Skip to main content

భారత ఆర్థిక సర్వే (2018–19)

పరిచయం :
భారత ఆర్థిక వ్యవస్థ 2017–18లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా.. 2018–19లో ఇది 6.8 శాతానికి తగ్గింది. అయినా భారత్‌.. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచినట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. 2017–18తో పోల్చితే 2018–19లో ప్రపంచ ఉత్పత్తి వృద్ధిలోనూ క్షీణత సంభవించింది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, చైనా కఠిన పరపతి విధానాలు, అభివృద్ధి చెందిన దేశాల్లోని ఆర్థిక బిగువు తదితరాల కారణంగా 2018లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి క్షీణించింది. స్థూల దేశీయోత్పత్తి పరంగా (ప్రస్తుత అమెరికా డాలర్ల వద్ద) భారత్‌ ప్రపంచంలో ఏడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. చైనా, ఇతర అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే 2014–15 నుంచి 2017–18 మధ్యకాలంలో భారత్‌లో సగటు వృద్ధిరేటు అధికంగా నమోదైంది. కొనుగోలు శక్తిసామ్యం (పీపీపీ) ఆధారంగా భారత్‌.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.

వ్యవసాయ, అనుబంధ రంగాలు; వాణిజ్యం, హోటల్, రవాణా, నిల్వ, సమాచారంతో పాటు బ్రాడ్‌కాస్టింగ్, ప్రభుత్వ పాలన, రక్షణ రంగాల్లో వృద్ధి క్షీణత వల్ల 2018–19లో భారత్‌ 6.8 శాతం వృద్ధికే పరిమితమైంది. గత అయిదేళ్ల కాలంలో (2014–15 తర్వాత) భారత సగటు వాస్తవిక జీడీపీ వృద్ధి 7.5 శాతం. 2017–18తో పోల్చితే 2018–19లో రబీ కింద సాగు విస్తీర్ణం తగ్గిన కారణంగా వ్యవసాయ రంగ ప్రగతి కుంటుపడింది. ప్రభుత్వ అంతిమ వినియోగంలో తగ్గుదల, స్టాక్స్‌లో మార్పుతో పాటు వాల్యూబుల్స్‌ క్షీణత లాంటి అంశాలు కూడా వృద్ధి క్షీణతకు దారితీశాయి. 2018–19లో ప్రస్తుత ధరల వద్ద స్థూల కలిపిన విలువ (జీవీఏ)లో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 16.1 శాతం కాగా, పారిశ్రామికరంగం వాటా 29.6 శాతం, సేవారంగం వాటా 54.3 శాతంగా నమోదైంది.

వ్యవసాయ రంగం :
గత కొన్నేళ్లుగా భారతీయ వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో వ్యవసాయ కమతాల విఘటన, నీటి వనరుల కొరత ప్రధానమైనవి. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపునకు, సుస్థిరత సాధనకు ఐసీటీ ఆధారిత వాతావరణ–స్మార్ట్‌ వ్యవసాయాన్ని చేపట్టాలని ఆర్థిక సర్వే పేర్కొంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, పౌల్ట్రీ, మత్స్యరంగాలపై దృష్టిసారించాలి. ఆహార రాయితీ, ఆహార యాజమాన్యంలో అధికంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినప్పుడు అందరికీ ఆహార భద్రత ఏర్పడుతుంది. 2014–15లో వ్యవసాయ రంగంలో స్థూల కలిపిన విలువ (జీవీఏ)లో వృద్ధి రుణాత్మకం కాగా, 2016–17లో 6.3 శాతంగా, 2018–19లో 2.9 శాతంగా నమోదైంది. 2014–15 నుంచి 2017–18 మధ్యకాలంలో పంటలు, పశుసంపద, అటవీరంగ వృద్ధిలో ఆటుపోట్లు సంభవించాయి. 2012–13లో మత్స్యరంగంలో వృద్ధి 4.9 శాతం కాగా, ఇది 2017–18లో 11.9 శాతానికి పెరిగింది. వ్యవసాయ కమతాల ప్రక్రియను పరిశీలిస్తే వ్యవసాయ రంగంపై చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఆధారపడటాన్ని గమనించొచ్చు. 2015–16 వ్యవసాయ గణాంకాల ప్రకారం మొత్తం కమతాల్లో ఉపాంతర కమతాలు 68.5 శాతం, చిన్న కమతాలు 17.7 శాతం, పెద్ద కమతాలు 4.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. పౌష్టికాహార ప్రమాణాల్లో భారత్‌ తొలిస్థానం పొందగా, ఆహార భద్రతకు సంబంధించి మొత్తం 113 దేశాల జాబితాలో 76వ స్థానంలో నిలిచింది. ఇలాంటి పరిస్థితి భారత్‌.. ఆహార సప్లయ్‌ యాజమాన్యాన్ని మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకతను స్పష్టంచేస్తోంది.
  • ఆహార ధాన్యాల నిల్వ విషయంలో కనీస మద్దతు ధర, జారీ ధరలను ప్రకటించడం, ఎఫ్‌సీఐ ద్వారా ఆహార ధాన్యాల సేకరణ, రాష్ట్ర ఏజెన్సీల ఆహార ధాన్యాల సేకరణలో వికేంద్రీకరణ, అధిక నిల్వల నిర్వహణ తదితర చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ద్రవ్యోల్బణాన్ని నివారించేందుకు బియ్యం, గోధుమలను బహిరంగ మార్కెట్లో విక్రయించడం వంటి చర్యలు కూడా తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; కేంద్ర పాలిత ప్రాంతాల ఉమ్మడి బాధ్యతల కింద లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ అమలవుతోంది. ఆహార ధాన్యాల సేకరణ, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) గుర్తించిన డిపోలకు ఆహార ధాన్యాలను చేరవేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా ఉంటోంది. ఆహార ధాన్యాల పంపిణీకి అర్హతగల లబ్ధిదారులను గుర్తించడంతో పాటు వారికి రేషన్‌కార్డుల మంజూరు, చౌక ధరల దుకాణాల పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలుగా ఉంటాయి. వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధి 2018–19లో 2.9 శాతంగా నమోదైంది. కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ మూడో ముందస్తు అంచనాల ప్రకారం 2017–18లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 285 మిలియన్‌ టన్నులు కాగా, ఇది 2018–19లో 283.4 మిలియన్‌ టన్నులకు తగ్గింది.

పారిశ్రామిక రంగం :
2017–18లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో వృద్ధి 4.4 శాతం కాగా, ఇది 2018–19లో 3.6 శాతానికి తగ్గింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పరపతి ప్రవాహం తగ్గడం, బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలు అందించే రుణంలో తగ్గుదల వంటివి చోటుచేసుకున్నాయి. వీటితో పాటు కీలక రంగాలైన ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్స్, యంత్రాలు–పరికరాలకు స్వదేశీ డిమాండ్‌ తగ్గుదల, ప్రపంచ చమురు ధరల్లో ఆటుపోట్ల కారణంగా 2018–19లో పారిశ్రామిక రంగ వృద్ధి మందగించింది. తయారీ రంగ వృద్ధిని వేగవంతం చేసేందుకు, మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, సరళీకృత వాణిజ్యం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విధానంలో సంస్కరణలు వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ప్రపంచ బ్యాంకు సరళీకృత వాణిజ్య నివేదిక–2019 ప్రకారం 2018లో మొత్తం 190 దేశాల జాబితాలో భారత్‌ 77వ స్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా అవస్థాపనా రంగంలో భారత్‌ పెట్టుబడులు అధికంగా ఉన్నప్పటికీ అవసరమైన కొన్ని ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులను సేకరించడం ఓ సవాలుగా నిలిచినట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. 2018–19లో తయారీ రంగంలో 6.9 శాతం; విద్యుత్, గ్యాస్, నీటి సరఫరాలో ఏడు శాతం; నిర్మాణ రంగం లో 8.7 శాతం వృద్ధి నమోదైంది.
  • బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్‌ వంటి ఎనిమిది కీలక పరిశ్రమల భారత్వం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 40.3 శాతంగా ఉంది. ఈ సూచీలో ఆయా పరిశ్రమల వృద్ధి 2018–19లో 4.3 శాతంగా నమోదైంది. భారత ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ప్రధానమైనది. 2018, మార్చి 31 నాటికి దేశంలో మొత్తం 339 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా, వీటిలో 2017–18లో 257 సంస్థలు కార్యకలాపాలు సాగించాయి. 184 సంస్థలు లాభాలు గడించాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నికర లాభాల్లో వృద్ధి 2017–18లో 2.29 శాతంగా నమోదైంది. పారిశ్రామిక రంగ స్థూల మూలధన కల్పనలో వృద్ధి 2017–18లో 7.6 శాతంగా ఉంది. పారిశ్రామిక రంగానికి సంబంధించి బ్యాంకింగ్‌ రంగ పరపతిలో వృద్ధి 2018–19లో అధికంగా నమోదైంది. రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, సిమెంటు, సిమెంటు ఉత్పత్తులు, ఇంజనీరింగ్‌ పరిశ్రమలు, నిర్మాణ రంగం, అవస్థాపనా రంగం.. బ్యాంకింగ్‌ రంగం నుంచి అధిక పరపతి పొందాయి.

సేవారంగం :
2017–18లో సేవారంగంలో 8.1 శాతం వృద్ధి నమోదుకాగా, ఇది 2018–19లో 7.5 శాతానికి క్షీణించింది. 2018–19లో 10.6 మిలియన్ల విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించారు. మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్థూల రాష్ట్ర కలిపిన విలువలో సేవారంగ వాటా 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల జీవీఏలో సేవారంగం వాటా ఇటీవల కాలంలో మెరుగైంది.
  • భారత్‌ ఆకర్షించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 60 శాతం సేవారంగానికే లభిస్తోంది. 2017–18తో పోల్చితే 2018–19లో సేవారంగానికి లభించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 1.3 శాతం క్షీణత నమోదైంది. టెలికాం, కన్సల్టెన్సీ సర్వీసులు, వాయు, నౌకా రవాణా రంగాలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం తగ్గడం సేవారంగ ఎఫ్‌డీఐల వృద్ధి క్షీణతకు కారణమైంది.
  • ఐక్యరాజ్య సమితి జాతీయ అకౌంట్స్‌ గణాంకాల ప్రకారం 2017లో సేవారంగ పరిమాణంలో భారత్‌ 9వ స్థానం పొందింది. పర్యాటక రంగం ఆర్థిక వృద్ధికి చోదకశక్తిగా ఉపకరిస్తూ జీడీపీ, విదేశీ మారక ద్రవ్య రాబడి, ఉపాధి పెరుగుదలకు దోహదపడుతోంది. పర్యాటక రంగం ద్వారా 2017–18లో 28.7 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం లభించగా, ఇది 2018–19లో 27.7 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. 2017–18లో భారత ఐటీ–బీపీఎం పరిశ్రమలో 8.4 శాతం వృద్ధి నమోదైంది. ఈ పరిశ్రమ ద్వారా 2017–18లో 167 బిలియన్‌ డాలర్ల రాబడి రాగా, దీన్ని 2018–19లో 181 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఈ పరిశ్రమ ఎగుమతుల విలువ 2017–18లో 126 బిలియన్‌ డాలర్లు కాగా, 2018–19లో 136 బిలియన్‌ డాలర్లుగా అంచనా.

సాంఘిక అవస్థాపన, ఉపాధి, మానవాభివృద్ధి :
  • భారత అభివృద్ధి అజెండాలో సమ్మిళితం ప్రధాన అంశం. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌ నినాదం ద్వారా సమ్మిళితం సాధనకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అల్ప వనరులు ఉన్న భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో సుస్థిరత, సమ్మిళిత వృద్ధి సాధనకు సాంఘిక అవస్థాపనపై అధిక వ్యయం ఉండాలని ఆర్థిక సర్వే సూచించింది. మానవ మూలధనంపై ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెంచాల్సిన అవసరముంది. జనాభాపరమైన ప్రయోజనం, విద్యా ప్రమాణాల మెరుగుదల, యువతలో శిక్షణ, నైపుణ్యం పెరుగుదల, పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత వంటి అంశాలు భారత్‌ భవిష్యత్తు ప్రగతికి దోహదపడగలవని ఆర్థిక సర్వే పేర్కొంది.
  • విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ రంగ పెట్టుబడిలో పెరుగుదలను గమనించొచ్చు. విద్యపై ప్రభుత్వరంగ పెట్టుబడి 2014–15లో జీడీపీలో 2.8 శాతం కాగా, 2018–19లో ఇది 3 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో ఆరోగ్య రంగంపై పెట్టుబడి 1.2 శాతం నుంచి 1.5 శాతానికి పెరిగింది. సాంఘిక భద్రతా పథకాల అమల్లో ప్రగతి మెరుగైనట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రాథమిక విద్య స్థూల నమోదు నిష్పత్తిలో పెరుగుదల ఏర్పడింది. మాధ్యమిక స్థాయిలో డ్రాప్‌ అవుట్‌ రేటు బాలురులో అధికంగా ఉంది. ఆర్థిక కార్యకలాపాలు, విద్యపై శ్రద్ధ లేకపోవడం, ఆర్థికపరమైన అడ్డంకులను దీనికి ప్రధాన కారణాలుగా ఆర్థిక సర్వే పేర్కొంది. సాధారణ స్థాయి ఆధారంగా భారత్‌లో నిరుద్యోగిత రేటు 6.1 శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతం, పట్టణ ప్రాంతాల్లో 7.8 శాతంగా నమోదైంది. పనిచేసే శ్రామికశక్తి 2011–12లో 38.6 శాతం నుంచి 2017–18లో 34.7 శాతానికి తగ్గింది. ఇటీవలి శాంపుల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌–2016 నివేదిక ప్రకారం ప్రతి వెయ్యి జననాలకు శిశు మరణాల రేటు 34 కాగా, అయిదేళ్ల లోపు మరణాల రేటు 39గా ఉంది.
  • 2014 తర్వాత 1,90,000 కి.మీ. గ్రామీణ రహదారుల నిర్మాణం జరిగింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం కింద 2014–15లో 166.2 కోట్ల పని దినాలు కల్పించగా, ఈ మొత్తం 2018–19లో 267.9 కోట్లకు పెరిగింది.
  • సుస్థిరాభివృద్ధికి అనుసంధానత పెంపు, గృహ వసతి కల్పన, సాంఘిక–ఆర్థిక సూచికల్లో లింగ అసమానత తగ్గింపునకు ప్రాధాన్యం అవసరమని ఆర్థిక సర్వే పేర్కొంది. మానవ మూలధనం, సమ్మిళిత వృద్ధిపై పెట్టుబడుల ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు భారత్‌ ప్రయత్నించాలి.

                                                                   డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్.

Published date : 16 Jul 2019 05:27PM

Photo Stories