Skip to main content

TS EAMCET Toppers : టీఎస్ ఎంసెట్‌ టాప‌ర్స్ స‌క్సెస్ స్టోరీలు.. మా ల‌క్ష్యాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ‌స్టు 12వ తేదీన (శుక్రవారం) హైదరాబాద్‌లో వీటిని విడుదల చేశారు.
TS EAMCET 2022 Toppers Success
TS EAMCET 2022 Toppers

ఇంజనీరింగ్‌ విభాగంలో బాలురు ఎక్కువ శాతం అర్హత సాధిస్తే, మెడికల్‌.. అగ్రికల్చర్‌ విభాగంలో బాలికలు ఎక్కువ మంది అర్హత పొందారు. ర్యాంకులు, మార్కులతో కూడిన ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇంజనీరింగ్‌ ఎంసెట్‌కు మొత్తం 1,72,238 మంది దరఖాస్తు చేశారు. 1,56,860 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,26,140 మంది (80.41 శాతం) అర్హత సాధించారు. బాలురు 75,842 మంది అర్హత పొందితే, బాలికలు 50,298 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్‌..మెడికల్‌ ఎంసెట్‌కు 94,476 మంది దరఖాస్తు చేస్తే 80,575 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 71,180 మంది (88.34 శాతం) అర్హత సాధించారు. బాలురు 21,329 మంది, బాలికలు 49,851 మంది అర్హత పొందారు.

ఏపీ విద్యార్థులకు అగ్రశ్రేణి ర్యాంకులు..
తెలంగాణ ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థులు అగ్రశ్రేణి ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్, మెడికల్‌..అగ్రికల్చర్‌ విభాగాలు రెండిటిలోనూ నంబర్‌ వన్‌ ర్యాంకులు వారికే దక్కాయి. అంతేకాదు టాప్‌టెన్‌లోనూ ఎక్కువమంది ఏపీ విద్యార్థులే ఉన్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో ఎనిమిది మంది, అగ్రికల్చర్‌..మెడికల్‌ విభాగంలో ఏడుగురు ఉన్నారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఇంజనీరింగ్‌లో ఇద్దరు, మెడికల్‌..అగ్రికల్చర్‌ విభాగంలో ముగ్గురు మొదటి పది ర్యాంకుల్లో ఉన్నారు. ఫలితాలు విడుదల కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాస్, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఎ.గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అభినందనలు: సబిత
వర్షాలు, వరదల్లోనూ ఎంసెట్‌ నిర్వహించిన పలు ప్రభుత్వ విభాగాలకు విద్యా మంత్రి సబితా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎంసెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.

ఎంసెట్‌లో టాప్‌ టెన్‌ ర్యాంకర్లు వీరే..
ఇంజనీరింగ్‌ విభాగంలో..
1. పొలు లక్ష్మీసాయి లోహిత్‌ రెడ్డి (మార్కులు 151.615123), ప్రకాశం
2. నక్కా సాయి దీపిక (150.547509), శ్రీకాకుళం జిల్లా
3. పొలిశెట్టి కార్తికేయ (150.539622), గుంటూరు జిల్లా
4. పల్లి జయలక్ష్మి (149.953984), శ్రీకాకుళం జిల్లా
5. మెండ హిమవంశీ  (149.863305), శ్రీకాకుళం జిల్లా
6. గండు హరిదీప్‌ (148.577175) అమలాపురం
7. దయ్యాల జాన్‌ జోసెఫ్‌ (148.401115) విశాఖపట్నం
8. పెనికలపాటి రవి కిషోర్‌ (147.756406), గుంటూరు 
9. గవినికాడ అరవింద్‌ (146.880744), నాగర్‌కర్నూల్‌
10. నందన్‌ మంజునాథ్‌ (146.242304), మేడ్చల్‌

మెడికల్‌..అగ్రికల్చర్‌ విభాగంలో..

TS EAMCET Toppers


1. జుటూరి నేహ (154.141629), గుంటూరు
2. వంటాకు రోహిత్‌ (153.900883), విశాఖపట్నం
3. కల్లాం తరుణ్‌కుమార్‌ రెడ్డి (153.114467), గుంటూరు
4. కొత్తపల్లి మహీత్‌ అంజన్‌ (152.791152)  హైదరాబాద్‌
5. గుంటుపల్లి శ్రీరామ్‌ (152.781677), గుంటూరు
6. మువ్వల నివేదిత (152.779126), కృష్ణా
7. మిట్నాల శివ తేజశ్విని (152.417384), కర్నూలు
8. శ్రీ శశాంక్‌ గోపిశెట్టి (152.124698), హైదరాబాద్‌
9. ప్రణీత్‌ గంజి (151.815401), హైదరాబాద్‌
10. వజ్రాల దినేష్‌ కార్తీక్‌రెడ్డి (151.322827), గుంటూరు 

ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చేస్తా..
ఎంసెట్‌లో మొదటి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఐఐటీ–బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు చేయాలన్నది నా కోరిక. మేం ఇద్దరం అన్నదమ్ములం. మా అమ్మానాన్న లక్ష్మీకాంత, మాల్యాద్రిరెడ్డి. నాన్న ఏపీలోని ప్రకాశం జిల్లా దర్శిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా రు. నేను హైదరాబాద్‌ మాదాపూర్‌లోని కళాశాల హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నా. 
– ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ టాపర్‌ లోహిత్‌రెడ్డి

రీసెర్చ్‌ చేయాలని ఉంది..
ఇంజనీరింగ్‌ కోర్సులో కంప్యూటర్‌ సైన్స్‌పై నాకు మక్కువ ఎక్కువ. భవిష్యత్తులో ఈ రంగంలో రాణించి రీసెర్చ్‌ చేయాలన్నది నా ఆకాంక్ష. ఫ్యాకల్టీగా స్థిరపడి నలుగురు విద్యార్థులకు ఉపయోగపడాలన్నది నా కోరిక. అమ్మ రమ, నాన్న మల్లికార్జునరావు. నాన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.
 – ఇంజనీరింగ్‌ టెన్త్‌ ర్యాంకర్‌ నందన్‌ మంజునాథ్, మేడ్చల్‌

కార్డియాలజిస్ట్‌ అవుతా..
నేను బాచుపల్లిలోని కళాశాలలో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశా. బైపీసీలో 987 మార్కులు వచ్చాయి. నీట్‌ ఎగ్జామ్‌ రాశా. పాండిచ్చేరిలోని జిప్‌మెర్‌లో మెడిసిన్‌ చేయాలని ఉంది. భవిష్యత్తులో మంచి కార్డియాలజిస్ట్‌ కావాలన్నదే లక్ష్యం. మా సొంత ఊరు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి. నాన్న శ్రీనివాస్‌ గోపిశెట్టి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, అమ్మ కల్పన ఏపీ జెన్‌కోలో అసిస్టెంట్‌ డివిజినల్‌ ఇంజనీర్‌.  
– అగ్రికల్చర్‌లో 8వ ర్యాంకర్‌ శ్రీ శశాంక్‌ గోపిశెట్టి (హైదరాబాద్‌)

నా లక్ష్యం ఇదే..
ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో సీటు సాధించడం ద్వారా అత్యున్నతమైన వైద్య విద్యను పొందాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నా. నీట్‌ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా. నాన్న శ్రీనివాస్, అమ్మ మాధవి ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శనంతోనే ర్యాంకు సాధించా. నాకు ఏపీ ఎంసెట్లో 54వ ర్యాంక్‌ వచ్చింది.
– అగ్రికల్చర్‌లో 4వ ర్యాంకర్‌  కె.మహీత్‌ అంజన్‌ (హైదరాబాద్‌)

నీట్‌లో మంచి ర్యాంక్‌ కోసం..
ఎంసెట్‌ అగ్రికల్చర్‌.. మెడికల్‌లో రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. వాస్తవానికి 5 లోపే ర్యాంకు వస్తుందని భావించాను. అయితే నేను నీట్‌ కూడా రాశా. మంచి ర్యాంకు వస్తుందని అనుకుంటున్నా. ఒక క్రమ పద్ధతిలో చదవడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. 
– అగ్రికల్చర్‌లో 9వ ర్యాంకర్‌ గంజి ప్రణీత్, హైదరాబాద్‌

Published date : 13 Aug 2022 07:11PM

Photo Stories