Inspiring Story: ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న తండ్రికూతుళ్లు స్టోరీ..
సినిమా డైలాగ్ ప్రకారం విజయం ఎవడబ్బ సొత్తు కాదు. కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే చాలు.. విజయం మన సొంతం అవుతుంది. ఈ మాటలు నిజం చేసి చూపారు ఆర్య రాజగోపాల్ అనే యువతి. పెట్రోల్ బంక్‌లో పని చేసే ఓ ఉద్యోగి కుమార్తె అయిన ఆర్య.. ఇప్పుడు ఐఐటీ కాన్పూర్‌లో పీజీ అడ్మిషన్ సాధించారు.
ఇక్కడో ఆసక్తికర అంశం ఉంది. ఏంటంటే ఆర్య తండ్రి పెట్రోల్ బంక్‌లో సాధారణ ఉద్యోగి అని చెప్పుకున్నాం కాదా. ఇప్పుడు ఆర్య పీజీ అడ్మిషన్ పొందిన కోర్సు పెట్రోలియమ్ ఇంజనీరింగ్ కావడం విశేషం. ఆర్య కథ కేవలం ఆమె చదవులో చూపిన ప్రతిభ గురించి మాత్రమే కాదు.. ఆమె పట్టుదల, సంకల్పం గురించి కూడా. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోన్న ఈ స్ఫూర్తిదాయక కథనం వివరాలు ఇలా ఉన్నాయి..
ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే...
కేరళ పయ్యనూర్‌కు చెందిన ఆర్య తండ్రి రాజగోపాల్ గత 20 ఏళ్లుగా పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు. భార్య ఓ ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్ట్. కూతురు భవిష్యత్తు గురించి చాలా గొప్పగా ఊహించుకునేవాడు రాజగోపాల్. కూతురుకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎంతో కష్టపడ్డాడు. తాము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే.. ఆర్య చదువుకు మాత్రం అడ్డంకులు ఎదురు కానీవ్వలేదు.
తండ్రి కష్టానికి..
తల్లిదండ్రుల కష్టాన్ని, కలలను అర్థం చేసుకున్న ఆర్య చదువులో ముందుండేది. మంచి మార్కులు తెచ్చుకుని పేరున్న విద్యాసంస్థల్లో సీటు సంపాదించుకుంది. దానిలో భాగంగానే ఆర్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుంచి తన బ్యాచిలర్ పూర్తి చేసింది. ఇప్పుడు పీజీ చేయడం కోసం ఐఐటీ కాన్పుర్‌లో సీటు సాధించి.. తండ్రి కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చింది.
కేంద్ర మంత్రి కూడా..
ఆర్య కుటుంబ నేపథ్యం...ఆమె ప్రయాణం.. ఇప్పుడు సాధించిన విజయం తదితర అంశాల గురించి అశ్విన్ నందకుమార్ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరలయ్యింది. ఆర్య కథ చదివిన వారు తండ్రికూతుళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్య విజయం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి తెలిసింది. ఈ క్రమంలో ఆయన ఆర్యను ప్రశంసిస్తూ.. ట్వీట్ చేశారు.
‘‘ఆర్య విజయం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆర్య రాజగోపాల్, ఆమె తండ్రి రాజగోపాల్‌ల విజయం పట్ల దేశ ఇంధన రంగంతో సంబంధం ఉన్న మనమందరం నిజంగా ఎంతో గర్వపడుతున్నాము. ఈ ఆదర్శవంతమైన తండ్రి-కుమార్తెల ద్వయం ఎందరికో స్ఫూర్తి.. కొత్త భారతదేశానికి స్ఫూర్తి, మార్గదర్శకులు. వారిరువురికి నా శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు.