Skip to main content

ఆసియా, పసిఫిక్ సామాజిక-ఆర్థిక సర్వే 2016

డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్
సుస్థిర అభివృద్ధే ధ్యేయంగా రూపొందించిన 2030 ఎజెండా విజయవంతం కావాలంటే సమ్మిళిత, సుస్థిర ఆర్థిక వృద్ధి సాధన ఆవశ్యకమని ఆసియా, పసిఫిక్ ఆర్థిక సర్వే -2016 పేర్కొంది. ప్రపంచంలో అధిక జనాభా కలిగిన ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో సుస్థిర ఆర్థిక వృద్ధి సాధన ద్వారా మాత్రమే అడిస్ అబాబా యాక్షన్ ఎజెండా (డెవలప్‌మెంట్, ఫైనాన్సింగ్), వాతావరణ మార్పుకు సంబంధించిన పారిస్ ఒప్పందం, ఇతర నూతన ప్రపంచ ఒప్పందాలు విజయవంతమవుతాయని సర్వే స్పష్టం చేసింది.

సుస్థిరవృద్ధి సాధనకు తోడ్పడే దిశగా ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో ఉత్పాదకత, ఆర్థికవృద్ధి రేటును పెంచాల్సిన ఆవశ్యకతను ఐక్యరాజ్య సమితి.. ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సామాజిక కమిషన్ (ఈఎస్‌సీఏపీ) సామాజిక, ఆర్థిక సర్వే పేర్కొంది. చైనా ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చిత వాతావరణం, ఈ ప్రాంతంలోని ఇతర ముఖ్య ఆర్థిక వ్యవస్థల్లో వినియోగం, పెట్టుబడులు బలహీనపడటం, వినిమయ రేటులో ఒడిదొడుకులు, ప్రైవేటు, కార్పొరేట్ రంగాల రుణ భారం పెరగడం, అమెరికాలో వడ్డీరేటు పెరుగుదల వంటి కారణాల వల్ల ఆసియా, పసిఫిక్ ప్రాంత వృద్ధిరేటు 2016లో 4.8 శాతంగా, 2017లో 5 శాతంగా ఉండనుందని సర్వే పేర్కొంది.

2016-2030 కాలంలో వ్యవసాయ ఉత్పాదకతలో పెరుగుదల నమోదవనుంది. ఆ కారణంగా అదనంగా 110 మిలియన్ల ప్రజలు పేదరికం నుంచి విముక్తులవుతారని నివేదిక తెలిపింది. సుస్థిర వృద్ధి, ఉత్పాదకత, తూర్పు, ఈశాన్య ఆసియాలో విత్త సుస్థిరత, దక్షిణ, నైరుతి ఆసియాలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం పెంపు, ఆగ్నేయాసియాలో పన్ను విధానాన్ని మెరుగుపర్చడం వంటి అంశాలను సర్వే ప్రస్తావించింది.

మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరగడం, వేగవంతమైన పట్టణీకరణ వల్ల సుస్థిర వృద్ధి సాధనలో ఆసియా - పసిఫిక్ ప్రాంతం అనేక సవాళ్లను ఎదుర్కోనుంది. స్వదేశీ, ప్రాంతీయ డిమాండ్ పెంపునకు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని దేశాలు పటిష్టమైన చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని సర్వే తెలిపింది.

ఉత్పాదకత పెంపు - చర్యలు
అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎగుమతుల ప్రోత్సాహంతో కూడిన అభివృద్ధి నమూనా నుంచి స్వదేశీ, ప్రాంతీయ డిమాండ్ పెంపు కోసం అభివృద్ధి చెందిన దేశాలు అవలంబిస్తోన్న అభివృద్ధి నమూనాను అలవర్చుకోవాలని సర్వే సూచించింది. ప్రస్తుతం వాణిజ్య ప్రవాహాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో స్వదేశీ, ప్రాంతీయ డిమాండ్ ప్రాధాన్యత పొందింది. స్వదేశీ డిమాండ్‌ను పటిష్టం చేయాలంటే సుస్థిర ఉత్పాదక వృద్ధితోపాటు అధిక వేతనాలను అందించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధిలో వ్యత్యాసాలను తగ్గించడానికి సమ్మిళిత వృద్ధి సాధన, వృద్ధి కొనసాగింపు అవసరం. సంక్షోభానికి ముందు కాలం (2005-2007)లో ఈ ప్రాంతంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు వృద్ధి 9.4 శాతం కాగా, అది 2015 నాటికి 4.6 శాతానికి క్షీణించింది. దీంతో పాటు ఉత్పాదకత వృద్ధిలో తగ్గుదలను సర్వే ప్రస్తావించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల మొత్తం కారకాల ఉత్పాదకత సగటు 2000-2007లో 2.8 శాతం కాగా, 2008-2014 నాటికి 1 శాతానికి తగ్గింది. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోని మొత్తం కారకాల ఉత్పాదకత సగటు కంటే ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు ఎక్కువ. అయినప్పటికీ ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని శ్రామిక ఉత్పాదకతలో తగ్గుదల కనిపిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యం సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి ముఖ్య ఆధారంగా ఉండగలదని, తద్వారా ఉత్పాదకత ధనాత్మకంగా ఉండనుందని సర్వే తెలిపింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి ముఖ్య మార్గంగా ఉండటంతో పాటు స్థానిక, విదేశీ సంస్థల మధ్య అనుసంధానం (లింకేజీ) ఏర్పడి ఉత్పాదకత వృద్ధి పెరుగుదలకు తోడ్పడనున్నాయి. అవస్థాపనా సౌకర్యాల లభ్యత కూడా సుస్థిర ఉత్పాదకత వృద్ధికి దోహదపడనుంది. పబ్లిక్ అవస్థాపనా సౌకర్యాలను ఉత్పాదకత పెంపునకు ముఖ్య ఆధారాలుగా సర్వే పేర్కొంది. దీంట్లో భాగంగా రవాణా, శక్తి, సాంఘిక అవస్థాపనలైన విద్య (పాఠశాలలు, యూనివర్సిటీలు), ఆరోగ్యం (హాస్పిటల్స్, ఆరోగ్య సేవలు) వంటి సౌకర్యాల కల్పనను ప్రభుత్వ రంగం చేపట్టాలి. శ్రామికుల నైపుణ్యం ఉత్పాదకత వృద్ధికి దారితీస్తుంది. విద్యారంగంలో నాణ్యత పెంపుపై ఈ ప్రాంతంలోని దేశాలు దృష్టి సారించాలి.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో విద్యకు సంబంధించి వివిధ స్థాయిల్లో విద్యార్థుల నమోదు నిష్పత్తి పెరిగింది. కానీ, నాణ్యతతో కూడిన విద్యను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రభుత్వ చర్యలు మాత్రమే ఉత్పాదకత వృద్ధిని వేగవంతం చేయగలవు. వృత్తివిద్యను అందించే ఇన్‌స్టిట్యూట్‌లను పటిష్టం చేయడం, టీచింగ్ కరిక్యులంలో సంస్కరణలను చేపట్టి దాన్ని ప్రస్తుత వాతావరణానికి అనుగుణంగా రూపొందించాలి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని అధిక దేశాలు ఒక రంగంలోని మిగులు శ్రామికులను ఇతర రంగాల్లోకి బదిలీ చేయడంలో విఫలమయ్యాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని స్థూలదేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగానికి సంబంధించి కలిపిన విలువ 1990లో 19.1 శాతం కాగా 2013లో 9.9 శాతానికి తగ్గింది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత తగ్గి సేవారంగ అభివృద్ధికి ప్రాధాన్యత పెరిగింది. ఫలితంగా తయారీ రంగంలో వృద్ధి తగ్గింది. అభివృద్ధిని వేగవంతం చేయాలంటే ఆయా దేశాలు ప్రారంభంలోనే సేవారంగ ఆర్థిక వ్యవస్థలుగా రూపుదిద్దుకోవాలనుకోవడం అంత ఉపయుక్తం కాదని సర్వే పేర్కొంది.

అధిక వయోవర్గ జనాభా
తూర్పు, ఈశాన్య ఆసియాలో అధిక వయోవర్గ జనాభా పెరుగుదలను సర్వే ప్రస్తావించింది. మొత్తం ప్రపంచ జనాభాలో ఉప ప్రాంత ఉమ్మడి జనాభా 22 శాతం కాగా, ప్రపంచంలో 65 సంవత్సరాలు, అంత కంటే ఎక్కువ వయసు కలిగిన మొత్తం జనాభాలో ఈ ఉపప్రాంతం వాటా 29 శాతం. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా 65 సంవత్సరాలు, పైబడిన మొత్తం జనాభాలో ఉప ప్రాంత వాటా 31 శాతంగా ఉండొచ్చని అంచనా. జపాన్‌లో జనాభా సంఖ్యలో తగ్గుదల ఉండగా, మరోవైపు 65 సంవత్సరాలు పైబడిన జనాభా సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో శాతాల పరంగా వివిధ వయోవర్గ జనాభాను పరిశీలించినప్పుడు జపాన్ మొత్తం జనాభాలో 65 సంవత్సరాలు, పైబడిన జనాభా శాతం ప్రపంచంలోనే ఎక్కువ. చైనాలోనూ అధిక వయోవర్గ జనాభాలో పెరుగుదల కనిపిస్తుంది. 2000 సంవత్సరంలో చైనా మొత్తం జనాభాలో 65 సంవత్సరాలు, పైబడిన జనాభా వాటా 6.7 శాతం కాగా, 2020 నాటికి 12.1 శాతానికి, 2050 నాటికి 27.6 శాతానికి పెరుగుతుందని అంచనా. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ఈ ఉప ప్రాంతంలో నికర వలసల స్థాయి కూడా తక్కువగా ఉంది. సజాతీయత, National Identityకి ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. 1995లో స్థాయికి తగినట్లుగా ‘పనిలో పాల్గొనే వయోవర్గ జనాభాను’ నిర్వహించాలంటే 2050 వరకు జపాన్ సంవత్సరానికి ఆరు లక్షల మంది ఇమ్మిగ్రెంట్స్‌ను అనుమతించాలి.

వ్యయం వైపు పరిశీలిస్తే అధిక వయోవర్గ జనాభా పెరుగుతున్న కారణంగా దేశాలు వృద్ధాప్య ఫించను పథకాలు, ఆరోగ్య సంరక్షణ సేవలను అమలు చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరిగింది. ఆయా పథకాల అమలు నిమిత్తం వయో సంబంధిత ప్రభుత్వ వ్యయం చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో అధికంగా ఉండనుందని సర్వే పేర్కొంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో వయో-సంబంధిత ప్రభుత్వ వ్యయం 2050 నాటికి జీడీపీలో 30 శాతంగా ఉండొచ్చు.

వివిధ దేశాలు- సంస్కరణలు
భవిష్యత్తులో జనాభాపరమైన మార్పులకు సంబంధించిన అంచనాలు, వయో-సంబంధిత వ్యయంలో పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ఉపప్రాంత ఆర్థిక వ్యవస్థలు అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాయి. ఆయా దేశాలు..ప్రభుత్వ రుణాన్ని నిర్వహించగలిగే స్థాయిలో ఉంచుతూ అధిక వయోవర్గ జనాభా శ్రేయస్సు కోసం అనేక పథకాలను అమలుచేస్తున్నాయి. 2015లో చైనా వన్‌చైల్డ్ విధానాన్ని రద్దు చేయడంతోపాటు డ్యూయల్-ట్రాక్ పట్టణ పెన్షన్ పథకాన్ని తొలగించింది. గతంలో డ్యూయల్ ట్రాక్ పట్టణ పెన్షన్ పథకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగస్థులకు పెన్షన్ కంట్రిబ్యూషన్‌ను మినహాయించేవారు. ప్రస్తుతం చైనా ఆయా విధానాలను రద్దు చేసింది. జపాన్ ఎంప్లాయీస్ బీమాను తాత్కాలిక ఉద్యోగస్థులకు కూడా వర్తింపజేయడంతో పాటు జాతీయ పెన్షన్ పొందేందుకు అర్హతను 25 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు తగ్గించింది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఐదుగురు లేదా అంతకంటే తక్కువ శ్రామికులు ఉన్న సంస్థలకు Severance Pay Plansను తప్పనిసరి చేసింది. దీంతో పాటు శిశువు జన్మించిన వెంటనే అధిక మొత్తాన్ని గ్రాంటు ఇస్తుంది. సాంఘిక భద్రతా పథకం కింద అందించే ఈ మొత్తాన్ని సులభంగా తీసుకోవడానికి ఎలక్ట్రానిక్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. పన్నుల సంస్కరణల ద్వారా విత్త సుస్థిరత సాధనకు తూర్పు, ఈశాన్య ఆసియా దేశాలు ప్రయత్నించాలని సర్వే పేర్కొంది. చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ప్రస్తుతం జీడీపీ -పన్ను నిష్పత్తి తక్కువగా ఉన్నందువల్ల పన్నులు పెంచడానికి ఆయా దేశాలకు అవకాశం ఉందని సర్వే తెలిపింది.

భారత్- సర్వేలోని అంశాలు
2014లో 7.3 శాతం, 2015లో 7.6 శాతం మేర వృద్ధి సాధించిన భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా సర్వే పేర్కొంది. ప్రైవేటు వినియోగ వృద్ధి పెరుగుదల భారత్ అధికవృద్ధికి ముఖ్య కారణమని సర్వే తెలిపింది. సేవా కార్యకలాపాలైన వాణిజ్యం, ఫైనాన్‌‌స, రవాణా, సమాచారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో ప్రైవేటు వినియోగ వ్యయం పెరిగింది. పటిష్టమైన కుటుంబ వినియోగం Broad-basedగా ఉండకపోవడానికి గ్రామీణ వేతన వృద్ధిరేటు మందగమనం, వ్యవసాయ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడాన్ని కారణాలుగా పేర్కొంది. దీని వల్లే గ్రామీణ డిమాండ్ తగ్గిందని తెలిపింది. నిర్మాణంలో ఉన్న పెద్ద తరహా అవస్థాపనా ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం, ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల్లో విశ్వాసం కొంతమేర సన్నగిల్లిన కారణంగా స్థిర పెట్టుబడి వృద్ధి తగ్గింది. 2015లో భారత్ కరెంట్ అకౌంట్ లోటును జీడీపీలో 1 శాతంగా సర్వే వెల్లడించింది. ఆహార ధరలు కొన్ని నెలల్లో అధికంగా ఉన్నప్పటికీ వినియోగ ద్రవ్యోల్బణం 2014లో 6.7 శాతం, 2015లో ఐదు శాతంగా నమోదైంది. ప్రపంచ వస్తు ధరల తగ్గుదల, ధరల నియంత్రణ, నిల్వలపై ప్రభుత్వ చర్యలు, ఇంధన ధరలు తక్కువగా ఉండటం వంటి అంశాలు అల్ప ద్రవ్యోల్బణానికి కారణమయ్యాయి. అల్ప ద్రవ్యోల్బణం నేపథ్యంలో రిజర్‌‌వబ్యాంక్ ఆఫ్ ఇండియా 2015లో విధాన రేట్లను 125 బేసిస్ పాయింట్లు తగ్గించింది. భారత్ ప్రస్తుత ఆర్థిక వాతావరణం నేపథ్యంలో 2016లో 7.6 శాతం, 2017లో 7.8 శాతం వృద్ధిని సాధించగలదని సర్వే పేర్కొంది. స్థిర ఉపాధి వృద్ధి, సాపేక్షంగా అల్ప ద్రవ్యోల్బణం ఉన్న పరిస్థితుల్లో పట్టణ వినియోగ వ్యయంలో పెరుగుదల ఆర్థికవృద్ధిని పెంపొందించగలదు. రుణ వ్యయం తక్కువగా ఉండటం, స్నేహ పూర్వక వాణిజ్య వాతావరణం.. స్థిర పెట్టుబడి పెంపునకు దారితీస్తుంది. నిర్మాణాత్మక సంస్కరణల అమల్లో పురోగతి, పెద్ద తరహా అవస్థాపనా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి తీసుకునే చర్యలు స్వదేశీ డిమాండ్ పెంపునకు దోహదం చేస్తాయి. విత్త విధానంలో సంస్కరణల విషయంలో భారత్ పురోగతిని సర్వే పేర్కొంది. పారిశుద్ధ్య సౌకర్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో పన్ను పరిధిలోకి వచ్చే అన్ని విధాలైన సేవలపై ప్రభుత్వం 0.5 శాతం సెస్‌ను విధించింది. వంద స్మార్‌‌ట సిటీస్ మిషన్ కింద సుస్థిర నగరాలను అభివృద్ధిపర్చేందుకు ప్రాధాన్యమిచ్చింది. సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యాన్ని సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సమ్మిళిత, సుస్థిర వృద్ధిని సాధించే దిశగా ప్రభుత్వం సూక్ష్మ, మధ్య తరహా సంస్థల అభివృద్ధి కోసం 'Micro units Development and Refinance Agency Bank loan Scheme' కింద పరపతి మొత్తాన్ని పెంచింది. సమ్మిళిత వృద్ధిలో భాగంగా 250 మిలియన్ ప్రజలు జన్‌ధన్ యోజన కార్యక్రమం కింద ఆధునిక బ్యాంకింగ్ సేవలను పొందగలుగుతున్నారు. Skill India Initiative కార్యక్రమంలో భాగంగా నైపుణ్యత గల శ్రామిక శక్తిని పెంపొందించడం, స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా భారత్‌ను తయారీ రంగ ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సర్వే ప్రశంసించింది.
Published date : 14 Jun 2016 12:20PM

Photo Stories