట్లు తెలిపింది. నాలుగో పారిశ్రామిక విప్లవ కాలంలో శ్రామిక మార్కెట్ సరళత, శ్రామికుల రక్షణ ఆవశ్యకతను నివేదిక ప్రస్తావించింది. పోటీతత్వ సూచీ గణనలో మూడు ఉపసూచికలకు సంబంధించి 12 ఆధారాలను వరల్డ్ ఎకనమిక్ ఫోరం పరిగణనలోకి తీసుకుంది.
ప్రపంచ జీడీపీ వృద్ధి 3.5 శాతం
4 నేపథ్యాలు
నివేదిక -ముఖ్యాంశాలు
దక్షిణాసియా (SOUTH ASIA)
భారత్
ఆధారాల విషయంలో భారత్ స్థానం, స్కోరు
ప్రపంచ పోటీతత్వ సూచీ - వివిధ దేశాల స్థానాలు
ప్రపంచ జీడీపీ వృద్ధి 3.5 శాతం
- పపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమన సంకేతాలతో పాటు విధాన నిర్ణేతలు, బిజినెస్ లీడర్‌స ఆర్థిక వృద్ధిపై దృష్టిసారించిన ప్రస్తుత పరిస్థితుల్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్).. ప్రపంచ పోటీతత్వ నివేదిక (2017-18)ను రూపొందించింది. గత 25 ఏళ్లుగా సాంకేతిక పరిజ్ఞానం, భౌగోళిక రాజకీయ శక్తుల కారణంగా ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు.. అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక విధానాల్లో గందరగోళానికి కారణమయ్యాయి. దీంతో ప్రభుత్వాలు, వ్యాపారాలు, వ్యక్తులకు అనిశ్చితి పరిస్థితులు ఎదురయ్యాయి.
- 2017లో ప్రపంచ జీడీపీ వృద్ధిని 3.5 శాతంగా నివేదిక అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ధనాత్మక వృద్ధి నమోదైనప్పటికీ ఆర్థిక విధానానికి సంబంధించి దేశాధినేతలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక ప్రగతి ఫలాల పంపిణీలో అసమానతలు, అభివృద్ధి చెందిన దేశాల్లో ఆదాయ అసమానతల పెరుగుదల, పర్యావరణ క్షీణత పెరగడం తదితర పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక విధానాలు సమాజంలోని పౌరులకు ప్రయోజనం చేకూర్చలేదు. చరిత్రాత్మక స్థాయి కంటే వృద్ధి రేటు తక్కువగా ఉన్న నేపథ్యంలో గతంలో అవలంబించిన ఆర్థిక విధానాలు ప్రశ్నార్థకంగా మారాయి.
- అనేక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో అసమానతలు పెరగడంతో సమాజంలో ఆర్థిక వృద్ధి విలువ ప్రశ్నార్థకమైంది. సాంకేతిక పరిజ్ఞానంలో ప్రగతి కారణంగా ఎదురైన సవాళ్లు, ప్రపంచీకరణలో వస్తు- సేవల వాణిజ్యం, ప్రజలు, మూలధనం గమనశీలత వల్ల ఏర్పడిన దుష్పరిమాణాల కారణంగా సమాజంలో అసమానతలు పెరిగాయి.
- వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో పేదరిక స్థాయి తగ్గుదల, మధ్య తరగతి ప్రజల పెరుగుదల కారణంగా నాణ్యమైన పబ్లిక్ వస్తువులకు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఈ ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి రేటు నెమ్మదించడంతో ప్రభుత్వాల బడ్జెట్లపై భారం పెరిగింది.
- మానవ కేంద్రీకృత ఆర్థిక ప్రగతి లక్ష్యం దేశ జనాభాకు సంబంధించి సుస్థిర, సమానత్వ శ్రేయస్సులో పెరుగుదలను సాధించడమేనని నివేదిక పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల సాధన కంటే ముందు మానవ శ్రేయస్సును పెంపొందించాలని నివేదిక సూచించింది.
- ఆరోగ్యం, విద్య, భద్రత పెంపునకు అవసరమైన వనరులు అధిక ఆర్థికవృద్ధి సాధనతో లభ్యమవుతాయి. పోటీతత్వాన్ని నిర్ణయించే అన్ని అంశాలను ప్రపంచ దేశాలు పర్యవేక్షించడం అవసరమని నివేదిక అభిప్రాయపడింది. మానవ కేంద్రీకృత ఆర్థిక ప్రగతి బహుముఖంగా ఉండాలని, ఈ ప్రగతి సాధనకు పోటీతత్వం ఉపకరిస్తుందని నివేదిక వెల్లడించింది.
4 నేపథ్యాలు
- వరల్డ్ ఎకనమిక్ ఫోరం.. ఆర్థిక ప్రగతికి సంబంధించి గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్.. నాలుగు అంతర్గత అనుబంధ నేపథ్యాలను గుర్తించింది. అవి..
- విత్త మార్కెట్, పన్నులు, సాంఘిక భద్రత, అసమానతలను రూపుమాపడం, పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం, నైపుణ్యత పెంపు ప్రతిపాదనలు తదితరాలు ప్రపంచీకరణలో భాగంగా ఉండాలి. ప్రపంచీకరణ అత్యంత సమ్మిళితంగా రూపొందాలి.
- నాలుగో పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో ఉత్పాదకత, ఆర్థిక సామర్థ్యం పెంపు.
- బహుముఖ సమ్మిళితను ప్రోత్సహించడం, సాధించడం.
- ఆలోచనా ధోరణిని పెంపొందించడం. సామాజిక మాధ్యమాల్లో నూతన అభివృద్ధిని సాధించేందుకు సమాచార అనుసంధానం, సంస్థాగత వృద్ధి.
నివేదిక -ముఖ్యాంశాలు
- విత్తమార్కెట్లో అనిశ్చితి గత పదేళ్లుగా కొనసాగుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ప్రైవేటు రుణం పెరుగుదల, నియంత్రణ లేని మూలధన మార్కెట్ల వృద్ధి వంటి పరిస్థితులు నెలకొన్నాయి. పటిష్ట విత్తమార్కెట్ నిర్వహణ ద్వారా తిరోగమనాన్ని అధిగమించొచ్చు. అదే విధంగా ఉత్పాదకత, వృద్ధి మెరుగవుతాయి. నాలుగో పారిశ్రామిక విప్లవం వల్ల ప్రయోజనాలు పొందాలంటే అవసరమైన నిధులు, ఇతర సాధనాల మద్దతు అవసరం.
- అనేక దేశాల్లో నవకల్పనలు పెరిగాయి. నవకల్పనల పెరుగుదల వల్ల కలిగే ప్రయోజనాలు ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించాలి.
- నాలుగో పారిశ్రామిక విప్లవంలో సంపద.. సమాజంలో అన్ని వర్గాల మధ్య పంపిణీ కావాలంటే శ్రామిక మార్కెట్ సరళత, శ్రామికుల రక్షణ అవసరం.
దక్షిణాసియా (SOUTH ASIA)
- దక్షిణాసియాలోని అనేక దేశాల్లో పోటీతత్వం మెరుగుపడింది. రెండు హిమాలయ దేశాలైన భూటాన్ (82వ స్థానం), నేపాల్ (88వ స్థానం) తమ పోటీతత్వాన్ని 2016-17తో పోల్చితే 2017-18లో మెరుగుపరచుకున్నాయి. అదేవిధంగా పోటీతత్వానికి సంబంధించి అన్ని ఆధారాల్లోనూ బంగ్లాదేశ్, పాకిస్తాన్ తమ స్కోరును మెరుగుపరచుకున్నాయి. గత దశాబ్ద కాలంగా ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) అభివృద్ధి, దాని వినియోగం పెంపు విషయంలో దక్షిణాసియా సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లలో దీన్ని అతిపెద్ద సవాలుగా భావించొచ్చు. దక్షిణాసియా ప్రాంతంలో సాంకేతిక సంసిద్ధత స్తంభించింది. ఈ అంశానికి సంబంధించి సబ్-సహారా ఆఫ్రికా, దక్షిణాసియాల ప్రగతి ఒకేవిధంగా ఉంది.
భారత్
- గత రెండేళ్లతో పోల్చితే భారత్.. అనేక ఆధారాల్లో తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. ఇటీవల ప్రభుత్వరంగ పెట్టుబడులు పెరగడంవల్ల అవస్థాపనా సౌకర్యాలు (66వ స్థానం); ఉన్నత విద్య, శిక్షణ (75వ స్థానం), సాంకేతిక సంసిద్ధత (107వ స్థానం)లో భారత్ స్థితి మెరుగైంది. మొబైల్ ఫోన్, బ్రాడ్‌బ్యాండ్ వినియోగం, ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్‌త, పాఠశాలల్లో ఇంటర్నెట్ అందుబాటు తదితర ఐసీటీ సూచికల విషయంలో భారత్ వృద్ధిని నమోదు చేసినట్లు నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ వ్యయ సామర్థ్యం (20వ స్థానం) పెరగడం వల్ల సంస్థల నాణ్యత మెరుగుపడింది. భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు అవినీతిని అతిపెద్ద సమస్యాత్మక కారకంగా ప్రైవేటు రంగం పరిగణిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. దేశంలో 2016వ సంవత్సరానికి సంబంధించి జనాభా 1309.3 మిలియన్లుగా, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2256.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. తలసరి స్థూలదేశీయోత్పత్తి 1723.3 డాలర్లు కాగా, కొనుగోలు శక్తిసామర్థ్యం ఆధారంగా ప్రపంచ జీడీపీలో భారత జీడీపీని 7.23 శాతంగా నివేదిక పేర్కొంది.
ఆధారాల విషయంలో భారత్ స్థానం, స్కోరు
ఎ. ఉపసూచికలు | ర్యాంకు/137 | స్కోరు (1-7) |
మౌలిక అవసరాలు | 63 | 4.68 |
సామర్థ్య పెంపు అంశాలు | 42 | 4.47 |
నవకల్పన, పరిపుష్టత అంశాలు | 30 | 4.29 |
బి. ఆధారాలు |
|
|
సంస్థలు | 39 | 4.44 |
అవస్థాపనా సౌకర్యాలు | 66 | 4.22 |
స్థూల ఆర్థిక వాతావరణం | 80 | 4.54 |
ఆరోగ్యం, ప్రాథమిక విద్య | 91 | 5.50 |
ఉన్నతవిద్య, శిక్షణ | 75 | 4.31 |
వస్తు మార్కెట్ సామర్థ్యం | 56 | 4.47 |
శ్రామిక మార్కెట్ సామర్థ్యం | 75 | 4.15 |
విత్త మార్కెట్ అభివృద్ధి | 42 | 4.37 |
సాంకేతిక పరమైన సంసిద్ధత | 107 | 3.12 |
మార్కెట్ పరిమాణం | 3 | 6.43 |
వ్యాపార పరిపుష్టత | 39 | 4.49 |
నవకల్పన | 29 | 4.09 |
ప్రపంచ పోటీతత్వ సూచీ - వివిధ దేశాల స్థానాలు
దేశం | స్కోరు | 2016-17లోస్థానం | 2017-18లోస్థానం |
స్విట్జర్లాండ్ | 5.86 | 1 | 1 |
అమెరికా | 5.85 | 3 | 2 |
సింగపూర్ | 5.71 | 2 | 3 |
నెదర్లాండ్‌స | 5.66 | 4 | 4 |
జర్మనీ | 5.65 | 5 | 5 |
చైనా | 5.00 | 28 | 27 |
ఇండోనేషియా | 4.68 | 41 | 36 |
ఇండియా | 4.59 | 39 | 40 |
పాకిస్తాన్ | 3.67 | 122 | 115 |
యెమన్ | 2.87 | 138 | 137 |
Published date : 03 Oct 2017 05:52PM