తెలంగాణలో 16న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాల షెడ్యూలులో మార్పులు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వెబ్ ఆప్షన్ల గడువు మరో రెండు రోజులు పొడిగించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి, 16వ తేదీన సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. కోర్టు ఉత్తర్వుల కాపీ అందగానే ఒకటీ రెండు రోజుల్లో షెడ్యూలును అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైంది.
ముందస్తు షెడ్యూలు ప్రకారం.. మొదటి దశ కౌన్సెలింగ్‌లో ఈ నెల 11 వ తేదీ ఉదయం 10 గంటల వరకు 90,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే వీలు ఉంది. 10, 11 తేదీలు, 12వ తేదీ ఉదయం 10 గంటల వరకు అన్ని ర్యాంకుల వారు వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం, మార్పులు చేసుకునే ప్రక్రియ 12వ తేదీ ఉదయం 10 గంటలకు ముగియాల్సి ఉంది. 14 న సీట్లను కేటాయించాల్సి ఉంది. అయితే కోర్టు ఆదేశాల మేరకు వెబ్ ఆప్షన్లను ఈనెల 14 వ తేదీ ఉదయం 10 గంటలవరకు పొడగించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో సీట్ల కేటాయింపును 14 న కాకుండా 16 వ తేదీన ప్రకటించేందుకు సిద్ధమైంది. హైకోర్టు ఉత్తర్వుల కాపీ అధికారికంగా అందగానే వెబ్ ఆప్షన్ల గడువు పెంపు ప్రకటనను జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. కాలేజీల్లో చేరే షెడ్యూలుకు, చివరి దశ కౌన్సెలింగ్‌కు దీనితో ఎలాంటి ఇబ్బంది లేదని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 21వ తేదీ వరకు ఫీజు చెల్లించి, కాలేజీల్లో చేరవచ్చని, ఈ షెడ్యూలులో మార్పు ఉండకపోవచ్చని, అవసరమైతే 23వ తేదీ వరకు కూడా ఫీజు చెల్లింపు, కాలేజీల్లో చేరేందుకు అవకాశం ఇచ్చే వీలుంటుందని వెల్లడించారు. ఇక చివరి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా ముందస్తు షెడ్యూలు ప్రకారం ఈనెల 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టి, ఆయా తేదీల్లోనే వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు 27 న సీట్లను కేటాయించి, 29 వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించ నున్నారు.
ఆప్షన్లు ఇచ్చిన వారు 63,067 మంది :
ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా శనివారం వరకు 68,118 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాగా 63,067 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల సంఖ్య 30,78,057 కు చేరింది. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు సూచించారు.
ఆప్షన్లు ఇచ్చిన వారు 63,067 మంది :
ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా శనివారం వరకు 68,118 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాగా 63,067 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల సంఖ్య 30,78,057 కు చేరింది. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు సూచించారు.
Published date : 11 Jul 2016 02:59PM