అక్టోబర్ రెండో వారంలో గ్రూప్–3 పరీక్షలు!
గతేడాది డిసెంబర్‌లో గ్రూప్–3 కేటగిరీలో 1,363 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ, ఫిబ్రవరి 23వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,36,477 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ఉద్యోగానికి సగటున 390 మంది పోటీ పడుతున్నారు.
తాజాగా ఈ పరీక్షల నిర్వహణపై దృష్టిపెట్టిన కమిషన్.. అక్టోబర్ రెండో వారంలో నిర్వహించాలని భావిస్తోంది. గ్రూప్–1 ప్రిలిమ్స్, గ్రూప్–4 పరీక్షలను పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ, గ్రూప్–2 పరీక్షలకు సంబంధించి ఇదివరకే తేదీని ప్రకటించింది. గ్రూప్–3 ఉద్యోగాలకు మూడు దశల్లో అర్హత పరీక్షలుంటాయి. పేపర్–1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, పేపర్–2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్–3 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఇందులో భాగంగా ఉంటాయి.
ఒక్కో పరీక్షను రెండున్నర గంటల పాటు నిర్వహిస్తారు. అలాగే ఒక్కో పరీక్షకు గరిష్టంగా 150 మార్కులుంటాయి. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇతర ఉద్యోగ పరీక్షలకు ఆటంకం లేకుండా గ్రూప్–3 తేదీలను నిర్ణయించే అంశాన్ని కమిషన్ పరిశీలిస్తోంది. ఈ కసరత్తు తర్వాత అతి త్వరలో పరీక్షల తేదీలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.