Skip to main content

టీఎస్‌ ఎంసెట్‌తో సహా ఇతర సెట్స్‌ అన్నీ వాయిదా.. జూలై 25 తరువాతే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదాపడనున్నాయి.
ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు రద్దయిన నేపథ్యంలో విద్యార్థులు ఇక ఎంసెట్‌పై దృష్టి సారించనున్నారు. ఇన్నాళ్లూ సెకండియర్‌ పరీక్షలు ఉంటాయా? లేదా? అన్న ఆందోళనలో ఉన్న విద్యార్థులకు ఇప్పటికిప్పుడు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.

పైగా కరోనా కూడా అదుపులోకి రాలేదు.
ఈనేపథ్యంలో విద్యార్థులు ఎంసెట్‌కు సిద్ధమయ్యేందుకు కనీసం 6 వారాల గడువు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. అందుకు అనుగుణంగానే వచ్చే నెల 5 నుంచి 9 వరకు (5, 6 తేదీల్లో అగ్రికల్చర్, 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్‌) నిర్వహించాల్సిన ఎంసెట్‌ను వాయిదా వేయాలన్న భావనకు వచ్చింది. త్వరలోనే సవరించిన షెడ్యూల్‌ను జారీ చేసే అవకాశం ఉంది. వీటిపై ప్రభుత్వంతో చర్చించాకే తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యా మండలికి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్‌ స్లాట్స్‌ను బట్టి పరీక్ష తేదీలను ఖరారు చేయనున్నారు.

తెలంగాణ ఎంసెట్‌– 2021 స్టడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్స్, ప్రిపరేషన్‌ గైడెన్స్, మాక్‌టెస్ట్స్, ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్స్, ప్రీవియస్‌ పేపర్స్, కాలేజ్‌ ప్రిడిక్టర్‌.. ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇతర ప్రవేశ పరీక్షలు సైతం..
మరోవైపు జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ ఏప్రిల్, మే నెలల సెషన్లను ఇంకా నిర్వహించలేదు. కరోనా కారణంగానే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాటిని వాయిదా వేసింది. జూలై 3న నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షనూ వాయిదా వేసింది. ఈ పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు. ఆయా పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించేదీ టీసీఎస్సే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎంసెట్, ఇతర సెట్స్‌తో ఆయా పరీక్షల తేదీలు క్లాష్‌ కాకుండా టీసీఎస్‌ ఖాళీ స్లాట్స్‌ను బట్టి తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. మొత్తానికి ఆగస్టు ఆఖరులోగా సెట్స్‌ అన్నింటినీ పూర్తి చేయాలని ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. అయితే ఎంసెట్‌ను మాత్రం సర్వీసు ప్రొవైడర్‌తో స్లాట్ల లభ్యతను బట్టి, జూలై 25 నుంచి ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. దీంతో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఆగస్టు 15 తరువాత చేపట్టి, సెపె్టంబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభించేలా ప్రణాళిక రచిస్తోంది.

జేఈఈ మెయిన్, ఆడ్వాన్స్‌డ్‌– 2021 స్టడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్స్, ప్రిపరేషన్‌ గైడెన్స్, ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్స్, ప్రీవియస్‌ పేపర్స్‌.. ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

పీజీఈసెట్, ఈసెట్‌ వాయిదానే..
జూన్‌ 19 నుంచి 22 వరకు నిర్వహించాల్సిన పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (పీజీఈసెట్‌), జూలై 1న నిర్వహించాల్సిన ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఈసెట్‌)ను వాయిదావేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయానికి వచ్చింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 19, 20 తేదీల్లో నిర్వహించాల్సిన ఐసెట్, అదే నెల 23న నిర్వహించాల్సిన లాసెట్, 24, 25 తేదీల్లో నిర్వహించాల్సిన ఎడ్‌సెట్‌ పరీక్షలు కూడా వాయిదాపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు వివిధ డిగ్రీ కోర్సుల ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంది. అవి పూర్తయ్యాకే లాసెట్, ఎడ్‌సెట్, ఐసెట్‌ ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది.
Published date : 10 Jun 2021 05:31PM

Photo Stories