Skip to main content

తెలంగాణలో 5 నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 65,379 సీట్ల భర్తీకి ఎంసెట్ ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది.
మంగళవారం (ఈనెల 5) నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 178 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 89,055 సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. ఇందులో 62,339 సీట్లు (70%), 17 ప్రభుత్వ కాలేజీల్లోని 3,040 సీట్లు కలిపి మొత్తంగా 65,379 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ప్రైవేటు కాలేజీల్లోని మిగతా 26,716 (30%) సీట్లను యాజమాన్యాలే మేనేజ్‌మెంట్ కోటా (ఇందులో 15% ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటా)లో భర్తీ చేసుకోనున్నాయి.

టాప్ కాలేజీల్లో గతేడాది సీట్లు కొనసాగింపు:
ఈసారి టాప్ కాలేజీల్లో సీట్లకు, బ్రాంచీలకు పెద్దగా కోత పడలేదు. దాదాపుగా గతేడాది ఉన్నట్లుగానే ఈసారీ అనుబంధ గుర్తింపు లభించింది. సాధారణ కాలేజీల్లోనే ఎక్కువగా బ్రాంచీలు, సీట్లకు కోత పడింది. నిర్దిష్ట ప్రమాణాల మేరకు లేని కాలేజీల్లో భారీగా బ్రాంచీలు, సీట్లు తగ్గిపోయాయి. కాలేజీల సంఖ్య కూడా తగ్గింది. వాస్తవానికి రాష్ట్రంలోని 282 ఇంజనీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. అందులో 40 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. మరో 47 కాలేజీల్లో లోపాలున్నట్లు యూనివర్సిటీలు, విజిలెన్స్ నివేదికల్లో తేలడంతో వాటికి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. మిగతా 178 ప్రైవేటు కాలేజీలు, 17 ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వీటితోపాటు ఫార్మసీ కాలేజీల్లోని బీఫార్మసీ సీట్ల భర్తీకి, వెబ్ ఆప్షన్లకు చర్యలు చేపట్టింది.

52 వేల సీట్లు కోత: ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన లెక్కన కాలేజీల్లో మొత్తంగా 1.42 లక్షల సీట్లు ఉండగా... వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చింది 178 కాలే జీల్లోని 89,055 సీట్లకే. అంటే 52,945 సీట్లకు కోత పడింది. మొత్తంగా ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలుపుకొని 92,095 సీట్లు అందుబాటులోకి ఉన్నాయి. ఇందులో 65,379 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ఆదివారం రాత్రి జేఎన్టీయూహెచ్ ప్రకటించిన ప్రకారం దాని పరిధిలోని కాలేజీల్లో 79,705 సీట్లకు అనుమతి ఇచ్చారు. సోమవారం నాటికి సీట్ల సంఖ్య 81,424కు చేరుకుంది.

వీలైన న్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వండి: ఇంజనీరింగ్ ఎంసెట్‌లో 1,04,500 మంది అర్హత సాధించి ర్యాంకులు పొందారు. ఇందులో 63,777 మంది మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారంతా ఈనెల 5వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ ఎంవీ రెడ్డి, క్యాంపు కార్యాలయం అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు లాగిన్ ఐడీ ని సోమవారమే వారి మొబైల్ ఫోన్లకు పంపించినట్లు చెప్పారు. tseamcet.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆప్షన్లు ఇచ్చుకోవాలని వెల్లడించారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ వారికి 5, 6 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

వెబ్ ఆప్షన్లు, ప్రవేశాల షెడ్యూల్ :
  • జూలై 5, 6 తేదీలు, 7న ఉదయం పది గంటల వరకు: 1 నుంచి 45 వేల ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్లు
  • 7, 8 తేదీల్లో: 45,001 నుంచి 90 వేల ర్యాంకు వరకు
  • 9, 10 తేదీల్లో: 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి
  • 10, 11వ తేదీల్లో: వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం
  • 14న: విద్యార్థులకు సీట్లు కేటాయింపు
  • 21 వరకు: ఫీజు చెల్లింపుతోపాటు కాలేజీల్లో రిపోర్ట్ చేయడానికి గడువు.
Published date : 05 Jul 2016 02:23PM

Photo Stories