Skip to main content

Navodaya Vidyalaya Samiti: ‘నవోదయ’ంలో ఉజ్వల భవిష్యత్‌.. దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే

విజయనగరం పూల్‌బాగ్‌: ప్రతిభావంతులైన విద్యార్థులకు పట్టంకట్టి ఉజ్వల భవిష్యత్తునిచ్చే వేదిక నవోదయ విద్యాలయం.
Navodaya Vidyalaya Samiti
‘నవోదయ’ంలో ఉజ్వల భవిష్యత్‌.. దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే

అందుకే ఈ విద్యాలయంలో పిల్లల్ని చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు పోటీ పడుతుంటారు. ఆరో తరగతిలో చేరేందుకు ప్రవేశ పరీక్ష ఆధారం. ఇందులో ప్రతిభ చూపితే సీటు ఖాయం. 2024–25 ఏడాదికి సంబంధించి ప్రవేశపరీక్ష నిర్వహణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సమయం కేటాయించి ప్రణాళికాబద్ధంగా చదివితే సీటు సాధించవచ్చునని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి 1986లో కేంద్రం జవహర్‌ నవోదయ విద్యాలయాలు స్థాపించింది. ఈ విద్యాలయాల్లో 6 నుంచి 12వ తరగతివరకు తరగతులు కొనసాగిస్తున్నారు. ఆరు నుంచి 7వరకు ప్రాంతీయ, మాతృభాషల్లో బోధన సాగుతుంది. గణితం, సైన్స్‌, పాఠ్యాంశాలను ఆంగ్లంలో, సామాజిక శాస్త్రాలు హిందీలో చెబుతున్నారు. పదోతరగతి వరకు సీబీఎస్‌ఈ అమలు చేస్తున్నారు.

చదవండి: Harichandana: నవోదయ టు జపాన్‌.. సకూరా సైన్స్‌ హైస్కూల్‌ ప్రోగ్రాంలో పాల్గొన్న మన విద్యార్థిని

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు

ఎస్‌కోట మండలంలోని కిల్తంపాలెంలో జవహర్‌ నవోదయ విద్యాలయం ఉంది. 6వతరగతిలో 80 సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.ఇందుకు ఆగస్టు 10వతేదీ వరకు గడువు విధించారు. ఆర్హులైన విద్యార్థులు సీఎస్‌సీ(కామన్‌ సర్వీస్‌ సెంటర్లు), మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చదవండి: NEP 2020: పక్కాగా జాతీయ విద్యావిధానం అమలు

రిజర్వేషన్‌ విధానం..

ఆరవ తరగతిలో 80 సీట్లు ఉండగా, 75 సీట్లు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి కేటాయిస్తారు. ఐదు సీట్లు పట్టణ ప్రాంతాల వారికి కేటాయించారు. జిల్లా జనాభా ప్రాతిపదికన ఎస్టీలకు 15శాతం, ఎస్సీలకు 7.5శాతం, బాలికలకు 1/3 శాతం, దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ గుర్తింపు పొందిన పాఠశాలల్లో వరుసగా 3,4 వతరగతి చదివి అదే పాఠశాలలో ప్రస్తుతం 5వతరగతి చదువుతున్న వారు అర్హులు.నవోదయలో ఉమ్మడి జిల్లా వారీగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వసతుల కల్పన భేష్‌

ఎస్‌కోట మండలంలోని కిల్తంపాలెంలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో అన్ని సౌకర్యాలు కల్పించారు. ఉత్తమ బోధన అందిస్తున్నారు.విద్యాలయంలో తరగతులకు అకడమిక్‌ బ్లాక్‌, పాలనా సౌలభ్యానికి అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌, బాలబాలికలకు వేర్వేరుగా డార్మిటరీలు, భోజనశాలలు, బోధకులు, సిబ్బందికి ప్రత్యేక సముదాయాలు కొలువుదీరాయి. పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వడంతో విద్యాలయం వృక్షాలతో విరాజిల్లుతోంది. విద్యాలయం మొత్తం సీసీ రోడ్డు నిర్మించారు. స్మార్ట్‌ తరగతులు కొనసాగిస్తున్నారు. డూయింగ్‌బైలెర్నింగ్‌, ప్రయోగాత్మక విద్యను అందిస్తున్నారు. సైన్స్‌,కంప్యూటర్‌ ల్యాబ్‌ల సదుపాయం ఉంది.

మంచి అవకాశం...

ప్రతిభ ఉన్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇదో గొప్ప అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రుల కృషి, విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల ప్రణాళికతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే నవోదయలో సులభంగా ప్రవేశం పొందవచ్చును.
– వి.దుర్గా ప్రసాద్‌, ప్రిన్సిపాల్‌, నవోదయ విద్యాలయం, కిల్తం పాలెం,విజయనగరం

Published date : 01 Aug 2023 03:18PM

Photo Stories