Skip to main content

తెలంగాణలో మే 14న ఎంసెట్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘ఎంసెట్’ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది.
ఈ నెల 25న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 28వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. మే 14వ తేదీన పరీక్షను నిర్వహించి.. అదే నెల 28వ తేదీన తుది ఫలితాలను వెల్లడిస్తారు. అంతేగాకుండా విద్యార్థుల వెసులుబాటు కోసం ఈసారి ఓఎంఆర్ జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్షలను బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్‌తోనే రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్యను బట్టి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో, నల్లగొండ జిల్లా కోదాడ, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో కొత్తగా ఎంసెట్ రీజనల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా తెలంగాణలోని 12 ప్రాంతాల్లో ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 8 జోన్లను ఏర్పాటు చేసి, వాటి పరిధిలో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పాత పద్ధతిలోనే ప్రవేశాలు..
మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలన్నీ పాత పద్ధతిలోనే జరుగుతాయని ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. రాజ్యాంగంలోని 371 (డి) ప్రకారం 15 శాతం ఓపెన్ కోటాలో సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరుకావచ్చని... రెండు రాష్ట్రాల విద్యార్థుల మెరిట్ ఆధారంగా ఓపెన్ కోటాలో ప్రవేశాలు ఉంటాయని ఆయన వివరించారు. ఏపీ ప్రభుత్వం కోరితే ఆ రాష్ట్రంలోనూ పరీక్ష కేంద్రాల ఏర్పాటును పరిశీలిస్తామని చెప్పారు.

అవసరమైతే నార్మలైజేషన్..
ఎప్పటిలాగే ఈ సారి కూడా ఎంసెట్ తుది ర్యాంకు ఖరారులో విద్యార్థుల ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుందని హైదరాబాద్ జేఎన్టీయూ వైస్ చాన్సలర్ శైలజా రామయ్యార్ వెల్లడించారు. ప్రస్తుతం రెండు వేర్వేరు బోర్డుల ద్వారా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో తమ విద్యార్థులకు ఎక్కువ సీట్లు వచ్చేలా ఎక్కువ మార్కులు వేసుకుంటే ఎలాగని విలేకరులు ప్రశ్నించగా... 85 శాతం స్థానిక కోటా ప్రవేశాల్లో ఆ ఇబ్బంది ఉండదని, మిగతా 15 శాతం ఓపెన్‌కోటా సీట్లకు ఆ ఇబ్బంది రావచ్చని శైలజా రామయ్యార్ చెప్పారు. అయితే తుది ర్యాంకుల ఖరారు నాటికి రెండు రాష్ట్రాల బోర్డులు ఇచ్చే ఇంటర్ మార్కుల్లో అసాధారణ తేడాలున్నట్లు తేలితే... జేఈఈలో తరహాలో నార్మలైజేషన్ పద్ధతిలో ర్యాంకుల ఖరారు చేపడతామని పేర్కొన్నారు.

2.5 లక్షల మందికి పైనే..
ఈ సారి ఎంసెట్‌కు 2.5 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతారని ఎంసెట్ వర్గాలు అంచనా వేశాయి. తెలంగాణ నుంచి గత ఏడాది 1,80,825 మంది (1,26,071 ఇంజనీరింగ్‌లో, మెడికల్‌లో 54,754 మంది) విద్యార్థులు ఎంసెట్‌కు హాజరయ్యారు. ఈసారి కూడా రాష్ట్రం నుంచి దాదాపు అదే సంఖ్యలో విద్యార్థులు ఉండనుండగా... ఏపీ నుంచి మరో 70 వేల మంది విద్యార్థులు ఎంసెట్‌కు హాజరయ్యే అవకాశం ఉందని, మొత్తంగా 2.50 లక్షల మంది ఈసారి ఎంసెట్‌కు హాజరవుతారని అధికారుల అంచనా. పరీక్ష సిలబస్‌కు సంబంధించిన వివరాలను www.tseamcet.in/ వెబ్‌సైట్‌లో ఈ నెల 25 తరువాత అందుబాటులో ఉంచనున్నారు.

ఫీజు చెల్లింపు విధానం
ఈ నెల 28వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజు చెల్లించి ఎంసెట్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గత ఏడాదిలాగే ఈ సారి కూడా ఒక్కో పరీక్షకు రూ. 250 ఫీజును నిర్ణయించినట్లు తెలిసింది. ఇంజనీరింగ్, మెడికల్ రెండింటికి కలిపి రూ. 500గా నిర్ణయించారు. ఫీజును విద్యార్థులు తెలంగాణ స్టేట్ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈసేవ, మీసేవ కేంద్రాల ద్వారా చెల్లించవచ్చు. అలాగే ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులు, బిల్‌డెస్క్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ చెల్లించవచ్చు.

ఇదీ షెడ్యూల్..
  • ఫిబ్రవరి 25న ఎంసెట్ నోటిఫికేషన్
  • 28 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ .. చివరి తేదీ ఏప్రిల్ 9
  • అదే నెల 15 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తుల్లో సవరణకు అవకాశం
  • ఆలస్య రుసుము రూ.500తో ఏప్రిల్ 15 వరకు.. రూ.1,000 రుసుముతో ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులకు అవకాశం
  • మే 8-12 వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
  • మే 14న పరీక్ష : ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష
  • పాథమిక కీ విడుదల 16వ తేదీన..
  • 23వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
  • మే 28న తుది ర్యాంకుల ప్రకటన

ప్రాంతీయ కేంద్రాలు, సమన్వయం చేసే కాలేజీలు..

కేంద్రం

కళాశాల

ఆదిలాబాద్

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, శాంతినగర్

జనగాం

ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, గీతానగర్

కరీంనగర్

ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ ఫర్ విమెన్స్, మంకమ్మతోట

ఖమ్మం

యూనివర్సిటీ పీజీ కాలేజీ, కాకతీయ యూనివర్సిటీ

మహబూబ్‌నగర్

ప్రభుత్వ పాలిటెక్నిక్, మహబూబ్‌నగర్

మెదక్

ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీ, నర్సుఖేడా రోడ్డు

నల్లగొండ

నాగార్జున ప్రభుత్వ కాలేజీ

నిజామాబాద్

గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, దుబ్బరోడ్

సిద్దిపేట

ప్రభుత్వ పాలిటెక్నిక్

వికారాబాద్

ఎస్‌ఏపీ కాలేజీ

వనపర్తి

కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్

వరంగల్

కేయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ.

Published date : 20 Feb 2015 06:15PM

Photo Stories