Skip to main content

తెలంగాణ ఎంసెట్– 2021కు ఈసారీ ఆ నిబంధన తొలగింపు!

సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది కూడా ఎంసెట్లో ర్యాంకుల కోసం ఇంటర్లో కనీస అర్హత మార్కుల నిబంధనను తొలగించే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంతో పాటు... ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఏడాది (2019–20) ఇంటర్‌ మొదటి సంవత్సరంలో విద్యార్థులు పొందిన మార్కులనే 2020–21 ద్వితీయ సంవత్సరంలో కూడా కొనసాగించారు. అయితే మొదటి సంవత్సరంలో ఎవరైనా విద్యార్థులు ఏ సబ్జెక్టులోనైనా ఫెయిలైతే.. వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించలేదు. పాస్‌ మార్కులను వేసి ఉత్తీర్ణులను చేశారు. కాబట్టి వారికి ఇంటర్‌లో ఎంసెట్‌ నిబంధన మేరకు 40.. 45 శాతం మార్కులు వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల ఇలాంటివారు ఎంసెట్‌ పరీక్షలో అర్హత సాధిస్తే వారికి నిబంధనల ప్రకారం ర్యాంకులను ఇవ్వడానికి అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే గత ఏడాది ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అది కేవలం ఆ విద్యా సంవత్సరానికి మాత్రమేనని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి అలాంటి ఉత్తర్వులు ఈ ఏడాది కూడా ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఏడాది ఎంసెట్‌ తోపాటు.. 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సులో ప్రవేశాలకు కూడా వీటిని అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి బుధవారం విద్యా శాఖ కార్యదర్శి అధ్వర్యంలో ఎంసెట్‌ కన్వీనర్, లాసెట్‌ కన్వీనర్‌ తోపాటు విద్యా శాఖ కార్యదర్శి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం అనంతరం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసే అవకాశం ఉంటుంది.

చ‌ద‌వండి: రేపట్నుంచి తెలంగాణ పీజీఈసెట్‌– 2021 ప్రవేశ పరీక్షలు

చ‌ద‌వండి: నీట్‌–ఎండీఎస్‌ అడ్మిషన్ల కౌన్సిలింగ్‌ ఎప్పుడు?.. సుప్రీంకోర్టు
Published date : 11 Aug 2021 02:32PM

Photo Stories