Skip to main content

భారత ఆర్థిక వ్యవస్థ - పాతికేళ్ల ఆర్థిక సంస్కరణలు

స్వాతంత్య్రం సిద్ధించే నాటికి నిరుద్యోగిత, అల్పాభివృద్ధి, పేదరికం, ప్రాంతీయ, ఆదాయ అసమానతలు వంటి క్లిష్ట సమస్యలను భారత్ ఎదుర్కొంటోంది. ఆయా సమస్యల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు చిత్తశుద్ధితో పని చేయడంతోపాటు సమగ్ర, పటి ష్ట కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత నాటి ప్రభుత్వంపై పడింది. ఈ దిశగా భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన కృషి ఫలితమే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ రూపకల్పన, ప్రణాళికల అమలు. అయితే తర్వాతి పరిణామాల నేపథ్యంలో దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు 1991 జూన్ 24న నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి, దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం (1948) మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేస్తే.. రెండో పారిశ్రామిక విధాన తీర్మానం (1956) ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేసింది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రభుత్వ రంగం కీలక పాత్ర పోషించేందుకు వీలుగా రెండో తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఏడో పంచవర్ష ప్రణాళిక నాటికి దేశం అనేక విజయాలతోపాటు వెఫల్యాలను చవిచూసింది. ఈ కాలంలో ప్రభుత్వ రంగానికి ఇతోధిక ప్రాధాన్యం లభించగా, ప్రైవేటు రంగంపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగింది. ప్రైవేటు పరిశ్రమలు, వాణిజ్యం అనేక నియమ నిబంధనలకు లోబడి ఉండేవి.

1991 నాటికి దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరమైంది. దానికి తోడు దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత, గల్ఫ్ సంక్షోభం, సోవియట్ యూనియన్పతనం వంటి కారణాల వల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం స్థూల ఆర్థిక స్థిరీకరణ, నిర్మాణాత్మక సంస్కరణలకు సంబంధించిన కార్యక్రమాలను చేపట్టింది.

దేశంలో ఆర్థిక సంక్షోభానికి కారణాలు
1) కోశ లోటు
2) విదేశీ మారక చెల్లింపుల లోటు
3) అధికస్థాయి ద్రవ్యోల్బణం.

కోశ లోటు: 1981-82లో కోశ లోటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.1 శాతం ఉండగా, 1990- 91 నాటికి 7.8 శాతానికి పెరిగింది. ఈ లోటును పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన దేశీయ రుణాలు ఇదే కాలంలో జీడీపీలో 33.3 శాతం నుంచి 49.7 శాతానికి పెరిగాయి. వాటిపై వడ్డీ భారం జీడీపీలో 2 శాతం నుంచి 3.8 శాతానికి పెరిగింది.

విదేశీ మారక చెల్లింపుల లోటు: 1981-82లో కరెంట్ ఖాతా లోటు 2.1 బిలియన్ డాలర్లు. అది జీడీపీలో 1.35 శాతం. 1990-91 నాటికి కరెంటు ఖాతా లోటు 9.7 బిలియన్ డాలర్లకు చేరుకుని జీడీపీలో 3.69 శాతానికి ఎగబాకింది. ఇదే కాలంలో విదేశీ రుణం జీడీపీలో 12 శాతం నుంచి 23 శాతానికి పెరిగింది.

ద్రవ్యోల్బణ రేటు: 1980లో సగటున 6.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణ రేటు 1990-91 నాటికి 10.3 శాతానికి పెరిగింది.

దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు 1991 జూన్ 24న నాటి ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌లు నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి, దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రాతిపదికన ఆర్థిక సంస్కరణల లక్ష్యాలను నిర్దేశించారు. సంస్కరణల లక్ష్యాలు...
1. ఆర్థికాభివృద్ధి రేటును పెంచడం.
2. పారిశ్రామిక రంగంలో పోటీతత్వాన్ని పెంచడం.
3. కోశ లోటును తగ్గించడం.
4. పేదరికం, ఆదాయ అసమానతలను తగ్గించడం.
5. ప్రభుత్వ రంగ సామర్థ్యాన్ని పెంచడం.
6. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ప్రోత్సహించడం.
7. విదేశీ చెల్లింపుల లోటును తగ్గించడం.
8. ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.
9. ఉపాధి సౌకర్యాలను విస్తరించి, సంపూర్ణ ఉద్యోగితను సాధించడం. డిమాండ్ అండ్ సప్లయ్ కోణాల నుంచి ఈ ఆర్థిక సంస్కరణలను రూపొందించారు

స్థూల ఆర్థిక స్థిరీకరణ: ఇది డిమాండ్ వైపు నిర్వహణ. ఇందులో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, కోశ పరమైన సర్దుబాటు, విదేశీ మారక చెల్లింపుల సర్దుబాటు వంటి అంశాలుంటాయి.

నిర్మాణాత్మక సంస్కరణలు: ఇది సప్లయ్ వైపు నిర్వహణ. ఇందులో వ్యాపార, మూలధన ప్రవాహ సంస్కరణలు, పారిశ్రామిక నియంత్రణలను తొలగించడం, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ రంగ సంస్థల సంస్కరణలు, ద్రవ్య రంగంలో సంస్కరణలు ఉన్నాయి.

ద్రవ్యోల్బణ కట్టడి: 1990-91 నాటికి ద్రవోల్బణం సగటున సాలీన 10 శాతానికి పైగా ఉంది. 1991-92లో ఉత్పత్తి, 1990-91 కంటే తక్కువగా ఉండటం, ద్రవ్య సప్లై 20.6 శాతానికి పెరగడం వల్ల టోకు ధరల సూచీ 13.7 శాతానికి చేరింది. 1992-93లో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగడం వల్ల నికర జాతీయోత్పత్తిలో 5 శాతం వృద్ధి నమోదైంది. ప్రభుత్వ కోశ లోటును జీడీపీలో తగ్గించడం వంటి ప్రతి ద్రవ్యోల్బణ చర్యల వల్ల ద్రవ్యోల్బణ రేటు 7 శాతానికి దిగొచ్చింది. 1993-94, 1994-95 కాలంలో కేంద్ర ప్రభుత్వం విత్త, కోశ విధానాలకు సంబంధించి ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల 1994-95లో ద్రవ్యోల్బణ రేటు 12.6 శాతానికి పెరిగింది. అయితే ద్రవ్య సప్లై తగ్గించడం, వృద్ధిరేటు పెరగడం వల్ల 1996 జనవరి నాటికి ద్రవ్యోల్బణ రేటు 5 శాతానికి తగ్గింది. 2000-01 నుంచి 2013-2014 వరకు ద్రవ్యోల్బణ రేటు సాలీన 5.5 శాతం నుంచి 6 శాతంగా నమోదైంది. అది 2014-2015 ఏప్రిల్-డిసెంబర్ నాటికి 3.4 శాతానికి తగ్గింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు 2016 జూలై 14న విడుదల చేసిన నివేదికలో 2016 జూన్ టోకుధరల సూచీ (ద్రవ్యోల్బణ రేటు) 1.62 శాతంగా పేర్కొన్నారు.

కోశ పరమైన సర్దుబాటు: అధిక ద్రవ్యోల్బణ రేటును అదుపులో ఉంచడానికి, విదేశీ వ్యాపార చెల్లింపుల లోటును తగ్గించేందుకు ప్రభుత్వానికి కోశ పరమైన సర్దుబాటు దోహదపడుతుంది. 1970లో ప్రభుత్వ కోశ లోటు జీడీపీలో 4 శాతం కంటే తక్కువగా ఉండేది. ఇది 1980 నాటికి 5.1 శాతానికి, 1990- 1991 నాటికి 7.8 శాతానికి పెరిగింది. కోశ పరమైన సర్దుబాటులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2004లో ఎఫ్‌ఆర్‌బీఎం(ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్‌మెంట్) చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఫలితంగా 2006-2007 నాటికి జీడీపీలో కోశ లోటు 3.3 శాతానికి, 2007-2008 నాటికి 2.5 శాతానికి తగ్గింది. అయితే అది 2008-2009లో 6 శాతానికి, 2009-2010 లో 6.5 శాతానికి పెరిగినా తిరిగి 2013-2014 నాటికి 4.4 శాతానికి తగ్గింది. ప్రభుత్వ వ్యయం రోజురోజుకీ పెరుగుతుండటమే కోశ లోటుకు ప్రధాన కారణం.

విదేశీ మారక చెల్లింపుల సర్దుబాటు: 1991 మార్చి నాటికి కేవలం 2.2 బిలియన్ డాలర్లు ఉన్న విదేశీ మారక నిల్వలు 2014 మార్చి నాటికి 304.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. నూతన ఆర్థిక సంస్కరణలను ప్రారంభించిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ విదేశీ మారక చెల్లింపులకు సంబంధించి పటిష్ట స్థాయికి చేరుకుంది. 1990-91లో కరెంటు ఖాతా లోటు జీడీపీలో 3.1 శాతం ఉండగా, 1991-92 నాటికి 0.4 శాతానికి తగ్గింది. దిగుమతులను బాగా తగ్గించడం వల్ల ఇది సాధ్యమైంది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది.
దాంతో 1992-1993లో దిగుమతుల సరళీకృత విధానాన్ని అవలంబించారు. ఫలితంగా విదేశీ వ్యాపార లోటు 2,798 మిలియన్ డాలర్ల నుంచి 5,447 మిలియన్ డాలర్లకు చేరింది. కరెంటు ఖాతా లోటు జీడీపీలో 1.7 శాతానికి పెరిగింది. అయితే 1993-94లో ఎగుమతుల వృద్ధిరేటు 20.2 శాతం పెరగడం వల్ల కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 0.4 శాతం తగ్గింది. 1994-1995లో మళ్లీ దిగుమతుల వృద్ధిరేటు 34.3 శాతం పెరగడం వల్ల విదేశీ వ్యాపార లోటు 9,049 మిలియన్ డాలర్లకు పెరిగింది. 2001-2002 నాటికి కరెంటు ఖాతాలో జీడీపీలో 0.7 శాతం మిగులు సాధ్యమైంది. 2003-2004లో కూడా జీడీపీలో 2.3 శాతం మిగులు నమోైదె ంది. అయితే 2004-2005 నుంచి నేటి వరకు కరెంటు ఖాతా లోటులోనే ఉంది. దీనికి ప్రధాన కారణం దిగుమతుల విలువను ఎగుమతుల విలువ అధిగమించలేకపోవడమే.

వ్యాపార, మూలధన ప్రవాహ సంస్కరణలు
1991 నుంచి వ్యాపార రంగంలో ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ వాణిజ్య రంగాన్ని ప్రపంచ వాణిజ్యంతో అనుసంధానించే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 1991 జూలైలో రూపాయి విలువను 18-19 శాతానికి తగ్గించారు. 1993-94లో కరెంట్ అకౌంట్లో రూపాయి పూర్తి మార్పిడి అమల్లోకి వచ్చింది. దీంతో కరెంట్ అకౌంట్‌కు సంబంధించిన విదేశీ మారక అమ్మకం, కొనుగోళ్లు బహిరంగ మార్కెట్‌కు అనుమతినిచ్చింది. ఎగుమతి, దిగుమతుల మీద ఉన్న నియంత్రణలను తొలగించి అనేక వస్తు దిగుమతులను బహిరంగ సాధారణ అనుమతి (Open general licence)లోకి మార్చింది. తొలిసారిగా 1991-92 బడ్జెట్‌లో 300 శాతం ఉన్న దిగుమతి సుంకాలను 150 శాతానికి తగ్గించారు. ప్రతి బడ్జెట్‌లో దిగుమతి సుంకాలను ప్రభుత్వం తగ్గించింది. 1995-96లో వీటిని 65 నుంచి 50 శాతానికి, 1997-98లో 40 శాతానికి, 2006-2007లో 12.5 శాతానికి, 2007-08 నాటికి 10 శాతానికి తగ్గించారు. అనుబంధ పరిశ్రమలను పూర్తి యాజమాన్య స్థాయిలో విదేశీ కంపెనీలు స్థాపించుకునేందుకు వీలు కల్పించారు. ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (FIPB)ను ఏర్పాటు చేసి సింగిల్ విండో ద్వారా విదేశీ పెట్టుబడులకు అనుమతిచ్చారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పించారు. విదేశీ బ్యాంకులను మన దేశంలో స్థాపించేందుకు వీలుగా అనేక సౌకర్యాలు కల్పించారు.

పారిశ్రామిక నియంత్రణలను తొలగించడం
MRTP (Monopolistic and Restrictive Trade Practice) Act ను అనుసరించి ఉన్న అనేక నిబంధనలు, పరిమితులను ఎత్తేశారు. దాంతో సంస్థలు అభిలషణీయ ఉత్పత్తులను చేపట్టేందుకు అవకాశం లభించింది. ఈ కారణంగా అనేక సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. పారిశ్రామిక సంస్థల స్థల నిర్ణయ విధానాన్ని కూడా సరళీకరించారు. సిగరెట్లు, ప్రమాదకర రసాయనాలు, పేలుడు పదార్థాలు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ వస్తువులు, రక్షణ సంబంధ పరికరాలు వంటి 5 రకాల వస్తువులు మినహా మిగిలిన అన్ని వస్తువుల ఉత్పత్తులకు లెసైన్సింగ్ విధానం రద్దు చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న 17 పరిశ్రమలను 3కు పరిమితం చేశారు.

పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ రంగ సంస్థల సంస్కరణలు
ప్రభుత్వ రంగం ఆర్థికాభివృద్ధిలో కీలక భూమిక పోషించేందుకు వీలుగా మొదటి, రెండో పారిశ్రామిక విధాన తీర్మానాలను ప్రవేశపెట్టారు. దాంతో ప్రభుత్వ రంగం పారిశ్రామికీకరణలో ఇతోధిక పాత్రను పోషించింది. అయితే అంతర్గత వనరులను సమగ్రంగా ఉపయోగించుకోలేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో పారిశ్రామిక విస్తరణ జరగలేదనే విమర్శ ఉంది. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల సంస్కరణలు, పెట్టుబడుల ఉపసంహరణ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2015 ఏప్రిల్ 15 నాటికి రూ.1,78,729 కోట్ల విలువైన ఈక్విటీలను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం సమకూర్చుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను అమ్మడం ద్వారా బడ్జెట్ లోటును పూడ్చడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ద్రవ్య రంగంలో సంస్కరణలు
నిర్మాణాత్మక సంస్కరణల విజయవంతానికి శక్తిమంత, సమర్థ ద్రవ్య విధానం అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 1991లో Committee on the financial system నిఏర్పాటు చేసింది. 1991 డిసెంబర్‌లో కమిటీ రిపోర్టును పార్లమెంటుకు సమర్పించింది. నాటి నుంచే బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు మొదలయ్యాయి. కమిటీ సలహాలను దృష్టిలో ఉంచుకుని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్), నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లను దశల వారీగా తగ్గించారు. ఎస్‌ఎల్‌ఆర్‌ను 2009 నవంబర్ నాటికి 24 శాతం, డిసెంబర్ 2010 నాటికి 21.5 శాతం, ప్రస్తుతం 21 శాతానికి తగ్గించారు. అలాగే నగదు నిల్వల నిష్పత్తి CRR ను2003 జూన్ నాటికి 4.5 శాతం, ప్రస్తుతం 4 శాతం తగ్గించారు.

బ్యాంకింగ్ సంస్కరణలు
బ్యాంకింగ్ సంస్కరణల కోసం నియమించిన నర్సింహం కమిటీ 1998 ఏప్రిల్‌లో సమర్పించిన నివేదికలోని ముఖ్య ప్రతిపాదనలు...
  1. ఆర్థిక పటిష్టత ఉన్న బ్యాంకులను విలీనం చేయడం, బలహీనంగా ఉన్న బ్యాంకులను మూసివేయడం
  2. అంతర్జాతీయ స్థాయిలో రెండు లేదా మూడు బ్యాంకులు, జాతీయ స్థాయిలో 8 నుంచి 10 బ్యాంకులు, ఎక్కువ మొత్తంలో ప్రాంతీయ బ్యాంకులను నెలకొల్పడం.
  3. బ్యాంకులు, సిబ్బందిని హేతుబద్ధీకరించడం.
  4. రాజకీయ జోక్యం లేకుండా రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో బోర్డులను ఏర్పాటు చేయడం.
  5. విదేశీ బ్యాంకులు అనుబంధ (లేదా) ఉమ్మడి వెంచర్లను మన దేశంలో ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించడం
  6. CRAR (Capital to Risk-weighted Assets Ratio)ను పెంచడం.
Published date : 17 Aug 2016 01:33PM

Photo Stories