Skip to main content

ఆర్థిక సంఘం విధి విధానాలు

డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్.
రాజ్యాంగంలోని 280(1) ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి 2020-25 కాలానికి రెవెన్యూ శాఖ మాజీ కార్యదర్శి ఎన్.కె.సింగ్ అధ్యక్షతన 15వ ఆర్థిక సంఘాన్ని నియమించారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాబడి పంపిణీకి సంబంధించిన సిఫారసులు చేస్తుంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులు 2020, ఏప్రిల్ 1 నుంచి 2025, మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.

14వ ఆర్థిక సంఘం నికర పన్ను రాబడిలో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. ఈ నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాల వాటాను సమీక్షించి తద్వారా కేంద్ర ప్రభుత్వ విత్త సామర్థ్యంపై ప్రభావాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. పన్ను పంపిణీ సూత్రం, గ్రాంట్-ఇన్ ఎయిడ్‌లకు సంబంధించిన సిఫారసులతోపాటు 15వ ఆర్థిక సంఘానికి కింది అంశాలు పరిశీలకాంశాలుగా ఉంటాయి.
పన్ను పంపిణీ సూత్రంలో 2011 జనాభా గణాంకాలను వినియోగించడం (జనాభా కీలక ప్రాతిపదికగా ఉంటుంది).
రెవెన్యూ లోటు, గ్రాంట్ల ఆవశ్యకతను సమీక్షించడం.
14 ఆర్థిక సంఘం నికర పన్ను రాబడిలో రాష్ట్రాల వాటా పెంపును సమీక్షించడం.
రాష్ట్రాలకు ప్రగతి ఆధారిత ప్రోత్సాహకాలను కింది అంశాల ఆధారంగా నిర్ణయించడం.
1. జీఎస్‌టీ అమల్లో భాగంగా ట్యాక్స్ నెట్‌కు సంబంధించి రాష్ట్రాల కృషి.
2. భారత ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలు.
3. డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించడం.
4. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.
5. పారిశుద్ధ్యం, ఘన వ్యర్థ్యాల నిర్వహణ.

2011 గణాంకాలు
కేంద్ర పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటాను నిర్ణయించడంలో జనాభా కీలకాంశంగా ఉంది. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్రాల వాటాను ప్రభావితం చేస్తుంది. 14 ఆర్థిక సంఘం 1971 జనాభా ప్రాతిపదికన కేంద్ర మొత్తం పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటాకు సంబంధించి 17.5 శాతం వెయిట్ ఇచ్చింది. పరోక్షంగా 1971 జనాభా గణాంకాల ఆధారంగా ఆదాయ వ్యత్యాసానికి 50 శాతం వెయిట్ ఇచ్చింది.

15వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీలో 2011 జనాభా గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే.. జనాభా నియంత్రణపై దృష్టిసారించిన రాష్ట్రాలకు కేంద్ర పన్నుల రాబడిలో లభించే వాటాలు తగ్గుతాయి. బాలికల్లో విద్యా ప్రమాణాల పెంపులో విఫలమైన బీఐఎంఏఆర్‌యూ రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలకు ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం తగ్గుతాయి.

2011 జనాభా ప్రాతిపదికన నిధుల పంపిణీ జరిగితే.. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అధిక ప్రయోజనం పొందుతాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.24,340 కోట్లు, తమిళనాడుకు రూ.22,497 కోట్లు, కేరళకు రూ.20,285 కోట్లు, కర్ణాటకకు రూ.8,373 కోట్లు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2011 జనాభా ప్రాతిపదికన కేంద్ర పన్నుల రాబడిని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలనుకునే పద్ధతినే పార్లమెంటు సభ్యుల సంఖ్యలో అమలుచేస్తే ఉత్తరాది, దక్షిణాది మధ్య రాజకీయ సమతుల్యం దెబ్బతింటుంది. ఇదే జరిగితే పార్లమెంటులో, రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గుతుంది.

ఈశాన్య రాష్ట్రాలు, బిహార్, జమ్ముకశ్మీర్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల మొత్తం రాబడిలో కేంద్ర ప్రభుత్వ ద్వారా వచ్చేది 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం రాబడిలో కేంద్రం నుంచి లభించిన రాబడి వాటా 50.07 శాతం. తెలంగాణ రాష్ట్ర మొత్తం రాబడిలో కేంద్రం నుంచి లభించిన రాబడి 32.66 శాతం.

దక్షిణాది వ్యతిరేకత
కేంద్ర నిధులను రాష్ట్రాలకు పంపిణీ చేసే అంశంలో (జనాభా వెయిటేజీని నిర్ణయించడంలో) 1971 జనాభా గణాంకాల స్థానంలో 2011 గణాంకాలను పరిగణనలోకి తీసుకోవాలనే ప్రతిపాదనను దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉమ్మడి పోరాటానికి సిద్ధం కావాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 10న కేరళ ఆర్థిక మంత్రి దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు.

14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్ను రాబడిలో 42 శాతాన్ని రాష్ట్రాల వాటాగా సిఫారసు చేసినప్పటికీ.. రాష్ట్రాల సాంఘిక రంగ వ్యయం (విద్య, ఆరోగ్యం) తగ్గడాన్ని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.

రాష్ట్రాలు కేంద్ర పన్ను రాబడిలో అధిక వాటాను కోరుతూ.. మరోవైపు సాంఘిక రంగంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఆశిస్తున్నాయి. ఈ ధోరణి కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు వ్యయ నాణ్యత, వృద్ధి క్షీణతకు దారితీస్తుంది.

Published date : 03 May 2018 12:09PM

Photo Stories