Skip to main content

భారత జాతీయ పరివర్తన సంస్థ నీతి ఆయోగ్

నరేంద్ర మోదీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంది. స్వాతంత్య్ర భారత ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసింది. దీని స్థానంలో నీతి ఆయోగ్ (భారత జాతీయ పరివర్తన సంస్థ) పేరుతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
తొలి ప్రధానమంత్రి నెహ్రూ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడంలో ప్రణాళికా సంఘం పోషించిన పాత్ర అమోఘం. ఇందుకు తొలి రెండు పంచవర్ష ప్రణాళికల్లో సాధించిన ఫలితాలే నిదర్శనం. అయితే అనంతర కాలంలో లక్ష్యాలను నిర్దేశించినా కొరవడిన కార్యాచరణతో ప్రణాళికా సంఘం ప్రతిష్ట మసక బారింది. ఈ నేపథ్యంలో దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు ముందుగా పురోగతి సాధించాలనే లక్ష్యంతో నీతి ఆయోగ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్‌‌సఫార్మింగ్ ఇండియా- ఎన్‌ఐటీఐ) ఆవిర్భవించింది.

కొత్త వ్యవస్థ ఏర్పాటు:
భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో 1950లో ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని ప్రభుత్వం రద్దు చేయనుందని ప్రధాని నరేంద్రమోదీ గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో వెల్లడించారు. అందులో భాగంగా డిసెంబరు 7న ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రస్తుత నిర్మాణతపై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అభిప్రాయాన్ని మోదీ గుర్తు చేశారు. సంస్కరణల అనంతర కాలంలో భారత్ నిర్మాణతలో ముందుచూపు కొరవడిందని మన్మోహన్‌సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని మోదీ అంగీకరించారు. సమర్ధవంతమైన నిర్మాణతేకోఆపరేటివ్ ఫెడరలిజాన్ని (Coopera-tive Federalism) పటిష్టపరుస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికనుగుణంగా ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి విధి విధానాల్ని రూపొందించడానికి ప్రభుత్వం నిపుణులు, విశ్లేషకులతో పలుమార్లు సమావేశాల్ని నిర్వహించింది. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘం పాత్ర, విధుల్ని పూర్తిగా తగ్గించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముఖ్య మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమ ప్రణాళికా బడ్జెట్ అంచనాల్ని నేరుగా కేంద్ర ప్రభుత్వానికే అందించాలని ఆదేశించడంతో ప్రణాళికా సంఘం పాత్రను ప్రభుత్వం కుదించింది. ఈ నేపథ్యంలో 2015 జనవరి 1న ప్రధాని మోదీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ (భారత జాతీయ పరివర్తన సంస్థ)ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

స్వరూపం:
కేంద్ర మంత్రివర్గ తీర్మానంతో భారత జాతీయ పరివర్తన సంస్థ (National Institution for Transforming India&NITI Aayog - నీతి ఆయోగ్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని కార్యకలాపాల కోసం ప్రభుత్వం గవర్నింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ కౌన్సిల్‌లో
  • నీతి ఆయోగ్ అధ్యక్షుడు: ప్రధానమంత్రి
  • ఒక ఉపాధ్యక్షుడు, సీఈఓ ఉంటారు.
  • అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాలక మండలిలో ఉంటారు.
  • ఐదుగురు పూర్తి కాల సభ్యులు, ఇద్దరు పాక్షిక కాల సభ్యులు ఉంటారు. వీరిద్దరినీ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి ఎంపిక చేస్తారు.
  • నలుగురు కేంద్ర మంత్రులు తమ పదవీరీత్యా సభ్యులుగా వ్యవహరిస్తారు.
సైన్యం ఇదే:
ప్రణాళికా సంఘం రద్దయి దాని స్థానంలో ఆవిర్భవించిన నీతి ఆయోగ్‌కు కొలంబియా విశ్వ విద్యాలయం ప్రొఫెసర్, ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగారియా ఉపాధ్యక్షుని (వైస్ చైర్మన్) గా నియమితులయ్యారు. ముఖ్య కార్య నిర్వహణాధికారిగా ప్రస్తుతం ప్రణాళికా సంఘం కార్య దర్శిగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి సింధుశ్రీ ఖుల్లర్‌ను ప్రభుత్వం నియమించింది. డీఆర్‌డీఓ మాజీ ఛీఫ్ వీకే సారస్వత్, ఆర్థిక వేత్త బిబేక్ దేబ్ రాయ్‌లు దీర్ఘకాలిక సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు, వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్‌లు కొనసాగుతారు. నితిన్ గడ్కారీ, స్మృతి ఇరానీ, తవర్‌చంద్ గెహ్లాట్‌లు ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరిస్తారు.

లక్ష్యాలు:
  • జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలు, ప్రధాన రంగాల అభివృద్ధి వ్యూహాలను రాష్ట్రాలతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది.
  • ఆర్థిక వ్యూహాలు, విధానాల్లో భాగంగా జాతీయ భద్రతకు సంబంధించి ఏ అంశాన్నైనా తిరిగి సమీక్షిస్తుంది.
  • గ్రామీణ స్థాయిలో విలువ ను చేకూర్చే ప్రణాళికల్ని రూపొందించి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది.
  • ఆర్థికాంశాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న విషయాలపై సూచనలు ఇస్తుంది.
  • ఆర్థిక పురోగతిని అందుకోలేని సమాజ అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
  • వ్యూహాత్మక, దీర్ఘకాలిక విధానాలు కార్యక్రమాలకు సంబంధించిన ప్రోత్సాహకాల్ని రూపొందించి, వాటి పురోగతి, సమర్థతను పర్యవేక్షిస్తుంది.
  • జాతీయ, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య సహకారం పెంపొందించి ఆయా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఉమ్మడిగా పరిష్కరించడం ద్వారా కోఆపరేటివ్ ఫెడరలిజమ్ (Cooperative Federalism) సాధన దిశగా అడుగులు వేయిస్తుంది.
  • అందరికీ సమాన అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తుంది.
ఏర్పాటు - ఆవశ్యకత:
మూలధన ప్రవాహాలపై సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ఆంక్షలు తొలగించిన కారణంగా భారత్‌లో ప్రణాళికల్ని అమలు చేయాల్సిన ఆవశ్యకత లేదని ప్రముఖ ఆర్థిక వేత్త ప్రభాత్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న ప్రపంచ బ్యాంకు మాజీ ఆర్థికవేత్తలు ఆర్థిక వృద్ధి సాధనపై అధిక దృష్టి సారించారు. అయితే ఈ వృద్ధి కొన్ని వర్గాల ప్రజలకే పరిమితమయింది. దీంతో వివిధ వర్గాల మధ్య ఆదాయాల్లో అంతరాయాలు పెరిగాయి. సామాజిక న్యాయం సాధించాలంటే పేదరిక నిర్మూలన, ఆదాయ అసమానతల్ని రూపుమాపాలి. వాటి సాధనకు భారత్‌లో ప్రణాళికా యుగంలో తగినంత కృషి జరగలేదని కొందరి ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు చెప్పిన మాట అక్షర సత్యం.

ప్రణాళికా ప్రక్రియ ప్రారంభమైన కాలంలో భారత్‌లో ఆదాయ, సంపదలో తీవ్ర అసమానతలు ఉన్నాయి. ప్రణాళికలు ప్రారంభం నుంచి ఆర్థిక అసమానతల తగ్గింపునకు ప్రణాళికా రచయితలు ట్రికిల్ డౌన్ వ్యూహాన్ని అవలంబించారు. కానీ అది సత్ఫలితాలనివ్వలేదు. దేశంలో నల్లధన ప్రవాహం పెరిగిన కారణంగా ఆర్థిక, రాజకీయ అధికారాల్ని కొన్ని వర్గాల ప్రజలే అనుభవిస్తున్నారు. దేశ ఆర్థిక విధానాలు తమకు అనుగుణంగా ఉండేలా పాలక ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. సామ్యవాద సమాజ స్థాపనే ధ్యేయంగా అనేక ప్రణాళికా డాక్యుమెంట్లలో ఉపాధి కల్పనను ప్రణాళికా రచయితలు పొందుపరిచారు. ఉత్పత్తి, ఉపాధి కల్పనకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని వారు గుర్తించినప్పటికీ సమగ్ర ఉపాధి వ్యూహం రూప కల్పన మృగ్యమైంది.

ప్రభుత్వ సరళీకృత విధానాల నేపథ్యంలో 1980లో పారిశ్రామిక రంగంలో పురోగతి కనిపించినప్పటికీ, అనంతర కాలంలో వృద్ధి క్షీణించింది. ఉక్కు, భారీ యంత్రాలు, ఎరువులు, రసాయనాల ప్లాంట్లు సకాలంలో పూర్తి కానందువల్ల ఆ ప్రభావం ఇతర పరిశ్రమల అభివృద్ధికి అవరోధంగా మారింది. ప్రణాళికా యుగంలో ప్రణాళికా లక్ష్యాలైన ఆర్థికవృద్ధి, ఆధునికీకరణ, స్వయం సమృద్ధి సాధన కలగానే మిగిలింది. ఇలాంటి తరుణంలో ప్రణాళికా సంఘం స్థానంలో పుట్టుకొచ్చిన నీతి ఆయోగ్ వాటిని సాధిస్తుందన్నది మోదీ సర్కారు నమ్మకం.

పేరే కాదు.. తీరూ మారాలి:
గత మూడేళ్ల కాలంలో జీడీపీ వృద్ధి 5 శాతం మించలేదు. ఈ నేపథ్యంలో వృద్ధి రేటు పెంపుపై నీతి ఆయోగ్ దృష్టి సారించాలి. పెరుగుతున్న ఆదాయ, ప్రాంతీయ అసమానతల్ని నిర్మూలించేందుకు తగిన ప్రణాళికకు నాంది పలకాలి. సాగు రంగంపై ప్రభుత్వ రంగ పెట్టుబడుల్ని పెంచాలి. పన్ను వ్యవస్థలో మార్పులకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న వనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి. అవస్థాపనా సౌకర్యాలపై అధిక పెట్టుబడుల దిశగా రాష్ట్రాల్ని ప్రోత్సహించాలి. రాష్ట్రాల విద్యుత్ బోర్డులు ఎదుర్కొంటోన్న ఉమ్మడి సమస్యల్ని పరిష్కరించే దిశగా నీతి ఆయోగ్ ప్రయత్నించాలి. విద్యుత్ సంక్షోభాన్ని నివారించగలిగినప్పుడే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధి సాకారమవుతుంది. సంస్కరణల కాలంలో ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో ఎలాంటి లబ్ధికి నోచుకోని ప్రజల అభ్యున్నతికి ప్రత్యేక పథకాల అమలు దిశగా నీతి ఆయోగ్ నిలవాలి. అప్పుడే నాలుగు కాలాలు అందరి మన్ననలను అందుకుంటోంది. లేదంటే కొత్తసీసాలో పాతసారా అన్న చందాన పాతకథే పునరావృతమవుతుంది.

ప్రణాళికా సంఘం వర్సెస్ నీతి ఆయోగ్
  1. నిర్మాణత: ప్రణాళికా సంఘానికి ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. కేబినెట్ మంత్రి హోదాకు సమాన స్థాయిలో డిప్యూటీ చైర్మన్ ప్రణాళికా సంఘంలో ఉంటాడు. ఇంకొందరు కేబినెట్ మంత్రులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ఏర్పడిన నీతి ఆయోగ్‌ను జ్ఞాన ఆవిష్కరణల స్థావరం (Knowledge and Innov-ation Hub - నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్) గా అభివర్ణించారు. దీనికి ప్రధాని చైర్మన్‌గా, వైస్‌చైర్మన్ వాస్తవ అధికారిగా ఉంటూ స్వల్ప, దీర్ఘకాల భవిష్యత్ ప్రణాళికల్ని రూపొందిస్తారు. నిర్ణయాలు, ప్రణాళికల అమల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలుపంచుకొంటారు.
  2. డివిజన్‌లు: ప్రణాళికా సంఘంలా కాకుండా నీతి ఆయోగ్‌లో నాలుగు డివిజన్లు ఉంటాయి. అవి 1. అంతర్రాష్ట్ర మండలి (ఇంటర్ స్టేట్ కౌన్సిల్), 2. ప్రణాళికా మూల్యాంకనం (ప్లాన్ ఎవాల్యూయేషన్). 3. ఆఫీస్, యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 4., డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అనే విభాగాలు నీతి అయోగ్‌లో ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలకు సంబంధించిన నిపుణులు ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తారు. కానీ ప్రణాళికా సంఘంలో ఇవేమీ లేవు.
  3. రాష్ట్రాలకు అధికారాలు: నీతి ఆయోగ్ రూపొందించిన అభివృద్ధి పథకాల్లో రాష్ట్రాలది ప్రధాన పాత్ర. ప్రతిపాదిత ప్రణాళికల్లో రాష్ట్రాలకు అధికారం ఇవ్వడంతో ప్రణాళిక విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయి. దీంతో ప్రణాళికల లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు. ప్రణాళికా సంఘంలో ఇందుకు విరుద్ధం. ప్రణాళికా రచనలో కేంద్రానికి మాత్రమే ప్రాధాన్యం ఉండేది.దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలూ అభివృద్ధి చెందడం ముఖ్యమన్నదే నీతి ఆయోగ్ ప్రధాన ఉద్దేశం.
  4. కోఆపరేటివ్ ఫెడరలిజమ్: కోపరేటివ్ ఫెడరలిజమ్ నీతి ఆయోగ్ ప్రధానాంశం. ప్రధాని మోదీ అభి ప్రాయంలో విధాన ప్రణాళికా ప్రక్రియ పైనుంచి కింది స్థాయికి, కింది నుంచి పైస్థాయికి మారాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దృక్పథం ప్రణాళికా సంఘంలో లేదు. ఫెడరల్ నిర్మాణతను పరిగణనలోకి తీసుకోలేదు. కేంద్రం నిర్ణయాల్ని రాష్ట్రాలు పాటించాలనే షరతు ప్రణాళికా సంఘంలో ఉండేది.
  5. నిధుల సక్రమ వినియోగం: ప్రణాళికా సంఘంలోని ప్రధాన లోపం నిధుల దుర్వినియోగం. పలు రంగాల మధ్య వనరుల కేటాయింపునకు సంబంధించి ప్రణాళికా సంఘం పలు విమర్శలను మూటగట్టుకుంది. పేదరిక గీత నిర్ణయించడంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రణాళికా సంఘం తీసుకున్న నెలవారీ తలసరి వినియోగ వ్యయం కొలమానం అంచనాలు విమర్శలకు గురయ్యాయి. ప్రణాళికా సంఘం పేదరిక అంచనాల కోసం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి నెలవారీ తలసరి వినియోగ వ్యయాన్ని రూ. 672.8గానూ, పట్టణ ప్రాంతాలకు రూ. 859.6గా నిర్ణయించింది. ఇలా ఉన్నవారు పేదరిక రేఖకు దిగువన ఉన్నట్లు ప్రణాళికా సంఘం పేర్కొనడం వాస్తవ దూరం. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం ద్వారా కేంద్ర నిధుల సమర్ధ వినియోగానికి నీతి ఆయోగ్ అవసరమైన విధానాల్ని రూపొందించనుంది.
Published date : 16 Jan 2015 02:18PM

Photo Stories