తెలంగాణలో ఎంసెట్-3 నోటిఫికేషన్ జారీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాత పరీక్ష నిర్వహించేందుకు ఎంసెట్ ప్రవేశాల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది.
సెప్టెంబర్ 11 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. గతంలో ఎంసెట్-2 రాసేందుకు దరఖాస్తు చేసుకున్న 56,153 మంది అభ్యర్థులంతా ఎంసెట్-3 రాసేందుకు అర్హులేనని, వారంతా మళ్లీ దరఖాస్తు చేసుకోవడం.. ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. విద్యార్థులు సెప్టెంబర్ 3 నుంచి 9 వరకు tseamcet.in వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. పరీక్ష జరిగిన వారం రోజుల్లోగా (వీలైతే 16, 17 తేదీల్లో) ఫలితాలు, ర్యాంకులను విడుదల చేయనుంది. ఎంసెట్ స్కోర్‌కు 75 శాతం, ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది. పరీక్ష నిర్వహణకు గతంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ కేంద్రాల్లో ఎలాంటి మార్పులు ఉండవని, ఒక్కో రీజనల్ కేంద్రం పరిధిలోని పరీక్ష కేంద్రాలు మాత్రం మారుతాయని తెలిపింది.
Published date : 09 Aug 2016 11:00AM