Skip to main content

తెలంగాణ ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు మూడు కేటగిరీల్లో..

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శుక్రవారం (జూలై 17) సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. ‘అఫిలియేషన్ల’ వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనం బుధవారమే తీర్పు ఇచ్చినా.. దాని కాపీ ప్రభుత్వానికి గురువారం అందింది.
దానికి అనుగుణంగా ప్రవేశాల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ముందే జేఎన్టీయూహెచ్ అనుమతి పొంది ఎలాంటి వివాదం లేని కాలేజీలతో పాటు కోర్టు ఆదేశాల మేరకు కొన్ని కాలేజీలు, స్వచ్ఛందంగా తనిఖీలకు ముందుకు వచ్చే కాలేజీలను వెబ్‌కౌన్సెలింగ్‌లో చేర్చనున్నారు. తనిఖీల్లో లోపాలున్నట్లు గుర్తిస్తే ఈ కాలేజీల్లో ప్రవేశాలు రద్దయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల విద్యార్థులకు ముందు జాగ్రత్తగా ఈ మూడు రకాల కాలేజీలు, వాటిల్లోని బ్రాంచీలను మూడు రంగుల్లో వేర్వేరుగా సూచిస్తారు. విద్యార్థులు ్టట్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీ వెబ్‌సైట్లో వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన గురువారం సచివాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, సాంకేతిక విద్యా కమిషనర్ వాణీప్రసాద్, జేఎన్టీయూహెచ్ తాత్కాలిక వీసీ శైలజా రామయ్యార్ తదితరులు సమావేశమై కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేశారు. అనంతరం కడియం శ్రీహరి ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. కోర్టుకు వెళ్లని కాలేజీల యాజమాన్యాలు కూడా తాజా తనిఖీలకు ఒప్పుకుంటే వాటిని వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చుతామని.. ఇందుకోసం గురువారం రాత్రి వరకు జేఎన్టీయూహెచ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కోర్టుకు వెళ్లిన వారికి వర్తించే నిబంధనలే వీటికి వర్తిస్తాయని చెప్పారు. ఇక కోర్టుకు వెళ్లిన 121 కాలేజీల్లో 73 కాలేజీలు తమకు అదనపు సీట్లు అవసరం లేదంటూ జేఎన్టీయూకు లేఖలను అందజేశాయన్నారు. మరికొన్ని కాలేజీలు కొన్ని బ్రాంచీలు వద్దని, మరికొన్ని బ్రాంచీలకు తనిఖీలు చేయాలని కోరాయని తెలిపారు.

మూడు రంగుల్లో.. మూడు కేటగిరీలుగా..
  1. జేఎన్టీయూహెచ్ మొదట అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీలు, బ్రాంచీలు, సీట్లు.. 82,759 ఉన్నాయి. వీటితోపాటు ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల పరిధిలోని ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లు కలుపుకొని 257 కాలేజీల్లోని 95,629 సీట్లు వెబ్ కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంటాయి. ఇవీ ఏ వివాదం లేనివి. వీటిని సాధారణంగా ఉంచడం లేదా ఆకుపచ్చ రంగులో చూపించే అవకాశం ఉంది.
  2. హైకోర్టు ఆదేశాల మేరకు పలు కాలేజీలు, బ్రాంచీలు, సీట్ల వివరాలను వెబ్ కౌన్సెలింగ్‌లో అందుబాటులో పెడతారు. ఈ కాలేజీలకు, బ్రాంచీలకు మరొక రంగు (ఎరుపు లేదా పసుపు) ఇస్తారు. వీటిలో ప్రవేశాలు ఈనెల 20 నుంచి చేపట్టే ఏఐసీటీఈ, జేఎన్టీయూ సంయుక్తంగా తనిఖీ నివేదికలపై ఆధారపడి ఉంటాయి. వీటిల్లో ఏవైనా కాలేజీలు, బ్రాంచీలకు అనుమతి రాకపోతే... వాటిలో చేరే విద్యార్థుల ఫీజులను వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేస్తారు. మరో కాలేజీలోకి మార్చుతారు.
  3. కోర్టుకు వెళ్లని వారి కాలేజీలు, బ్రాంచీలను యాజమాన్యాలు కోరుకుంటే కౌన్సెలింగ్‌లో చేర్చుతారు. వాటిల్లోనూ తనిఖీలు చేసి.. లోపాలున్నట్లు తేలితే అనుమతివ్వరు. కోర్టుకు వెళ్లిన కాలేజీలకు సంబంధించి వర్తింపజేసే నిబంధనలు వీటికి కూడా వర్తిస్తాయి. ఈ కేటగిరీకి మరో రంగును కేటాయిస్తారు.
జాగ్రత్తగా ఆప్షన్లు ఇచ్చుకోవాలి..
‘‘కాలేజీలను, బ్రాంచీలను ఎంచుకునే సమయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. వెబ్‌సైట్లో పేర్కొన్న రంగులను చూసి, నిబంధనలు చదువుకోవాలి. ఏయే నిబంధనలకు కట్టుబడి ఉంటారో నిర్ణయించుకొని ఆయా కాలేజీలను ఎంచుకోవాలి. కోర్టును ఆశ్రయించిన కాలేజీలు, బ్రాంచీలను ఎంచుకుంటే అవి కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. కోర్టుకు వెళ్లిన కాలేజీలు, వాటిలోని కోర్సుల వివరాలను జేఎన్టీయూహెచ్, కౌన్సెలింగ్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతారు.’’
- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి


ఇదీ షెడ్యూల్
మొదటి దశ ప్రవేశాలు
ఈనెల 17న సాయంత్రం 5 గంటల నుంచి 21వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు
22న ఆప్షన్లను మార్చుకునే అవకాశం
24న సీట్ల కేటాయింపు
25వ తేదీ నుంచి 27 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువు

రెండోదశ ప్రవేశాలు
29న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ (మొదటి దశలో పాల్గొనని వారికి)
29 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు, ఆప్షన్లలో మార్పులకు అవకాశం
31న సీట్ల కేటాయింపు
ఆగస్టు 1వ తేదీన కాలేజీల్లో చేరేందుకు అవకాశం, ఇదే రోజునుంచి తరగతులు ప్రారంభం

కాలేజీలు, సీట్ల వివరాలు..

కేటగిరీ

కాలేజీలు

సీట్లు

జేఎన్టీయూహెచ్ మొదట అనుమతి ఇచ్చినవి

220

82,759

కోర్టు ద్వారా అనుమతి పొందినవి

25

---

కోర్టు అనుమతితో అదనంగా సీట్లు వచ్చే కాలేజీలు

25

---

కేయూ, ఓయూ, ఎంజీ వర్సిటీ పరిధిలో

22

9,838

కోర్టుకు వెళ్లకున్నా తనిఖీలకు ఒప్పుకుంటే వచ్చేవి

--

---

ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో..

17

3,032

16వ తేదీ వరకు సమాచారం మేరకు మొత్తం..

284

95,629


  • కోర్టు ఆదేశాల మేరకు వెబ్ ఆప్షన్ల సమయానికి వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టే కాలేజీలు, సీట్లు వీటికి అదనంగా వస్తాయి.
  • కోర్టుకు వెళ్లకున్నా తనిఖీలకు ఒప్పుకునే కాలేజీలు, వాటిల్లోని సీట్లు కూడా అదనంగా చేరే అవకాశముంది. మొత్తంగా 1.15 లక్షల వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వ కాలేజీల్లో ఉండే సీట్లు

3,032

కన్వీనర్ కోటాలో ప్రైవేటు కాలేజీల్లోని సీట్లు

64,817

కన్వీనర్ కోటాలోని వివాదం లేని సీట్లు

67,849

మేనేజ్‌మెంట్ కోటా సీట్లు (వివాదం లేనివి)

27,779



విద్యార్థుల వివరాలు

ఎంసెట్‌లో అర్హత సాధించిన వారు

90,556

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న వారు

66,308

Published date : 17 Jul 2015 12:43PM

Photo Stories