తెలంగాణలో ఈనెల 9న ఎంసెట్-2
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్-2 పరీక్షను ఈనెల 9న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్-2 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణారావు తెలిపారు.
9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షకు హాజరయ్యేందుకు 56,108 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇక మాల్ ప్రాక్టీస్ నిరోధానికి సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వంటి హైటెక్ నిఘా ఏర్పాట్లు చేయడంతోపాటు 20 జామర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడాన్ని నిరోధించేందుకు ఈసారి విద్యార్థుల బయోమెట్రిక్ డాటాను సేకరిస్తున్నామని, వేలి ముద్రలు, డిజిటల్ ఫొటోలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక రూ.5 వేలు, రూ.10 వేలు ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసిన వారిని, మళ్లీ మళ్లీ ఎంసెట్ రాస్తున్న అభ్యర్థులకు సంబంధించి వారు ఎందుకు పరీక్షకు హాజరు అవుతున్నారన్న అంశంపై పోలీసు విచారణ చేయిస్తున్నట్లు చెప్పారు. వారి చిరునామాలు, ఫోన్ నంబర్లను ఇంటెలిజెన్స్ విభాగానికి అందజేసినట్లు తెలిపారు. 1970 నుంచి 1994 మధ్యలో జన్మించిన వారు గతంలో ఎంసెట్ రాసి, ఎంపికై, మెడిసిన్ చదువుతూ ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసిన వారి వివరాలను కూడా పోలీసు శాఖకు అందజేశామన్నారు. బాంబు డిస్పొజల్ స్క్వాడ్ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మహిళా పోలీసులను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు.
పరీక్షకు సంబంధించి వివరాలు.. జాగ్రత్తలు..:
అభ్యర్థులు, పరీక్ష కేంద్రాల వివరాలు..
పరీక్షకు సంబంధించి వివరాలు.. జాగ్రత్తలు..:
- విద్యార్థులు కచ్చితంగా కలర్ ఫొటోను ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంపై అంటించాలి. ఆ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి.
- పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- ప్రశ్నలతోపాటు జవాబుల ఆప్షన్లలో కూడా జంబ్లింగ్ అమలు చేస్తున్నారు.
- పరీక్ష కేంద్రాల్లో బాలికలను తనిఖీ చేసేందుకు, మహిళా హోంగార్డులను నియమిస్తున్నారు. - ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వివరాలను కూడా పోలీసు పరిశీలన కోసం అందజేశారు.
- ఈసారి విద్యార్థులకు కార్బన్‌లెస్ జవాబుల పత్రం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
- ఈసారి పరీక్షకు కొత్త విద్యార్థులు 33,300 మంది హాజరుకానుండగా, గత ఏడాది ఇంటర్మీడియెట్ పూర్తయిన వారు 15,435 మంది దరఖాస్తు చేశారు. 2014లో పాసైన వారు 5,041 మంది, 2013లో పాసైన వారు 1,474 మంది, 2012లో ఉత్తీర్ణులైన వారు 455 మంది, 2011లో ఉత్తీర్ణులైన వారు 167, 2010లో పాసైన వారు 67 మంది ఉన్నారు. ఇలా 1981 నుంచి ఇప్పటివరకు ఇంటర్ పాసైన వారు ఈ మెడికల్ ఎంసెట్‌కు హాజరయ్యేందుకు దరఖాస్తు చేశారు.
- ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పరీక్షకు హాజరయ్యేందుకు 17,934 మంది దరఖాస్తు చేశారు.
- వారికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అభ్యర్థులు, పరీక్ష కేంద్రాల వివరాలు..
ప్రాంతం | అభ్యర్థులు | పరీక్ష కేంద్రాలు |
ఆదిలాబాద్ | 932 | 3 |
హైదరాబాద్-ఏ | 5,134 | 6 |
హైదరాబాద్-బీ | 6,468 | 9 |
హైదరాబాద్-సీ | 9,008 | 15 |
కరీంనగర్ | 3,361 | 8 |
ఖమ్మం | 2,171 | 4 |
మహ బూబ్‌నగర్ | 2,538 | 4 |
నల్లగొండ | 2,160 | 5 |
నిజమాబాద్ | 1,702 | 5 |
వరంగల్ | 4,700 | 8 |
కర్నూలు | 2,710 | 4 |
తిరుపతి | 3,588 | 5 |
విజయవాడ | 7,537 | 13 |
విశాఖపట్నం | 4,099 | 6 |
మొత్తం | 56,108 | 95 |
Published date : 04 Jul 2016 11:42AM