Skip to main content

తెలంగాణ ఎంసెట్-2లో బాలుర హవా

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2లో బాలురు సత్తా చాటారు. టాప్-10 ర్యాంకుల్లో ఆరుగురు వారే ఉన్నారు.
ఉత్తీర్ణతపరంగా మాత్రం బాలికలు కాస్త ముందంజలో నిలిచారు. ఎంసెట్-2 ర్యాంకులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సచివాలయంలో విడుదల చేశారు.

ఎంసెట్ స్కోర్‌కు 75%.. ఇంటర్ మార్కులకు 25%
ఎంసెట్-2కు మొత్తం 56,153 మంది దరఖాస్తు చేసుకోగా ఈ నెల 9న జరిగిన పరీక్షకు 50,961 మందిహాజరయ్యారు. అందులో 47,644 మంది (93.49 శాతం) ర్యాంకులు పొందారు. మొత్తంగా 48,205 మంది అర్హత సాధించినా.. 134 మంది ఇంటర్‌లో ఫెయిల్ అయ్యారు. మరో 427 మంది విద్యార్థుల ఇంటర్మీడియెట్ వివరాలు ఎంసెట్ కమిటీకి అందలేదు. దీంతో వారిని మినహాయించి 47,644 మందికి ర్యాంకులను కేటాయించారు. ఎంసెట్ స్కోర్‌కు 75 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి కంబైన్డ్ స్కోర్‌ను నిర్ణయించారు. తెలంగాణ, ఏపీలో కలిపి మొత్తం 95 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు హాజరైన వారిలో 16,722 మంది బాలురు ఉండగా.. వారిలో 15,577 మంది (93.15 శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు. ఇక 34,239 మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా.. 32,067 మంది (93.65 శాతం) అర్హత సాధించారు.

16 నుంచి ఓఎంఆర్ పత్రాలు
పరీక్షకు హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలనుఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకుఎంసెట్ వెబ్‌సైట్‌లో (med.tseamcet.in) అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మూల్యాంకనంలో ఏమైనా పొరపాట్లు దొర్లితే జనరల్, బీసీ విద్యార్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.2 వేలు చెల్లించి తమ విజ్ఞాపనను ఆన్‌లైన్ ద్వారా (ఎంసెట్ వెబ్‌సైట్) అందజేయాలని సూచించారు. ఇక ర్యాంకు కార్డులను విద్యార్థులు ఈ నెల 21 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

25 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటాలోని 2,420 సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 25న ప్రారంభించనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జనరల్ విద్యార్థులకు, 30, 31 తేదీల్లో ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు (వికలాంగులు, ఆర్మీ, స్పోర్ట్స్ కేటగిరీ) సర్టిఫికెట్ల వెరిఫికే షన్ ఉంటుందన్నారు. ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రాలను జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్నట్లు కాళోజీ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. 50 శాతం కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. మొదట ఎంబీబీఎస్, తర్వాత బీడీఎస్‌లో ప్రవేశాలు చేపడతామన్నారు. ఆ తర్వాత అగ్రికల్చర్, వెటర్నరీ, ఆయుర్వేదిక్, హోమియో, యునానీ, నేచురోపతి కోర్సుల్లో ప్రవేశాలు వరుస క్రమంలో ఉంటాయని చెప్పారు. తర్వాత రెండో దశ లేదా చివరి దశ ప్రవేశాల కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.

Education News

Published date : 14 Jul 2016 02:38PM

Photo Stories