Skip to main content

తెలంగాణ ఎంసెట్‌లో బాలుర హవా

టాప్-10లో 9 మంది వారే.. ఉత్తీర్ణతలో మాత్రం బాలికలది పైచేయి
అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లోనూ టాప్-10లో ఆరుగురు బాలురే
ఇంజనీరింగ్‌లో బాలికలు 83.02 శాతం.. బాలురు 74.81 శాతం ఉత్తీర్ణత
అగ్రికల్చర్‌లో బాలికలు 85 శాతం.. బాలురు 82 శాతం పాస్
జేఈఈ టాపర్లకే ఎంసెట్‌లోనూ టాప్ ర్యాంకులు
ఎంసెట్ ర్యాంకులు విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం
ఈ నెల 28 నుంచి వచ్చేనెల 4 వరకు వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ షీట్లు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంకులను బాలురే అత్యధికంగా కైవసం చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్-10 ర్యాంకుల్లో 9 ర్యాంకులను వారే సాధించగా.. ఒక్క ర్యాంకును మాత్రం బాలిక సాధించింది. అగ్రికల్చర్ అండ్ మెడికల్(ఎంబీబీఎస్, బీడీఎస్ మినహా)లో టాప్-10 ర్యాంకుల్లో ఆరుగురు బాలురు ఉండగా.. నాలుగు ర్యాంకులను బాలికలు సాధించారు. ఇక మొత్తంగా హాజరైన వారిలో ఉత్తీర్ణత శాతాన్ని చూస్తే బాలికలదే పైచేయిగా ఉంది. ఇంజనీరింగ్‌లో బాలికలు 83.02 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 74.81 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో బాలురు 82.07 శాతం మంది.. బాలికలు 85 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం సచివాలయంలోతెలంగాణ ఎంసెట్ ఫలితాలు, ర్యాంకులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకుంటున్న వారు తెలంగాణ ప్రభుత్వం జూలై 9న నిర్వహించనున్న ఎంసెట్-2 రాయాల్సి ఉంటుందన్నారు. గురువారం ఫలితాలు ప్రకటించిన అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష ద్వారా బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఎన్‌వైఎస్, బీఫార్మా, బీటెక్ బయో టెక్నాలజీ (బైపీసీ), ఫార్మా-డీ (బైపీసీ), బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హార్టికల్చర్), బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, యానిమల్ హజ్‌బెండరీ, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్ (ఎఫ్‌ఎస్‌టీ), బీఎస్సీ (సీఏ, బీఎం) కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయని వెల్లడించారు. ఇక ఇంజనీరింగ్ ఎంసెట్ టాప్-10 ర్యాంకర్లలో తెలంగాణ నుంచి నలుగురు, ఏపీ నుంచి ఆరుగురు ఉన్నారని తెలిపారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో టాప్-10 ర్యాంకర్లలో తెలంగాణ కు చెందిన వారు ఏడుగురు ఉండగా.. ఏపీకి చెందిన వారు ముగ్గురు ఉన్నట్లు వివరించారు. జేఈఈ మెయిన్‌లో దేశంలోనే అత్యధిక (345 మార్కులు) మార్కులు సాధించిన సాయితేజ ఎంసెట్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. అలాగే జేఈఈలో 340 మార్కులు సాధించిన కొండా విఘ్నేశ్‌రెడ్డి ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు, జేఈఈలో 325 మార్కులు సాధించిన చేతన్‌సాయి ఎంసెట్‌లో రెండో ర్యాంకు సాధించాడు.

1,03,923 మందికి అర్హత
ఎంసెట్ రాసేందుకు మొత్తంగా 2,46,540 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ కోసం 1,44,511 మంది దరఖాస్తు చేసుకోగా 1,33,428 మంది (92.33 శాతం) పరీక్షకు హాజరయ్యారు. అందులో 1,03,923 మంది ర్యాంకులు సాధించారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 1,02,029 మంది దరఖాస్తు చేసుకోగా 90,114 మంది (88.32 శాతం) పరీక్షకు హాజరయ్యారు. అందులో 75,681 మంది ర్యాంకులు సాధించారు. మొత్తానికి ఇంజనీరింగ్‌లో 77.88 శాతం, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 83.98 శాతం మంది అర్హత సాధించారు. ఆన్‌లైన్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 534 మందిలో 411 మంది హాజరయ్యారు.

మారిన ఫైనల్ కీ
ప్రాథమిక కీలో పేర్కొన్న జవాబులపై విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సబ్జెక్టు నిఫుణులతో పరిశీలన జరిపించినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రమణరావు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో మ్యాథ్స్ కోడ్-ఏ ప్రశ్నపత్రంలో 65వ ప్రశ్నకు (కోడ్-బీలో 62, కోడ్-సీలో 16, కోడ్-డీలో 22వ ప్రశ్నకు) ప్రాథమిక కీలో 3వ ఆప్షన్ సరైనదిగా పేర్కొనగా ఫైనల్ కీలో 2, 3 సరైనవిగా తేల్చినట్లు వెల్లడించారు. ఫిజిక్స్‌లో కోడ్-ఏప్రశ్నపత్రంలో 95వ ప్రశ్నకు (కోడ్-బీలో 85, కోడ్-సీలో 106, కోడ్-డీలో 105వ ప్రశ్న) ప్రాథమిక కీలో ఒకటో ఆప్షన్ సరైందిగా పేర్కొనగా ఫైనల్ కీలో నాలుగో ఆప్షన్ సరైందిగా మార్పు చేసినట్లు వివరించారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో జువాలజీ సబ్జెక్టులో కోడ్-డీలో 52వ ప్రశ్నకు ప్రాథమిక కీలో రెండో ఆప్షన్ సరైందని ఇవ్వగా, ఫైనల్ కీలో 3వ ఆప్షన్ సరైందిగా మార్పు చేసినట్లు తెలిపారు. ఫిజిక్స్‌లో కోడ్-ఏలో 105వ ప్రశ్నకు ప్రాథమిక కీలో ఒకటో ఆప్షన్ సరైందిగా పేర్కొనగా పైనల్ కీలో ఒకటీ, రెండు ఆప్షన్లు సరైనవిగా తేల్చినట్లు చెప్పారు. కోడ్ బీలో 108వ ప్రశ్నకు ప్రాథమిక కీలో 4వ ఆప్షన్ సరైందిగా పేర్కొనగా.. ఫైనల్ కీలో 1, 4వ ఆప్షన్ సరైనవిగా తేల్చారు. కోడ్-సీలో 97వ ప్రశ్నకు ప్రాథమిక కీలో 3వ ఆప్షన్ సరైందిగా పేర్కొనగా ఫైనల్ కీలో 3, 4 ఆప్షన్లు సరైనవిగా తేల్చారు. కోడ్-డీలో 88వ ప్రశ్నకు ప్రాథమిక కీలో 2వ ఆప్షన్ సరైందిగా పేర్కొనగా.. ఫైనల్ కీలో 2, 3 ఆప్షన్లు సరైనవిగా గుర్తించారు.

వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ పత్రాలు
విద్యార్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను ఎంసెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం నుంచి వచ్చేనెల 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాటిల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వచ్చేనెల 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద రూ.5 వేలు (ఎస్సీ, ఎస్టీలైతే రూ.2 వేలు) చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 6 నుంచి విద్యార్థులు ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్‌లో ఒక్కరు.. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో ఐదుగురు
ఎంసెట్‌లో 160 మార్కులకుగాను 160 మార్కులు సాధించిన విద్యార్థులు మొత్తంగా ఆరుగురు ఉన్నారు. ఇంజనీరింగ్‌లో ఒకే ఒక్క విద్యార్థికి 160 మార్కులు రాగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో ఐదుగురు విద్యార్థులు 160/160 మార్కులు సాధించారు. ఇందులో ఇంజనీరింగ్‌లో తాళ్లూరి సాయితేజ, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో బొజ్జల ప్రదీప్‌రెడ్డి, సోమల ప్రత్యూష, మహమ్మద్ అర్బాజ్, వి.ప్రణతి, ఎ.యజ్ఞప్రియ ఉన్నారు. ఇక సబ్జెక్టుల వారీగా చూస్తే ఇంజనీరింగ్ ఎంసెట్‌లో గణితంలో 80 మార్కులకు 80 మార్కులు సాధించిన వారు నలుగురు (తాళ్లూరి సాయితేజ, కొండా విఘ్నేశ్‌రెడ్డి, కొల్లు సాత్విక్ రెడ్డి, నంబూరు కృష్ణ సాయి వినయ్) ఉన్నారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో బయాలజీ సబ్జెక్టులో 80 మార్కులకు 80 సాధించిన వారు 101 మంది ఉన్నారు.
Education News
Education News
Education News
Published date : 27 May 2016 05:51PM

Photo Stories