తెలంగాణలో ఎంసెట్ ఆప్షన్లను బట్టే సీట్లు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో మొదటి దశ కౌన్సెలింగ్‌లో ఎంతమందికి సీట్లు లభిస్తాయో ఈనెల 28న తేలనుంది.
ఈ మేరకు ఎంసెట్ సీట్ల కేటాయింపును 28న రాత్రి 8 గంటలకు ప్రకటించేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది కంటే ఈసారి సీట్లు తక్కువగా ఉండటంతో ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకే సీట్లు లభించే అవకాశం ఉంది. గతేడాది కన్వీనర్ కోటాలో 71,066 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి దశ కౌన్సెలింగ్‌లో 66,566 మంది విద్యార్థులు 34,29,835 వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అయినా 57,789 మంది విద్యార్థులకే సీట్లు లభించాయి. గతేడాదితో పోల్చితే ఈసారి సీట్ల సంఖ్య తక్కువగా ఉంది. కన్వీనర్ కోటాలో 64,300 సీట్లే అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోల్చితే 6,766 సీట్లు తగ్గాయి. మరోవైపు విద్యార్థులు కూడా వెబ్ ఆప్షన్లు తక్కువగా ఇచ్చారు. 63,216 మంది విద్యార్థులు 31,30,419 వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. గతేడాది కంటే ఈసారి 3 లక్షలకు పైగా ఆప్షన్లు తగ్గడంతో ఎంతమందికి మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు లభిస్తాయన్నది ఆసక్తిగా మారింది. సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేసేందుకు వచ్చే నెల 3 వరకు గడువివ్వనున్నారు.
Published date : 28 Jun 2017 01:32PM