Skip to main content

‘ఆర్థికం’ లో విజయానికి...

డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్.
మైనింగ్ రంగం :
భారత ఆర్థికవ్యవస్థలో మైనింగ్ ప్రధాన రంగం. స్వాతంత్య్రానంతరం ఖనిజాల ఉత్పత్తి, విలువ విషయంలో గణనీయమైన పురోగతి ఏర్పడింది. భారత్ మొత్తం 95 ఖనిజాలను ఉత్పత్తి చేస్తోంది. వీటిలో 4 ఇంధనం, 10 లోహ, 23 అలోహ, 3 అణు, 55 మైనర్ లోహాలు. 2017-18లో మొత్తం ఖనిజాల ఉత్పత్తి విలువ (అణు, ఇంధన ఖనిజాలు మినహా) రూ. 1,13,541 కోట్లు. 2016-17తో పోల్చితే ఉత్పత్తి విలువలో పెరుగుదల 13 శాతంగా నమోదైంది. గనుల మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక 2017-18 ప్రకారం బొగ్గు, లిగ్నైట్ ఉత్పత్తిలో మూడో స్థానం.. క్రూడ్ పెట్రోలియం ఉత్పత్తిలో 23వ స్థానం... బాక్సైట్, క్రోమైట్, ఇనుప ధాతువు ఉత్పత్తిలో నాలుగో స్థానం... అల్యూమినియం, జింక్ ఉత్పత్తిలో 5వ స్థానం.. మాంగనీస్ ముడి ఖనిజం ఉత్పత్తిలో ఆరో స్థానం.. కాపర్(శుద్ధి చేసిన)ఉత్పత్తిలో ఏడో స్థానం.. ఉక్కు (క్రూడ్/లిక్విడ్) ఉత్పత్తిలో మూడో స్థానం.. మాగ్నసైట్ ఉత్పత్తిలో 11వ స్థానం... లెడ్ ఉత్పత్తిలో 17వ స్థానాన్ని భారత్ సొంతం చేసుకుంది.
  • 2016-17తో పోల్చినప్పుడు 2017-18లో ఖనిజాల ఉత్పత్తిలో పెరుగుదల వరుసగా... కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గోవా, ఒడిషా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్‌లలో నమోదైంది. కాగా తగ్గుదల వరుసగా... మేఘాలయ, జార్ఖండ్, అసోం, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నమోదైంది. మైనర్ ఖనిజాల ఉత్పత్తి విలువ 2016-17లో రూ.52,810 కోట్లు. వీటి ఉత్పత్తిలో వాటాల పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానాన్ని.. రాజస్థాన్, తెలంగాణ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు పొందాయి.

జాతీయ తయారీ రంగ విధానం :
స్థూలంగా భారత ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజించడం జరిగింది. ప్రాథమిక రంగంలో... వ్యవసాయం, పశుసంపద, అడవులు, మత్స్యసంపద, గనులు-క్వారీయింగ్ ఉపరంగాలు. అలాగే ద్వితీయ రంగంలో.. తయారీ ముఖ్య కార్యకలాపం. తృతీయ రంగాన్ని సేవా రంగంగా పరిగణిస్తాం. పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్’ 2011, నవంబర్ 4న జాతీయ తయారీ విధానాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలో చైనా తయారీ రంగానికి ముఖ్య కేంద్రంగా నిలిచింది. చైనా జీడీపీలో తయారీ రంగ వాటా సుమారు 34 శాతం. కాగా ప్రస్తుతం భారత జీడీపీలో తయారీ రంగ వాటా సుమారు 16 శాతం.

ముఖ్యాంశాలు..
  1. జాతీయ తయారీ రంగం ముఖ్య లక్ష్యం... 2022 నాటికి దేశ జీడీపీలో తయారీ రంగ వాటాను 25 శాతానికి పెంచడంతోపాటు వంద మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం.
  2. రాష్ట్రాల భాగస్వామ్యంతో పారిశ్రామిక రంగ వృద్ధిని వేగవంతం చేయాలనే అంశంపై జాతీయ తయారీ రంగ విధానం ఆధారపడి ఉంది. విధానాల రూపకల్పనతోపాటు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య నమూనాలో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది.
  3. గ్రామీణ యువతలో ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వీలుగా.. వారిలో నైపుణ్యత మెరుగుపరచడానికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. భారత జనాభాలో 60 శాతానికిపైగా పనిచేసే వయో వర్గంలో ఉన్నారు.
  4. భారత సమగ్ర అభివృద్ధికి జాతీయ తయారీ రంగ విధానం అనువైన వాతావరణం కల్పిస్తుంది.
  5. జాతీయ పెట్టుబడి, తయారీ జోన్ల ఏర్పాటు (ఎన్‌ఐఎంజెడ్).. జాతీయ తయారీ రంగ విధానంలో భాగంగా ఉంటుంది.
  6. ఇప్పటివరకు 14 ఎన్‌ఐఎంజెడ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
  7. చిన్న, మధ్య తరహా సంస్థలకు ప్రోత్సాహకాలు... యువ శ్రామిక శక్తికి శిక్షణ.. వ్యాపార నియంత్రణల సడలింపు.. గ్రీన్ టెక్నాలజీతోపాటు సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి ఆర్థిక, సంస్థాగత యంత్రాంగం ఏర్పాటు వంటివి జాతీయ తయారీ రంగ విధానంలో ముఖ్యాంశాలు!

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన :
భారత ప్రభుత్వం 2016, జనవరిలో నూతన వ్యవసాయ బీమా పథకం..‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’నను ప్రకటించింది. జాతీయ వ్యవసాయ బీమా పథకం(1999), సవరించిన(మోడిఫైడ్) జాతీయ వ్యవసాయ బీమా పథకం (2010-11) స్థానంలో.. ఈ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ కొత్త పథకాన్ని ప్రైవేట్ రంగంతోపాటు ప్రభుత్వ రంగంలోని వ్యవసాయ బీమా కంపెనీలు అమలుచేస్తాయి. 2016-17లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మొత్తం పంట విస్తీర్ణంలో 30 శాతం అమలుకాగా.. 2018-19 నాటికి దాన్ని 50 శాతానికి విస్తరించాలన్నది లక్ష్యం.

ముఖ్యాంశాలు..
  1. అన్ని ఖరీఫ్ పంటలకు రెండు శాతం, రబీ పంటలకు 1.5 శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లిస్తారు.
  2. వాణిజ్య పంటలు, తోట పంటల విషయంలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం 5 శాతం.
  3. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం తక్కువ. మిగతా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం సంభవించినప్పుడు బీమా మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారు.
  4. ప్రభుత్వ సబ్సిడీకి గరిష్ట పరిమితి లేదు. బ్యాలెన్స్ ప్రీమియం 90 శాతం ఉన్నప్పటికీ ఈ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది.
  5. ప్రత్యక్షంగా 25 శాతం క్లెయిమ్‌ను రైతుల ఖాతాలో జమ చేస్తారు. రాష్ట్రం మొత్తానికి ఒక బీమా కంపెనీ క్షేత్రస్థాయిలో నష్టానికి సంబంధించిన అంచనాను రూపొందిస్తుంది.
  6. సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని ఈ పథకం కింద ప్రోత్సహిస్తారు. రైతులకు క్లెయిమ్‌ల చెల్లింపులో జాప్యాన్ని తగ్గించడానికి, పంటకోత గణాంకాలను నమోదు చేయడానికి స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తారు.

జనాభా వృద్ధి :
ప్రపంచంలో జనాభా పరంగా చైనా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. ప్రపంచ మొత్తం విస్తీర్ణంలో భారత్ వాటా 2.4 శాతం కాగా... ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.5 శాతంగా ఉంది. 2011లో భారత జనాభా 121.09 కోట్లు. ఇది అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్‌ల మొత్తం జనాభాకు సమానం. భారత్‌లో పెరుగుతున్న జనాభా భూమిపై ఒత్తిడి పెంచుతోంది. 1901 మొదలు 110 ఏళ్ల కాలంలో... భారత్ జనాభా 97 కోట్లు పెరిగింది. సగటు సాంవత్సరిక జనాభా వృద్ధి రేటు 1981 గణాంకాల ప్రకారం 2.22 శాతం కాగా 2011 గణాంకాల ప్రకారం అది 1.64 శాతం. దేశంలో జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటరుకు 1901లో 77గా ఉండగా.. అది 2011లో 382. ప్రస్తుతం భారత్ జనాభా పరిణామ సిద్ధాంతం రెండో దశలో ఉంది. అయితే ఇటీవల కాలంలో జనాభా వృద్ధిరేటులో తగ్గుదల కారణంగా త్వరలో జనాభా పరిణామ సిద్ధాంతం మూడోదశలోకి ప్రవేశిస్తుందని అంచనా. భారత్‌లో జనాభా పెరుగుదలకు అధిక జననరేటు, అల్ప మరణ రేటుతోపాటు వలసలను కారణంగా పేర్కొనవచ్చు. భారత్‌లో జనాభా విస్ఫోటనానికి అధిక జనన రేటు, అల్ప మరణ రేటును ముఖ్య కారణాలుగా పేర్కొనవచ్చు.
  • దేశంలో అధిక జనన రేటుకు.. ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ముఖ్య కార్యకలాపంగా ఉండటం.. వ్యాధి నిరోధక శక్తిని కలిగించే ప్రక్రియ(ఇమ్యునైజేషన్) నెమ్మదిగా సాగడం.. పేదరిక తీవ్రత ఆర్థిక కారకాలుగా చెప్పొచ్చు. కాగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, వివాహ వయసు తక్కువగా ఉండటం, విద్యా ప్రమాణాల లభ్యత తక్కువగా ఉండటం, మతపరమైన ఆచారాలను సాంఘిక కారకాలుగా పేర్కొనవచ్చు.
  • భారత్‌లో మరణ రేటు తగ్గుదలకు.. కలరా, మశూచి, మలేరియా, కుష్టు వ్యాధి వంటి రోగాలు తగ్గుముఖం పట్టడం.. సురక్షితమైన తాగు నీటి లభ్యత.. మెరుగైన పారిశుధ్యం.. విద్యాసౌకర్యాలు అందుబాటులోకి వచ్చి అక్షరాస్యత పెరగడం.. మెరుగైన వైద్య సౌకర్యాలు వంటివి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.
  • గత ఆరున్నర దశాబ్దాల కాలంలో అఖిల భారత స్థాయిలో జననాల రేటు కొంత తగ్గింది. కేరళ, తమిళనాడు, గోవాలలో జననాల రేటులో అధిక తగ్గుదల నమోదైంది.

ముద్రా బ్యాంకు :
సూక్ష్మ సంస్థలు నిధుల కోసం స్థానిక వడ్డీ వ్యాపారులపై అధికంగా ఆధారపడుతుంటాయి. భారత ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ సంస్థలు కీలకమైనవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్‌లో.. ‘మైక్రో యూనిట్స్ డవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ బ్యాంక్(ముద్రా బ్యాంక్)ను ఏర్పాటుచేసింది. భారత ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలో పెద్ద పరిశ్రమలు 1.25 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుండగా.. సూక్ష్మ సంస్థల్లో 12 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. సూక్ష్మ సంస్థల యూనిట్ల యజమానులు సుమారు 5.7 కోట్ల మంది రూ.11 లక్షల కోట్ల నిధులు వినియోగించుకుంటున్నారు. ముద్రా బ్యాంకు నమూనా ప్రకారం సూక్ష్మ యూనిట్లు రీఫైనాన్స్ మార్గం ద్వారా రూ.10 లక్షల రుణాన్ని పొందుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా బ్యాంకుల ద్వారా సూక్ష్మ యూనిట్లు రుణాన్ని పొందుతాయి. మూడు విధాలైన పరపతిని సూక్ష్మ యూనిట్లు పొందుతాయి. శిశు పథకం కింద రూ.50,000 రుణాన్ని; కిశోర్ పథకం కింద రూ.50,000 నుంచి రూ.5 లక్షల రుణాన్ని; తరుణ్ పథకం కింద రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు సూక్ష్మ యూనిట్లు రుణం పొందొచ్చు. పండ్లు, కూరగాయల వర్తకులు ఈ పథకానికి అర్హులు. అయితే వ్యవసాయ రంగానికి ఈ పథకం ద్వారా రుణం లభించదు. ఈ పథకం కింద ఏ విధమైన స్థిర వడ్డీరేటు ఉండదు. ప్రస్తుతం బ్యాంకులు ఈ పథకం ద్వారా ఇచ్చే రుణాలపై ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. నష్ట భయం అధికంగా ఉండే సంస్థలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది.
Published date : 01 Feb 2019 03:57PM

Photo Stories