Skip to main content

Navodaya Entrance Exam: ‘నవోదయ’ ప్రవేశ పరీక్ష.. విద్యార్థులకు సూచనలు ఇవే..

పెద్దవూర: మండలంలోని చలకుర్తి క్యాంపు జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2024–25 విద్యా సంవత్సరానికి 9వ, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఫిబ్ర‌వ‌రి 10న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ నాగభూషణం ఫిబ్ర‌వ‌రి 8న‌ తెలిపారు.
Navodaya Entrance Exam

9వ తరగతి ప్రవేశ పరీక్షను నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు చలకుర్తి జేఎన్‌వీలోనూ, 11వ తరగతి ప్రవేశానికి నిర్వహించే పరీక్షా కేంద్రాలను సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

9వ ప్రవేశ పరీక్ష

తొమ్మిదవ తరగతిలో ఖాళీగా ఉన్న 7 సీట్లకుగాను ప్రవేశ పరీక్ష నిర్వహణకు మొత్తం 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,267 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఒక్కో సీటుకు 181 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. పరీక్షా కేంద్రాలను నాలుగు కేంద్రాల్లో సెయింట్‌ ఆల్ఫోన్సెస్‌ హైస్కూల్‌ నల్లగొండ (360 మంది), నల్గొండ పబ్లిక్‌ స్కూల్‌ మీర్‌బాగ్‌ కాలనీ, నల్లగొండ(360), పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపు జవహర్‌ నవోదయ విద్యాలయంలోనూ(312), ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, దేవరకొండ రోడ్‌ నల్లగొండ(235)లోనూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

చదవండి: Admissions: విద్యార్థుల భవిష్యత్తుకు నవోదయం.. పరీక్ష విధానం ఇదీ..

విద్యార్థులు ఉదయం 10:45 గంటలలోపే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, 11:45 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదు. పరీక్షా సమయం రెండున్నర గంటలు ఉంటుంది. ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు ఉంటుంది. దివ్యాంగులకు అదనంగా మరో 50 నిమిషాలు సమయం ఇవ్వనున్నారు. ప్రశ్నపత్రంలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో హిందీ భాషకు 15 మార్కులు, ఇంగ్లీష్‌ బాషకు 15 మార్కులు, గణితం 35 మార్కులు, జనరల్‌ సైన్స్‌కు 35 మార్కులు ఉంటాయి.

11వ తరగతి పరీక్ష..

ప్రవేశ పరీక్షను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 9 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం 2126 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సూర్యాపేటలో ఏవీఎం బాలికల ఉన్నత పాఠశాల(360), తెలంగాణ మోడల్‌ స్కూల్‌, ఇమాంపేట(360), ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.2 వాటర్‌ ట్యాంకు పక్కన(192), కాకతీయ ఉన్నత పాఠశాల(240), సిటీ టాలెంట్‌ హైస్కూల్‌(240), ప్రభుత్వ(ఎంఏఎం) హైస్కూల్‌(192), సిద్దార్థ హైస్కూల్‌(216), జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల హైస్కూల్‌, మున్సిపల్‌ వాటర్‌ ట్యాంకు పక్కన(134) పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

చదవండి: CTET January 2024 Notification: టీచింగ్‌ కెరీర్‌కు తొలి మెట్టు.. సీటెట్‌

విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 10:30 గంటలోగా చేరుకోవాల్సి ఉంటుంది. 11 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రశ్నపత్రంలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మెంటల్‌ ఎబిలిటీ 20 మార్కులు, ఇంగ్లిష్‌ భాషపై 20, సైన్స్‌పై 20, సోషల్‌ సైన్స్‌పై 20, గణితంపై 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

విద్యార్థులకు సూచనలు

హాల్‌టిక్కెట్లు లేని విద్యార్థులను పరీక్షకు అనుమతి ఉండదని, ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతి లేదు. పరీక్షను బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతో మాత్రమే ఓఎంఆర్‌ షీటులో రాయాల్సి ఉంటుంది. పెన్సిల్‌తో రాసిన సమాధానాలు చెల్లవని, ప్రతి ప్రశ్నకు ఏదో ఒకదానిని గుర్తించి ఓఎంఆర్‌ షీట్‌లో సర్కిల్‌ను నింపాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రశ్నపత్రంపైనా, ఓఎంఆర్‌ షీటుపైన విద్యార్థి తన రూల్‌ నంబర్‌ను విధిగా వేయాలని, ఓవర్‌ రైటింగ్‌, కొట్టివేతలు, దిద్దుళ్లు చేసినా, వైట్‌నర్‌ ఉపయోగించినా ఆ ఓఎంఆర్‌ షీటు చెల్లదని సూచించారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటాయని పేర్కొన్నారు.

Published date : 09 Feb 2024 03:07PM

Photo Stories