Skip to main content

భారత ఆర్థిక వ్యవస్థ-సవాళ్లు

ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాల పురోగతి కారణంగా ఆసియా వృద్ధి పథంలో కొనసాగుతుందని ఆశించినప్పటికీ 2018లో 5.9 శాతం, 2019లో 5.7 శాతం, 2020లో 5.6 శాతం వృద్ధిని మాత్రమే సాధించగలదని ఆసియా అభివృద్ధి అవుట్‌లుక్-2019 నివేదిక పేర్కొంది. వస్తు ధరల్లో స్థిరత్వం కారణంగా ద్రవ్యోల్బణం 2019, 2020ల్లో 2.5 శాతంగా ఉండనుంది.
వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం ఆసియా వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. తద్వారా ఈ ప్రాంతంలో వినియోగం,పెట్టుబడి క్షీణిస్తోంది.

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో వృద్ధి మందగించడం ఆసియా వృద్ధిపై ప్రభావం చూపనుంది. ఈ సవాళ్లను అధిగమించడానికి ఆసియాలోని విధాన నిర్ణేతలు చేస్తున్న కృషిని నివే దిక ప్రస్తావించింది. పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు ఈ ప్రాంత వృద్ధికి అవరోధాలుగా మారాయి. అభివృద్ధి చెందుతున్న ఆసియా ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాల (తుపాన్లు, భూకంపాలు..) వల్ల 2000-2018 మధ్యకాలంలో సగటున సంవత్సరానికి 38,000 మంది మరణించినట్లు నివేదిక వెల్లడించింది.

భారత్ పరిస్థితి
పెట్టుబడి వృద్ధి రేటులో పెరుగుదల, పారిశ్రామిక రంగంలో వృద్ధి అధికంగా ఉన్పప్పటికీ వ్యవసాయ, సేవారంగ కార్యకలాపాల విస్తరణ తగ్గుముఖం పట్టాయి. దీంతో 2018లో భారత వృద్ధి నె మ్మదించినట్లు నివేదిక పేర్కొంది. కరెంటు ఖాతా లోటులో పెరుగుదల ఉన్నప్పటికీ నియంత్రణలోనే ఉందని వెల్లడించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 2018-2019లో భారత్ 7 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 2018-19లో వృద్ధి క్షీణించింది. దీనికి వ్యవసాయం రంగంలో తక్కువ వృద్ధి నమోదు కావడం ప్రధాన కారణంగా ఉంది. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల ఉన్పప్పటికీ తృణ, పప్పు ధాన్యాల ఉత్పత్తి తగ్గింది.
  • పారిశ్రామిక రంగ అధిక వృద్ధికి తయారీ, నిర్మాణ రంగాలు, యుటిలిటీస్ కారణమయ్యాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో పెరుగుదల ఏర్పడింది. ఈ పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి సూచీ.. మూలధన పరికరాల డిమాండ్, నిర్మాణ సామాగ్రి, వినియోగదారు వస్తువుల్లో డిమాండ్‌ను సూచిస్తుంది. అందుబాటు ధరల గృహ సదుపాయ విధానం, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కారణంగా నిర్మాణ రంగంలో వృద్ధి అధికమైంది.
  • గత ఏడు సంవత్సరాల కాలంలో సేవారంగంలో తక్కువ వృద్ధి 2018-19లో నమోదైంది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచారం వంటి ఉప రంగాల వృద్ధి క్షీణించడంతో సేవారంగ వృద్ధి 7.4 శాతానికి పరిమితమైంది. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) నూతన నియంత్రణల కారణంగా సేవారంగంలో అధిక వాటా కలిగిన చిన్న, మధ్య తరహా సంస్థలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయి.

ఇంధన ద్రవ్యోల్బణం పెరుగుదల
ప్రభుత్వ వ్యయంలో తగ్గుదల కారణంగా ప్రభుత్వ సర్వీసుల్లో (ప్రభుత్వ పాలన, రక్షణ, ఇతర కేటగిరీలు) వృద్ధి క్షీణించింది. ప్రైవేటు వినియోగంలో పెరుగుదల 2018-19లో వృద్ధిరేటు పెరుగుదలకు కారణమైంది. స్థూల స్థిర మూలధన కల్పనలో 10 శాతం పెరుగుదల ఏర్పడింది. హెడ్‌లైన్ రిటైల్ ద్రవ్యోల్బణంలో తగ్గుదల 2018-19 రెండో త్రైమాసికం నుంచి ప్రారంభమైంది. ప్రపంచ చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ క్షీణత కారణంగా ఇంధన ద్రవ్యోల్బణం పెరిగింది.
  • గతంతో పోల్చితే బ్యాంకింగ్ రంగ పరపతిలో వృద్ధి అధికంగా ఉంది. 2017-18లో పరపతి వృద్ధి 7 శాతం కాగా, 2018లో 11.9 శాతంగా నమోదైంది. సర్వీసులు, వ్యక్తిగత రుణాల వాటా బ్యాంకింగ్ పరపతిలో అధికం. పారిశ్రామిక రంగ పరపతిలో కొంత పెరుగుదల ఏర్పడింది. దివాలా సమస్యలను పరిష్కరించే దిశగా 2016లో నూతన మార్గదర్శకాలను రూపొందించారు. ఎంపిక చేసిన బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ అందించినప్పటికీ బ్యాంకింగ్ రంగంలో ఆశించిన ఫలితాలు రాలేదు. మొత్తం రుణాల్లో వసూలు కాని రుణాలు 2018, మార్చిలో 11.5 శాతం కాగా అదే ఏడాది సెప్టెంబర్ నాటికి 10.8 శాతానికి తగ్గాయి. పరపతి అవసరాలు తీర్చడంలో ప్రధాన పాత్ర పోషించిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంలో వసూలు కాని రుణాలు పెరిగాయి.
  • వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ ఆదాయ పన్ను వసూళ్లు పెరగడంతో ప్రత్యక్ష పన్ను రాబడిలో పెరుగుదల ఏర్పడింది. అనేక వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేటును తగ్గించడం వల్ల ఆ పన్ను రాబడి లక్ష్యాన్ని భారత్ అందుకోలేకపోయిందని నివేదిక పేర్కొంది.
ఎగుమతి, దిగుమతులు
  • చమురు మినహా ఇతర దిగుమతుల్లో తగ్గుదల కారణంగా 2017-18తో పోల్చితే 2018-19లో దిగుమతుల్లో వృద్ధి క్షీణించింది. 2018-19 రెండో అర్ధ భాగంలో మూలధన వస్తు దిగుమతులు తగ్గాయి. ఈ మూలధన వస్తు దిగుమతులు తగ్గడానికి దేశంలో ఆర్థిక కార్యకలాపాల క్షీణత కారణమైంది. బంగారం దిగుమతులు తగ్గడానికి గ్రామీణ డిమాండ్‌లో తగ్గుదల కారణం. అధిక చమురు ధరలు, స్వదేశీ వినియోగంలో పెరుగుదల కారణంగా చమురు దిగుమతుల వృద్ధిలో 32 శాతానికి పైగా పెరుగుదల నమోదైంది. 2017-18తో పోల్చితే 2018-2019లో ఎగుమతుల్లో వృద్ధి 8.9 శాతంగా ఉంది. ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్, మెషినరీ ఎగుమతుల్లో వృద్ధి నమోదు కాగా, మెటల్స్, లెదర్ ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయి. 2018-19లో సేవల ఎగుమతుల మిగులులో వృద్ధి 3 శాతంగా ఉంది. మూడు సంవత్సరాల పాటు స్థిరంగా సాగిన సాఫ్ట్‌వేర్ రంగ వృద్ధి ఈ సంవత్సరంలో తగ్గింది.
నికర ఎఫ్‌డీఐలు
నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 2017-18తో పోల్చితే 2018-19లో పెరిగింది. 2018-19లో భారత్ 32 బిలియన్ డాలర్ల నికర ఎఫ్‌డీఐలను ఆకర్షించింది. అమెరికాలో వడ్డీరే ట్ల పెరుగుదల, చమురు ధరల పెరుగుదల, కరెంటు ఖాతా లోటు అధికంగా ఉండటం, ద్రవ్యలోటు లక్ష్యాన్ని భారత్ సాధించగలదనే విషయంలో అనిశ్చితి తదితర అంశాల కారణంగా నికర పోర్ట్‌ఫోలియో పెట్టుబడి ప్రవాహంలో రుణాత్మక వృద్ధి నమోదైంది. పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు భారత్ నుంచి ఇతర దేశాలకు తరలివెళ్లాయి. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పటికీ స్టాక్ మార్కెట్‌లో 10 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. 2018-19లో అమెరికా డాలర్‌తో పోల్చితే భారత రూపాయి విలువ 7.2 శాతం మేర క్షీణించింది. రూపాయి విలువ క్షీణత కారణంగా కరెంట్ ఖాతా లోటు పెరిగింది.
  • నౌకాశ్రయాలు, ఉత్పత్తి కేంద్రాల మధ్య భారత్‌లో అనుసంధానం సరిగా లేకపోవడాన్ని నివేదిక ప్రస్తావించింది. ఈ స్థితి ఉత్పత్తి వ్యయాల పెరుగుదలకు దారితీసింది. గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్ (ప్రపంచ పోటీతత్వ సూచీ) ప్రకారం భారత్‌లో రోడ్ల నాణ్యత మెరుగైనప్పటికీ విద్యుత్ సరఫరాలో నాణ్యత తక్కువగా ఉంది. పారిశ్రామిక జోన్‌లో అవస్థాపనా సౌకర్యాల కల్పనకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు భరించాలి. తద్వారా వ్యక్తిగత సంస్థలు అవస్థాపనా సౌకర్యాలపై చేసే అవస్థాపనా పెట్టుబడి తగ్గుతుంది.
అండగానైపుణ్యాభివృద్ధి
 గ్లోబల్ వాల్యూ చెయిన్‌లో పాలుపంచుకుంటున్న దేశాల్లో ఉత్పాదకత వృద్ధికి నైపుణ్యాభివృద్ధి దోహదపడింది. భారత శ్రమశక్తిలో 4.7 శాతం మంది మాత్రమే సరైన శిక్షణ పొందారు. మొత్తం శ్రమశక్తిలో వృత్తి శిక్షణ (సరైన శిక్షణ) పొందిన వారి వాటా జపాన్‌లో 80 శాతం కాగా, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో 96 శాతంగా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో 24 శాతంగా ఉంది. సాంకేతికతను వినియోగించుకోవడానికి, క్లిష్టతరమైన సర్వీసులను దేశంలోని పౌరులందరికీ అందించడానికి శ్రమశక్తి, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన విధివిధానాలను రూపొందించాలి.
 
 సారాంశం
 స్వదేశీ డిమాండ్‌లో పెరుగుదల భారత వృద్ధికి దోహదపడగలదని ‘ఆసియా అభివృద్ధి’ నివేదిక- 2019 పేర్కొంది. వ్యవసాయ సంక్షోభ నివారణ చర్యల్లో భాగంగా రైతులకు ఆదాయ మద్దతు, ఆహార ధాన్యాల ధరలకు సంబంధించి సేకరణ ధరల పెంపు వంటివి గ్రామీణ డిమాండ్ పెరుగుదలకు దారితీస్తాయి. భూ రికార్డులను రైతుల బ్యాంకు ఖాతాలకు అనుసంధానించాల్సిన నేపథ్యంలో ప్రారంభంలో రైతుల ఆదాయ మద్దతు విధానం అమలు కొద్దిగా క్లిష్టతరం కానుంది. వడ్డీ రేట్లు, ఆహార, ఇంధన ధరల తగ్గింపు తదితర చర్యలు పట్టణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్‌లో పెరుగుదలకు దోహదపడతాయి. భారత్‌లో జీడీపీ వృద్ధిని 2019లో 7.2 శాతంగా, 2020లో 7.3 శాతంగా ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనా వేసింది. ఇదే కాలానికి ద్రవ్యోల్బణం వరుసగా 4.3 శాతం, 4.6 శాతంగా ఉండగలదు. కరెంటు ఖాతాలో లోటు 2019లో జీడీపీలో 2.4 శాతంగా, 2020 లో 2.5 శాతంగా ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనా వేసింది. ఇటీవలి కాలంలో పెట్టుబడి రేటులో నమోదవుతున్న వృద్ధి మున్ముందు కొనసాగనుంది.
 
 అనుసంధాన లోపాలు
 మొండి బకాయిల్లో (రికవరీ కాని రుణాలు) తగ్గుదల, కొన్ని బ్యాంకులు పరపతి నియంత్రణను తొలగించడం తదితర చర్యలు పారిశ్రామికాభివృద్ధికి దోహదపడ్డాయి. గత నాలుగు సంవత్సరాల కాలంలో 2018-19 చివరి త్రైమాసికంలో వ్యాపార అంచనాలు భారత్‌లో అధికమని నివేదిక పేర్కొంది. గ్లోబల్ వాల్యూ చెయిన్‌లో పాల్గొనడం ద్వారా భారత్ తన ఎగుమతుల్లో వృద్ధిని నమోదుచేసుకోగలదు. ఈ క్రమంలో భారత్ అపస్థాపనా సౌకర్యాల అభివృద్ధిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందనందున భారత్‌లో నౌకాశ్రయాలు, ఉత్పత్తి కేంద్రాల మధ్య అనుసంధానం సరిగా లేదని నివేదిక పేర్కొంది.
డా॥తమ్మా కోటిరెడ్డి
ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్
Published date : 12 Apr 2019 03:11PM

Photo Stories