Skip to main content

తెలంగాణలో ఎంసెట్-2 నోటిఫికేషన్ విడుదల

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వైద్య విద్యా కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ‘ఎంసెట్-2’ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా..
జూలై 9న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. ఈ మేరకు మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2గా పేర్కొంటూ ఎంసెట్ కమిటీ శనివారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో ఈ పరీక్షను నిర్వహించేందుకు జేఎన్‌టీయూహెచ్ చర్యలు చేపట్టింది. జూన్ 1వ తేదీ నుంచి 7వరకు ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో (tseamcet.in)దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 2 నుంచి 7వ తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250, ఇతరులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని టీఎస్ ఆన్‌లైన్/ఏపీ ఆన్‌లైన్/మీ సేవ/ఈసేవ కేంద్రాల్లోగానీ, నెట్ బ్యాం కింగ్, క్రెడిట్‌కార్డు/డెబిట్ కార్డు ద్వారా గానీ చెల్లించవచ్చు. పరీక్షను పకడ్బందీ గా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రాంతీయ కేంద్రాలను, హైదరాబాద్ లో మరో 8 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంసెట్ కమిటీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 20 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

వెయిటేజీ యథాతథం..: ఎంసెట్-2లో ఇంటర్ మార్కులకు యథాతథంగా వెయిటేజీని కొనసాగిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో ఎంసెట్ కమిటీ తెలిపింది. ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకులను ఖరారు చేస్తామని వెల్లడించిం ది. నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ, ఇతర పూర్తి మార్గదర్శకాలు, సిలబస్, అర్హతల వివరాలన్నీ ఎంసెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఏపీ విద్యార్థులు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.

ఎంసెట్-2 షెడ్యూల్ ఇదీ..
జూన్ 1: దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
7వ తేదీ వరకు: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణ.
(జూన్ 14వ తేదీ వరకు రూ.500 ఆలస్య రుసుముతో, 21వ తేదీ వరకు రూ.1,000, 28వ తేదీ వరకు రూ.5వేలు, జూలై 6వ తేదీ వరకు రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు)
జూలై 2 నుంచి 7 వరకు: వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
జూలై 9న: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష
Published date : 30 May 2016 10:30AM

Photo Stories