తెలంగాణ ఎంసెట్-2 రద్దు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-2 పరీక్షను తెలంగాణప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సంబంధించి వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించినా... న్యాయ నిపుణుల సూచనల మేరకు రద్దు చేయడానికే మొగ్గుచూపింది.
ఆగస్టు చివరలో లేదా సెప్టెంబర్ తొలివారంలో ఎంసెట్-3 పరీక్ష నిర్వహించాలని.. ఆ నెలాఖరులోగా ప్రవేశాలను పూర్తిచేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి సోమవారం అధికారికంగా ప్రకటన విడుదల చేయనుంది. వేలాది మందిని మానసిక క్షోభకు గురి చేసిన ఎంసెట్ లీకేజీ పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. వరుస పరీక్షలతో వైద్య విద్యార్థులు ఇప్పటికే అలసిపోయి, విసిగిపోయి ఉన్నప్పటికీ.. గత అనుభవాల దృష్ట్యా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ, తదనంతర పరిణామాలు, చర్యలపై సీఎం కేసీఆర్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, సీఐడీ చీఫ్ సత్యనారాయణ, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డిలతో పాటు కొత్తగా నియమితులైన వీసీలు, సీఎంవో అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో ఎంసెట్ లీకేజీ, పరీక్ష రద్దు అంశంపై నాలుగు గంటల పాటు చర్చించారు. ఈ సందర్భంగా ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన సీఐడీ నివేదికను సీఎం కేసీఆర్‌కు డీజీపీ అందించారు. ప్రశ్నపత్రం లీకైన తీరు, నిందితుల వివరాలు, కేసు పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.
సుప్రీం తీర్పుల మేరకే..:
పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలా.. లేక లీకేజీతో సంబంధమున్న విద్యార్థులపై మాత్రమే చర్యలు తీసుకోవాలా.. అన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తిరిగి పరీక్ష నిర్వహించకుండా ఉండే ప్రత్యామ్నాయాలపై ఆరా తీశారు. అయితే పరీక్ష రద్దు చేయకుంటే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులెవరైనా కోర్టుకు వెళితే, కోర్టు అభ్యంతరం తెలిపితే.. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సమస్య ఉత్పన్నమవుతుందని వివరించారు. దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సీఎం ఈ సందర్భంగా పరిశీలించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 80 సార్లు వివిధ పరీక్షా పత్రాలు లీకయ్యాయని... దాదాపు అన్ని పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించారని అధికారులు సీఎంకు వివరించారు. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి సందర్భాల్లో పరీక్షను తిరిగి నిర్వహించాలంటూ తీర్పునిచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుల మేరకు నడుచుకోవాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం అధికారికంగా ప్రకటన :
ఎంసెట్-2 రద్దు, తిరిగి పరీక్ష నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌పై సోమవారం ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేయనుంది. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహించాలని, సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రవేశాలను పూర్తి చేయాలని యోచిస్తోంది. ఎంసెట్-3 నిర్వహణ బాధ్యతల నుంచి ప్రస్తుత కన్వీనర్ రమణారావును తప్పించి.. జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డికి అప్పగించే అవకాశాలున్నట్లు తెలిసింది.
విద్యార్థులకు వెసులుబాటు :
పరీక్షను తిరిగి నిర్వహిస్తే చేపట్టాల్సిన చర్యలపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటికే పరీక్షలు రాసిన విద్యార్థులు తిరిగి పరీక్ష ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని.. పాత దరఖాస్తు ప్రకారమే తిరిగి పరీక్ష రాసే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరీక్ష రోజున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకు ఉచిత ప్రయాణ వసతి కల్పించే అంశంపైనా చర్చించారు.
లీకేజీలపై కఠినంగా ఉండండి :
ప్రశ్నపత్రం లీకేజీల వంటి సంఘటనలను ప్రభుత్వం సహించబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన లీకేజీ ముఠాపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడాలంటేనే భయపడేలాంటి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే మరింత కఠిన చట్టాలను ప్రయోగించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు పిల్లలకు సీట్లు సంపాదించేందుకు తప్పుదారి పట్టిన తల్లిదండ్రులను సైతం శిక్షించాలని ఆదేశించారు. జీమ్యాట్, జీఆర్‌ఈ, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షల తరహాలో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించే అంశంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

Published date : 30 Jul 2016 10:44AM